Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
5. ఈ యజమాని దీక్షవహించి ఉన్నాడు. అనిష్ట నివారకుడు అయి ఉన్నాడు. ఆసనమునందు ఆసీనుడై ఉన్నాడు. ఇతడు నానారాజ్యములు గెలిచి సామ్రాజ్యము పాలించుటకు సంకల్పించును గాక.
(యజ్ఞకర్తను అట్లు అనుమంత్రించవలెను.)
6. రాజా! నీవు బ్రాహ్మణ ధర్మములను పాలించుచున్నావు. బ్రాహ్మణులగు మాకు అనుజ్ఞనిచ్చుచున్నావు. అమోఘ అనుజ్ఞ కలవాడవు. అందువలన నీవే బ్రాహ్మణుడవు.
రాజా! నీవు పరమ ఐశ్వర్యవంతుడవు. అమోఘవీర్యుడవు. కావున నీవే బ్రాహ్మణుడవు.
రాజా! నీవు శిష్టపాలనకు దేవతలే మిత్రులుగా కలవాడవు. సేవింపదగిన వాడవు. కావున నీవే బ్రాహ్మణుడవు.
రాజా! నీవు అనిష్ట నివారకుడవు. ధర్మయుక్తుడవు. కావున నీవే బ్రాహ్మణుడవు.
(దిగ్విజయమొనర్చిన సామ్రాట్టును ప్రజలు, ఋత్విజులు అట్లు స్తుతించవలెను.)
7. హేస్థ్య! నీది వజ్రస్వరూపము. నీవు శత్రువులను వధించు దానవు. నాకు రథ్యవగుము.
8. ఈ రాజు పైదిక్కుతో కూడ అయిదు దిశలను అభిలషించి ఉన్నాడు.
9. సచ్చరిత్ర గల కోశాధ్యక్షులను, మంగళకరులై పన్నులు వసూలు చేయువారిని, అంతః పురమును రక్షించు కంచుకులను ఆహ్వానించుచున్నాను.
(ఇది యజమాని ఆశయము.)
10. జలములను ఆవిరిచేయు అగ్నికి స్వాహా. బలములు క్షీణింపచేయు అగ్నికి స్వాహా. గృహపతి యగు అగ్నికి స్వాహా.
పదిహేడవ అనువాకము
(పది సంసృప హవిస్సులు చెప్పబడినవి.)
1. ఆగ్నేయమ్ అష్టకపాలమ్ నిర్వపతి. హిరణ్యమ్ దక్షిణా.
2. సారస్వతమ్ చరుమ్ నిర్వపతి. వత్సతరీ - పాలు మానిన దూడ - దక్షిణా.
3. సావిత్రమ్ ద్వాదశ కపాలమ్ నిర్వపతి. ఉపధ్వస్తః - సంకీర్ణవర్ణముల దూడ - దక్షిణా.
4. పౌష్ణమ్ చరుమ్ నిర్వపతి. శ్యామః - నల్లని దూడ - దక్షిణా.
5. బార్హస్పత్యమ్ చరుమ్ నిర్వపతి. శితిపృష్టః - తెలుపు వీపు దూడ - దక్షిణా.
6. ఐన్ద్రమ్ ఏకాదశకపాలమ్ నిర్వపతి. ఋషభః దక్షిణా.
7. వారుణమ్ దశకపాలమ్ నిర్వపతి. మహానిరష్టః. వట్టకొట్టిన ఎద్దు - దక్షిణా.
8. సౌమ్యమ్ చరుమ్ నిర్వపతి బభ్రువః - కపిల వర్ణగోవు - దక్షిణా.
9. త్వాష్ట్రరమ్ - త్వష్టదేవతాకమునకు - అష్టాకపాలమ్ నిర్వపతి. శుణ్ణః. తెల్లనిఆవు - దక్షిణా.
10. విష్ణుదేవతాకమునకు త్రికపాలమ్ నిర్వపతి. పొట్టి ఆవు దక్షిణ అగును.
పద్దెనిమిదవ అనువాకము
(దశపేయము చెప్పబడినది.)
1. దీక్షవహించిన వెంటనే సోమమును కరీదు చేయవలెను.
(సోమ క్రయము ఒక్కొక్క యాగమునకు ఒక్కొక్క తీరుగా ఉండును. రాజసూయమున దీక్షవహించినపుడే కొనవలెను.)
2. తామర పూవుల మాలను - జలమునకు - సమర్పించవలెను.
3. పాలు మానిన పది దూడలను ఇచ్చి సోమము కొనవలెను.
4. పది చమసములందు పానము చేయగల సోమము గలది దశపేయక్రతువు అగును.
5. పది చమసములందలి సోమమును నూరుగురు బ్రాహ్మణులు సేవించుచున్నారు.
6. దశపేయ క్రతువు సప్తదశ స్తోమము కలది అగుచున్నది.
7. యజమాని అధ్వర్యునకు రెండు బంగారు అద్దములు దానము చేయవలెను.
8. బంగారు దండను ఉద్గాత అను ఋత్విజునకు ఇవ్వవలెను.
9. హోతకు బంగారపు గుండ్రని బళ్లను దానము చేయవలెను.
10. ప్రస్తోత, ప్రతిహర్తలు ఇద్దరకు అశ్వమును ఇవ్వవలెను.
11. బ్రహ్మకు పన్నెండు పెయ్యలను ఇవ్వవలెను.
12. మిత్రావరుణులకు వంధ్యగోవును అర్పించవలెను.
13. బ్రాహ్మణాచ్ఛంసి ఋత్విజునకు ఆబోతును ఇవ్వవలెను.
14. నేష్ట, పోతలకు రెండు వస్త్రములను ఇవ్వవలెను.
15. ఆచ్ఛావాకుడయి ఋత్విజునకు యవలు నింపిన పెద్దపాత్ర నీయవలెను.
16. అగ్నీధ్రునకు ఎద్దును ఇవ్వవలెను.
17. ఈ దశపేయ క్రతువునందు భార్గవుడు - భృగుగోత్రజుడు - హోత యగును. శ్రావన్తీయము బ్రహ్మసామము అగును. వారన్తీయము అగ్నిష్టోమాసామము అగుచున్నది.
సరస్వతీ నదీజలమును సేకరించవలెను.
పందొమ్మిదవ అనువాకము
1. ఆగ్నేయమ్ అష్టాకపాలమ్ నిర్వపతి. హిరణ్యమ్ దక్షిణా. ఐన్ద్రమ్ ఏకాదశకపాలమ్ నిర్వపతి. ఋషభః దక్షిణా. వైశ్వదేవమ్ చరుమ్ నిర్వపతి. పచ్చరంగు గోవు దక్షిణా. మైత్రావరుణమ్ ఆమిక్షామ్ నిర్వపతి. గొడ్డుబోతు గోవు దక్షిణ. బార్హస్పత్యమ్ చరుమ్ నిర్వపతి. తెల్లని వీపు గల గోవు దక్షిణ.
(రాజసూయమున రాజు సకల దిక్కులను జయించుటకు సాగుము. అతని శ్రమ నివారణార్థమైన ఈ అయిదు హవిస్సులు అవేష్టులు అనబడును.)
2. అదితి దేవతాకమునకు చూడిగోవును వధించవలెను. మరుద్దేవతాకమునకు తెల్లనిదియు, బాల్యముననే గర్భిణి అయిన గోవును వధించవలెను.
3. అశ్వినులు, పూషదేవతాకమునకు పన్నెండు గిన్నెలందు పురోడాశమును - సత్యవాక్కు గల సరస్వతీ దేవతాకమునకు చరుహవిస్సును - సవితా దేవతాకమునకు పన్నెండు గిన్నెలందు పురోడాశమును సమర్పించవలెను.
ఇరువదవ అనువాకము
(ప్రయుక్కుల హవిస్సులు చెప్పబడినవి.)
1. ఆగ్నేయమ్ అష్టాకపాలమ్ నిర్వపతి. 2. సౌమ్యమ్ చరుమ్ నిర్వపతి. 3. సావిత్రమ్ ద్వాదశ కపాలమ్ నిర్వపతి. 4. బార్హ స్పత్యం చరుం నిర్వపతి. 5. త్వష్టదేవతాకమునకు అష్టా కపాలమ్ నిర్వపతి. 6. వైశ్వానరమ్ ద్వాదశ కపాలమ్ నిర్వపతి.
ఇది పూర్వ షట్కము.
1. సారస్వతమ్ చరుమ్ నిర్వపతి. 2. పౌష్ణమ్ చరుమ్ నిర్వపతి. 3. మైత్రమ్ చరుమ్ నిర్వపతి. 4. వారుణమ్ చరుమ్ నిర్వపతి. 5. క్షేత్రపతి దేవతాకమునకు చరుమ్ నిర్వపతి. 6. ఆదిత్యమ్ చరుమ్ నిర్వపతి.
ఇది ఉత్తరషట్కము
ఈ రెండు షట్కములకు ఒక్కొక్క దానికి రథవాహనవహము దక్షిణ యగును. (ఒక బండిని మరొక బండికి కట్టినపుడు రెండు బండ్లను లాగు ఎద్దు రథవాహన వహము అగును.)
ఇరువది ఒకటవ అనువాకము
(సౌత్రామణి మంత్రములు, పశువులు, హవిస్సులు చెప్పుబడినవి.)
1. సురా! నీవు మధురమవు. తీవ్రమవు. అమృతమవు. నిన్ను సోమాత్మకమగు లేత గరికతో కలుపుచున్నాను. అది మధురము, తీవ్రము, అమృతము అగును. నీవు అశ్వినుల కొరకు పక్వమగుము. సరస్వతి కొరకు పక్వమగును. చక్కని రక్షణల ఇంద్రుని కొరకు పక్వమగుము.
(1. సురయందు లేత గరికను కలుపవలెను. 2. ఇంద్రుడు సోమాభిషవము చేసినాడు. అందువలన అతనికి పాపము కలిగినది. అది పది ముక్కలుగ విడిపోయినది. తలనుండి వచ్చినది 'సోమము' పాయు గుహ్యము నుండి వచ్చినది 'సుర' అయినవి.)
2. ఇంద్రా! నీ కొరకు సూర్యుని వంటి దీప్తి కలదియు, ద్రవరూపమును అగు సోమము శాశ్వతమును, విస్తృతమైనదియునగు వాలజన్య పవిత్రమున పావనము అగునుగాక.
ఈ సోమము పవిత్రమున పావనమైనది. ఇంద్రునకు యోగ్యమైనది. అది ఆవిరియై గాలిలో కలిసిపోయినది.
(వాలజన్య పవిత్రము. గొర్రెబొచ్చుచే చేయబడినది.)
3. పంటలుగల కర్షకులు పంటయందు పండినది అని విచక్షణచేసి కోయుదురు.
అశ్విని సరస్వతీ సుత్రామేంద్రులారా! అట్లే యజ్వలందు నమస్కరించువారలు, నమస్కరించని వారలందు విచక్షణ చేసి ఈ పాత్రయందలి హవిస్సులను ఆరగించండి.
(మరొక ఖరస్థానమునందలి సురాపాత్రను అందుకొనవలెను.)
4. అశ్వినీ దేవతాకమునకు ధూమ్రవర్ణ పశువును బలి ఇవ్వవలెను. సరస్వతీ దేవతాకమునకు మేకను బలి ఇవ్వవలెను. ఇంద్ర దేవతాకమునకు ఆబోతును బలి ఇవ్వవలెను.
5. ఐన్ద్రమ్ ఏకాదశ కపాలమ్ నిర్వపతి. సావిత్రమ్ ద్వాదశ కపాలమ్ నిర్వపతి. వారుణమ్ దశకపాలమ్ నిర్వపతి. సోమప్రతీకలగు పితృదేవతలు సంతృప్తులు అగుదురు గాక.
6. ఆడుగుర్రము దక్షిణ యగును.
ఇరువది రెండవ అనువాకము
(యాజ్యా పురోను వాక్యలు.)
1. అగ్నా, విష్ణువులారా! మీ మహత్వము పూజనీయము. ఘృతమునకు అనేక గోప్య నామములు ఉన్నవి. అట్టి ఘృతమును మీరు ప్రతి ఇంట పొందగలరు. జ్వాలారూపములగు మీ నాలుకలు ఏడు. అవి రత్నసదృశములు. వానితో మీరు ఘృతమును సేవింతురు గాక.
2. అగ్నా విష్ణుదేవతలారా! యజ్ఞశాల మీకు ప్రియమైన ధామము. అది పూజనీయము. ప్రతి ఇంట శుభప్రదములగు స్తోత్రములచే వర్థిల్లు ఘృతము ఉన్నది. దానిని జ్వాలారూపములు, రత్న సన్నిభములగు మీ నాలుకలతో సేవించండి.
3. సరస్వతి అన్నప్రద. జ్ఞానరక్షిణి. ఆమె మాకు ఎంతో అన్నమును అందించునుగాక.
4. మేము సరస్వతిని యజించుచున్నాము. ఆమె మా యజ్ఞమునకు దివినుండి వచ్చుగాక. పర్వతముల నుండి వచ్చును గాక. మా ఆహ్వానమును మన్నించి, ఘృతమును సేవించిన వచ్చిన చదువుల తల్లి మాస్తుతులను ఆశించుచు, వినును గాత.
5. బృహస్పతీ! నీవు సర్వదేవతలకు హితకరుడవు. మాహవిస్సులను సేవింపుము. యజమానికి రత్నములు ప్రసాదించుము.
6. బృహస్పతీ! నీవు మమ్ము తండ్రివలె కాపాడువాడవు. దేవతలందరకు ఆచార్యుడవు. మాకు వరదుడవు. అట్టి నీ కొరకు యాగములు చేయుదుము. నమస్కరింతుము. హవి సమర్పింతుము సేవింతుము.
7. బృహస్పతీ! రాజుల వద్ద ఉన్న ధనము మిన్న అయినది. అది అతడు అనుభవించ యోగ్యమైనది. ధనము అమాత్యాదుల వద్ద భూషణ రూపముగ ఉన్నది. యజమాను వద్ద యజ్ఞయాగాది ధనము ఉన్నది. ధనము సైన్యరూపమున కూడ ఉన్నది. అది విచిత్రము. సత్యజాతము. అట్టి ధనమును మాకు ప్రసాదించుము.
8. మిత్రావరుణులారా! మా ఆవుల గుంపులను నేతులతో తడపండి. మీరు శోభనక్రతుయుక్తులు. మహారాజులు. దుమ్ము రేగు మాక్షేత్రములను నీటితో తడపండి.
9. మిత్రావరుణులారా! మేము జీవించు కొరకు మీ చేతులనిండుగ మరింత ధనము కొనిరండి. విచ్చేసి మా గోవుల గుంపులను నేతులతో తడపండి. మీరు పరస్పరము కలసి ఉన్నవారు. జనుల సభలందు మమ్ము గురించి తెలియ పరచండి.
మిత్రావరుణులారా! మేము మిమ్ము పిలుచుచున్నాము. మా పిలుపులు ఆలకించండి.
10. అగ్నిదేవుడు వసువులందు తొలివాడు. పురోడాశప్రియుడు. మిత్రుని వంటివాడు. మా క్షేత్రములను కాపాడువాడు.
అట్టి అగ్నిని యాగపరిసమాప్తి వరకు ఉండునట్టి నేను వేదవాక్కులచే స్తుతించుచున్నాను.
11. దేవతలను గూర్చి యాగము చేయువాని మనసు - కొన్ని యుద్ధములందు శూరుని వలెను, రథము వలెను సాగుచున్నది.
దేవతల మనసులను ఆరాధించువాడు యాగరహితులను దాటిపోవుచున్నాడు.
12. యజమానీ! యజ్ఞము చేసిన నీవు నాశనము లేనివాడవు అగుచున్నావు. సోమయాజీ! పాకయాజీ! మీరును నాశనము లేని వారలగుచున్నారు.
13. ఈ యజమానికి చక్కని సామర్థ్యము కలుగును గాత. శీఘ్రగాములగు అశ్వసంబంధ సామర్థ్యము కలుగును గాత.
14. కర్మ సహితుడైన యజమానిని రాక్షసాదులు నాశనము చేయకుందురు గాత. యజ్ఞవిరోధి పాపము యజమానికి అంటకుండును గాక.
దేవతల మనసులను ఆరాధించు వాడు యాగరహితులను దాటిపోవుచున్నాడు.
15. ధేనువులు నదులవంటివి. సుఖదాయినులు. అవి ఇంతకు ముందు యజ్ఞము చేసిన - ఇకముందు యజ్ఞము చేయనున్న వానికి మరిన్ని పాలిచ్చుచున్నవి.
ఇప్పుడు జుహువును నింపువాడును - ఇకముందు నింపబోవువాడగు యజమాని స్తుతులు వినుటకా అన్నట్లు ఆజ్యధారలు అంతటను వ్యాపించుచున్నవి - అంతటి నుండి వచ్చి చేరుచున్నవి.
16. సోమ, రుద్రలారా! మా ఇంట చేరిన రోగరూపమగు నిరృతిని దూరమున ఉండగనే హింసించండి. అది మాకు కలిగించిన రోగరూప పాపములనుండి మమ్ము విముక్తులను చేయండి.
17. సోమ రుద్రలారా! మీరు మా యందు సమస్త ఓషధులను ఏర్పరచండి. ఆ ఔషధముల చేత అనిష్టములను నశింపచేయండి. నిరృతి మాకు కలిగించిన రోగరూప పాపములను మా నుండి తొలగించండి.
18. సోమ, పూష దేవతలారా! మీరు ద్యావా పృథ్వులను సృష్టించినారు. ధనమును కలిగించినారు. పుట్టినంతనే సకల లోకములను రక్షించినారు. మీరు కర్మఫలమునకు ముడివేసినారు.
19. సోమ పూషదేవతలను - వారు పుట్టిన నాటినుండియే - సమస్త దేవతలు సేవించుచున్నారు. వీరు - అప్రియమగు - బుద్ధి మాంద్యమును నశింపచేయుదురు గాక. ఇంద్రుడు - పూష సోములచేత - వయసులో ఉన్న గోవులందు మంచి పాలను కలుగచేయుచున్నాడు.
దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును - విద్వాన్ దాశరథి వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును, ఆంధ్రప్రదేశ ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును - కమలానామ్ని ధర్మపత్నీ సమేతుండును "వివేకానందుడు" "శకుంతల" "మాళవిక - అగ్నిమిత్రుడు" "విక్రముడు - ఊర్వశి" "మహాత్ముడు" "బాలాజీ" మున్నగు బాలల గ్రంథరచయితయు అయిన దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత యందలి మొదటి కాండము సమాప్తము.
సర్వే భవన్తు సుఖినః





