Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
7. హవి పదార్థమా! రాక్షసవధ కొరకు నాకు సవిత ప్రేరణ కలిగించుచున్నాడు. అశ్వినుల బాహువుల తోను - పూష హస్తములతోను నిన్ను హోమము చేయుచున్నాను. రాక్షసులు హతులైనారు. రాక్షసులను సంహరించినాను.
8. హోమ కాలమున ఆచ్చాదనముగా ఉండిన వస్త్రములను దక్షిణగా ఇవ్వవలెను.
ఎనిమిదవ అనువాకము
(ఏకదిన కర్తవ్యమగు కర్మషట్కము చెప్పబడినది.)
1. ధాతృ దేవతాకమునకు 12 పాత్రలందు పురోడాశమును - అనుమతి దేవతాకమునకు చరును - రాకా దేవతాకమునకు చరు - సినీవాలి దేవతాకమునకు చరు - కుహూ దేవతాకమునకు చరు నిర్వాపనము చేయవలెను. ఆబోతు, గోవు, విథునమును దక్షిణగా ఇవ్వవలెను.
2. అగ్ని విష్ణు దేవతాకమునకు 11 కపాలములందు పురోడాశము - ఇంద్ర విష్ణు దేవతాకమునకు 11 కపాలములందు పురోడాశము - విష్ణువునకు మూడు కపాలములందు పురోడాశమును సమర్పించవలెను. పొట్టిది బరువులు మోయు ఎద్దు దక్షిణ అగును.
అగ్ని సోమ దేవతాకమునకు 11 కపాలములందు ఇంద్ర సోములకు 11 కపాలములందు పురోడాశము అర్పించవలెను. సోమ దేవతాకమునకు చరు నిర్వాపనము చేయవలెను. కపిల వర్ణ గోవు దక్షిణ యగును.
సోమ పూష దేవతాకమునకు, ఇంద్ర పూష దేవతాకమునకు, పూష దేవతాకమునకు వేరు వేరుగా చరు సమర్పించవలెను. నల్లని ఎద్దు దక్షిణ అగును.
వైశ్వానర దేవతాకమునకు 12 పాత్రలందు పురోడాశమును సమర్పించవలెను. బంగారము దక్షిణ అగును.
వరుణ దేవతాకమునకు యవల చరు నిర్వాపనము చేయవలెను. అశ్వము దక్షిణ యగును.
తొమ్మిదవ అనువాకము
(ప్రతిదినము ఆచరించవలసిన 'రత్ని' హవిస్సులు చెప్పబడినవి.)
1. i) 'బ్రహ్మ' అణు ఋత్విజుని గృహమున బృహస్పతి దేవతాక చరును సమర్పించవలెను. తెల్లని వీపు గల గోవు దక్షిణ.
ii) రాజు గృహమున ఇంద్రునకు 11 కపాలములను సమర్పించవలెను. ఋషభః దక్షిణా.
iii) పట్టమహిషి ఇంట వద్ద అదితి దేవతాక చరును సమర్పించవలెను. ధేనుః దక్షిణా.
iv) ప్రేమలేని రాజు భార్య ఇంట నల్లని ధాన్యమును గోళ్లచే విడదీసి వండిన చరును నిరృతి దేవతాకమునకు సమర్పించవలెను. నల్లని కొమ్ముల ఆవు దక్షిణ.
v) సేనాని గృహమున అగ్నికి అష్టకపాలములు అర్పించవలెను. హిరణ్యమ్ దక్షిణా.
vi) సారథి గృహమున వరుణ దేవతాకమునకు దశకపాలం నిర్వపతి. వట్టకొట్టిన ఎద్దు దక్షిణ.
vii) గ్రామాధికారి గృహమున మరుద్దేవతాకమునకు సప్త కపాలమ్ పురోడాశం నిర్వపతి. తెల్లని గోవు దక్షిణ.
viii) అంతః పురాధ్యక్షుని గృహమున సవితృ దేవతాకమునకు ద్వాదశ కపాలమ్ నిర్వపతి. కలగలుపు రంగు గోవు దక్షిణ.
ix) కోశాధ్యక్షుని గృహమున అశ్వినీ దేవతాకమునకు ద్వికపాలమ్ పురోడాశం నిర్విపతి. ఒకే ఆవుకు పుట్టిన రెండు దూడలు దక్షిణ.
x) పన్ను వసూలు చేయువాని గృహమున పూష దేవతాకమునకు చరుమ్ నిర్వపతి. నల్లని గోవు దక్షిణ.
xi) ద్యూతకారుని గృహమున రుద్ర దేవతాకమునకు గోధూమచరుమ్ నిర్వపతి. రంగుల రంగుల దేహము, పొడవైన తోక గల ఆవు దక్షిణ.
(ఇందు రాజ సూయమునకు సంబంధించిన పదకొండు హవిస్సులు - ఇష్టులు చెప్పబడినవి. ఇవి ఆయా వ్యక్తుల - అధికారుల గృహముల వద్ద ఇవ్వవలసినవి. ఇందు రాజ్యపు అధికారులు స్పష్టము. మంత్రులు లేకుండుట గమనించవలెను.
ఒక్కొక్కరి ఇంటి వద్ద హవిస్సులు ఇచ్చుట వలన ఆయా దేవతలు సంతుష్టులు అగుదురు. వారు రాజ్యమునకు మేలు కలిగింతురు.
(ఇవి రత్న హవిస్సులు.)
2. ఇంద్రుడు చక్కగా పాలించువాడు. పాప విమోచకుడు. స్వగృహమున ఇంద్ర దేవతాకమునకు ఏకాదశ కపాలమ్ పురోడాశం నిర్వపతి.
3. అయంనోరాజా వృత్రహారాజాభూత్వావృత్రం వధ్యాత్
ఇతడు మా రాజు. ఇతడు వృత్రహంతరాజగు ఇంద్రుడు కావలెను. శత్రువులను వధించవలెను.
(అధ్వర్యుడు స్విష్టకృదగ్ని వద్ద ఈ మంత్రమును జపించవలెను.)
4. పాత్ర చతురస్రము కావలెను. దానిని రాలిపడిన రావి కొమ్మ నుండి మాత్రమే చేయవలెను - చెట్టును కొట్టరాదు. ఆ పాత్ర యందు తెల్లని దూడ గల తెల్లని ఆవు స్వయము ఇచ్చిన పాలను - తనకు తాను చిలుకగా వచ్చిన నేతిని ఉంచవలెను. అది మిత్ర, బృహస్పతి దేవతాకమగు హవిస్సు అగుచున్నది.
ఆ హవిస్సు కొరకు నూకలను, బియ్యమును వండవలెను. నూకలు పాలయందు పక్వము చేసిన చరు బృహస్పతి దేవతాకము అగును. బియ్యమును నేతియందు ఉడికించిన చరు మిత్ర దేవతాకము అగును.
ఇందు వేది స్వయంకృతము - బర్హిస్సు స్వయందినము - ఇధ్మము స్వయంకృతము అగుచున్నది.
తెల్లని దూడగల తెల్లని గోవు దక్షిణ అగుచున్నది.
(ఈ మంత్రమున 'స్వయం' అను పదము పలుమారులు వచ్చినది. స్వయం అనగా ఆంగ్లమున Auto అగును. తమంతట తాము చేసికొనిపోవు సాధనములు ఏవో ఉన్నట్లున్నవి. పాలు పిండుట, వెన్నతీయుట స్వయముగా ఈనాడు యంత్రములు చేయుచున్నవి. అట్టివి ఆనాడు ఉండెనా? అను విషయము పరిశోధించవలసి ఉన్నది.)
పదవ అనువాకము
(దేవసూ హవిస్సులు చెప్పబడినవి.)
1. i) గృహపతియగు అగ్నయే అష్టకపాలమ్ వ్రీహీణామ్ - నల్ల ధాన్యమునకు సంబంధించిన - పురోడాశమ్ నిర్వపతి.
ii) వనస్పతయే సోమాయ శ్యామాకమ్ - చామ ధాన్య సంబంధి - చరుమ్ నిర్వపతి.
iii) సత్య ప్రసవాయ సవిత్రే ద్వాదశపాలమ్ అశూనాం వ్రీహీణామ్ - అరువది దినముల పంట ధాన్యపు - పురోడాశమ్ నిర్వపతి.
iv) పశుపతయే రుద్రాయ గోవీధుకమ్ - అడవి గోధుమల - చరుమ్ నిర్వపతి
v) వాచస్పతయే బృహస్పతయే నైవారమ్ - నీవార సంబంధ - చరుమ్ నిర్వపతి.
vi) జ్యేష్ఠాయ ఇంద్రాయ ఏకాదశ కపాలమ్ మహా వ్రీహీణామ్ - స్థూల బీజ ధాన్య సంబంధి - పురోడాశమ్ నిర్వపతి.
vii) సత్యాయ మిత్రాయ అమ్బానామ్ చరుమ్ నిర్వపతి
viii) ధర్మ పతయే వరుణాయ యవమయమ్ చరుమ్ నిర్వపతి.
2. యజమానీ త్వామ్ - నిన్ను, సవితా, ప్రసవానామ్ - భృత్యాదులకు, స్వామిత్వేన - ప్రభువుగా, సువతామ్ - గుర్తించునుగాక.
గృహనామ్ స్వామిత్వేన అగ్నిః సువతామ్. వనస్పతీనామ్ స్వామిత్వేన త్వాం సోమః సువతామ్. రుద్రః త్వాం పశూనాం స్వామిత్వేన సువతామ్. బృహస్పతిః వాచాం స్వామిత్వేన త్వాం సువతాం. ఇంద్రః జ్యేష్ఠానాం స్వామిత్వేన త్వాం సువతామ్. మిత్రః త్వామ్ సత్యానాం స్వామిత్వేన సువతామ్. వరుణః త్వామ్ ధర్మవతీనాం స్వామి త్వేన సువతామ్.
దేవతలారా! మీరు దేవసువః యజమానికి ప్రేరణ కలిగించువారు. ఈ యజమానిని యజ్ఞదత్తుని పౌత్రునిగను, దేవదత్తుని పుత్రునిగను- శత్రురహితునిగను గుర్తించండి.
మహాతేక్షత్రాయ - మహాక్షాత్రము కొరకును, మహతే ఆధిపత్యాయ - మహా ఆధిపత్యము కొరకును, మహతే జాన రాజ్యాయ - మహా సామ్రాజ్యము కొరకును గుర్తించండి.
3. వైశ్యాది సంపన్నులారా! ఇతడు మీకు రాజు.
4. సోమాస్మాకం బ్రాహ్మణానాగం రాజా - బ్రాహ్మణులమగు మాకు సోముడు రాజు.
5. ఇతడు మహారాజ్యాదులందు వరుణునిచే ప్రతిష్ఠించబడినాడు. వరుణుడే దానిని ఆశ్రయించునుగాక.
మమ్ము మిత్రుడు అనుమతించినాడు. మేము పావనులము అయినాము. కర్మ యోగ్యులము అయినాము. అందువలననే మేము రాజసూయ యాగమును తలచుకొనువారము అయినాము.
ఋత్విజులెల్లరు వరుణుని అనుమతిచే కర్మయోగ్యులు అయినారు. మిత్ర దేవుడు విచ్చేసి మేము శత్రువులను పారద్రోలునట్లు చేసినాడు. ఋత్విజులు యజ్ఞము చేత మమ్ము రక్షించినారు. ఈ అగ్ని బ్రాహ్మణాది వర్ణత్రయము చేత విస్తరింపచేయబడినది. ఇతడు మాకు - వార్ధక్య దోషములను పోగొట్టి - ఆయువును కలిగించినాడు.
6. విష్ణోఃక్రమోసి విష్ణోఃక్రాన్తమసి, విష్ణోర్విక్రాన్తమసి
1 - 7 - 7 - 7 చూడండి.
పదకొండవ అనువాకము
(అభిషేకార్థ జలమంత్రములు చెప్పబడినవి.)
సరస్వతీ నదీ జలములారా! మీరు ఏదో ప్రయోజనార్థము ప్రవహించుచున్నారు. సముద్రుడా! నీవు జలములకు పతివి అగుచున్నావు. జలతరంగమా! నీవు నీరు పారించు దానవు అగుచున్నావు. జలరాశియను సేన గలదానవు అగుచున్నావు. కూపము నందలి జలములారా! మీరు బావి యందు నిలిచి ఉన్నారు. వంకర నడకల ఉదకములారా! మీరు వాయువులకు బలరూపములు అగుచున్నారు. (గాలికి నీరు వంకర నడక సాగించును.) ఎండా వానలు కూడిన జలమా! మీరు సూర్య తేజస్సు కలవారు అగుచున్నారు. సూర్యుడు ప్రతిబింబించు జలములారా! మీరు సూర్య త్వచారూపులు అగుచున్నారు. కదలిక లేని జలములారా! మీరు మందరూపులు అగుచున్నారు. మంచునందలి జలమా! మీరు వశవర్తులు అగుచున్నారు. గోవు గర్భాశయమందున్న జలమా! నీవు గర్భ రక్షకమవు అగుచున్నావు.
క్షీరమందలి నీరమా! మీరు జగములను పోషించువారలు అగుచున్నారు. పెరుగు నందలి నీరమా! నీవు జనులను పోషించుదానవు అగుచున్నావు. నేతియందలి నీరా! నీవు అగ్ని తేజస్సున పుట్టినదానవు అగుచున్నావు. మధు ద్రవ రూప జలమా! మీరు ఓషధులందలి రసరూపులు అగుచున్నారు.
రాజసూయమును గురించి తలచుచున్న ఋత్విజాదులు దీప్యమానములు, మధురములు, బలప్రదములునగు జలములను తీసికొన్నారు. వానితో మిత్రా వరుణులను అభిషేకించినారు. శత్రువులను అతిక్రమించినారు. ఇంద్రుని సాధించినారు.
జలములారా! మీరు రాజ్యమును ఇచ్చువారు. రాజ్యమును ప్రసాదించండి - స్వాహా. మీరు రాజ్యమును ఇచ్చు వారు. ఈ యజమానికి రాజ్యము నివ్వండి స్వాహా.
పన్నెండవ అనువాకము
(ఇవి జలసంస్కార మంత్రములు.)
1. జల దేవతలారా! మీరు అనేక పాత్రలందు గ్రహించబడినారు. మీరు మధురములు. రాజునకు వర్చస్సు కలిగించండి. మధుర, జలములను కలిసికొనండి.
2. జలములారా! మిమ్ము తిరస్కరించగలవారు లేరు. బలవంతులు కండి. రాజునకు బలము సమకూర్చండి.
(హోతృ, బ్రాహ్మణచ్ఛంసి స్థానముల మధ్య నీటిని ఉంచవలెను.)





