Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    3. ఆవిధముగనే వశిష్ఠపుత్రులు సింధునదిని అనాయాసముగ దాటినారు. భేద, నామక శత్రువును హతమార్చినారు. వసిష్ఠపుత్రులారా ! ప్రసిద్ధ దాశరాజ్ఞ యుద్ధమున మీ మంత్రబలముననే ఇంద్రుడు సుదాసుని రక్షించినాడు.

    4. మానవులారా ! మీ స్తోత్రములు పితరులకు తృప్తి కలిగించును. నేను రథమును నడిపింతును. మీరు అలసట చెందరాదు. వశిష్ఠగణములారా ! మీరు శక్వరీ రుక్కులు, శ్రేష్ఠ వచనములతో ఇంద్రుని బలము ఆర్జించినారు.

    (పితరులకు తృప్తి అనగా స్వయముగా వసిష్ఠుని తృప్తియే)

    5. జ్ఞాన తృష్ణగల రాజులు చుట్టుకూడినవారును వర్షయాచకులగు వశిష్ఠపుత్రులు పదిమందిరాజులతో యుద్ధమున సూర్యునివలె ఇంద్రుని పైకి లేపినారు. స్తోత వసిష్ఠుని స్తోత్రమును ఇంద్రుడు విన్నాడు. తృత్సు రాజులకొఱకు విస్తృత దేశమును ఇచ్చినాడు.

    6. గోవులను పాలించు దండులవలె భారత గణము తృత్సులు శత్రువుల మధ్య అల్పసంఖ్యాకులై ఉండిరి. తదనంతరము వశిష్ఠుడు వారి పురోహితుడయినాడు. అప్పటి నుంచి తృత్సు ప్రజ పెరుగసాగినది.

    7. అగ్ని, వాయువు, సూర్యుడు జగములకు జలమునిచ్చువారు. వారిలో ఆదిత్యాది మువ్వురు ఆర్యులు. వారు ముగ్గురు ఉషను సేవింతురు. వసిష్ఠులకు అవి అన్నియు తెలియును.

    (ఆదిత్యాదులు - ఆదిత్యులు, వసువులు, రుద్రులను ముగ్గురు)

    8. వశిష్ఠ పుత్రులారా ! మీ మహిమ సూర్యుని జ్యోతివలె ప్రకాశించును. మీ మహిమ సముద్రమువలె గంభీరము. వాయువేగమువంటి మీ స్తోత్రములను ఇతరులు అనుసరించజాలరు.

    9. వశిష్ఠగణములు జ్ఞానమున తిరోహితమయిన సహస్రశాఖలుగల లోకమున సంచరించినారు. వారు సర్వనియంత ద్వారా పరచబడిన విశాల నూలును నేయుచున్న మాతృ స్వరూపలగు అప్సరల వద్దకు వెళ్లినారు.

    (సర్వ నియంత యముడు. అతడు పరచినది పరిధిలేని జననమరణ ప్రవాహము. అప్సరలు తల్లులు. వారుచేసిన వస్త్రము జీవితము. వాసిష్ఠులు జననమరణ నియంత యముని జీవితము ఏర్పరచు మాతృమూర్తుల ఎరిగిన వారని తాత్పర్యము)

    10. వశిష్ఠా ! విద్యుత్తువంటి నీ జ్యోతిని నీవు పరిత్యజించుటను మిత్రావరుణులు చూచినారు. అప్పుడు నీకు ఒక జన్మ అయినది. అదికాక అంతకుముందు వాస స్థానమునుండి అగస్త్యుడు తెచ్చినాడు.  

    ("ఏతాశ్చేంద్ర స్యవాక్యమిత్యేకే వర్ణంతి అపరే వసిష్ఠ పుత్రాణమితి" దీనిని ఇంద్రుడే చెప్పినాడని కొందరు - వసిష్ఠ పుత్రులని కొందరు అని శాయణుడు)

    11. వశిష్ఠా ! నీవు మిత్రావరుణులు పుత్రుడవు. బ్రహ్మా ! నీవు ఉర్వశి మనసున ఆవిర్భవించినావు. అప్పుడు మిత్రావరుణుల వీర్యము స్థలమైనది. విశ్వదేవగణములు దివ్యస్తోత్రములతో పుష్కర మధ్యమున నిన్ను దాల్చినారు.

    (ఆదిత్య సవనమునకు మిత్రావరుణులు వచ్చినారు. వారు అక్కడ ఉన్న ఊర్వశిని చూచినారు. వారికి వీర్యస్కలనమైనది. దానిని ఒక కుండలో ఉంచినారు. తేవైవతు ముహుర్తేన వీర్యవంతౌ తపస్వినౌ అగస్త్య వశిష్ఠశ్చ తత్రర్షీ సంబభూవతుః అప్పుడే ఆ వీర్యము నుండి తపస్వినులగు అగస్త్య వసిష్ఠులు జన్మించినారని శాయణుడు)

    12. అనంత జ్ఞానవంతుడగు వసిష్ఠుడు భూలోక స్వర్గలోకములను తెలుసుకున్నాడు. సహస్రదానవంతుడయినాడు. సర్వనియంత యముని ద్వారా విస్తీర్ణ వస్త్రము జనన మరణ ప్రవాహమును వేయగోరి వశిష్ఠుడు ఊర్వశికి జన్మించినాడు.

    13. యజ్ఞదీక్షవహించిన మిత్రావరుణులు స్తుతులతో ప్రార్థితులై కలశమున ఒకేసారి రేతః స్ఖలనము చేసినారు. అనంతరము మాన్య అగస్త్యుడు జన్మించినాడు. వసిష్ఠ ఋషి సహితము అదే కుంభమునుంచి జన్మించినాడని జనులు చెప్పుకొందురు.

    (కుంభము టెస్ట్ ట్యూబ్ కావచ్చును. వారిది కృత్రిమ జన్మ కావచ్చును. ఆలోచించవలెను)

    14. తృత్సువులారా ! మీ వద్దకు వసిష్ఠుడు వచ్చుచున్నాడు. మీరు అతనిని ప్రసన్న చిత్తమున పూజించండి. వశిష్ఠుడు అగ్రగామి అయి ఉక్థ, సోమములు ధరించును.ప్రస్తరముతో అభిషవకర్త అగును. అతడు కర్తవ్యమును బోధించును.

    (ఇది తండ్రి కొడుకుల పరస్పర ప్రశంసవలె ఉన్నది.)

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత అయిదవ అష్టకము ఏడవ మండలమున రెండవ అనువాకము సమాప్తము)


                మూడవ అనువాకము             ముప్పది నాలుగవ సూక్తము

                               ఋషి - వశిష్ఠుడు, దేవత - విశ్వేదేవతలు,
                  ఛందస్సు-1-21 ద్విపద, 20,21 విరాజ, 22-25 త్రిష్టుప్.   

    1. దీప్తము, అభీష్టప్రదమగు స్తుతీ ! వేగవంతము, అలంకృతములగు రథమువలె నీవు మానుండి దేవతలవద్దకు చేరుము.

    2. క్షయమగు జలము భూమి, స్వర్గపు సృష్టి ఎరుగును. జలము స్తుతి వినును.

    (జలము, భూమి, స్వర్గముకన్న ముందు పుట్టినదని)

    3. విస్తీర్ణ జలము ఇంద్రుని ఆనంద పరచును. ఉపద్రవము వచ్చినపుడు వీరులు, శూరులు ఇంద్రుని స్తుతింతురు.

    4. ఇంద్రుడు రావలసి ఉన్నది. గుఱ్ఱములను రథముముందు కట్టండి. ఇంద్రుడు వజ్రధరుడు. స్వర్ణహస్తములవాడు.

    5. మానవులారా ! యజ్ఞమునకు సాగండి. గంతవలె స్వయముననే యజ్ఞమార్గమున సాగండి.

    6. మనుజులారా ! యుద్ధమునకు స్వయముగానే వెళ్లండి జనుల కొఱకు ప్రజ్ఞాపకము పాపనాశకమగు యజ్ఞము చేయండి.

    7. ఈ యజ్ఞ బలముననే సూర్యుడు ఉదయించును. భూమి ప్రాణులను మోయును. అట్లే యజ్ఞము సహితము భారము వహించును.

    8. అగ్నీ ! అహింసాదియుక్త యజ్ఞము చేయుదును. కోరికలు తీర్చుకుందును. పిలిచెదను. వారికొఱకు కర్మ చేయుదును.

    9. మానవులారా ! దేవతల లక్ష్యముగా దీప్త కర్మ చేయండి. దేవతలను స్తుతించండి.

    10. ఓజసి, బహునేత్రుడు, వరుణుడు నదుల జలమును పరిశీలించును.

    11. వరుణుడు దేశములకు రాజు. నదులకు రూపము. అతని బలము అప్రతిహతము. సర్వత్రగామి.

    12. దేవతలారా ! సకల ప్రజలలో మమ్ము రక్షించండి. నిందించ గోరు శత్రువును దీప్తిరహితును చేయండి.

    13. శత్రువులు అశుభంకర ఆయుధముల నలువైపుల తొలగిపోవలెను. దేవతలారా ! మాలోని పాపము తొలగి పోవలెను.

    14. హవ్యభోజి అగ్నీ ! మా నమస్కారములకు ప్రీతుడవగుము. మమ్ము రక్షింపుము. మేము అగ్నిని సుతింతుము.

    15. అగ్ని దేవతల సహచరుడు. అతనితో స్నేహము చేయండి. అతడు మనకు శుభంకరుడు కావలెను.

    16. మేఘహంతా ! నదీ స్థానమున కూర్చున్నవాడును జలమున ఉత్పన్నుడగు అగ్నిని స్తోత్రములతో స్తుతింతురు.

    ("ఋద్నే నదీరాం" అని మంత్రం ఋధ్నమనగా అంతరిక్షము ధృతా ఆప ఇతి ఉత్పత్తిః)

    17. అహిర్భుధ్న్యా ! మమ్ము హింసకునకు వప్పగించకుము. యాజ్ఞికుని యజ్ఞము క్షీణింప చేయకుము.

    (అహిర్భుద్న్య గార్హపత్య అగ్ని గృహములందలి అగ్ని)

    18. దేవతలు మాజనుల కొఱకు అన్నము ధరింతురు. ధనముకొఱకు ఉత్సాహులగు శత్రువు చావవలెను.

    19. సూర్యుడు సమస్త భువనములను తపింప చేయును. అట్లే దేవతల బలమువలన మహాసేనగల రాజు శత్రువులను తపింప చేయును.

    20. మా వద్దకు దేవతా స్త్రీలు వచ్చినపుడు ఉత్తమ హస్త నిపుణుడు త్వష్ట మాకు వీరపుత్రులను ప్రదానము చేయవలెను.

    21. త్వష్ట మా స్తోత్రములను స్వీకరించును. పర్యాప్త బుద్ధిగల త్వష్ట మా కొఱకు ధనాభిలాషి కావలెను.

    22. దాననిపుణులగు దేవపత్నులు మా మనోరథములను ప్రదానము చేయవలెను. ద్యావాపృథ్వులు, వరుణ పత్ని సహితము వినవలెను. శుభంకరుడు, దానశీలుడగు త్వష్ట ఉపద్రవ నివారణులగు దేవపత్నుల సహితుడై మాకు అభయము ఇవ్వవలెను.

    23. అవ్యయములగు మా ధనములను పర్వతములు పోషించవలెను. సమస్త జలములు ఆ ధనమును పోషించవలెను. దాన పరాయణులగు దేవపత్నులు దానిని పోషించవలెను. ఓషధులు ద్యులోకము సహితము పాలన పోషణ చేయవలెను. వనస్పతులు సహితమయి అంతరిక్షము సహితము పాలించవలెను. ద్యావాపృథ్వులు మమ్ము రక్షించవలెను.

    (అవ్యయ ధనములు ప్రకృతి సంపదలు. వాటికి స్వయముగా పునరుత్పత్తి ఉన్నందున అవ్యయములయినవి. ఆధునికమను పేరుగల రాక్షస నాగరకతలో పునరుత్పత్తిగల ప్రకృతి సంపదల ఉత్పత్తిని నాశనము చేయు ప్రయత్నము నిరంతరము జరుగుచున్నది.)

    24. మేము భరించ తగిన ధనమునే ఆశ్రయింతుము. విస్తృత ద్యావాపృథ్వులు దానిని ఆమోదించవలెను. దీప్తికి ఆధారభూతుడవగు ఇంద్రుడు మిత్రుడగు వరుణుడు ఆమోదించవలెను. పరాజయకర్తలు మరుద్గణములు సహితము ఆమోదించవలెను.

    (ధియధ్యైః భరించ కలిగినంత ధనము మాత్రమే ఉండవలెను. అది ప్రకృతి శక్తుల అనుమతి గలది కావలెను.ఈ యంత్ర నాగరికతకు పట్టిన రోగము ప్రకృతి అనుమతిలేని భరించలేని ధనము! ఇది పులిని ఎక్కినది. స్వారి చేయలేదు. దిగలేదు. ఆశ్చర్యమేమనగా ఆనాటి ఋషులు నేటి మానవుని హెచ్చరించినాడు.) 

    25. ఇంద్ర, వరుణ, మిత్ర, అగ్ని, జల, ఓషధ, వృక్షములు మా స్తుతులను స్వీకరించవలెను. మరుత్తుల వద్ద నివసించి మేము సుఖింతుము. యూయం పాత స్వస్తిభిః సదానః

    (గాలి వద్ద కన్న సుఖము మరెక్కడ లభించును?)


                                           ముప్పది ఐదవ సూక్తము

                    ఋషి - వసిష్ఠుడు, దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రాగ్నులారా ! మాకు రక్షణలు కల్పించండి. శాంతి ప్రసాదించండి. ఇంద్రావరుణులారా ! యజమాని హవ్యము సమర్పించినాడు. మీరు మాకు శాంతి ప్రసాదించండి. ఇంద్రసోములు మాకు శాంతి, శుభములు ప్రసాదించువారు కావలెను. ఇంద్ర, పూషలు మాకు శాంతి, సుఖములు ప్రసాదించవలెను.

    2. భగుడు మాకు శాంతిని ఇవ్వవలెను. నరశంసాగ్ని మాకు శాంతి ప్రదుడు కావలెను. మాకు పురంధ్రి శాంతి ప్రద కావలెను. సకల ధనములు మాకు శాంతి ప్రదములు కావలెను. ఉత్తమము. నియమయుక్త సత్యవచనము మాకు శాంతి ప్రసాదించవలెను. బహుమారులు అవిర్భూత ఆర్యమ మాకు శాంతి దాత కావలెను.

    3. ధాత మాకు శాంతిని ఇవ్వవలెను. ధర్త వరుణుడు మాకు శాంతిని ఇవ్వవలెను. పృథ్వి అన్న సహితముగా శాంతి ఇవ్వవలెను. మహాంతములగు ద్యావాపృథ్వులు మాకు శాంతి ఇవ్వవలెను. పర్వతము శాంతి ఇవ్వవలెను. దేవతల సకల ఉన్నత స్తుతులు శాంతి ఇవ్వవలెను.

    4. జ్వాలాముఖాగ్ని మాకు శాంతి ప్రసాదించవలెను. మిత్రావరుణులు శాంతి ప్రసాదించవలెను. అశ్వినులు శాంతి ప్రసాదించవలెను. పుణ్యాత్ముల పుణ్యకర్మలు శాంతి ప్రసాదించవలెను. గతిశీలమగు వాయువు సహితము శాంతముగా వీచవలెను.

    5. ప్రథమ ఆహ్వానముననే ద్యావాపృథ్వులు మాకు శాంతికలిగించవలెను. దర్శనీయ అంతరిక్షము మాకు శాంతి కలిగించవలెను. ఓషధులు, వృక్షములు మాకు శాంతి కలిగించవలెను. విజయ పరాయణుడగు లోకపతి ఇంద్రుడు సహితము మాకు శాంతి కలిగించవలెను.

    6. వసువులతో కలిసి ఇంద్రుడు మాకు శాంతి అనుగ్రహించవలెను. ఆదిత్యులతో కలిసి శోభనస్తుతుల వరుణుడు మాకు శాంతి అనుగ్రహించవలెను. రుద్రుగణముల కొరకు రుద్రుడు మాకు శాంతిని అనుగ్రహించవలెను. దేవతా స్త్రీలతో త్వష్ట మాకు శాంతిని అనుగ్రహించవలెను. యజ్ఞము మా స్తోత్రము వినవలెను.

    7. సోముడు మాకు శాంతి అందించవలెను. స్తోత్రము మాకు శాంతి అందించవలెను. శిలలు మాకు శాంతి అందించవలెను. యూపముల కొలతలు మాకు శాంతి అందించవలెను. ఓషధులు మాకు శాంతి అందించవలెను. వేదము మాకు శాంతి ప్రసాదించవలెను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.