Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1


 
    7. ఇంద్రా ! నీవు వజ్రమును నాట్యము చేయించగలవు. నీకు హవిస్సులు అర్పించు యజమాని కొఱకు తొంబది శత్రు నగరములను కూల్చినావు. శత్రుసంహారకమగు వజ్రమున యజమాని యొక్క శత్రువులను హతమార్చినావు. దివోదాసుని కొఱకు అతని శత్రువు శంభరాసురుని కొండమీది నుంచి కూలద్రోసినావు.

    8. ఇంద్రుడు యుద్ధములందు యజమానుని రక్షించుచున్నాడు. సమస్త యుద్ధములందు, తన ఆయుధములతో, యజమానుని రక్షించుచున్నాడు. స్వర్గ సౌఖ్యములను ఇచ్చి యుద్ధములందు రక్షించుచున్నాడు. ఇంద్రుడు నదులకొఱకుగాను విద్వేషులను సంహరించుచున్నాడు. కృష్ణుడు అను రాక్షసుని నల్లని చర్మము ఒలిచి చంపినాడు. దహించినాడు. హింసించు సర్వజంతువులను నిశ్శేషముగ హతమార్చినాడు.

    9. ఇంద్రుడు సూర్యుని రథచక్రమును తన బలమున లాగినాడు. తేజోవంతుడు అయినాడు. శత్రువు మీద ప్రయోగించినాడు. శత్రువులను హతమార్చినాడు. ఇంద్రుడు ఉశనసుని రక్షించుటకు ఇంతదూరము వచ్చినాడు. అతడు మాకు సమస్త సుఖసాధనములను ప్రసాదించవలెను. నరునివలె సాయపడవలెను. నిత్యము మా కోరికలను తీర్చవలెను.

    10. ఇంద్రా ! నీవు వర్షించువాడవు. శత్రుపుర ధ్వంసకుడవు. ప్రసిద్ధుడవు. మేము దివోదాస వంశజలము. నిన్ను నవీన స్తోత్రములతో భజించుచున్నాము. మా స్తోత్రములకు సంతృప్తుడవు అగుము. మమ్ము రక్షించుము. పగటి సూర్యునివలె ప్రకాశించుము.

                         నూట ముప్పది ఒకటవ సూక్తము

        ఋషి - పురుచ్చేపుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - అంత్యష్టి.


    1. దేవతలు ఇతరులను నిరసించు స్వభావులు. అయినను ఆ దేవతలు ఇంద్రునకు వశులయి ఉన్నారు. భూమి కూడ ఇంద్రుని కీర్తి కొఱకు, ఇంద్రునకు వశమయిఉన్నది. దేవతలందరు ఏకముగా ఇంద్రునే ముందుంచుకున్నారు. మానవులు చేయు ప్రాతస్సవనాదులు మూడును, పురోడాశాది హవిస్సులును ఇంద్రుని కొరకే అగుచున్నవి.

    2. ఇంద్రా ! నీవు సర్వసముడవు. యజమానులు తమ కోరికలు తీర్చుకొనుటకును, స్వర్గాదులు లభించుటకును, నీ ఒక్కనికే, సకల సోమయాగములందును, విశేష హవిస్సులను అర్పించుచున్నారు. యజమానులు నిన్ను ఓడవలె దరిచేర్చు వానిగా భావించి సేనాగ్రమందు ఉండమని అర్థించుచున్నారు. యజ్ఞములందు ఈశ్వరునివలె భావించి నిన్ను కీర్తించుచున్నారు.

    3. ఇంద్రా ! నీవు పబ్బమును విడువక నీ సామర్ధ్యమును ప్రకటించుచున్నావు. యజమానులు గొసమూహములను కోరి ఉన్నారు. పాపములు పోగొట్టుకోదలచినారు. ఆ తలంపుతో భార్యా సహితులయి నీకు హవిస్సులు ఇవ్వదలచినారు. యాగములు చేయుచున్నారు. నీవు యజమానులకు గోవులను, స్వర్గమును ప్రసాదించుము.

    4. ఇంద్రా ! నీవు ఎంతోకాలముగా గట్టిపడిన శత్రుపురములను ధ్వంసము చేసినావు. యాగ విరోధులగు రాక్షసులను నాశనము చేసినావు. ఈ నీ పరాక్రమమును యజమానులు గ్రహించినారు. నీవు ఈ భూమిని, జలమును స్వాధీనపరుచుకున్నావు. సకల సంతోష కార్యములను చేయుచున్నావు.

    5. ఇంద్రా ! నిన్ను భజించు యజమానులను రక్షించుచున్నావు. నీ స్నేహము కోరిన మమ్ము రక్షించుచున్నావు. అందువల్ల సర్వయాగములందును నీకు బలమును ఇచ్చు సోమమును సమర్పించుచున్నాము. యజమానులను రక్షించుటకు యుద్ధములందు సింహనాదము చేయుచున్నావు. నీకు సర్వ విషయములందును సమృద్ధి కలదు. అన్నము కోరినవారికి అన్నము ఇచ్చుచున్నావు.

    6. ఇంద్రుడు కామ్యార్థ ప్రదాతగా-శత్రుహింసకుడుగా పేరుపొందినాడు. స్వర్గ సాధనమగు యజ్ఞమునకు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. ఇంద్రుడు ఉషఃకాలమున విచ్చేయునా ? అర్చన సాధనములగు హవిస్సులు గ్రహించునా?

    7. పరాక్రమశాలీ ! ఇంద్రా ! నిన్ను మాస్తుతులతో పూజించినాము. మాయందు శతృత్వము గలవారిని మాకు దుఃఖములు కలిగించు వారిని నీ వజ్రాయుధమున హతమార్చుము. మంచి స్తోత్రములు వినుము.

    మమ్ము జయించవలెనన్న దుర్బుద్ధి నశించవలెను. సకలమార్గములందును దోపిడిగాండ్ర దుర్బుద్ధి మమ్ము బాధింపకుండవలెను.

                          నూట ముప్పది రెండవ సూక్తము
   
           ఋషి - పురుచ్చేపుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - అంత్యష్టి.


    1. ఇంద్రా ! నీవు మాకు రక్షకుడవు. నీవు మాకు సాయము చేయుము. మేము ఎంతటి శత్రువునైనను ఎదిరించగలము. మా మీదకు వచ్చువారిని హతమార్చగలము. యజ్ఞమునందు సోమము సమర్పించిన యజమానికి మేలు చేయుము. యుద్ధములందు శత్రుంజయుడవయిన నీకు హవిస్సులు అందించుచున్నాము. స్తుతించుచున్నాము.

    2. శత్రువులను సంహరించదలచిన యజమాని వీరమార్గమును అవలంబించుచున్నాడు.  ఇంద్రునకు ప్రీతి కలిగించుటకు ప్రాతస్సవనము చేయుచున్నాడు. స్వర్గప్రదాత అగు ఇంద్రుడు ఆ యజమాని శత్రువులను హింసించుచున్నాడు. అన్నీ తెలిసిన యజమానికి ఇంద్రుడు పూజనీయుడు. అట్లే ఇంద్రుడు సర్వజనులకు పూజనీయుడు అగును.

    ఇంద్రా ! మాకు సంపదలు ప్రసాదించుము. నీవు చేసిన దానములు స్థిరములు కావలెను.

    3. ఇంద్రా ! ఋత్విజులు వేదికలు సిద్ధము చేయుచున్నారు. యాగములు చేయుచున్నారు. నీ కొఱకు ప్రకాశమానమగు హవిస్సులు సిద్ధము చేసినారు. నీవు స్వర్గమున ఉన్నావు. అంతరిక్షమున సూర్యరూపమున నిన్ను అందరు దర్శించుచున్నారు. నీవే వర్షము కలిగించుచున్నావు. యజమానులకు గోధనమును ప్రసాదించుచున్నావు.

    4. ఇంద్రా ! అంగిరో గోత్రజుల కొఱకు మేఘమును భేదించినావు. వారి గోసమూహములను విడిపించినావు. అట్లే యుద్ధములు చేసినావు. జయించినావు. మేము నీకు సోమమును సమర్పించుచున్నాము. సమస్త యాగవిరోధులను హతమార్చుము. మాయందు కుత్సితబుద్ధిగల శత్రువులను వధింపుము. నీపనులు పూర్వమువలెనే స్తవనీయములు.

    5. ఇంద్రుడు పరాక్రమశాలి. అతని వీర కృత్యములు జగద్విదితములు. యజమానులు తమ శత్రువులను బాధించుమని ఇంద్రుని అర్చించుచున్నారు. హవిస్సులు అందించుచున్నారు. హవిస్సులు ఇంద్రుని కొరకే ఏర్పడినవి. ఇంద్రుడు అన్నము కోరిన యజమానులను రక్షించుచున్నాడు. వారి శత్రువులను హతమార్చుచున్నాడు. యజమానులు స్వర్గమును సాధించు కర్మలు చేయుచున్నారు. దేవతలను అభిముఖము చేసికొనుచున్నారు.

    6. మేఘాభిమాన దేవతలారా ! మీరు యుద్ధమున అగ్రభాగమున నిలుపుడు. మమ్ము వధించవచ్చు సేనను హతమార్చుడు. శత్రువులను అందరను వజ్రమున చావగొట్టుడు. వజ్రాయుధము దూరము నుంచి కనిపించదు. లక్ష్యమయిన శత్రువుమీదపడి కూల్చును. మా విరోధులు ఎక్కడ ఉన్నను, వజ్రము వారిని వారి ఉపాయములను భేదించును.

        నూట ముప్పది మూడవ సూక్తము-ఋషి-పురుచ్చేపుడు, దేవత-ఇంద్రుడు,
             ఛందస్సు - 2,3,4 అనుష్టుప్, 5 గాయత్రి, అధ్వతి; 7 అంత్యష్టి.


    1. యజ్ఞములు చేయుచున్నాము. ద్యావా భూములను పవిత్రము చేయుచున్నాము. ఇంద్రునకు ఆశ్రయములు కాని భూములను, ఇంద్ర ద్రోహస్థానములను కాల్చుచున్నాము. మమ్ము ఎదిరించిన శత్రువులు అందరు శ్మశానము పాలయినారు.

    2. శత్రుంజయుడవగు ఇంద్రా ! శత్రు సేనల శిరస్సులను సర్వవ్యాప్తములగు నీపాదముచేతను, ఐరావతపాదము చేతను అణగద్రొక్కుము.

    3. ఇంద్రా ! శత్రు సేనలను చూర్ణము చేయుము. పీనుగుల పెంట చేయుము. శ్మశానము చేయుము. కుత్సితము సర్వసాధారణము. దానిని తగలపెట్టుము.

    4. ఇంద్రా ! పైన చెప్పిన సేనలకు మూడింతల సేనలను వెంటపడి తరిమినావు. పట్టుకున్నావు. హతమార్చినావు. నీవు చేసిన శత్రు సేనా వధ మహత్తరమయినది. అనల్పమయినది.

    5. ఇంద్రా ! ఎరుపురంగులుగల భయంకర పిశాచములను హతమార్చుము. సమస్త రాక్షసులను హతమార్చుము.

    6. ఇంద్రా ! నీవు శత్రునాశకుడవు. ఘన మేఘములను తలక్రిందులుగా చీల్చుము. వర్షము లేక భూమి ఏడ్చినట్లు, త్వష్ట రూపాగ్ని భయమున ద్యావా భూములు ఏడ్చినట్లు యజ్ఞములు లేక ద్యులోకము ఏడ్చుచున్నది.

    ఇంద్రా ! నీవు బలవంతుడవు. శూరుడవు. క్రూరములగు ఆయుధములు గలవాడవు. "త్రిసప్తైః శూరసత్వభిః" ఇరువది ఒక్కమంది వీరభటులతో శత్రువుమీదకు పోవుచున్నావు.

    7. సోమయాగము చేసిన యజమాని గృహములు పొందుచున్నాడు. శత్రువులను హింసించుచున్నాడు. దేవతల శత్రువులను ఓడించుచున్నాడు. అన్నము కలవాడు అగుచున్నాడు. అపరిమిత ధనమును పొందుచున్నాడు.

    ఇంద్రుడు సోమయాగము చేయువారికి సమస్త సంపదలు ప్రసాదించుచున్నాడు.

                 (ప్రథమ మండలమున పందొమ్మిదవ అనువాకము సమాప్తము.)

        ఇరువదవ అనువాకము - నూటముప్పది నాలుగవ సూక్తము
        ఋషి - పురుచ్చేపుడు, దేవత - వాయువు, ఛందస్సు - అంత్యష్టి.


    1. వాయువా ! సమర్ధము, వేగవంతములు అయిన అశ్వములు నిన్ను అందరికన్నముందు యాగమునకు తీసికొనిరావలెను. నిన్ను సంతోషపెట్టుటకు వాక్కు సత్యయుతము, గుణవంతము కావలెను. యజ్ఞసంబంధములయిన హవిస్సులు అందుకొనుటకును, మా కోర్కెలు తీర్చుటకును రథమున విచ్చేయుము.

    2. మేము సోమము సిద్ధపరచినాము. అది శోధింపబడినది. ప్రకాశించునది. నిన్ను ఆనందింపచేయును. వాయువా ! నీ గుఱ్ఱములు "నియుత్తులు" అని నిన్ను సేవించునవి. పని నేరవేర్చునవి. సంతోషము కలిగించునవి. కలిసి నడుచునవి. ఆ గుఱ్ఱములు నిన్ను యాగస్థలమునకు చేర్చగలవు. ఋత్విజులు హవిస్సులతో నిన్ను నుతించుచున్నారు.

    3. వాయువు ఎర్రని గుఱ్ఱములను కాడికి కట్టుచున్నాడు. చిత్రవర్ణ అశ్వములను రథమునకు పూన్చుచున్నాడు. జారుడు పరస్త్రీని మేల్కొలిపినట్లు వాయువా ! యజమానిని మేల్కొల్పుము. ఉషస్సులను నిలుపుము. ద్యావాపృథ్వులను ప్రకాశింపజేయుము.

    4. వాయువా ! ప్రకాశించు ఉషస్సులు నీ కొఱకు అంతరిక్షమున ఆవరించిన తమ కిరణములచేత వస్త్రములు విస్తరించుచున్నవి. నానావర్ణ వస్త్రములను పరచుచున్నవి. గోవు నీ కొరకే పాలు, నేయి మున్నగు వానిని ఇచ్చుచున్నది. వర్షము కలిగించు వాయువులను కలిగించుచున్నావు. నదులను ప్రవహింపచేయుచున్నావు.

    5. వాయువా ! పవిత్రులగు యజమానులు యాగములందు నీ కొఱకు సోమమును సిద్ధపరచినారు. నిన్ను వర్షము కలిగించమని ప్రార్థించుచున్నారు. నీవు సమస్త భూతముల నుండి హవిస్సులు అందుకొనుచున్నావు. సర్వభూతములను రాక్షస బాధనుంచి రక్షించుచున్నావు. వ్రతములచే క్షీణించిన యజమాని యాగవిరోధులను పారదోలవలసినదని నిన్ను ప్రార్థించుచున్నాడు.

    6. వాయువా ! నీకు సోమపానమున అగ్రస్థానము కలదు. సోమపానమునకు అర్హుడవు. నీవు పాపములు పోగొట్టువాడవు. యజమానులు నిన్ను విశేషముగ ఆహ్వానించుచున్నారు. సమస్త గోవులు నీ కొరకే పాలు, నెయ్యి మున్నగునవి ఇచ్చుచున్నవి.

        నూట ముప్పది అయిదవ సూక్తము - ఋషి - పరచ్చేపుడు,
      దేవత - వాయువు, ఇంద్రుడు - ఛందస్సు - 7,8 అష్టి; మిగిలినవి అత్యష్టి.


    1. వాయువా ! దర్భలు పరచినాము. సోమము సిద్ధము చేసినాము. నూర్ల, వేల అశ్వములతో విచ్చేయుము. నీకొఱకు ఋత్విజులు ఇతర దేవతల కంటే ముందు సోమము సమర్పించినారు. ఈ సోమము నిన్ను ఆనందపరచుటకే అయి ఉన్నది. ఋత్విజులనుండి సోమము అందుకొనుము ఆస్వాదించుము.

    2. ఈ సోమము పవిత్రముతో సంస్కరించినది. కోరదగినది. నిర్మల కాంతులు కలది. వాయువా ! ఈ సోమము నీకు తగినది. మనుష్యుల మధ్య పొందదగిన సోమమును నీకు దేవతల మధ్య సమర్పించినాము. నీవు నియుత్తు అను గుఱ్ఱములు పూన్చిన రథమునందు విచ్చేయుము. మాతో కూడుము. తృప్తినొందుము. స్వర్గమునకు చేరుము.

    3. సోమము సూర్యోదయమందు సమాన కాంతి కలిగి ఉన్నది. శుద్ధమయినది. ప్రకాశమానము. అధ్వర్యులు దానిని పట్టుకొని నలిచినారు. వాయువా ! నీకు హవిర్భాగము అందించు సమయము అయినది. నీవు నూర్లకొద్ది, వేలకొలది అశ్వములతో విచ్చేయుము. హవిస్సులు ఆరగించుటకు ఆతురతగా విచ్చేయుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.