Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"విశ్వాసమా? రెండు నెల్లయినా సరిగ్గా పరిచయం లేనివానిమీద విశ్వాసమా?"
"రెండు నెల్లు జేలుపరిచయం. జేలు. తెలిసిందా?"
"నీకు అతని పేరైనా తెలియదే!"
కాలూ తత్తరపడ్డాడు.
"ఒకరోజు అతన్నిపేరు అడుగుతే 'మనకు ఈ నెంబర్లకంటే మంచిపేర్లు ఉంటాయా?" అని జవాబు చెప్పాడు" అన్నాడు.
ఆ జవాబుతో లేఖ ప్రభావితం అయింది. కాలూ అది గుర్తించి సంతోషంతో "ఇంకోనాడు బి.10 కులం అడిగాను. అప్పుడు అతడు 'నాది ఖైదీలకులం' అని జవాబు చెప్పాడు" అన్నాడు.
"ఆఁ. బి.10 అలా అన్నాడా?"
ఆమె ముఖంలో కనిపించిన ఈర్ష్య అంతరించింది. మళ్ళీ ఆమె ముఖంలో సహజ విచారరేఖలు అలముకున్నాయి.
"నాకొక కోరిక ఉంది"
ఆమె తన కోరికను గురించి మాట్లాడి కొన్ని యుగాలు గడిచిపోయాయి. ఆమె కోర్కె వినాలని కాలూ చెవులు నిక్కపెట్టాడు.
"బాబూ, నాకు జేలు చూడాలని ఉంది. గేటుదగ్గర ఉండి జేలు చూస్తా. అదే నా కోర్కె. విశ్వనాథ్ మామతో వెళ్తా."
"ఎందుకూ"
"నాకూ జేలు చూడాలని ఉంది"
"నాకు చెప్పగూడదా"
"నేను గుమ్మడికాయ దొంగిలించానని నీతో చెప్పానుకదూ. ఆ ముసలిది పోలీసులకు రిపోర్టు చేసి ఉంటే? నేనూ జేలుకు వెళ్ళేదాన్నేగా?"
"లేఖా! ఆ ముసల్దానికి ఎవరున్నారు? అంతేకాక అంటరానిది.దానికి పోలీసుల దగ్గరికి వెళ్ళేంత ధైర్యమా?"
"కొల్లలుగా ధనంగలవారినుంచి వారికి ఏమాత్రం అవసరంలేని వస్తువును దొంగిలించినందుకు నిన్నేమో జేల్లోపెడ్తారూ? అవును ఎప్పటికైనా పేదలే పేదలకు తోడ్పడాలి. నేను చేసింది దొంగతనం అనేదిమాత్రం వాస్తవం."
"చంద్రలేఖా, నువ్వా గడ్డుదినాల్ను మరిచిపొమ్మని నెత్తిననోరు పెట్టుకొని అరుస్తున్నా"
"నేనూ అందుకే ప్రయత్నిస్తున్నా. అయినా ఆ స్మృతిపథం నుంచి పూర్వస్మృతులు చెరిగిపోవడం లేదు."
తన కూతురుకు ఎలా సహాయం చేయాలో అర్ధంకాక కాలూ తల నేలకు వేశాడు.
లేఖ ఆగకుండా చెపుతూనే ఉంది. "ఈ కొత్తజీవితం నాకు అవాస్తవంగా కనిపిస్తూంది. ఈ ఇల్లు, గుడి, మహానగరం అన్నీ మిధ్యగా కనిపిస్తున్నాయి." ఆమె క్షణం ఆగింది. "జేలే నయం. అది కనీసం వాస్తవం" అన్నది.
కాలూ భరించలేక "చంద్రలేఖా!" అని గట్టిగా అరచాడు.
"పోనీ ఇలాగే గడవనీ. నాకు బుద్దిలేదు. నేను జేలు చూడ్డానికి ఎందుకు వెళ్ళాలి?"
చర్చ అంతటితో ముగిసింది. కాని కాలూ మెదులోమాత్రం అది ఒక సమస్యగానే నిలిచిపోయింది. దాన్ని ఏదో విధంగా పరిష్కరించాలి. ఇల్లు గుడి, మహానగరం అన్నీ మిధ్య. తన జీవితమూ, లేఖ జీవితమూ ఒక నిర్దిష్ట రూపానికి రావడానికి ఈ మహానగరం కారణం కాదా?నేరం అనుకొని దాన్నిచూచి బెదరడం, వెరవడం?
కనీసం ఆమె తన్ను డాక్టరు చూడ్డానికి అనుమతిస్తే? ఆమె తనకేమీ జబ్బులేదని ఖచ్చితంగా చెప్పేసింది. జబ్బేమీలేదూ? ఇంతకంటే జబ్బేంకావాలి? ఎప్పుడూ మనసును చికాకుపరచే ఆలోచనల్తో తుచ్చమైన గతపు గూడులోనే కూర్చొని ఉండడం జబ్బుకాకుంటే ఏమిటి?
కాలూకు కూతురు పెళ్లినిగురించిన విచారం పట్టుకుంది. లేఖ తల్లి జీవించి ఉన్నట్లయితే కూతురును ఇంతకాలం పెళ్ళికాకుండా ఉండనిచ్చేదా? అప్పుడే ఆమెకు 18 ఏండ్లు వచ్చాయి. ఆమెనుగురించి శ్రద్ద తీసుకునే భర్తా, ఆమె శ్రద్ద తీసుకోవాల్సిన మాతృత్వమూ ఉంటే బహుశః ఆమె సర్దుకొనిపోవచ్చు. అయితే వరుడు? అతడు బ్రాహ్మడు కావాలి.
బాపనివరుడు దొరకడం అట్టేకష్టం ఏమీకాదు. శివసంహిత పారాయణం చేయడానికి వచ్చిన అయిదుగురు బాపల్లోనూ ఒకని వృత్తి పెళ్ళి సంబంధాలు కూర్చడమే. అతడు 'మీ కూతురు అప్సరలాంటిది. ఆమె ఉత్తమమైన బ్రహ్మని ఇంటికి ఇల్లాలు కావాలి. నేను వరులను తెస్తుంటాను. మీరు మంచిచెడ్డలు చూస్తూ ఉండండి" అన్నాడు.
"వరుడు దొరకడం కష్టం. అందులోనూ నా కూతురుకు అన్ని విధాలా తగినవాడు ఏ పదివేలల్లోనో ఒకడుంటాడు."
చంద్రలేఖ వాస్తవాన్ని గ్రహించాలి. వర్ణబంధాల్ను తండ్రి పటపటా తెంపివేయడం ఆమె కళ్ళారా చూచింది. దానివల్ల ఎవరినెత్తినా పిడుగు పడలేదు. అయినప్పుడు ఆమె బాపన్ని పెళ్ళిచేసుకోవడానికి ఎందుకు అంగీకరించదు?
ఆమె అందుకు అంగీకరించకుంటే? గుడివదిలి మళ్ళీ పాతజేవేఇతపు మార్గం పట్టాలి. అప్పుడు ఆమె ఎవరో ఒక కమ్మరి కుర్రాణ్ణి పెళ్ళాడి ఇరుకుజీవితం గడపాల్సి ఉంటుంది.
గతం ఆమె స్మృతిపథంనుంచి కదలడంలేదు. ఆకలితో అలమటించిన గతంమాత్రమే కాదు, ఆమె మెడల్ గెల్చినప్పుడు కులంతక్కువకాబట్టి ఆమెను ఎవరూ గుర్తించలేదనే విషయం సహితం ఆమెకు మరపుకు రావడంలేదు. మేజిస్ట్రేటు కూతురుకే మెడల్ రావడం సంభవిస్తే ఊళ్ళో ఎంతమంది సంబరపడేవాళ్ళో? కమ్మరిబిడ్డ మెడల్ గెలిచిందంటే ఝార్నాకు గర్వంకాక సిగ్గు కలిగింది. నాలుగు రోజుల ఈ నాటకం తరువాత మళ్ళీ పాతజీవితానికి మరలుతే?
కాలూ తలతిప్పాడు. అలా కావడానికి వీల్లేదన్నట్లు తలను అటూఇటూ ఊపాడు. లేఖ తనతోపాటు పులినెక్కింది. సాగిపోవాల్సిందే. దిగడానికి వీల్లేదు.
అతని ఆలోచనలు కొత్తబాటలు త్రొక్కాయి. లేఖను కూడా అతన్తో తీసికెళ్తే? ఇద్దరూ హాయిగా రైల్లో ప్రయాణం చేయవచ్చు. అందువల్ల కాస్త ఉత్సాహంగా కూడా ఉంటుంది. ప్రయాణంకొద్ది దూరమే అయినా స్థలం మార్చినట్లుకూడా అవుతుంది.
బి.10 ఇదంతా చూసి ఆశ్చర్యంతో మునిగిపోతాడు.
ప్లానంతా సిద్దం చేసుకుని విశ్వనాథ్ తో చెప్పాడు. అతడు సాధారణంగానే 'మీలాంటి బ్రాహ్మలున్నన్నాళ్ళూ ఈ సామాజిక నియమాలమీద ప్రజలకు విశ్వాసం సడలదు" అన్నాడు.
నిర్ణీత దినాన కూతురు సహితంగా కాలూ బగ్గీ ఎక్కాడు. స్టేషను చేరి ఉదయం తూర్పుకు వెళ్ళే బండి ఎక్కి కూర్చున్నారు. లేఖ వింతగా చుట్టూ కలయచూసింది. పెద్దపెద్ద ఆకుపచ్చని కుషన్ సీట్లూ, పచ్చని గోడలూ, అద్దం, స్పటికంలాంటి లోకప్పుకు తగిలించి ఉన్న ఫ్యానులు, నిక్కెల్ ఫిట్టింగులూ, షవర్ గల స్నానాలగదీ ఇవన్నీ ఆమెకు కనిపించాయి.
"ఇది ఫస్టుక్లాసు" అన్నాడు కాలూ అసహజధోరణిని వ్యక్తపర్చకుండా ఉండాలని ప్రయత్నిస్తూ. అయినా అతనిలో గర్వం కనిపించకపోలేదు. అతడు లేఖ ముఖకవళికల్ను పరీక్షించాడు.
ఇంతకు ముందుకూడా ఒకసారి కాలూ ఫస్టుక్లాసు ప్రయాణం చేశాడు. అయితే అప్పుడతను ఫస్టుక్లాసు పెట్టె హ్యాండిల్ బార్ పట్టుకొని ఫుట్ బోర్డుమీద ప్రయాణం చేశాడు.
రైలు కదిలేముందు పళ్ళవాణ్ణి కేకవేసి బాగా పండిన బంగారు రంగుగల అరటిపళ్ళు కొన్నాడు.
కాలూ అరటిపళ్ళు కొనేసింతరువాత లేఖ ఆశ్చర్యంగా "అరటిపళ్ళూ! అవి తింటే మనకు ఇష్టమేలేదు. మరి ఎందుకా అరటిపళ్ళు? దండుగ' అని అడిగింది.
"ఆ పక్కబల్లమీద అవిఉంటే ఎంతో అందంగా ఉంటాయి." అతనిచూపు అరటిగుత్తిలో ఇరుక్కుంది.
అతడు కాళ్ళు చాచుకొని, వెనక్కు ఆనుకొని హాయిగా కూర్చున్నాడు. పచ్చని కుషన్ సీటు చేతితో వత్తిచూచాడు. ఒక నిముషం అలా కూర్చొని ఫ్యాన్ స్విచ్ దగ్గరికి వెళ్ళాడు. ముఖాలు వార్తా పత్రికల్లో దూర్చుకొని వానిలో మునిగిపోయిన ఇద్దరు ప్రయాణీకులు గాలితగలగానే ముఖాలెత్తి చూశారు. రాత్రి పెద్దవర్షం కురిసింది. చలిచలిగా ఉంది. కాబట్టి గాలి అవసరం లేదన్నట్లు వారు విసుక్కున్నారు.
వారి విసుగుచూచి కాలూ తనకుతానే జవాబు చెప్పుకున్నాడు. 'మీరెంతో నేనూ అంతే. అవసరం అనిపిస్తే నేను ఫ్యాన్ వేసుకుంటాను. గాలికీ నీటికీ అన్నిటికీ డబ్బుచెల్లించాను.' కాలూ పేపరుకొనడం మరచిపోయినందుకు విచారపడ్డాడు. పొద్దున్నే పేపరు చదవడం బాగుంటుంది.





