Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    3.  ఇంద్రా! నేను కోరినది నీవు నాకు ప్రసాదించుము. నీవు కోరినది నేను నీకు అర్పించెదను. నీవు నాకు ప్రసాదించినది నావద్ద ఉంచుము. నేను నీకు అర్పించినది నీవద్ద ఉంచెదను. ఇది ఒక్కసారి కాదు. తేపతేప జరుగు చుండవలెను. నీవు తెచ్చినది నావద్ద ఉంచుము. నేను తెచ్చినది నీవద్ద ఉంచెదను.

    4. క్రీడావంతులగు మరుద్దేవతాకము - సూర్యోదయమున ఏడు కపాలములందు - అగ్ని దేవతాకమునకు ఎనిమిది కపాలములందు పురోడాశమును సమర్పించవలెను. సోమదేవతాకమునకు చరును - సవితృ దేవతాకమునకు పన్నెండు కపాలములందు - సరస్వతి దేవతాకమునకు, పూష దేవతాకమునకు చరు సమర్పించవలెను. ఇంద్రాగ్నులకు పదకొండు కపాలములందు పురోడాశమును - ఇంద్రునకు చరును - విశ్వకర్మ దేవతాకమునకు ఒక కపాలమున పురోడాశమును సమర్పించవలెను.

    (చాతుర్మాస్యమున ఇవి రెండవ దినపు మంత్రములు.)

                              అయిదవ అనువాకము

                    (మహా పితృ యజ్ఞము చెప్పబడుచున్నది.)

    1. పితృ స్వామి యగు సోమ దేవతకు ఆరు కపాలములందు పురోడాశమును - యజ్ఞము నందుండునట్టి పితృ దేవతలకు వేపిన యవలు - యజ్ఞ నిష్ఠులు కాని పితృ దేవతలకు దూడ చచ్చిన ఆవు పాల యందు యవల పిండి సమర్పించవలెను.

    2. పితృదేవా! నీ కొరకు ఈ అన్న పిండమును - నిన్ను అనుసరించి ఉన్నవారి కొరకు అన్న పిండమును ఇచ్చుచున్నాను.

    పితామహా! నీ కొరకు ఈ అన్న పిండమును - నిన్ను అనుసరించినవారి కొరకు ఈ అన్న పిండమును ఇచ్చుచున్నాను.

    ప్రపితామహా! నీ కొరకు ఈ అన్న పిండమును - నిన్ను అనుసరించిన వారి కొరకు ఈ అన్న పిండమును 'దత్తమ్'

    (ఒకటవ మంత్రము నందు వలె పైతృక హవిస్సులు మూడును హోమము చేయవలెను. మిగిలిన అన్నమును కలిపి పిండములు చేసి పితృ దేవతల కొసంగవలెను.)

    3. పితృ, పితామహ, ప్రపితామహదేవతలారా! మీకు పిండములను ఇచ్చినాము. మీ భాగములు అందుకొనండి. సంతుష్టులు కండి.

        (ఉత్తర దిక్కుగా నిష్ర్కమించవలెను.)

    4. ఇంద్రా! నీవు నన్ను కటాక్షించినావు. నేను నీకు హవిస్సులు ఇచ్చినాను. తృప్తి చెందించినాను. నీవు హర్యశ్వములను రథమునకు పూన్చుము. రథపు వెనుక భాగమును ధనముతో నింపుము. నిన్ను స్తుతించు చున్న మా వద్దకు తరచుగా వచ్చు చుండుము.

        (ఆహవనీయాగ్నిని సేవించవలెను.)

    5. పితరులు మేము సమర్పించిన హవిస్సులను ఆరగించినారు. ఆనందించినారు. తలలు ఊపినారు. తేజస్సుచే ప్రకాశించినారు. బ్రాహ్మణుల వలె భోజనమునకు సంతసించినారు. బాపల వలెనే కీర్తించినారు.

    6. పితరులు హవిస్సులను ఆరగించినారు. పితరులు ఎంతో సంతోషించినారు. పితరులు మమ్ము సంతోష పరచినారు. పావనము చేసినారు.

    7. పితృదేవతలారా! మీరు సౌమ్య మనస్కులు. మీ మార్గములు అన్న సమృద్ధములు. సనాతనములు. మీరు ఆ మార్గముననే మీ స్థానములకు చేరుకొనండి. అచట పూర్వ పితరులు ఉన్నారు. వారు యమునితో సహ స్థానమున ఉంటారు. వారు ఆనందించు చుందురు. అచటి సంగతులు తెలిసి ఉందురు. మీరు వారిని కూడి ఉండండి.

    (8 - 11 నాలుగు మంత్రములచే పితృ దేవతలను సేవించవలెను.)

    8. మా మనస్సులు నరుల ప్రశంసాపాత్రములు కావలెను. పితృదేవతల మనసులను మురిపించునవి కావలెను. మేము అట్టి మనసులను ఆహ్వానించుచున్నాము.

    9. కర్మానుష్ఠానము కొరకు - అందుకు వలసిన సామర్థ్యము కొరకు - మేము జీవించుకొరకు - చిరకాలము సూర్యుని సందర్శించు కొరకు యోగ్యమగు మనసు మరల మరల మమ్ము చేరును గాక.

    10. పితృ దేవతలారా! దివ్య జనులు మాకు మంచి మనసులు ప్రసాదింతురుగాక. మేము ఎన్నో ఏండ్ల జీవితము గడుపుదుముగాక.

    11. మేము అంతరిక్షము, భూమి, ద్యులోకమున బాధించకోరినను - తలిదండ్రులను బాధించ కోరినను - గార్హ పత్యాగ్ని మమ్ము అట్టి పాపముల నుండి విముక్తులను చేయును గాత. ఏ ఇతర పాపములు చేసినను వాటి నుండి విముక్తి కలిగించునుగాక. నన్ను సర్వ పాప విముక్తుని చేయునుగాక.

    (కొన్ని సందర్భములందు సంకల్పము కూడ పాపము అగుచున్నది. ఇచట చేయకోరిన, చేసిన పాపముల నుండి విముక్తి కోరబడుచున్నది.)

                                ఆరవ అనువాకము

                   (త్ర్యంబక పురోడాశములు చెప్పబడుచున్నవి.)

    1. ప్రతి పురుషుని ఉద్దేశించి ఏక కపాల పురోడాశమును అర్పించవలెను. ఏక కపాల పురోడాశము సమధికము.

    2. ఆ విధముగా చేయుట వలన ఇంట నున్న యావన్మందికి సుఖము కలిగించిన వాడను అయినాను.

    3. మూతమా! నీవు పశువులు తిను గడ్డి మున్నగు వాని కట్టవు. పశువులకు సుఖకరము అగుచున్నావు. యజమాని మరియు అధ్వర్యుడనగు నాకును సుఖకరమవగుము.

    4. లోకములందు రుద్రుడు ఒక్కడే ఉన్నాడు. మరొక రుద్రుడు లేడు.

    5. రుద్రదేవా! నీకు ఎలుక ప్రియమైనది. కావున ఎలుకను స్వీకరించుము.

    (అధ్వర్యుడు తాను ద్వేషించువానిని తలచుకొని ఎలుక కన్నమున పురోడాశము వేయవలెను.)

    6. రుద్రదేవా! మోదుగు ఆకునందుంచిన ఈ పురోడాశము నీ భాగమగును. దీనిని - తోబుట్టువు వలె హితకారిణియగు - పార్వతి సహితుడవై సేవించుము.

    (పురోడాశమును మోదుగు ఆకుతో కొద్దికొద్దిగా తీసుకొని హోమము చేయవలెను.)

    7. మా గోవులకు, అశ్వములకు, మేషములకు, ప్రజలకు, మాకు తాత్కాలిక లేక శాశ్వత వ్యాధులకు ఉపశమనము కలిగించుము. ఆరోగ్యవంతులను చేయుము.

    (నాలుగు బాటల కూడలి వద్ద అగ్నికి పరిషేచనము చేయవలెను.)

    8. పార్వతీ! అంబే! రుద్రుడు మమ్ము అధ్యయనాదులచే శ్రేష్ఠులను - ధనవంతులను - గవాశ్వాది పశువువంతులను - జ్ఞానయుక్తులను చేయమని ప్రార్థించుచు ముక్కంటి రుద్రునకు పురోడాశము సమర్పించినాము.

        (యజమాని జపించవలెను.)

    9. రుద్రుడు ముక్కంటి. సుగంధి. ధనపుష్టిని, దేహపుష్టిని వర్థిల్లచేయువాడు. తొడిమ నుండి దోసపండు స్వయముగనే విడిపోవును. అట్లే నేను మృత్యు విముక్తుడను అగుదునుగాక. మరణము లేని చిరంజీవిత్వము నుండియు, స్వర్గాదికములనుండియు విముక్తుడను కాకుందునుగాక.

        (అగ్నికి మూడు ప్రదక్షిణలు చేయవలెను.)

    10. రుద్రదేవా! చెట్టు మీద పురోడాశములు ఉంచినాము. అవి నీయొక్క భాగము అగును. అవి నీకు పాథేయము వంటిది. వానిని అందుకొనుము. 'మూత' పర్వతము దాటుము. సాగిపొమ్ము.

    11. ఇతడు పినాకపాణి. చర్మధారి. మమ్ము రక్షించుటకు అల్లెత్రాటిని లాగినాడు. బాణము సంధించినాడు.

                               ఏడవ అనువాకము

        (ఇంద్ర తూర్యము, ఇధ్మీయము, అపామార్గము చెప్పబడినవి.)

    1. ఇంద్రాగ్ని దేవతాకమునకు 12 కపాలములందు పురోడాశము - విశ్వేదేవతాకమునకు చరు - వాయువు ఆదిత్యులతో కూడిన ఇంద్రునకు 12 కపాలములందు పురోడాశము - వాయు దేవతాకమునకు క్షీరము - సూర్య దేవతాకమునకు ఏక కపాలమున పురోడాశమును నిర్వాపము చేయవలెను. 12 ఎద్దులు లాగు నాగలిని దక్షిణగా ఇవ్వవలెను.

    2. అగ్ని దేవతాకమునకు 8 పాత్రలందు పురోడాశము రుద్ర దేవతాకమునకు అరణ్యధాన్య చరు - ఇంద్ర దేవతాకమునకు దధి - వరుణ దేవతాకమునకు యవ ధాన్య చరును సమర్పించవలెను వీపున బరువు మోయు ధేనువును దక్షిణగా ఇవ్వవలెను.

    3. తూర్పు దిక్కున అగ్ని ప్రముఖులగు దేవతలు రాక్షసులను సంహరించువారై ఉన్నారు. దక్షిణ దిశన యమ ప్రముఖులగు దేవతలు రాక్షసులను సంహరించువారై ఉన్నారు. పశ్చిమ దిశన సవితృ ప్రముఖ దేవతలు రాక్షసులను సంహరించు వారై ఉన్నారు. ఉత్తర దిశన వరుణ ప్రముఖులగు దేవతలు రాక్షసులను సంహరించువారై ఉన్నారు. ఊర్ధ్వ దిశన బృహస్పతి ప్రముఖులగు దేవతలు రాక్షసులను సంహరించువారై ఉన్నారు.

    ఆ దేవతలు రాక్షసులను నివారించి మమ్ము రక్షింతురుగాక. తేభ్యః నమః తేభ్యః స్వాహా. వారికి నమస్కారము. వారికి ఆహుతి.

    4. రాక్షస సముదాయమునంతను ఏకముగా దగ్ధము చేయబడినది. నేను రాక్షసుల అనుచరులను సహితము పూర్తిగా తగుల పెట్టినాను.

    5. రక్షోఘ్నే - రాక్షస సంహారకుడగు అగ్నయే - అగ్నికి స్వాహా. రక్షోఘ్నే యమాయ స్వాహా. రక్షోఘ్నే సవిత్రే స్వాహా. రక్షోఘ్నే వరుణాయ స్వాహా - రక్షోఘ్నే దువస్పతే. పరిచర్యలందుకొను బృహస్పతయే స్వాహా.

    6. అశ్వత్రయము లాగు రథము దక్షిణ యగును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.