Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    64. కఠిననైర్రుతే! ఈ యజమాని స్వర్గము చేరుటకు బంధనములగు పాశములను త్రెంచుటకే నీకు ఆహుతి అర్పించుచున్నాను. జనులు నిన్ను భూమిగా ఎరిగి పూజింతురు. నేను మాత్రము నిన్ను విశ్వము సర్వము తెలిసినదానిగా ఆరాధింతును.

    65. (యజమాని మెడకు తగిలిఉండిన పాశములను తీసివేయవలెను)

    యజమానీ! నీమెడలో ఎన్నటికి వీడని బంధమును నైర్రుతిదేవి వేసినది. వానిని నేను మంత్రములచే విడగొట్టినాను. గార్హపత్యాగ్ని యందే ఈ బంధనములను కాల్చివేసెదను. పాశములు విడిపోయిన యజమానీ! నైర్రుతిదేవిచే అనుజ్ఞాతుడవై హవిరన్నమును స్వీకరించుము.

    (నైర్రుతి పేరుగల ఇటుకల మీద చమసముచే నీరు చల్లి అందరు లేచిపోవలెను)
    ఈకార్యము చేసిన భూతమునకు నమస్కారము. "నమో భూత్యై యేదంచకార"

    66. (తిరిగి చూడక అందరు అగ్నిశాలకు చేరుదురు. మొట్టమొదలు అధ్వర్యు శాలాద్వారము వద్దనున్న గార్హపత్యాగ్ని కుండమును ఉపస్థానము చేయవలెను)

    అగ్ని యజమానిని స్వగృహమున నిలుపువాడు. ధనములు ఇచ్చువాడు. స్వర్గఫలప్రాప్తి కలిగించువాడు. అగ్నిహొత్రాది గుణములు కలవాడు. సూర్యసముడు. స్మకర్మయుక్తుడై - ఆహవనీయ అతిప్రణీత - అగ్నీధ్ర-ధిష్ణ్యాది అగ్నులందు దర్శనమిచ్చును. శత్రువులతో యుద్ధము కలిగినంత అగ్ని - ఇంద్రుని వలె సాయపడును.

    67. (ప్రతిప్రస్థాతయను అధ్వర్యు-కుండవు దక్షిణకోణమందు పశ్చిమాభిముఖుడై నిలిచి ఆరు, పది లేక ఇరువది నాలుగు ఎద్దులు కట్టిన నాగలిని ఈ రెండుమంత్రములచే ఉపస్థానము చేయవలెను)

    అగ్నిక్షేత్రమును ఎరిగినవారును కృషికర్మకుశలురగు జనులు నాగటికి ఎద్దులను కట్టెదరు. దేవతల వలన సుఖము అభిలషించు కృషీవలురు మడులను దూర దూరముగా దున్నెదరు.

    68. కృషికులారా! మీరు హలములకు ఎద్దులను కట్టండి. మడులు సిద్ధమైనంత విత్తనములు వేయండి. వేదవాణియు, పంటలును ఫలించవలెను. స్వల్పకాలమున పంటపండుట -కోతలు, నూర్పిడులగుట-పంట ఇంటికి చేరుట జరుగవలెను.    

    "షడ్భిర్వా దశభిశ్చతుర్వింశత్యా" అని మహీధరుడు. నాగలికి 6 లేక 10 లేక 24 ఎద్దులను కట్టుటను సూచించినాడు. ఇది నేలలోతుగా దున్నుటకు ఉపయోగపడినట్లున్నది.

    69. నేలమీద చక్కని చాళ్లు మృదువుగా ఏర్పడవలెను. పొలము దున్నువాడు ఎద్దులను మృదువుగా తోలవలెను.

    వాయు - ఆదిత్యులారా! మా హవిసస్సులు అందుకొనండి. సంతృప్తులు కండి. పంటలను చక్కగా పండించండి.

    70. విశ్వేదేవతలు, మరుత్తులు ఆదరించిన నాగటిచాళ్లు మధుర వర్షజలమున నిండిపోవలెను. ఆ చాళ్లు మాకు ఘృతదుగ్ధాది యుక్త అన్నమును అందించవలెను.

    71. హలము నేలమీద చాళ్లను ఏర్పరచును. సుఖములు కలిగించును. యజమానికి ప్రగతిశీలమగును. ఈ హలము పంటలనిచ్చునది. మంచిజాతి గోవులను, గొర్రెలను, వేగవంతములగు రథాశ్వములను ప్రదానము చేయునది యగును.

     72. హలమా! నీవు మాసమస్త కోరికలను తీర్చుదానవు. నీవు కరుణించుము. మిత్ర, వరుణ,  ఇంద్ర, అశ్వినులు  -పూష- సంతానము, ఓషధులను మా నిమిత్తము సంతృప్తులను చేయుము.

    73. (నాగటికి కట్టిన ఎద్దులను విడిచి - మేయుటకు ఈశాన్యదిశకు పంపవలెను. వానిని హలయుక్తముగ అధ్వర్యుకు దక్షిణగా ఇవ్వవలెను)

    దేవయాన మార్గమును అనుసరించు, అహింసనీయ వృషభములారా! హలము నుండి విముక్తులగుడు. మేము ఆకలిదప్పుల అంధకారమును దాటినాము. మాకు మహాజ్యోతి - పరమాత్మ లభించినది.

    74. (కుశస్తంభమును యజించవలెను)

    పక్షములకు - మాసములకు, వర్షమునిచ్చు సంవత్సరమునకు - అరుణ కిరణ ఉషకు అశ్వినులకు -సూర్యునకు - అగ్రగామి అగ్నికి స్వాహా.

    75. (ఈ అయిదు మంత్రములచే చమసముతో కుండమునందు సర్వౌషధములు అర్పించవలెను.)

    పూర్వకాలమున మూడు యుగములు - ఋతువులందు అనేక ఓషధులు ఉత్పన్నములైనవి. పరిపక్వమై - ధూమ్రవర్ణలయినట్టి ఆ ఓషధుల నూరును -ఏడును అగు స్థానములను నేను ఎరుంగుదును.

    "త్రియుగం త్రికాలమిత్యర్థః" అని ఉవటుడు. ఇవి చలికాలము, ఎండకాలము, వర్షకాలములగును. శతాయుః ...... ఏతాని శతధామం. ఇది వందసంవత్సరాముల ఆయువు. సప్తచప్రాణాః ఆ ఏడు ప్రాణములగును.

    76. తల్లులగు ఓషధులారా! మీ శత- శత తేజస్సులను నేను బాగుగా ఎరుగుదును. నీ సహస్ర సహస్ర జన్మస్థానములను చక్కగా ఎరుంగుదును.

    శతప్రభావ ఓషధులారా! మీరు నదేహమును సర్వదా రోగరహితము చేయండి.

    77. ఓషధులారా! మీరు ఫలవంతలు. పుష్టవంతలు.  యుద్ధమందు అశ్వములవలె వ్యాధిపుంజములను జయించు వారు వ్యాధులను వివిధ రీతులుగా నిరోధించువారు. మమ్ము దరిచేర్చువారు. మీరు ఎల్లప్పుడు ప్రసన్నలగుడు.

    78. ఓషధులారా! నేను యజమానిని. మీ పరిచారకుడను. మిమ్ము ప్రార్థించుచున్నాను:-

    నేను స్వయజ్ఞము పూర్తిచేయునట్లును - గోవులు, అశ్వములు వస్త్రములు, ఆత్మబలము కలుగునట్లును చేయండి.

    79. ఓషధులారా! ఆహుతి ఇచ్చునపుడు అశ్వత్ధచమసము మీ శయనమునకును. పలాశపర్ణ జుహువు నీ నివాసము కొరకును కల్పించబడినది. మీకు పరిచర్యలు చేయు యజమానిని గోభాజనుని చేయండి.

    80. రాజులు విజయులగుటకు యుద్ధములు చేసినట్లు మేధావులు వ్యాధులను జయించ ప్రయత్నింతురు. ఓషధులారా! మీరు వారికి రోగనివారణ శక్తి కలిగించండి. అప్పుడు వారిని విద్వాంసులు "వైద్యులు" అందురు. అట్టి వైద్యులు రాక్షసులను  నష్టపరచి - రోగములను నాశము చేయగలరు.

    81. ఏ ఓషధులు తమ ఆహుతులచే అశ్వదాయను లగునో - పివి సోమమున సంగతములగునో- ఏవి బలమునిచ్చునో - ఏవి రసస్వరూపలగునో వాటినన్నింటిని - ఈ యజమానికి కలుగు అమంగళముల నివారణార్థము - నేను ఎరుంగుదును.

    82. గోశాలయందలి గోవులు లేచినడచినట్లు - రోగనాశక ఓషధులు బలమును లేపినిలుపును. యజమానీ! ఈ ఓషధులు ధనప్రదలు. తమ సేవకులకు ధనములిచ్చును. ఈ ఓషధుల ప్రభావము సర్వదా నీకు అనుకూలమగును గాత.

    83. ఓషధులారా! 'నిష్కృతి' మీకు తల్లియగును. వ్యాధిని నివారించుట వలన మీరు నిష్కృతులు అగుదురు. మీరు  దేహమున సర్వత్ర సంచరించండి. శరీరమునందలి ఏభాగమున రోగజాతము ఉన్నను దానిని తీసి పారవేయండి.

    84. ఓషధులు రోగములను సర్వదా ఆక్రమించును. దొంగ గోశాలలో ప్రవేశించి. గోవులను వశపరచుకున్నట్టు- ఓషధులు వ్యాధులను వశపరచుకొనును. శరీరమున మలిన రూపమున ఉన్న వానిని అన్నింటిని ఓషధులు శుభ్రపరచును.

    85. మంత్రములచే ఓషధులను వాజీకరించి అరచేత నిలిపినంతమాత్రమున - ఉరిశిక్షపడిన వాడు ఉరితీయకముందే చచ్చునట్లు - రోగములన్నియు నశించును.

    86. ఓషధులారా! మీరు ఏరోగి దేహమందు - అతని అంగ అంగమున, నరనరమున ప్రవేశింతురో అట్టివాని దేహమందు రోగమును - నిపుణుడగు విలుకాడు శత్రువీరులను వలె - నష్టపరతురు.

    87. యక్ష్మరోగమా! వాత, పిత్త, కఫముల సహితముగా ఈ దేహమునుండి పారిపోండి. సర్వశరీరపీడక వ్యాధిసహితముగా నీవు నష్టపడుము.

    88. ఓషధులారా! మీలో ఒక ఓషధి రెండవ దానికి అనుకూలము కావలెను. రెండవది మొదటి దానివంటి ప్రభావము చూపవలెను. రోగనాశన విషయమున మీరందరు ఒక్కపలుకు మీదనిలిచి "ఓషధులు రోగములను నష్టపరచగలవ" ను నా మాట నిలపెట్టవలెను.

    89. ఓషధులు ఫలములు ఇచ్చునవి కావచ్చును. ఇవ్వనివి కావచ్చును. పుష్పించునవి కావచ్చును. పుష్పించనివి కావచ్చును. బృహస్పతిచే సృష్టించబడిన మీరు నన్ను రోగరూపములగు పాపములనుండి రక్షించవలెను.

    90. వాగ్దానము చేసియు వ్యతిరేక కార్యము చేసినందున కలుగు కుఫలము వలన వచ్చు వ్యాధులనుండి ఓషధులు నన్ను రక్షించవలెను. వరుణదేవుని జలోదరాదుల నుండి ఓషధులు నన్ను రక్షించవలెను. యముని బంధనములు గల యక్ష్మాదిరోగముల నుండి ఓషధులు నన్ను  రక్షించవలెను. అందరు సంబంధదేవతల రోగముల నుండి ఓషధులు నన్ను రక్షించవలెను.

    91. ద్యులోకమునుండి భూలోకమున అవతరించు ఓషధులు ఇట్లు మాట్లాడుకున్నవి:-

    "ఏ  జీవి శరీరమున మనము వ్యాపింతుమో ఆ జీవికి మృత్యువు కలుగదు"

    92. సోమరాజుచేత వందల వందల ప్రభావములు కల అనేక ఓషధులున్నవి. వానినుంచి ఎంచబడిన ఓషధులారా! మీరు ఓషధులన్నింట శ్రేష్ఠలు. మీరు నాకోరికలు ఫలింపచేయు సమర్థులు కండి. హృదయమున శాంతిని ప్రసాదించువారలు కండి.

    93. సోమరాజు చేతి అనేక ఓషధులు భూమి మీద వ్యాపించి ఉన్నవి. అవన్నియు - బృహస్పతి చేత అనుజ్ఞాతలై - తమతమ ప్రభావమును  నేను తీసికొను ఓషధియందు ప్రవేశపెట్టవలెను.

    94. నా మాట వినుచున్నట్టియు దూరమునకు సాగిపోయినట్టి ఓషధులారా! నేను స్వీకరించు ఈ ఓషధియందు మీ మీ ప్రభావములను చేర్చండి.

    95. ఓషధులారా! ఉపచారము కొరకు మిమ్ము త్రవ్వువాడును - త్రవ్వబడునదియు నష్టపోరాదు. రెండు కాళ్లమానవులు - నాలుగుకాళ్లగోవులు మున్నగు జంతువులు ఆరోగ్యవంతులు కావలెను. 

    96. ఓషధులు రాజగు సోమునితో ఇట్లన్నవి:-

    రాజా! బ్రాహ్మణుడు మమ్ము ఏరోగికి వాడునో ఆ రోగిని మాత్రమే మృత్యువు నుండి దరి చేర్చెదము. అంతే - అందరిని కాదు.

    97. నేను వాడుచున్న ఓషధీ! నీవు వాతనాశనివి. మూల వ్యాధినాశనివి. వ్రణాదుల నాశనివి. ముఖక్షత - మందాగ్నుల నాశనివి. వేయేల యక్ష్మభేదములు గల వందలాది రోగముల నాశనివి.

    98. ఓషధులారా! మిమ్ము గంధర్వులు త్రవ్వినారు - ఇంద్రుడు త్రవ్వినాడు - బృహస్పతి త్రవ్వినాడు. వేయేల! విద్వాంసుడగు సోమరాజు సహితము మిమ్ము త్రవ్వి తన యక్ష్మమునుండి విముక్తి పొందినాడు.

    99.ఓషధి! నీవు శత్రురూపరోగమును జయించుదానవు. ఈనా అదాతయగు రోగమును జయించుము. యుద్ధముకోరు రోగమును జయించుము. పాపములన్నింటిని నీవే జయించుము.

    100. ఓషధి!నిన్ను త్రవ్వితీయుచున్న నేను దీర్ఘాయుష్మంతుడను కావలెను. నిన్ను ఏరోగి కొరకు త్రవ్వుచున్నానో అతడు దీర్ఘాయుష్మంతుడు కావలెను. నీవు సహితము దీర్ఘాయుష్మంతవు కమ్ము. వందలకాండ ప్రకాండములతో వర్ధిల్లుము.

    101. ఓషధీ! నీవు ఓషధులన్నింట శ్రేష్ఠమవు, సకల వృక్షములు నీ సహాయకులు మాత్రమగుదురు. నీ ప్రభావమున - మమ్ము హింసించదలచువాడును - మాకు సేవకుడు కావలెను.

    90 నుండి 101 వరకు అనారభ్యాధీతలు సమాప్తము.

    102. ఎవడు పృథ్విని సృష్టించినాడో ఎవడు సత్యధర్మములను కలిగించినాడో -  ఎవడు ద్యులోకమున వ్యాపించినాడో -  ఎవడు ప్రథమజాతయో అట్టిఎవనికి హవిస్సులు అర్పించవలెను. "కస్మైదేవాయ హవిషావిధేమ"

    103. పృథివీ! నీవు మేము సంకల్పించిన యజ్ఞరూపమునను - యజ్ఞసాధన భూతములగు దుగ్ధాదిరూపమునను మాకు లభించుము. అగ్ని - కోమలమగు - నీ పృష్టభాగమును అధిరోహించును గాత.

    104. అగ్నీ! నీ ఒకరూపము శుభ్రము. ఒకటి ఆహ్లాదకరము. ఒకటి పవిత్రము. వేరొకటి యజనీయము. ఇటువంటి - నీయొక్క - అన్ని రూపములను దేవతల కొరకని మేము సమర్జింతుము.

    105. అన్నమును - దాని ఉపసేచనములగు దుగ్ధఘృతాదులను - సత్యమును - అగ్నిని నేను  ఉత్తర దిశన పొందుచున్నాను. ఈ పురోడాశాదులన్నియు నాదేహమున - పుత్రాదులదేహమున గవాది పశువుల దేహమున - ప్రవేశింపవలెను.

    (ఉత్తరభాగపు నేలను ఊడ్చవలెను)

    అన్నపు అభావము - వ్యాధిగ్రస్తతను నేను పారద్రోలుచున్నాను.

    106. ప్రభాధన అగ్నీ! నీవు యజమాని కీర్తి పరలోకమునకు చేర్చువాడవు. నీ ధూమము, నీ జ్వాలలచే నీవు అందములు సంతరించు కొనుచున్నావు.

    మహాప్రకాశవంతఅగ్నీ! నీవు నీకు గల మహాబలమున యజమాని యజ్ఞము కొరకు పర్యాప్త అన్నమును ప్రసాదించుము.

    107. అగ్నీ! నీవు పరిశుద్ధుడవు. ప్రదీప్తుడవు. నిర్మలుడవు. జ్యోతిర్మయుడవు. నీవు నీప్రకాశమున పైకి ఎదుగుదువు. వార్థక్యమున పుత్రులు తల్లిదండ్రులను వలె - నీవు యజమానిని స్వర్గమున పోషింతువు. ద్యావాపృథ్వులను హవితోను - వర్షముతోను పూరింతువు.

    108. జలముల పుత్రికలు ఓషధులు. ఓషధులపుత్రా అగ్నీ! నీవు జాతవేదవు. అవస్థానాది కార్యములచే అగ్నికుండమున ఉండువాడవు. శోభన స్తుతులచే పరిపుష్టుడవగుము. నానా స్వరూపలు, నానా తర్పణలు, విశిష్టకుల గోత్రోత్పన్నుడగు యజమాని నీయందు వివిధ చరు పురోడాశ హవిస్సులచే హొమము చేయును.

    109. అగ్నీ! నీవు అమరుడవు. అధ్వర్యాదులు అర్పించు హవిరాదులచే దేదీప్యమానుడవు. మాయందు ధనములను విస్తరింపచేయుము. దర్శనీయములగు జ్వాలాసమూహములచే అగ్నికుండమున విరాజిల్లుచున్నావు. మా చిరకాల యజ్ఞమును సర్వదా పూర్తి చేయుచున్నావు.

    110. అగ్నీ! నీవు యజ్ఞమును సఫలము చేయువాడవు. ప్రకృష్ట జ్ఞానవంతుడవు. విశిష్ట వేదస్థాన నివాసివి. యజమానికి వరణీయమగు మహాధనమును ప్రసాదించుము. మహావర్షమును కలిగించుము. అశ్వ, గోసంపదను ప్రదానము చేయుము.

    111.  అగ్ని సత్యశీలుడు. మహానుడు. విశ్వదర్శనీయుడు. పూర్వకాలమున ఋష్యాదులు ధనప్రాప్తి కొరకు - అగ్నినే యజించినారు. కారున నేటి యజమాని సహితము విన్నపము వినువాడు, అతిశయకీర్తిశాలి యగు దైవీ అగ్నినే - పూర్ణిమ అమావాస్యదులందు వేదవాణిని ఆశ్రయించి యజింతురు.

    112. సోమమా! నీవు వర్ధిల్లుము. నీకు సర్వదిశలందు బలము లభించవలెను. మాకు అన్నము లభించుటకు సాయపడుము.

    113. శత్రుహింసక సోమమా! నీకు వసతీవరీ మున్నగు జలములు లభించును గాత. సర్వశక్తులు లభించును గాత. మా పుత్రాది సంతతుల అభివృద్ధి. కొరకు నీవు ద్యులోకము నుండి మంచి మంచి అన్నములను తెచ్చిఇమ్ము.

    114. అత్యంత తృప్తికర సోమమా! నీవు సమస్త అవయవములచే వృద్ధిచెందుము. అతిశయకీర్తిశాలి సోమమా! మా మిత్రమా! నీవు  మమ్ము వర్ధిల్లచేయుము.

    115. అగ్నీ! యజమాని నీకు పుత్రుని వంటివాడు. అతడు వేదవాణిచే నిన్ను స్తుతించునపుడు స్వర్గము సహితము తలచడు.

    116. (తెల్లని గుర్రము లేక ఎద్దును ఎక్కిన హొత ఈ మంత్రము చదువవలెను)

    అత్యంత అంగార వంత అగ్నీ! తమతమ కోరికలు తీర్చుకొనుటకు సమస్తజాతులు భిన్నభిన్న విధులచే - నిన్ను ఆరాధింతురు.

    అగ్నిః ప్రియేషు ధామసు భవ్యస్య|
    సామ్రాడేకో విరాజతి ||

    స్వర్గాది ప్రియధామములందు సమస్త భూతభవిష్యత్తులకు అగ్నిఒక్కడే సామ్రాట్టుగా విరాజిల్లుచున్నాడు.

   
           
       
                దాశరథి రంగాచార్య విరచిత
                శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
           రుక్మాది వచనాన్తమను పన్నెండవ అధ్యాయము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.