Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    31. (సమిధలు వేసిన తరువాత యజమాని పీఠసహిత ఉఖాగ్నిని కుడిప్రక్క నుండి శకటము మీద పెట్టవలెను)

    అగ్నీ! ప్రాణస్వరూపులగు విశ్వేదేవతలు వారిచిత్త వృత్తులతో నిన్ను పైన నిలుపవలెను. సుందర ముఖుడవు కాంతిధనుడవగు అగ్నీ! మాకు శుభంకరుడవగుము.

    32. (బండికి ఎడ్లను కట్టి ముందు తూర్పుదిశగా సాగి తదుపరి కోరినచోటికి తీసికొని వెళ్లవలెను)

    అగ్నీ! శుభప్రదములగు నీజ్వాలలచే ఇచటి నుండి ప్రస్థానము చేయుము. మహాజ్వాలలచే ప్రకాశించు నీ జ్వాలలు మాసంతానములను హింసించకుండును గాత.

    33.అగ్ని మేఘమువలె గర్జించి నినదించుచున్నది. అగ్ని - మేఘమువలెనే - భూమిని తాకుచున్నది లతాగుల్మాదులందు వ్యాపించుచున్నది. అగ్ని అరణి మంథనమున అంటుకొను చున్నది. అత్యంత ప్రదీప్తమగుచున్నది. తన ప్రకాశమున సమస్త వస్తువులను ప్రకాశవంతము చేయుచున్నది. అగ్ని ద్యావాపృథ్వులందు - మేఘము నందలి మెరుపువలె -స్వప్రకాశమున మెరిసిపోవుచున్నది.

    (ఆరవ, ఇరవది ఒకటవ మంత్రములు పునరావృతములు)

    34. (శకటమును ఉత్తరదిశన నిలిపి - నీళ్లుచల్లి పవిత్రము చేసిన స్థలమున ఉఖాగ్నిని దింపి సమిధలు వేయవలెను)

    ఈ అగ్ని మహా, మహాకాంతులచే - సూర్యసముడై - జాజ్వల్య మానముగ ప్రకాశించుచున్నాడు. అతడు ఈ యజమాని పిలుపును వినగలడు. అగ్ని యుద్ధములందు పురురాజుకు సహాయకుడు అయినాడు. అగ్ని మాకు శుభముల నొసంగు దైవీ అతిథి. అతడు ఎంతో దేదీప్యమానుడై వెలుగుచున్నాడు.

    35. (నది లేక తటాక జలమున ఉఖభస్మమును వేయవలెను)

    జలదేవతలారా! ఈ భస్మమును సహర్షముగ స్వీకరించండి. దీనిని సుఖకర, సుగంధ స్థలమున ఉంచండి. వరుణుని సుపత్నులు దీని సేవకు నియమితులు కావలెను. తల్లులు బిడ్డలను వలె - వారు దీనిని జలములందు ధరించవలెను.

    36. (మిగిలిన బూడిదను నీటవేయవలెను)

    అగ్నీ!  జలములందు నీకు సమాన స్థానమున్నది. జలములతో కూడ నీవు బీజములందు ప్రవేశింతువు - మొలకెత్తుదువు - పెరుగుదువు - మాకు లతాగుల్మాదుల రూపమున మరల దర్శనమిచ్చెదవు.

    37. అగ్నీ! నీవు ఔషధుల గర్భమవు - వనస్పతుల గర్భమవు - సమస్త భూతములకు గర్భరూపమవు. అంతేకాదు నీవు జలములకు సహితము గర్భమవు. 'గర్భోఅపామసి.'

    38. (నీట వేసిన బూడిదను అనామిక అంగుళితో కొద్దిగా తీసి కొనవలెను)

    అగ్నీ! సకలమునకు కారణభూతములగు నేల నీరు ఈభస్మమును గ్రహించవలెను. నీకు మాతృస్వరూపలగు ఆపఃపృథ్వులందు నీవు ప్రవేశింపుము. తిరిగి జ్యోతిర్మయ రూపము దాల్చి ఉఖాస్థానమున చేరుము.

    39. అగ్నీ! స్వస్థానములగు పృథ్వీజలములందు చేరిన నీవు అత్యంత శుభంకరుడవై ఉఖయందు తల్లివడిలో బిడ్డవలె - శయనించుము.

    40. పునరూర్జా నివర్తస్వ పునరగ్న ఇషాయుషా|

    పునర్నః పాహ్యంహసః
   
    9వ మంత్రము పునరావృతము.

    41. సహ రయ్య నివర్తస్వాగ్నే షిన్వస్వ ధారయా|

    విశ్వ ప్నుయా విశ్వతస్పరి

    (10 వ మంత్రము పునరావృతము)

    42. (అనామికతో తీసిన భస్మమును ఉఖలోవేసి ఉఖాగ్ని ఉపస్థానము చేయవలెను)

    అన్నవంత, యువతమ అగ్నీ! నీవు వినవలెనని నేను నీ స్తుతులను ఉచ్చరించుచున్నాను. నీవు వానిని వినవలెను. గ్రహించవలెను. ఒకడు నిన్ను దూషించును. మరొకడు నిన్ను స్తుతించును. నేను మాత్రము నీ దేహమునకు నమస్కరింతును- "తన్వం వందే"

    43. అగ్నీ! నీవు ధనవంతుడవు. ధనస్వామివి. విద్వాంసుడవు. మాఅభిమతములను ఎరుంగుము. మానుండి -ద్వేషములను, ద్వేషించువారిని దూరము చేయుము. సర్వకర్మణ అగ్నయే స్వాహా.

    44. (ఘృతహొమము తరువాత లేచి నిలుచుని ఉఖాగ్నిలో సమిధలు వేయవలెను)

    అగ్నీ! శాంతించిన నిన్ను ఆదిత్య, రుద్ర, వసుగణములు మరల ప్రజ్వలింపచేయవలెను. యజ్ఞమూలమున - యజమాని, ఋత్విజాదులు - నిన్ను మరల మరల ప్రవృద్దుని చేయవలెను.

     ఘృతమున నీవు నీ జ్వాలా శరీరమును పెంపొందించుము. యజమాని సకల కామనలు తీరవలెను. "సత్యాః సన్తు యజమానస్య కామాః"

    45. (ఇది గార్హపత్యాగ్నిని వేదిమీద చయనమొనర్చు క్రమము. వాకిలిని మోదుగు కొమ్మలతో ఊడ్చవలెను)

    యమదూతలారా! జరగండి. దూరము జరగండి. బహుదూరము జరగండి. ఇచటినుండి పారిపొండి. ఏలనన యముడు స్వయముగా ఈస్థానమును యజమానికి దత్తము చేసినాడు. పితరులు ఇతని కొరకే భూమి మీది ఈ స్థానమును నిశ్చయించినారు.

    46.(గార్హపత్యాగ్ని ముందు ఊడ్చిన మోదుగు కొమ్మను పారవేయవలెను. చవుడు మట్టిని యజ్ఞకుండము వద్ద వేయవలెను.)

    ఉషా! నీవు గోవులు మున్నగు పశువులకు జ్ఞాన సాధనమవు. నీవు కోరికలు తీర్చుదానవు. కోరకలు తీర్చునట్టి నీగుణము యజమానినగు నాకు కలుగును గాత.

    (అగ్ని స్థానమున ఇసుక వేయవలెను)

    సికతమా! నీవు అగ్నియొక్క భస్మమవు. అగ్ని విడిచి పుచ్చిన దానవు.

    (ఇసుక మీద ఇరువది ఒక్క గీతలు గీయవలెను)

    సికతరేఖలారా! మీరు భూతలము మీద పరచబడినారు మీరు పైన నిలిచి గార్హ పత్యాగ్నిని ఆశ్రయించండి.

    47. (అధ్వర్యు మండలపు దక్షిణభాగమున ఉత్తరాభిముఖుడై కూర్చుండవలెను. 'అర్ధబృహతి' అను నాలుగు ఇటుకలను ఉత్తరము నుంచి ప్రారంభించి ఉత్తర= దక్షిణమునకు పేర్చవలెను)

    ఇది గర్హపత్యాగ్ని చయన కుండము. ఇది సిద్ధమైనంత అత్యంత అభిలాషియగు ఇంద్రుడు వేల విలువకలదియు - ఎంతో మందికి తృప్తినిచ్చునదియునగు అన్నము పొందును. త్రాగినంత మత్తునిచ్చునదియు, తృప్తికర అభిషుత సోమము ఉదరమునందు చేర్చును.

    జాతవేదాగ్ని వేలమందిని పోషించువాడు. బలస్వరూపుడు. అతడు అశ్వమువంటి వేగవంతమగు సోమహవిని అందుకొని, యజమానిచే స్తుతించబడుచున్నాడు.

    48. యజనీయ అగ్నీ! నీ తేజము ద్యులోకమున ఆదిత్యరూపమున - పృథ్విపైన అగ్నేయరూపమున ఓషధులందు - మేఘమున ఉన్నది. నీవు నీ తేజమున విస్తృత అంతరిక్షమును మరింత విస్తరింపచేసినావు. అట్టి నీ భాసమానము, గమనశీలము, మానవదర్శనీయమగు నీతేజము- మేము కూర్చిన ఇటుకలందు - ఉన్నది.

    49. అగ్నీ! నీవు ద్యులోకసంబంధి జలమును అందుకొనువాడవు. ప్రాణస్వరూపులు, మా బుద్ధులను వికసింపచేయు నీలో దాల్చి మాకు హితము సమకూర్చెదవు. సూర్యునిపైన ద్యులోకమునందున్న జలమును సూర్యుని అథోభాగమున ఉన్న జలమును గ్రహించి వర్షము కురిపించెదవు.

    50. పశుహితకారిణులును - మనోవేగవంతములు - ద్రోహ రహితములును -క్షుత్పిపాసములకు అతీతములు - మహావర్షకారకములగు అగ్నికుండనిర్మాణ ఇష్టికలు ఈ యజ్ఞమును ప్రీతిగా సేవించవలెను.

    51. అగ్నీ! బహుకర్మసాధన భూతమగు అన్నము - గోసంబంధమగు పాడిని ఈయజమానికి కలిగింపుము ఇతనికి వంశమును ఉద్ధరించువాడును, విజయుడగు పుత్రుడు కలుగవలెను. నీకు ఉన్నటువంటి కళ్యాణబుద్ధి మాకు కలుగవలెను.

    (అధ్వర్యు ఇటుకను పశ్చిమ దిశన దక్షిణాభిముఖముగా పేర్చవలెను)

    52. అగ్నీ! ఈ వేది అన్ని ఋతువులందు నీకు జన్మ ఇచ్చునదగును. దీన పుట్టి నీవు ప్రజ్వలితుడవగుము. ఈవిషయములను ఎరుగుము. ఆరోహించుము. మా దానములను వర్ధిల్ల చేయుము- "వర్థయా రయిమ్"

    (రెండవ ఇటుక పశ్చిమ దిశన ఉత్తరాభిముఖముగా ఉంచవలెను)

    53. ఇష్టికా! ఇప్పుడు నీవు స్థాపించబడినావు. దేవతచే స్థాపించబడిన నీవు ప్రత్యంగము నందలి ప్రాణము వలె - గార్హపత్యాగ్ని కుండమున మిక్కిలి గట్టిపడుము.
   
    (ఒక ఇటుకను ఉత్తరమున పెట్టవలెను)

    ద్వితీయ ఇష్టికా! నీవు స్థాపించబడినావు. దేవతచే స్థాపించబడిన నీవు మిక్కిలి గట్టిపడుము ప్రత్యంగమునందలి ప్రాణమువలె గార్హపత్యాగ్ని వద్ద స్థిరపడుము.

    (రెండవ ఇటుకను దక్షిణమున పెట్టవలెను)

    54. లోకమ్పృణ ఇష్టికలారా! ఇదివరకటి ఇటుకలు తప్పి పోయినచోట మీరు నిలువండి మిగిలిన ఛిద్రములను పూరించండి. అట్లు ఛిద్రములను పూరించిన ఇష్టికలారా! మీరు దృఢపడి ఇక్కడ స్థిరపడండి. మిమ్ము గార్హపత్యాగ్ని యందు ఇంద్రాగ్ని బృహస్పతులు నిలిపినారు. (మొదలు 3 +  తదుపరి 10 + పిదప 8 ఇటుకలు పేర్చవలెను.)

    55. ద్యులోక సంబంధ - నానావిధజలయుక్త  - అన్నమును దేవతలు ఈయజమానికి ప్రతి సంవత్సరము కలిగింతురు గాత. వారు ఈ యజమాని యొక్క ప్రతిసవనము నందును సోమమును పరిపక్వము చేయుదురు గాత.

    56. (మట్టిని గార్హపత్య అగ్నిగుండము వద్ద పోయవలెను)

    ఇంద్రుడు అంతరిక్షమంతటి వ్యాపకుడు. రధిక యోద్ధలందు అత్యంత వీరుడు. అన్నస్వామి. సన్మార్గులను పాలించువాడు. అతనిని ఋగ్యజుస్సామవాణి పరివర్ధితుని చేయును.
   
    57. (గార్హపత్య అగ్ని కుండమును మట్టితో సమముచేసి ఈనాలుగు మంత్రములతో ఉఖాగ్నిని స్థాపించవలెను)

    కుండము మరియు ఉఖయందున్న అగ్నులారా! మీకు ప్రీతియుక్తులు- దీప్తియుక్తులు ప్రసన్నచిత్తలు - అన్నధారులై -ఏకమనస్కులు కండి.

    58. ఉభయ అగ్నులారా! మీ మనసులు - కార్యములు - బుద్ధియు ఒకే విధముగా ఉండునట్లు చేసినాము. పశుహిత కారులగు మీరు మమ్ము పాలించండి. ఈయజమానికి అన్నము, జలము ప్రసాదించండి.

    59. అగ్నీ! నీవు పశుహితకారివి - ధనవంతుడవు - పుష్టివంతుడవగుము. దిశలన్నింటిని మాకు శుభంకరములు చేయుము. నీవు గార్హపత్యాగ్నిచితియందు ప్రతిష్ఠతుఢవగుము.

    60. అగ్నులారా! మేరు మాకొరకు సమచిత్తలు -సమానబుద్ధులు-పాపరహితులు కండి. మీరు ఈయజమానిని చలింపచేయరాదు- హింసించరాదు. మీరు పుట్టినంతనే వెలుగువారు. మావిషయమున శుభములు కోరువారలు కండి.

    61. (రిక్త ఉఖయందు ఇసుక నింపవలెను. దానిని చట్రము నుండి విడదీయవలెను. అగ్నికి ఉత్తర దిశన బెత్తెడు దూరమున గార్హపత్యాగ్ని మీద పెట్టి అందు పాలు పోయవలెను.)
   
    మట్టితో చేయబడిన ఉఖ, పశుహితకారి అగ్నిని తల్లి బిడ్డనువలె - తనలో దాల్చును. సృష్టికార్యము చేయు ప్రజాపతి విశ్వేదేవతలు, ఋతువులు సహితుడై ఉఖకు (చట్రమునుండి) విముక్తి కలిగించినాడు.

    62. (నైర్రుతి నామ ఇటుకలు పచ్చివి. నల్లనివి. దక్షిణముఖముగ ఒకటి ఉత్తరమునను, రెండు దక్షిణమునను పేర్చవలెను)

    నైర్రుతే! సోమయాగము చేయనివారిని - హవిర్యాగము చేయనివారిని - గుప్తచోరులను - ప్రకటచోరులను వెంబడించి పట్టుకొనుము. మానుండి దుష్టబుద్ధిని దూరము చేయుము. నమో దేవినైర్రుతే తుభ్యమస్తు" నైర్రుతిదేవీ! నీకు నమస్కారము.

    63. దుస్సహ తేజోవంత నైర్రుతే! నీకు నమస్కారము ఇనుమును మించిన జననమరణ బంధము నుండి విడిపింపుము. నీవు అగ్నిని - మట్టిని ఒక చోట చేర్చిన దానవు. ఈయజమానిని ఉత్తమ స్వర్గలోకమున అధిరోహించుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.