Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    2. ఇంద్రా ! నీవు బ్రహ్మవు. వీరుడవు. స్తోత్ర కార్యమును సేవింపుము. గుఱ్ఱములను ఎక్కుము. వెంటనే మా వైపునకు రమ్ము. నీవు ఈ యజ్ఞముననే ప్రసన్నుడవు కావలెను. మా స్తోత్రములను వినుము.

    3. ఇంద్రా ! మేము నిన్ను సూక్తముతో స్తుతింతుము కదా వాటి అలంకారము, వాటిశోభ, వాటి చక్కదనము ఎటువంటిది? మేము నిన్ను ఎన్నడు ఎప్పుడు ప్రసన్నుని చేయగలము? నిన్ను అభిలషించియే సకల స్తుతులు చేస్తాను. కావున నా స్తుతులను వినుము.

    4. ఇంద్రా ! నీవు అందరి ఋషుల స్తోత్రములు విన్నావు. వారందరు ప్రాచీన ఋషులు మానవహితము కోఱినవారు. అందువలన నేను నిన్ను మాటిమాటికి ఆహ్వానిస్తాను. ఇంద్రా ! నీవు తండ్రివంటివాడవు. మా హితము కోఱువాడవు.

    5. ఇంద్రుడు మాకు చక్కని ఆరాధ్యమగు మహాధనము ప్రసాదించినాడు. అతడు స్తోతను, స్తోతకార్యమును రక్షించినాడు. ధనవంతుడగు ఆ ఇంద్రునే మేము స్తుతింతుము. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                       ముప్పదవ సూక్తము

           ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు బలవంతుడు. జ్యోతిష్మంతుడు అతడు బలముతో మావద్దకు రావలెను. మాకు ధనవర్ధకుడు కావలెను. సువజ్రి, నృపతి ఇంద్రా ! మహా బలివి. అగుము. శత్రుంజయుడవగుము. పురుషార్ధివగుము.

    2. ఇంద్రా ! నీవు ఆహ్వానయోగ్యుడవు. మహా కల్లోల సమయములందు మా దేహరక్షణకును, సూర్యప్రాప్తికిని నిన్ను ఆహ్వానిస్తాము. మానవులందరిలో నీవే సేనాయోగ్యుడవు. సుహంత నామక వజ్రముతో శత్రువును మాకు అప్పగించుము.

    3. ఇంద్రా కాలము కలిసివచ్చినపుడు యుద్ధమున నీవు మాకు సమీపవర్తివి అయినపుడు, అప్పుడు హోతాగ్ని మాకు ఉత్తమ ధనములు ఇచ్చుటకు దేవతలకు పిలుచుచు ఈ యజ్ఞమున ఆసీనుడగును.

    4. ఇంద్రా ! మేము మీవారలము. నీకు పూజనీయ స్తుతి అందించుచు స్తుతించు వారు కూడ నీవారలే. వారికి మంచి ఇల్లు ఇమ్ము. వారు సమృద్దులై వృద్ధులు కావలెను. "స్వాభువో జరణ మశ్నునన్త"

    (వార్ధక్యము శాపము కారాదు సమృద్ధము కావలెనను సదాశయము)

   
                                          ముప్పది ఒకటవ సూక్తము

        ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - 10-12 విరాజము.

    1. మిత్రులారా ! హర్యశ్వుడు, సోమపాయి ఇంద్రుని కొఱకు మదకర స్తోత్రములు గానము చేయండి.

    2. ఇంద్రుడు శుభముల దానకర్త. సత్యధనుడు. స్తోతలు అతనిని దీప్తి స్తోత్రములతో స్తుతింతురు. అట్లే మీరు స్తుతించండి. మేమును స్తుతింతుము.

    3. ఇంద్రా ! నీవు మా కొఱకు అన్నాభిలాషివగుము. శతక్రతూ ! మా కొఱకు గో అభిలాషివి అగుము. వాసదాతో ! నీవు హిరణ్యదాతవగుము.

    4. అభీష్టవర్షి ఇంద్రా ! నిన్నుకోఱి మేము విశేషరూపమున స్తుతిస్తాము. వాసఫ్రదా ! వెంటనే మా స్తుతిని అవధరింపుము.

    5. ఆర్య ఇంద్రా ! కఠోరవాక్కులవానికి నిద్రించువానికి దానము చేయనివానికి మమ్ము అప్పగించకుము. నా స్తోత్రము నిన్ను చేరవలెను.

    6. వృత్రహంత ఇంద్రా ! నీవు మా కవచమవు. నీవు సర్వత్ర ప్రసిద్ధుడవు. నీవు ఎదురునిలిచి యుద్ధము చేయువాడవు. నీ సాయమున నేను వృత్ర వధ చేయగలను.

    7. ద్యావాపృథ్వులు అన్నవతులు. అవి ఇంద్రుని వశవర్తిణులు. అట్టి ఇంద్రా ! నీవు చాలా గొప్పవాడవు.

    8. ఇంద్రా ! నీకు సహచరి, తేజోయుక్త స్తోత్రసంపన్న స్తుతి నిన్ను నలుదిశల గ్రహించును.

    9. ఇంద్రా ! నీవు స్వర్గపువాడవు. దర్శనీయుడవు. సకల సోమములు నీ కొఱకు ఉద్యతలు. సకల ప్రజనీకు నమస్కరించును.

    10. నా వారలారా ! మీరు మహాధన వర్ధకులు. మహా ఇంద్రుని కొరకు సోమము చేయండి. అభ్యుదయము ఆశించి ప్రహృష్ట స్తుతి చేయుడు.

    ఇంద్రా ! నీవు ప్రజల కోరికలు తీర్చువాడవు. నీకు హవ్యము అర్పించి పూజించువాని సముఖమునకు వెళ్లుము.

    11. ఇంద్రుడు అత్యంత వ్యాపకుడు. మహానుభావుడు. విప్రులు మేధావి అతనిని గూర్చి స్తోత్రములు రచింతురు. హవ్యము కల్పింతురు. ఇంద్రుని వృత్రాది కర్మలను ఎంతటి ధీరుడైనను బాధింపజాలడు.

    12. ఇంద్రుడు అన్నివిధముల అన్ని జగములకు ఈశ్వరుడు. అతని క్రోథము బాధించునదికాదు. అతనిని గురించిన సకల స్తుతులు శత్రువులను అణచునవి. అందువలన స్తోతలారా ! ఇంద్రుని స్తుతించుటకు మీ బంధువులను ప్రోత్సహించండి.


                                         ముప్పది రెండవ సూక్తము

        ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - 3 ద్విపద విరాట్.

    1. ఇంద్రా ! మాకు దూరముగా యజమానులు సహితము నీతోకూడి ఆనందించరాదు. నీవు దూరమునందున్న వాడనైనను మాయజ్ఞముకు విచ్చేయుము వినుము.

    2. ఇంద్రా ! తేనెమీద తేనెటీగలు కూర్చున్నట్లు స్తోతలు నీ కొఱకు సోమము సిద్ధము చేసి కూర్చుందురు. రథముమీద అడుగు పెట్టినట్లు ధనాభిలాషులగుస్తోతలు నీకు స్తుతులు సమర్పింతురు.

    3. కొడుకు తండ్రిని పిలిచినరీతి ధనాభిలాషివగు నేను దానశీలుడగు ఇంద్రుని పిలుస్తాను.

    4. పెరుగు కలిపిన సోమము ఇంద్రుని కొఱకు సిద్ధమైనది. వజ్రహస్త ఇంద్రా ! ఆ సోమపానమునకు అశ్వసహితుడవై యజ్ఞ మంటపము వైపు విచ్చేయుము.

    5. ఇంద్రుడు యాచన విను చెవులవాడు ఇంద్రుని వద్ద మేము ధనము యాచిస్తాము. అతడు మా విన్నపము వినవలెను. అది నిష్ఫలము కారాదు. యాచన వినగానే వందల, వేల మందికి దానములు చేయు ఇంద్రుని దానాభిలాషను ఎవడును వారించరాదు.

    6. వృత్రహంత ఇంద్రా ! నీ కొఱకు గంభీర సోమమును అభిషవించు వాడు నిను అనుసరించువాడు వీరాధివీరుడగును. వాని విరుద్ధముగా ఎంతటివాడును మాట్లాడలేడు. అతనిని పరిచారకులు పరివేష్ఠించి ఉందురు.

    7. ధనవాన్ ఇంద్రా ! హవ్యదాతల ఉపద్రవ నివారకుడవు. అగుము. ఉత్సాహవంతులగు శత్రువుల నాశము చేయుము. నీవు నశింపచేసిన శత్రువు ధనమును మేము పంచుకొందుముగాత. నీకు ఎంతటివాడును హానికలిగింపజాలడు. నీవు మా కొఱకు ధనము పట్టుకొని రమ్ము.

    8. జనులారా ! వజ్రధరుడు, సోమపాయి ఇంద్రుని కొఱకు సోమము అభిషవించండి. తృప్తునిచేయగల పురోడాశాదులు వంపండి. నిర్వహించవలసిన కార్యములు నిర్వహించండి. ఇంద్రుడు యజమానికి సుఖములనిచ్చును. హవ్యము పూర్తి చేయును.

    9. సోమముగల యజ్ఞమును నాశనము చేయరాదు. ఉత్సాహవంతుడగు ధనప్రాప్తి కొఱకు శత్రుసంహారక ఇంద్రుని యజించండి. శీఘ్రకారియే విజయుడగును. నివాసకర్త అగును. పుష్టినొందును. కుత్సిత కర్మునకు దేవతలుండఋ.

    "తరణిరిజ్జయతి క్షేతి పుష్యతి నదేవాసః కువత్నవే"

    10. మంచిదానము చేయువాని రథమును త్రోసి వేయగలవాడు ఉండడు. అతనిని ఎవడును ఆటంకపరచజాలడు. ఇంద్రుడు మరుత్తులు రక్షగా గలవారు గోపూర్ణ గోష్టమునకు చేరుదురు.

    11. ఇంద్రా ! నీవు రక్షకుడుగా ఉన్న వ్యక్తి స్తోత్రములతో నిన్ను బలవంతునిచేయును అన్నము అందుకొనును. శూరా ! మా రథమును రక్షింపుము. మా పుత్రాదులను రక్షింపుము.

    12. హర్యశ్వ ఇంద్రుడు సోమవంత యజమానికి బలము కలిగిస్తాడు. అతనిని పగవారు పరిమార్చజాలరు. గెలిచినవాని వలె ఇంద్రుని భాగము దేవతలందరిని మించినది.

    13. దేవతలలో ఇంద్రునకే అనల్పములు, సువిహితములు, శుభంకరములగు స్తోత్రములను అర్పించండి. కర్మానుష్ఠానమున ఇంద్రుని మనసును ఆకర్షించగల వానివద్దకు అనేకానేక బంధములు చేరవు.

    14. ఇంద్రా ! నీవు కరుణించిన వానిని ఎవడు అణచగలడు? ధనశాలి ఇంద్రా ! నీ విషయమున శ్రద్ధగలవాడై, హవిష్మంతుడైనవాడు ద్యులోకమునను, ఈ లోకమునను ధనము బలము పొందును.

    15. ఇంద్రా ! నీవు ధనికుడవు. నీకు ప్రియమగు ధనము సమర్పించువానిని వృత్ర సంగ్రామాదులకు పంపుము. వారి కీర్తి పెంచుము. హర్యశ్వ ఇంద్రా ! నీ ఉపదేశానుసారము సకల స్తోతలతో సర్వపాపములను దాటగలము.

    16. ఇంద్రా ! నేలమీద ఉన్న దిగువ ధనము నీదే. అంతరిక్షమున ఉన్న నడిమి ధనము నీదే. అంతకుపైన ఉన్న ఉత్తమ ధనమునకు నీవే కర్తవు. ఇది సత్యము. సుత్రా మా ! గోవు సంబంధమున నిన్ను తొలగించువాడు లేడు.

    17. ఇంద్రా ! నీవు సమస్త లోకములకు ధనదాతవు. ఈ జరుగు యుద్ధములన్నిట నీవే ధనదుడవని ప్రసిద్ధి. పురుహోత ఇంద్రా ! సకల పార్థివజనులు రక్షణకుగాను నిన్ను అన్నభిక్షకోరుదురు.

    18. ఇంద్రా ! నీవు ఎన్నిధనములకు ఈశ్వరుడవో, మేము అన్ని ధనములకు స్వాములము కావలెను. ఇంద్రా ! నేను స్తోతలను రక్షిస్తాను. పాపికి ధనదానము చేయును.

    19. ఎచ్చట ఉన్నవాడయినను పూజించదగిన పురుషునకు నిత్యము దానము చేస్తాను. ఇంద్రా ! నీవు వినా నాకు బంధువుగాని ప్రశంసనీయ పితరుడుగానిలేడు.

    20. క్షిప్రకర్మకారి మాత్రమే మహాకార్యముల బలమున అనుభవించగలడు. వడ్రంగి పాత చక్రమునుచెక్కి నవీకరించినట్లు నేను స్తుతులతో పురుహూత ఇంద్రుని నవీకరిస్తాను.

    21. మానవుడు దుష్ట స్తుతివలన ధనము పొందజాలడు. హింసకుని వద్ద ధనము నిలువదు. ధనవాన్ ఇంద్రా! ద్యులోకమందును, దివసమందును నాతో సమానుడయిన వానికి నేవు ఇవ్వదలచినది సత్కర్మలు చేయువానికి సహితము లభించును.

    22. వీర ఇంద్రా ! నీవు ఈ సమస్త జంగమ పదార్థములకు స్వామివి. స్థావర పదార్థములకు ఈశ్వరుడవు. సర్వదర్శకుడవు. ఇంతవరకు పాలు పితుకని గోవు వంటి నిన్ను స్తుతింతును.

    23. ధనికుడవగు ఇంద్రా ! నీ సమానుడు లోకమున ఇంతవరకు పుట్టలేదు. ఇకముందు పుట్టడు. మేము అశ్వములు.గోవులు, అన్నములు కోరుచున్నాము. నిన్ను పిలుచుచున్నాము.

    24. ఇంద్రా ! నీవు జ్యేష్ఠుడవు. నేను కనిష్ఠుడను. నా కొఱకు ప్రసిద్ధ ధనము తెచ్చి ఇమ్ము. కలకాలముగా నీవు అత్యంత ధనవంతుడవు. ప్రత్యేక యుద్ధములందు హవ్యలాభ యోగ్యుడవు.

    25. మఘవా ! శత్రువులను పరాజ్ముఖులను చేయుము. తొలగింపుము. మా కొఱకు ధనమును సులభము చేయుము. యుద్ధమున మమ్ము రక్షింపుము. మేము నీ మిత్రులము మావర్ధకుడవగుము.

    26. ఇంద్రా ! మాకు ప్రజ్ఞానము తెమ్ము. తండ్రి కొడుకునకు ఇచ్చినట్లు మాకు ధనము ఇమ్ము. మేము యజ్ఞ జీవులము. మేము నిత్యము సూర్యుని పొందవలెను.

    27. ఇంద్రా ! తెలియని నడకలవారు, హింసకులు, దురారాధ్యులు, అశుభ శత్రువులు మమ్ము ఆక్రమించరాదు. మేము నీ వద్ద వినమ్రులమగుదుము. అనేక కార్యములందు ఉత్తీర్ణలమగుదుము.


                                            ముప్పది మూడవ సూక్తము

    ఋషి - వశిష్ఠుడు, వసిష్ఠ పుత్రులు దేవత - వశిష్ఠుడు, వసిష్ఠ పుత్రులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. వసిష్ఠపుత్రులు శ్వేతవర్ణులు. కర్మపూరకులు తలకుడివైపు ముడివేయువారు. నేను యజ్ఞమునుండి లేవగానే వసిష్ఠపుత్రులు నాకు దూరము కారాదని అందును. అందువలన వారు నన్ను ప్రసన్నుని చేయుదురు.

    2. పాశాద్యుమ్నుడు వయతి పుత్రుడు అతని యజ్ఞమున ఇంద్రుడు సోమపానము చేయుచుండెను. అది వసిష్ఠపుత్రులు దూరము నుండి గమనించినారు. యజ్ఞమును తిరస్కరించినారు. ఇంద్రుని అక్కడినుండి తొలగించినారు. ఇంద్రుడు సహితము వయత పుత్రుడు పాశద్యుమ్నుని వదలినాడు. వాసిష్ఠులను వరించినాడు.

    (వసిష్ఠిపుత్రులు సుదాసుని మన్నించినారు. సుదాసునితో యజ్ఞము చేయించినారు. పాశద్యుమ్నుడనురాజు సహితము యజ్ఞము చేసినాడు. ఇంద్రుని రప్పించినాడు. ఇంద్రుడు సోమపానము చేయు సమయమున వసిష్ఠపుత్రులు ఆ యజ్ఞమును తిరస్కరించినాడు. మంత్రబలమున ఇంద్రుని సోమపానము మాన్పించినారు. ఇంద్రుని సుదాసుని యజ్ఞమునకు తీసికొని వెళ్లినారను వృత్తాంతమును శాయణాచార్యులు చెప్పినారు.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.