Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
8. అగ్ని సమస్త జనులకు సమస్త యజమానులకు పాలకుడు. స్తవనీయుడు. అతిథివలె పూజార్హుడు. అట్టి అగ్నిని సుఖములు ప్రసాదించుమని ఆహ్వానించుచున్నాము. అన్నాదులు అందుకొనుటకు పిల్లలు తండ్రివద్దకు చేరుదురు. అట్లే దేవతలందరు హవిస్సులకొఱకు అగ్నివద్దకు జేరుదురు. ఋత్విజులు సహితము పూజనీయులయిన అన్యదేవతల మధ్య అగ్నికే హవిస్సులు అందించుచున్నారు.
9. అగ్నీ ! నీవు బలవంతుడవు. శత్రుంజయుడవు. తేజోవంతుడవు. దేవతలు మెచ్చదగు యజ్ఞము ధనమునందువలె నీవు అరణులందు ఆవిర్భవించుచున్నావు. నీ కార్యములు కీర్తిప్రదములు. నీ ఆనందమే ప్రధానము. అందువలన యజమానులు నిన్ను పరిచారకులవలె సేవింతురు.
10. ఋత్విజులారా ! పూజ్యుడు, స్వబలమున ఇతరులను తిరస్కరించువాడు. ప్రాతఃకాలమున ప్రజ్వరిల్లువాడు, పశుప్రదాత అగు అగ్నిని స్తుతించుడు. అగ్ని కొఱకు యజమాని సమస్త వేదికలను ఏర్పరచుచున్నాడు. యజ్ఞమునకు విచ్చేయు దేవతలందు అగ్నియే శ్రేష్ఠుడు. స్తోత్ర పాఠకులు ధనికుని స్తుతించునట్లు హోతలు అన్య దేవతలకన్న ముందుగా అగ్నిని స్తుతింతురు.
11. అగ్నీ ! మాకు కనిపించు దేవతలందరకు నీవు సమానుడవు. నేను మంచిమనసువాడను. నీవు మంచి మనసుతో పూజనీయము అగు ధనమును నాకు ప్రసాదించుము.
అగ్నీ ! నీవు బలవంతుడవు. నీవు మా కొఱకును, స్తుతికర్తలకొఱకును, యజమానులకొఱకును శ్రేష్ఠమయిన అన్నమును అనుగ్రహింపుము.
అగ్నీ ! నీవు ధనవంతుడవు. మాకు మంచి పుత్రపౌత్రులను, ధనమును ప్రసాదించుము. కఠినుడు తన బలమున ఇతరులను నశింప చేయును. ట్లే నీ బలమున మా శత్రువులను నశింప చేయుము.
నూట ఇరువది ఎనిమిదవ సూక్తము
ఋషి - పురుచ్చేపుడు, దేవత - అగ్ని, ఛందస్సు - అత్యష్టి.
1. అగ్ని ఇతర దేవతలను ఆహ్వానించువాడు. అరణుల మధ్య, అధ్వర్యుని వలన అవతరించినవాడు. సకల కర్మలకు ఆధారభూతుడు. యజమానులు ధనమును అపేక్షించి అగ్నిని అర్చించుచున్నారు. యజమానుల కర్మలు, స్వకర్మలను అనుసరించి ప్రవర్తించు అగ్నియొక్క మైత్రియే యజమానులకు సంపద అగుచున్నది. వేదికమీద ప్రజ్వరిల్లు అగ్నిని బాధించువారు లేరు. ఆ అగ్నిచుట్టు ఋత్విజులు చేరి ఉన్నారు.
2. అగ్ని యజ్ఞ సాధకుడు. యజ్ఞవేదియందు ప్రతిష్ఠింపబడినవాడు. ఆ అగ్నికి యజ్ఞమునందలి పురోడాశాదులు తృప్తి కలిగించువరకు సేవింతుము. పూర్వము వాయువు ఈ అగ్నిని సూర్యుని నుండి మనువు కొఱకు భూమికి తెచ్చినాడు. అట్టి అగ్ని మా యజ్ఞశాలయందు ఉండవలెను. చరుపురోడాశములు గ్రహించువరకు ప్రజ్వరిల్లుచుండవలెను.
3. మా ఆహ్వానమును అందుకొని విచ్చేయువాడు, వేదికమీద స్తుతించబడువాడు, హవిస్సులు కలవాడు, కోర్కెలు తీర్చువాడు, ధ్వనించువాడు, సమర్థుడు, ప్రకాశకుడు, స్తుతులకు నూరు రెట్లు ఎదిగి జ్వలించువాడు, శత్రుహంతకుడు, ఉన్నత స్థలములందు, యజమాని గృహమున నివసించు అగ్ని గమనముతో హవిస్సులను అందుకొనుటకు సాగుచున్నాడు.
4. అగ్ని మహత్కర్మలవాడు. పురోహితునివలె యజ్ఞనిర్వాహకుడు. ఇంటింటా నశించక నిలుచువాడు. యజ్ఞములందు విరాజిల్లువాడు. ఈ యజమానియు సత్కర్మతో యాగము చేయుచున్నాడు. యజమానికి ఫలమును ప్రసాదించుటకు అగ్ని హవిస్సులు స్వీకరించుచున్నాడు. అగ్ని ఆజ్యము సేవించు అతిథివలె పూజ్యుడు అయినట్లే యజమానియు హవిస్సులు ఆర్జించుచున్నాడు.
5. అగ్ని తన తృప్తికొఱకు వాయువు ధాన్యాదులను తనలో చేర్చుకొనును. అట్లే యజమానులు అగ్నిని తృప్తిపరచుటకు అగ్ని జ్వాలలందు చరుపురోడాశాదులు సమర్పించుచున్నారు. అన్నము కోరువానికి ఆహారము సమకూర్చువానివలె యజమానులు అగ్నికి హవిస్సులు అందించుచున్నారు. ఆ అగ్ని మమ్ము పాపముల నుండి రక్షించుచున్నాడు. పాప బాధను తొలగించుచున్నాడు.
6. అగ్ని సర్వస్వరూపుడు. మహత్తుగలవాడు. అతృప్తుడు. అతడు కుడిచేత ధనమును దాల్చినాడు. సూర్యునివలె ప్రకాశించుచున్నాడు. అన్నము అర్థించువారిని విడుచువాడుకాడు. అతడు దేవతలకు హవ్యవాహనుడు. అగ్ని యజమానులు అందరికి అన్నము కలుగచేయును. పుణ్యలోకముల ద్వారములు తెరుచును.
7. అగ్ని యజమాని పాపములు తొలగించును. బాధలు దూరము చేయును. సుఖములు కలిగించును. అతడు ఋత్విజులకు పాలకుడు. జయశీలుడగు రాజువలె ఇష్టుడు. యజమానులు అందించు హవిస్సులకొఱకు అగ్ని విచ్చేయును. ఘనుడు, హింసకుడు అయిన వరుణ రాజు బాధలనుండి అగ్ని రక్షించుచున్నాడు.
8. అగ్ని ధనములను ఇచ్చువాడు. అందువలన జనప్రియుడు. అగ్ని అధిపతి. హోమ నిర్వాహకుడు. హవ్యవాహనుడు. హీవన హేతువు. సర్వజ్ఞుడు. ధ్వనించువాడు. మనోహరుడు. అట్టి అగ్నిని ఋత్విజులు, తమ రక్షణ నిమిత్తము ధనములు కోరుచు హవిస్సులు అర్పించి స్తుతించుచున్నారు.
నూట ఇరువది తొమ్మిదవ సూక్తము
ఋషి - పురుచ్చేపుడు, దేవత, 6వ దానికి చంద్రుడు
ఛందస్సు - అత్యష్టి 8,9 ఆతిశక్వరి 11 అష్టిభ.
1. ఇంద్రా ! నీవు ప్రజ్ఞావంతుడవు. పండితుడవు. యజమాని చేయు యజ్ఞమునకు నీ రథమును నడిపించుచున్నావు. అతనిని గొప్పవానిని చేయుచున్నావు. ఫలములు పొందుటకు సమర్ధుని చేయుచున్నావు. హవిస్సు కలవానిని చేయుచున్నావు. హవిస్సులు కోరుచున్నావు. కర్మ ఫలము ప్రసాదించుటకు ఆలస్యముచేయని ఇంద్రుడు మా హవిస్సులను, స్తుతులను స్వీకరించవలెను.
2. "ఇంద్రా ! రక్షింపుము" అను పిలుపు విన్నపుడు నీవు మరుత్తులతోకూడి యుద్ధములకు పోవుచున్నావు. నీ సేనలతో కూడి నీవే నరులకు అభయము ఇచ్చుచున్నావు. ఋత్విజులతో కూడి అన్నము ప్రసాదించుచున్నావు. హవిస్సులు అందుకొనుచున్నావు. అటువంటి నిన్ను ఋత్విజులు స్తుతించుచున్నారు. వేగవంతమగు గుఱ్ఱమునువలె నిన్ను సేవించుచున్నారు.
3. ఇంద్రుడు శత్రుంజయుడు. నీరులేని మేఘములను విడిచి, నీరు నిండిన మేఘములను కొట్టి వర్షించువాడు. ఇంద్రుడు వర్షింపచేయుట అసామాన్య కార్యమని జనులకు చాటిచెప్పుచున్నాను. ఇంద్రుని గొప్పతనమును ద్యులోక దేవతలకు, రుద్రునకు, మిత్రునకు, వరుణనకు చెప్పుచున్నాను. ప్రజలకు సుఖము కలిగించు ఇంద్రునకు సహితము విన్నవించుచున్నాను.
4. ఇంద్రుడు యాగముల నిమిత్తము స్నేహితుడయి వచ్చువాడు. శత్రువును సహించువాడు. సహాయము చేయువాడు. హవిస్సుల కొఱకు యాగ విరోధులను అణచువాడు. మరుత్తులతో కూడినవాడు. ఫలములను ఇచ్చు ఇంద్రుని మా సమస్త కర్మములను రక్షించమని ప్రార్థించుచున్నాను. ఇంద్రుడు నివారించిన శత్రువు మమ్ము ఏ యుద్ధములందును బాధించలేడు.
5. ఉగ్రుడవగు ఇంద్రా ! నీకు భక్తుడయిన యజమాని శత్రువును నీ శత్రువులయిన వృత్రాదులవలె ఆయుధములతోను, యాగధనముతోను లొంగదీయుము. మా పూర్వులకు నీవు యాగఫలమును ప్రసాదించినావు. మాకును అట్లే నీరక్షణలను, యాగఫలమును ప్రసాదించుము. నీవు పాప రహితుడవు, జగన్నిర్వాహకుడవు, అది జగద్వితము. మా యజమాని సకల పాపములను తొలగించుము. దుఃఖములను పరిమార్చుము. సుఖములు ప్రసాదించుము.
6. మేము చంద్రుని ఆహ్వానించుచున్నాము. యాగవిరోధులను హింసించి ఇంద్రునివలె చంద్రుడు వచ్చుచున్నాడు. దినదినాభివృద్ధినొందు చంద్రుని స్తుతించుచున్నాము. మమ్ము నిందించువానిని, విరోధిని, దుర్భుద్ది గలవానిని చంద్రుడు తొలగించవలెను. మమ్ము హింసించదలచిన దొంగను తలక్రిందులుగా వ్రేలాడదీసి రూపుమాపవలెను.
7. ఇంద్రా ! ప్రసిద్ధమగు నీరూపమును తెలుపుచున్నాము. స్తుతించుచున్నాము. భజించుచున్నాము. సామర్ధ్యము కలిగించునది, రమణీయమగునది, వృద్ధినొందునది, పుత్రపౌత్రాదులతో గూడినది అగు ధనమును ప్రసాదించుమని ప్రార్ధించుచున్నాము.
ఇంద్రా ! నిన్ను తెలిసికొనుట దుస్తరము. నీకు హవిస్సులు అర్పించుచున్నాము, ఆహ్వానించుచున్నాము, అర్పించుచున్నాము.
8. ఋత్విజులు మా పక్షమున ఇంద్రుని స్తుతించినారు. ఇంద్రుడు ప్రసన్నుడు అయినాడు. యుద్ధమునందు శత్రువులను కూల్చినాడు. ఇంద్రుడు శత్రునాశకుడు. అతని పాలనలో మమ్ము ఎదిరించ వచ్చిన సేన తానే చచ్చినది. మా మీదకు రానేలేదు.
9. ఇంద్రా ! నీవు పాపములు, రాక్షసులు ఉండని మార్గమున రమ్ము. తలచినంతనే కలుగు ధనములతో విచ్చేయుము. దూరమగు స్వర్గమునుండి రమ్ము. దగ్గరి భూలోకము నుండి విచ్చేయుము. యాగశాలలోని హవిస్సులను స్వీకరింపుము. యాగమును, మమ్ము రక్షింపుము, పాలింపుము.
10. ఇంద్రా ! నీవు బలవంతుడవు. ధనవంతుడవు. రక్షకుడవు. అసురడవు. తృప్తి కలిగించువాడవు. మా స్తుతులు నిన్ను మరింత బలవంతుని చేయును. నీ మాహాత్మ్యము వృద్ధినొందించును. ఉత్సాహము కలిగి సూర్యునివలె ప్రకాశింతువు. నీవు ఏదో ఒక రథమును అధిరోహించి మా యాగశాలకు విచ్చేయుము. శత్రువును బాధింపుము. కుత్సితుని హతమార్చుము.
11. ఇంద్రా ! నీవు రక్షకుడవు. మమ్ము దుర్బుద్ధి పాపములనుండి రక్షింపుము. మా స్తుతులతో తృప్తినొందుము. యాగ విఘ్నకారకులను హతమార్చుము. మావంటి యజమానులను రక్షింపుము. సకల జీవములకు ఆధారభూతుడవగు నిన్ను రాక్షస సంహారమునకుగాను పరమేశ్వరుడు సృష్టించినాడు.
నూట ముప్పదియవ సూక్తము - ఋషి - పురుచ్చేపుడు,
దేవత - ఇంద్రుడు, ఛందస్సు - అంత్యష్టి- చివరిది త్రిష్టుప్.
1. ఇంద్రా ! అగ్నియాగ గృహమునకు వచ్చునట్లు రేరాజు చంద్రుడు స్వస్థానమునకు చేరునట్లు నీవు స్వర్గము నుండి యాగశాలకు విచ్చేయుము. పుత్రులు తండ్రిని భోజనమునకు పిలిచినట్లు ఋత్విజులతో కూడి నిన్ను హవిస్సులు అందుకొనుటకు ఆహ్వానించుచున్నాము.
2. ఇంద్రా ! దంచి, పిండి, శోధించి సిద్ధము చేసిన సోమమును జలమున నిండిన తొట్టివలె పాత్రలో ఉంచినాము. దప్పిగొన్న వృషభము బావివద్దకు పోవునట్లు విచ్చేయుము. ఈ సోమము నీకు బలమును, కాంతిని, సాహసము కలిగించును. సూర్యాశ్వములు సూర్యుని ఆకసమున విహరింపచేసినట్లు నీ అశ్వములు నిన్ను యాగశాలకు తోడ్కొని రావలెను.
3. సోమము ద్యులోకము నుండి తేబడినది. నాశరహితమయినది. పిట్ట తన పిల్లనువలె రాళ్లమధ్య పొదలలో తీవలందు భద్రపరచబడినది. అంగిర శ్రేష్ఠుడు గోద్వారమునువలె ఇంద్రుడు ఆ సోమము కొఱకు విచ్చేసినాడు. జలములు దాచుకున్న జలదముల ద్వారములను తెరచినాడు. భూమిని సస్యశ్యామలము చేసినాడు.
4. ఇంద్రుడు తాను ధరించిన వజ్రాయుధమును శత్రుసంహారమునకుగాను జలమును మంత్రములతో తీవ్రపరచినట్లు సానపట్టుచున్నాడు. వృత్రాసురుని వధించుటకు పదును పెట్టుచున్నాడు. ఇంద్రుడు స సైన్యముగా బయల్వెడలినాడు. చెట్లను గొడ్డలితోవలె శత్రువులను నరికినాడు. గండ్రగొడ్డలితో చెట్లను కూల్చినట్లు శత్రువులను కూల్చినాడు.
5. ఇంద్రా ! యుద్ధమునకు వెడలువారి వలె నీ రథమును మా యాగములకు నడపింతువు. వర్షము కలిగించి నదులను సముద్రమునకు ప్రవహింప చేతువు. మనువునకు గోవులను ఇచ్చినట్లు సామాన్య జనులకు గోవులను అందించినావు. మమ్ము కాపాడుటకు జలములను నదులందు ప్రవహింపచేసినావు.
6. ఇంద్రా ! ధనము కొఱకును, సుఖము కొఱకును ఋత్విజులు నీకు హవిస్సులు అర్పించుచున్నారు. బుద్ధి కుశలుడు రథమును నిర్మించినట్లు ఋత్విజులు నీ కొఱకు స్తుతులను నిర్మించినారు. యుద్ధములందు వేగముగల నిన్ను యుద్ధవీరుని పొగడినట్లు పొగడి ప్రోత్సహించుచున్నారు. విశ్వమందలి గోధనాదులను ప్రసాదించమని నిన్ను ప్రార్థించుచున్నారు.





