Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
మరుసటిరోజు ఆఫీసులో ఆ అందకత్తెనుగురించి పద్యం రాయాలనిపించింది. సాహిత్యపు వాసన సహితం అతనికి సోకకున్నా ఒక ద్విపద వ్రాసేశాడు. ఆ పద్యరత్నమే చీనాంబరం మీద అందంగా అలంకరించబడి ఉంది.
తమ మనోవాంఛణు బయటపెట్టగా, ఠాకూర్ దాస్ గొంతు ఆనందంతో పూడిపోయింది. మోతీచంద్ ఠాకూర్ దాస్ ను మేనేజర్ చేస్తున్నాడు. అతని కొడుకులకుకూడా మంచి మంచి పదవులు లభించబోతున్నాయి.
మోతీచంద్ మూడవ పెళ్ళాం ఏడుపు పెడబొబ్బల్తో ఆ ప్రాంతం అంతా అట్టుడికిపోయింది. మోతీచంద్ ఉక్కుమనిషి అతడు కరుగడు. తనను సవతి కాలిక్రింది దాసీగా పడిఉండనిమ్మని ఆమె భర్తను కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడింది. అతనికి తన నైతికవిలువలు నిశితకరవాలంలా కనిపించాయి. తనకు ఇద్దరు భార్యలు ఎలా ఉంటారు? ఏకపత్నీత్వనియమం ఏమౌతుంది?
"నేను నీతికి చింతాకుమందం ఎడంగా ఉండను. నీహోదాకు తగిన ఇల్లు కొంటాను. ఆధ్యాత్మికాహారం కావాలంటే కాశీలోనూ, కొండగాలి కావాలంటే డార్జిలింగ్ లోనూ ఇల్లు ఏర్పాటుచేస్తా. నేనేమన్నా నిన్ను వీధిలో వదిలేస్తున్నానా?" క్షణం ఆగాడు. ఆబాల దౌర్భాల్యం అతనికి అర్ధం అయింది. "ఇన్నాళ్ళు కాపరంచేశావు. ఇంత ముక్తి మార్గం చూసుకోరాదూ? రుద్రాక్షమాలతో శివనామం 108 సార్లు జపించు. అది ఇహ పరసాధకం"
ఈ మొండివాదానికి ఏం జవాబు చెప్పాలో ఆమెకు తోచలేదు.
మోతీచంద్ నాల్గవభార్య రాధ మిగతా ముగ్గురు అర్ధాంగుల్లాంటిదికాదు. ఆమెకు ఉన్నవి పదహారేళ్ళే అయినా బలుపువల్ల ఆమె అంతకంటే పెద్దవయసుగలదానిలా కనిపించేది. మోతీచంద్ నలభైకి దరిదాపుల్లో ఉన్నాడు. వైసుపెళ్ళాం అతన్ని పాత పొరక్కట్టలాచేసి కూర్చోపెట్టింది. ఆమె పలికిందే వేదం. నుంచోమంటే నుంచునేవాడు. కూర్చోమంటే కూర్చునేవాడు. ఆమె గర్వంగా మగనితో గడ్డిసైతం కరిపిస్తానని చెప్పుకునేది.
రాధా సాహచర్యం లేకుంటే మోతీచంద్ ప్రణయతాపం ఎన్నడో ఆరిపోయి ఉండేది. అతడు రాధకు ఏ విధంగానూ తగినవాడుకాడు. ఆమె కోపానికి గాలికి వణికిన దివ్వెలా అదిరిపోయేవాడు. అందమైన ఆ అతివ వయసుతోపాటు లావుపెంచుకుంటూ అంతకోపాన్ని తనలో ఎలా అణచిపెట్టుకుంటూందా? అని ఆశ్చర్యపడేవాడు. తన ముగ్గురు భార్యల్తో గడిపినరోజులు అతనికి గుర్తుకువచ్చాయి. నాడు ఇంటిమీద సర్వాధికారాలూ అతనికే ఉండేవి. ఇప్పుడు మిత్రులు, సేవకులు సహితం తనను వట్టి చవటక్రింద లెక్కకడుతున్నారు.
అమాంతంగా రాధలో ధార్మిక పరివర్తనం వచ్చింది. యోగులూ, సన్యాసులూ ఆమెను చుట్టుముట్టారు. ఈ మార్పులోని ఆంతర్యం అర్ధంకాని మోతీచంద్ కు ఆమెలో అణగారి ఉన్న ఏదోవాంఛ భక్తిరూపంలో పెల్లుబికినట్లు కనిపించింది. ఏళ్ళతోపాటు ఆమెలో వైరాగ్యం ముదిరింది. కోపంతో భగ్గుమండే భార్యబాధ మోతీచంద్ కు తప్పింది.
పదకొండు సంవత్సరాలపాటు అణగి ఉన్న మోతీచంద్ కు విముక్తి కలిగింది. అయినా అతడు రాధను ధిక్కరించలేకపోయాడు. పాషాణంలాంటి ఆమె పట్టుదలకు మట్టిలాంటి మెత్తదనం రాలేదు.
బొమ్మవేయాలనే ప్రేరణ కలిగినప్పుడు మోతీచంద్ స్థితి ఆవిధంగా ఉంది. దుఃఖపూరిత నేత్రాలుగల పందిపిల్లలమీద తలక్రిందులుగా పడిఉన్న ఏనుగును చూసింది ఒక్క కాలూ మాత్రమేకాదు - ఇంకా చాలామంది చూశారు. మోతీచంద్ ఆ చిత్రానికి "నా అంతర్వాణి" అని పేరుపెట్టాడు. దానికి అర్ధం? అది అపహాస్యం కాదుకదా!
అది చెప్పగలవాడు మోతీచంద్ మాత్రమే.
15
ఒకనాడు విశ్వనాథ్ అసాధారణంగా ఎక్కడికో వెళ్ళివచ్చాడు. అతడు వెళ్ళింది అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న జేలుకు.
చీఫ్ వార్డన్ బి.10 ను గురించిన వార్త చెప్పాడు. బి.10 ఒక్క రోజు సహితం శిక్ష రెమిషన్ ఆర్జించలేదు. కాలూ వచ్చింతరువాత ఒక్క ఖైదీసహితం రెమిషన్ సంపాదించలేదు. కలకత్తానుంచి మార్చిన క్విట్టిండియా ఖైదీలతో జేల్లోని సెల్సు అన్నీ నిండిపోయాయి. బ్రిటిషు మహాసింహాన్ని పారదోలడానికి అపహాస్యంగా ఒక మువ్వన్నెధ్వజం తయారుచేశారు పిచ్చివాళ్ళు: వారు పిచ్చివాళ్ళలా వాగుతూంటే జేలంతా చెవులు చేసుకొని విన్నది. జేలంతా పిచ్చివాళ్ళలా "క్విట్టిండియా" అని అరచింది. జేలు వాళ్ళ నోళ్ళకు సీలువేయడానికి సాధనమా? లేక దంతవైద్యునిలా తెరిచిన నోరు అలాగే ఉంచడానికి ఉపకరించే ఒక ఉపకరణమా?
విశ్వనాథ్ చెప్పిందంతా కాలూ ఓపిగ్గా విన్నాడు.
"ఏమైనా వ్రాసి ఇచ్చివచ్చావా?"
"ఒకపక్షం తరువాత విడుదలఅయ్యే బి.10 కోసం ఒక మిత్రుడు గేటుదగ్గర వేచిఉంటాడు. బి.10 ఆ వ్యక్తికోసం చూడాలి అని వ్రాశాను"
"ఆ వ్రాసింది జేలువాళ్ళు అతనికి అందిస్తారా?"
"ఇస్తారనే నా ఉద్దేశం. ఊరికే మరిచిపోయినట్లు ఒక పదిరూపాయలనోటు ఆ టేబుల్ మీద వదిలేశాను. నేను అక్కడినుంచి వచ్చేప్పుడు చీఫ్ వార్డన్ గంగూసింగ్ నావైపు చూసి "ఆ ముండతో......బి.10 పెళ్ళాంతో సిద్దంగా ఉండమనిచెప్పు......"
"ఎందుకూ?"
"ఆఁ. ఏమీలేదు. ఏదో........"
"బి-10కు పెళ్ళాం లేందే?"
విశ్వనాథ్ యజమాని ముఖంలోకి చూశాడు.
"పదహారు రోజుల్తర్వాత అతడు జేలునుంచి బైటపడ్తాడు. అతని రూపురేఖలు చెపుతే అతన్ని తేలిగ్గా గుర్తుపట్టేస్తా"
కాలూ క్షణం ఆలోచించాడు.
"నేనే వెళ్తా." విశ్వనాథ్ ఆశ్చర్యంగా చూశాడు. "ఆకలితో చచ్చేవాళ్ళకు అన్నం చూపిందే అతడు చేసిననేరం. అందుకే అతన్ని 12 నెల్లు జేల్లో ఉంచారు"
మూడు రోజుల్తర్వాత కాలూ విచారవదనంతో విశ్వనాథ్ ను పిలిచి "ఇదిగో చూడు. నీకు బి.10 ఎలా ఉండేదీ చెప్తా. నాకంటే పొడుగ్గా, సన్నగా, ఎరుపుగా ఉంటాడు"
మొక్కలు నాటడంలో మునిగి ఉన్న విశ్వనాథ్ "మీరే వెళ్ళేప్పుడు అతన్ని గురించి నాతో చెప్పడం ఎందుకు?" అని అడిగాడు.
"నీవు వెళ్ళడమే సబబు అనిపిస్తూంది."
"అట్లాగా?" విశ్వనాథ్ కళ్ళల్లో వెలుగు వెలిగింది. అటూ, ఇటూ చూస్తున్నవాడల్లా కాలూ వంగి ఒక గులాబీమొగ్గను అందుకున్నాడు. క్షణంసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. కాలూ తల పైకెత్తేవరకు అందులోంచి రౌద్రం ఉట్టిపడుతూంది. ముఖం చిట్లించి, బొమలు ముడివేసి "అలా అప్పుడప్పుడే జేలునుంచి బైటపడ్డవాడి వెంట ఉండడం నా అంతస్తుకు తగిందికాదు. ప్రజలు చెవులు కరచుకుంటారు"
"అవును. అదీ నిజమే" అన్నాడు తలూపుతూ విశ్వనాథ్.
"ఇప్పటికే పుట్టెడు తగాదాలున్నాయి"
"అవును"
నిర్ణయం జరిగిపోయింది.
ఒకనాడు చంద్రలేఖ తండ్రిని "బి.10కు తెలిసింది ఒక్క శివునిగారడీయేనా?" అని అడిగింది.
బి.10 విషయంలో అలా తిరస్కారంతోనూ, అపహాస్యంగానూ మాట్లాడ్డం కాలూకు బాగనిపించలేదు.
"ఎంతైనా ఇది అతడు పన్నుగడ. బైటికి రాగానే గుడి డబ్బులో భాగం అడగొచ్చు" అన్నది లేఖ. కాలూ తన నిర్ణయాన్ని గురించి లేఖకు చెప్పాడు. "అతనికీ ఒక జందెంవేసి బ్రాహ్మన్ని చేస్తావా?" అని అడిగింది లేఖ తండ్రిని.
ఆ మాటలు అతని గుండెకు సూదుల్లా గుచ్చుకున్నాయి. అతడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతని ఆలోచనల ఆంతర్యం గ్రహించినట్లే "బి.10 ఈ గుట్టు రట్టుచేస్తే?" అని అడిగింది.
కోపం వచ్చిన దురుసుకంఠంతో "బి.10 విషయం నాకు తెలుసు. నాకు అతనిమీద విశ్వాసం ఉంది" అన్నాడు కాలూ.





