Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
యస్తేస్తనః శశయో యోమయో భూర్యోరత్నధా వసువిద్యాః సుదత్రః |
యేనవిశ్వాపుష్యసి వీర్యాణి సరస్వతి తమిహదాతవోకః ఉర్వ్య న్తరిక్షమన్వేమి ||
ఎనిమిదవ ప్రపాఠకము
మొదటి అనువాకము
(ఈ ప్రపాఠకమున రాజసూయము విధించబడుచున్నది. 1 - 20 అనువాకములందు ప్రధాన కర్మలు - 21,22 అనువాకములందు సౌత్రామణి మంత్రములు, యాజ్యాపురోనువాక్యలు చెప్పబడినవి.)
1. అనుమతి దేవతకు అష్టకపాలములందు సంస్కరించబడిన పురోడాశ హవిస్సును ఉంచవలెను. ధేనువును దక్షిణగా నీయవలెను. బియ్యము విసురుచుండగా శమ్యకు తూర్పుదిశన పడిన పిండిని పురోడాశము చేసి సంస్కరించి అష్టకపాలములందుంచి అనుమతి దేవతకు నిర్వాపము చేయవలెను. ఇది ఒక కర్మ.
నిరృతి దేవతకు ఏక కపాలమున సంస్కరించబడిన పురోడాశ హవిస్సును ఉంచవలెను. నల్లని బట్ట దక్షిణగా ఈయవలెను. బియ్యము విసరుచుండగా తూర్పు దిక్కున పడిన పిండిని పురోడాశము చేసి, సంస్కరించి ఏక కపాలమునందుంచి నిరృతి దేవతకు నిర్వాపము చేయవలెను. ఇది రెండవ కర్మ.
2. గార్హ పత్యాగ్నీ! నీకు హవిస్సు సమర్పించినాము. స్వీకరించుము. మేము దక్షిణమునకు వెళ్లదలచినాము. మమ్ము విడువుము.
నిరృతి దేవతా! ఈ ఏక కపాలమునందు సంస్కృత పురోడాశము నీకు సమర్పించినాము. సంతృప్తి చెందుము. నీవే మాసంపదకు కారణమవు. హవిస్సును అందుకున్నావు. కావున ఈ యజమానికి దారిద్ర్యము, పాపముల నుండి విముక్తి కలిగించుము.
గార్హ పత్యాగ్నిని విడువమని ప్రార్థించినాము. అట్లే విడిచినాడు. అతనికి స్వాహా. అతనికి నమస్కారము.
(1. స్రువముతో గార్హ పత్యాగ్నికి హోమము చేయవలెను. 2. నిరృతి దేవతకు అంగుష్ఠములచే హోమము చేసి నల్లని బట్ట సమర్పించవలెను. 3. స్రువముచే గార్హ పత్యాగ్ని యందు హోమము చేయవలెను. నమస్కరించవలెను. ధేనువును దక్షిణగా ఇవ్వవలెను.)
3. ఆదిత్యునకు చరువనెడి హవిస్సును సమర్పించవలెను. గోవును దక్షిణగా ఇవ్వవలెను.
అగ్ని విష్ణువులకు పదకొండు కపాలములందు సంస్కృత పురోడాశమును సమర్పించవలెను. పొట్టిది, బరువులు మోయు ఎద్దును దక్షిణగా ఇవ్వవలెను.
అగ్ని షోమ దేవతకు పదకొండు కపాలములందు సంస్కృత పురోడాశమును సమర్పించవలెను. బంగారమును దక్షిణగా ఇవ్వవలెను.
ఇంద్రునకు పురోడాశమును అట్లే సమర్పించవలెను. దక్షిణగా బరువులు మోయు ఆబోతును ఇవ్వవలెను.
అగ్ని, ఇంద్రులకు ఎనిమిది కపాలములందు సంస్కరించబడిన పెరుగును సమర్పించవలెను. బరువులు మోయు ఆబోతును దక్షిణగా ఇవ్వవలెను.
ఇంద్రాగ్నులకు, విశ్వేదేవతలకు పన్నెండు కపాలములందు సంస్కరించబడిన చరువును సమర్పించవలెను. తొలిచూలు దూడను దక్షిణగా ఇవ్వవలెను.
సోమదేవతకు నల్లని ధాన్యపు చరును సమర్పించవలెను. వస్త్రము దక్షిణగా ఇవ్వవలెను.
(ఇంద్ర, అగ్ని, సోమ, వైశ్వ దేవయాగము ఒక్కటియే అగును. అప్పుడు యాగములు ఏడు అగును.)
రెండవ అనువాకము
అగ్ని సోమ దేవతాకములకు ఎనిమిది పాత్రలందు చరు సమర్పించవలెను. సావిత్రి, సరస్వతీ దేవతాకమునకు పన్నెండు పాత్రలందు 'చరు' సమర్పించవలెను. పూష, మరుద్దేవతాకములకు ఏడు పాత్రలందు 'చరు' సమర్పించవలెను. విశ్వేదేవతాకము, ద్యావాపృథ్వీదేవతాకమునకు ఒకే పాత్రలో 'అమిక్ష' సమర్పింపవలెను.
మూడవ అనువాకము
1. ఇంద్రాగ్ని దేవతాకమునకు పదకొండు పాత్రలందు పురోడాశమును - మరుద్దేవతాకమునకు అమిక్షను - వరుణ దేవతాకమునకు అమిక్షను సమర్పించవలెను. ప్రజాపతి దేవతాకమునకు ఒక పాత్రయందు పురోడాశము నిర్వాపము చేయవలెను.
2. మరుత్తులు వరుణ పాశములను త్రెంచగలవారు. యజ్ఞభారము వహించువారు. పెరుగు కలిపిన సత్తు నందు ప్రీతి గలవారు. అట్టి మరుత్తులను హవామహే ఆహ్వానించుచున్నాము.
(ప్రతి ప్రస్థాత యాజమాన పత్నిని ఆహ్వానించవలెను.)
3. ఇంద్రా! మాతో యుద్ధములు చేయించకుము. నీవు బలవంతుడవు. వర్షము కలుగ చేయువాడవు. మా భూములు అన్ని పంటలకు అనుకూలమై ఉన్నవి. అందువలన మాకు అనిష్టము కలుగకుండునుగాక.
మాస్తుతి - కరంభ పాత్రరూప హవిర్యుక్తులైన - మరుత్తులకు నమస్కరించుచున్నది.
(1. యజమాని దంపతులు కరంభ పాత్ర గల శూర్పమును నెత్తికి ఎత్తుకొనవలెను. తదుపరి దక్షిణాగ్ని యందు కరంభమును హోమము చేయవలెను. 2. నేయి కలిపిన సత్తు కరంభము.)
4. కరంభ పాత్ర సముదాయమా! మేము గ్రామ, అరణ్య, ఇంద్రియ, శూద్ర, ఆర్య, వైశ్యుల విషయమున చేసిన పాపములను - దంపతుల మధ్య ధర్మ విషయమున చేసిన పాపములను నాశము చేయుము.
(హోమము చేయవలెను.)
5. అధ్వర్యుడు మున్నగు వారు మంత్రోచ్చారణ చేసినారు. సుఖములు కలుగుటకు కరంభపాత్ర హోమాంతము వరకు గల కర్మ ముగించినారు. హవిస్సులు అందించు అధ్వర్యాదులారా! కర్మ పూర్తి చేసి మీ ఇండ్లకు వెళ్లండి.
నాలుగవ అనువాకము
(సాకమేధము చెప్పబడుచున్నది.)
1. సూర్యోదయమున సైన్యవంతుడగు అగ్నికి ఎనిమిది పాత్రలందు పురోడాశమును సమర్పించవలెను. మరుద్దేవతలు అనిష్టనివారకులు. వారికి మధ్యాహ్నము చరు సమర్పించవలెను. గృహమేధులగు మరుద్దేవతలకు సాయం సమయమున, గోవులకు పాలు పితుకునపుడు - చరు నిర్వాపనము చేయవలెను.
(ఓదనో హి చరుః అని శతపథము, చరు అనగా అన్నము లేక వంటకము.)
2. దర్వీ! నీవు శరనిష్కాసముతో నిండుము. ఇంద్రుని వద్దకు చేరుము. అచట ఇంద్రుని అనుగ్రహమును నింపుకొనుము మరలి రమ్ము.
ఇంద్రా! మేము ధనము వంటి శరనిష్కాసము సమర్పించినాము. ధనమును, బలమును క్రీణావహై - కొనుచున్నాము.
(1. దర్వి - కొయ్యతో చేసిన గరిట వంటిది. 2. శర నిష్కాసము - చరు ఉడుకు చుండగా పైకి తేలిన గట్టి పదార్థము. 3. కొనుచున్నాము అనుట వలన వస్తువినిమయము అయినది.)





