Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



       
                జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||


                               పన్నెండవ అధ్యాయము


1.    దృశానో రుక్మా ఉర్వ్య వ్యధ్యౌ  ద్దుర్మర్షమాయుః శ్రియే రుచానః|
    అగ్నిరమృతో అభవద్వయోభిర్యదేనం ద్యౌరజనయత్సురేతాః||

    (యజమాని 'రుక్మము' అను బంగారు హారమును మెడలో వేసుకుని ఈశాన్య ముఖుడై నిలుచును)

    సూర్యుడు మహాజ్యోతి. ప్రకాశమానుడు. దృశ్యమానుడు. అదిగో సూర్యుడు తూర్పున ఉదయించినాడు. ఇతని దినాంత జీవనము సర్వదా దుర్ధర్షము ఇతడు శోభించుటకు దీప్తిని దాల్చును. సువీర్య ద్యులోకము సూర్యుని ప్రకటించినపుడే అగ్ని అమృతుడైనాడు.

    2. సమచిత్తము, సమభావమున తమతమ కాలయాత్రను జరుపువారును. తెలుపు, నలుపు పరస్పర విరుద్ధవర్ణముల వారును అగు రాత్రింబవళ్లు ఒకఅగ్ని శిశువునకు తమస్తన్యమును ఇత్తురు. ఈ వెలుగులు ఎగజిమ్ము సూర్యుడు ద్యావాపృథ్వుల మధ్య వెలుగును. అప్పుడు ధనములను ఇచ్చు దేవగణములు ఈ అగ్నిని తమలో దాల్చెదరు.

    3. సూర్యుడు క్రాంతద్రష్ట స్వకిరణములచే వివిధ రూపముల వెలుగొందువాడు. ఇతడు ద్విపాదమనుష్యుల కొరకును, చతుష్పాద గోవుల కొరకును ఉదయించును. ఈ వరణీయ సూర్యుడు స్వర్గమును తేజోవంతము చేయును. ఉష తరలిపోయినంత సూర్యుడు ఆకాశమున శోభిల్లును.

    (ఉఖను ఇనుపచట్రమున చేర్చి - ఆ చట్రమును ఆరుత్రాళ్లతో కట్టి యజమాని మెడకు తగిలించుకొనవలెను.)

    సవితృదేవా! నీవు గరుడస్వరూపడవు. త్రివృత్సామము నీ శిరమగును. గాయత్రీసామము నీ నేత్రములగును. బృహత్సామ, రథంతర సామములు నీపక్షములగును. పంచదశస్తోమము నీ అంతఃకరణమగును.
   
    ఏడుఛందములు నీ అవయవములు, సర్వయజుస్సులు నీ నామము, నామదేవ్య సామము నీ దేహము, యజ్ఞాయజ్జీయ సామము నీ వాలము, హొత్రాది ధిష్ణ్యలందున్న అగ్నులు నీ పంజాలగును.

    సవితృదేవా! న్ర్ర్వు కళ్యాణగతుల గరుడుడవు. నీవు ద్యులోకమునకు వెళ్లుము. స్వర్గమున ఎగురుము.

    (యజమాని ఉఖాస్థితాగ్నిని పైకిలేపి పట్టును)

    5. (యజమాని తూర్పునకు నాలుగు అడుగులు వేయును)

    నా ప్రథమపదన్యాసమా! నీవు అగ్ని రూపుడగు విష్ణువు పదన్యాసమవు. నీవు శత్రువులను నాశము చేయుదానవు. గాయత్రీ ఛందమును ఆరోహింపుము. ఈపృథ్విని వికసింపచేయుము.

    ద్వితీయ పదన్యాసమా! నీవు విష్ణువుయొక్క పరాక్రమవవు. శత్రువును నాశనము చేయుదానవు. త్రిష్ణుప్ ఛందమును ఆరోహించుము. అంతరిక్షమును ఆక్రమించుము.

    తృతీయ పదన్యాసమా! నీవు విష్ణువు యొక్క విక్రమవవు. అదాతలను దెబ్బతీయుదానవు. జగతీ ఛందమును ఆరోహించుము. ద్యులోకమును ఆక్రమించుము.

    చతుర్థపదన్యాసమా! నీవు విష్ణువు యొక్క నాలుగవ పదన్యాసమవు. శత్రుత్వము చేయువారిని వధించుదానవు. అనుష్టుప్ ఛందమున ఆరోహించుము. నాలుగు దిశలను ఆక్రమించుము.

    6. (యజమాని తనచేతులతో ఎత్తిఉంచిన ఉఖాగ్నిని తూర్పుదిక్కునకు చూపవలెను)

    అగ్ని మేఘమువలె గర్జించి నినదించుచున్నది. మేఘము వలెనే అగ్ని పృథ్విని తాకుచున్నది లతాగుల్మాదులందు వ్యాపించుచున్నది. అగ్ని అరణి మంథనమున అంటుకొనుచున్నది. అత్యంతప్రదీప్తమగుచున్నది. అగ్ని తన ప్రకాశమున సమస్తవస్తువులను ప్రకాశవంతము చేయుచున్నది. అగ్ని ద్యావాపృథ్వులందు - మేఘమందలి విద్యుత్తువలె - స్వప్రకాశమున మెరయుచున్నది.

    7. (ఈ నాలుగు మంత్రములచే యజమాని పైకి ఎత్తిన అగ్నిని తనకు దగ్గరగా తెచ్చుకొనును)

    మా దగ్గరకు వచ్చుచున్న అగ్నీ! మాకు ఆయువు- బ్రహ్మవర్చస్సు - సంతానము - ధనము - అభీష్టలబ్ధి - ధారణగల బుద్ధి - సువర్ణ ఆలంకారములు - గోవులు అశ్వములు మున్నగు వానితో కూడిన పుష్టి కలిగించుము.

    8. ప్రత్యంగమున రసము నిండిన అగ్నీ! మాకు నీ విషయమున ఎంతో భక్తి ఉన్నది. కావున ఈ యజ్ఞస్థలమునందలి ఒక్కొక్క ఆహుతి వందలు, వందలు కావలెను. నీవు మాకు కలుగజేసిన ధనపశ్వాదులు వందలు వందలై వర్ధిల్లవలెను. నీ ఆవృత్తులు- ఉపావృత్తులు రెండింతలు-నాలుగింతలు కావలెను. అందువలన మేము కోల్పోయిన ధనము, పశువులు మున్నగునవి మరల లభించవలెను.

    9. అగ్నీ! మమ్ము మరల మరల బలవీర్యములచే సంపన్నులను చేయుము. మరల మరల మమ్ము అన్నము, ఆయువులచే సంపన్నులను చేయుము. రమ్ము. ఈ యజ్ఞమునకు విచ్చేయుము. మమ్ము మరల మరల పాపముల నుండి రక్షింపుము.

    10. అగ్నీ! నీవు ధనసహితుడవై మమ్ము చేరుము. అందరి దాహము తీర్చు వర్షధారలచే సమస్త విశ్వములను తడుపుము.

    11. (యజమాని ఉఖాగ్నిని నాభివద్దకు తేవలెను)

    అగ్నీ! నేను నిన్ను సమార్జించినాను. నీవు ఈ ఉఖయందు స్థిరపడుము. ఇందు సంపూర్ణముగా అచంచలముగ స్థిరభావమున నిలువుము. సకలప్రజ నిన్నే వాంఛించవలెను. సమస్త దేశము నీ పరిచర్యలను కోల్పోరాదు.

    12. (మెడయందలి రుక్మమును - అగ్నిని తొలగించవలెను)

    వరుణదేవా! నాతల కట్లను విడదీయుము. కాళ్ల కట్లనువిడదీయము. రొమ్ముకు ఉన్నకట్లను సడలింపుము. ఇప్పుడు మేము పాపరహితులమై యజనకర్మయోగ్యులము కావలెను. అతిథి విషయమున సహితము ఆసక్తులము కావలెను.

    13. (ఉఖాగ్నిని పైకి ఎత్తవలెను)

    ఉషస్సుల కన్న మున్నే మహాజ్యోతి ప్రజ్వరిల్లి నిలిచినది. రాత్రుల చీకట్లను దాటివచ్చినది. అతడు జ్యోతిర్మూర్తియై సూర్యరూపమున ప్రత్యక్షమైనాడు. శోభనాంగముల అగ్ని - తమస్సులను నశింపచేయుచు - ప్రకాశరూపమున వెలువడినాడు. అతడు పుట్టినాడో లేడో సమస్తలోక, లోకాంతరములను వ్యాపించినాడు.

    14. (ఉఖాగ్నిని పీటమీద పెట్టవలెను)

    అగ్ని గమనశీలుడు. పవిత్రస్థానస్థితుడు. స్వయంధన స్వరూపుడు. అంతరిక్షస్థితుడు. దేవతల ఆహ్వానకర్త. వేదియందుండువాడు. అతిథిస్వరూపుడు. యజ్ఞగృహస్థితుడు. మానవులకు ప్రాణస్వరూపుడు. శ్రేష్ఠస్థానములందు వసించువాడు. ఆకాశమున విద్యుద్రూపమున నిలిచినవాడు. జలములందు, గోవులు మున్నగు వానియందు, ఘృతమునందు ఉత్పన్నుడు. అతడు పరమసత్యము "ఋతం బృహత్".

    15. అగ్నీ! నీవు సమస్త ప్రజ్ఞానమార్గములను ఎరిగిన వాడవు. తల్లివడివంటి ఈ ఆసనమున ఆసీనుడవగుము. నీ  వేడిచే ఈ ఆసనమును కాల్చకుము. నీకున్న వేడితో శుభ్రజ్యోతి రూపమున దేదీప్యమానుడవగుము.

    16. అగ్నీ! ఉఖ నీకు గృహము వంటిది. దీనిలో నీవు స్వకాంతిచే సంపూర్ణముగ ప్రకాశింపుము. నీ తేజస్సున దానిని తపింపచేసినను కళ్యాణప్రదుడవగుము.

    17. అగ్నీ! నావిషయమున సహితము నీవు కళ్యాణ ప్రదుడవగుము. శివస్వరూపుడవై ఉఖయందు ఉండుము. నీవు సర్వదిశలను శుభప్రదములను చేయుము. నీకు యోనిభూతమగు ఉఖయందు వసింపుము.

    18. తొలుత అగ్ని ఆదిత్యరూపమున ద్యులోకమున అవతరించినాడు. అరణిమంథనమున రెండవసారి అవతరించినాడు. మానవ కళ్యాణకారియై మేఘమందు వైద్యుతాగ్ని అయి అవతరించినాడు. జలమునందున్న బడబాగ్ని సమిద్ధమానమగుచు నిత్యము ఆ జలమునకు వర్షరూపము కలిగించును.

    19. అగ్నీ! మేము నీయొక్క -ఆదిత్య, పార్థివ, వైద్యుతములను - మూడు జన్మలను ఎరిగిన వారలము. అవి ద్యులోక, అంతరిక్షములందుండును. అట్లయిన కట్టెలు మున్నగు వానియందలి నీ సూక్ష్మవ్యాపితను సహితము మేము ఎరుగుదుము. నీ ప్రాణస్వరూపమగు అత్యంత నిగూఢ స్వరూపమున్నదే - దానిని కూడ మేము ఎరుగుదుము. నీ ప్రాణ స్వరూపమగు అత్యంత నిగూఢ స్వరూపమున్నదే- దానిని కూడ మేము ఎరుగుదుము. నీవు ఈ సకల స్వరూపములతో అవతరించుటకు మూల స్వరూపమగు పరమస్థానమును సహితము మేము ఎరుగుదుము.

    20. అగ్నీ! అంతరిక్షమందు నిన్ను ఆప్రజాపతియే సమింధితుని చేయుచున్నాడు. జలమధ్యమున బడబాగ్ని రూపమున ప్రజాపతియే నిన్ను ప్రజ్వలితుని చేయుచున్నాడు. ఆదిత్యరూపమున ద్యులోకపు స్తనము వలె నీవు వ్రేలాడుచుండుటకు సహితము ప్రజాపతియే కారణమగును.

    తృతీయముగ భూలోకమునందు, నీటి ఎదలో ఉన్న నీవు వానికి ప్రాణ రూపమగు ఇంధనము సమకూర్తువు.

    21. అగ్ని మేఘము వలె గర్జించి నినదించుచున్నది. మేఘము వలెనే అగ్ని పృథ్విని తాకుచున్నది. లతాగుల్మాదులందు వ్యాపించుచున్నది. అగ్ని అరణి మంథనమున అంటుకొనుచున్నది. అత్యంత ప్రదీప్తమగుచున్నది. తన ప్రకాశమున సమస్త వస్తువులను ప్రకాశవంతము చేయుచున్నది. అగ్ని ద్యావాపృథ్వులందు - మేఘమునందలి మెరుపు వలె - స్వప్రకాశమున మెరయుచున్నది.

    (అరవ మంత్రము పునరావృతము)

    22. అగ్ని సంపదల దాత. ధనములు ధరించువాడు. అభిలషిత స్వర్గాదులు కలిగించువాడు. సోమరక్షకుడు. సకలమునందుండువాడు. బలపుత్రుడు. జలములందు వరుణ రూప ప్రభువు. అత్యంత ఉగ్రస్వభావుడు. అతడు ఉషస్సులను ప్రజ్వలింపజేసి భాసించును.

    23. నలుగురు ఋత్విక్కులు - అయిదవవాడగు యజమాని అగ్నిని పూజించినపుడు అగ్నివిశ్వప్రజ్ఞాపకుడగును - భవనములకు గర్భస్వరూపుడగును - పుట్టగనే స్వప్రకాశమున ద్యావాపృథ్వులందు వ్యాపించును - ఇంద్రరూపమున పర్వతములను విదీర్ణము చేయును.

    24. అగ్ని కమనీయుడు. పావకుడు. దుష్టులందు ప్రేమరహితుడు. మేధావి. అమరుడు. మానవుల కోరికలు తీర్చువాడు. అగ్ని ఆహవనీయాది రూపములచే ప్రతిష్టించబడును. ఈ అగ్ని ఆరోచనమాన ధూమమును పైకి పంపును. వర్షాదులు కలిగించుట వలన అగ్ని సకలలోకములను భరించిపోషించుచున్నాడు. అగ్ని తన దీప్తిని ద్యులోకము వరకు వ్యాపింపచేయును.

    25. సూర్యుడు మహాజ్యోతి. ప్రకాశమానుడు. దృశ్యమానుడు. అదిగో సూర్యుడు తూర్పున ఉదయించినాడు. ఇతని దినాంత జీవితము సర్వదా దుర్ధర్షము. ఇతడు తాను శోభించుటకు గాను దీప్తిని ధరించును. సువీర్యద్యులోకము సూర్యుని ప్రకటించినపుడే - అగ్ని అమృతుడైనాడు.

    (ఒకటవ మంత్రము పునరావృతము)

    26. ద్యోతమాన శుభదీప్త అగ్నీ! నేడు యజామని నీకొరకు ఘృతమున మునిగిన పురోడాశము వండినాడు. తరుణతమ అగ్నీ! అట్టి యజమానికి దేవతలు అనుభవించునట్టి స్వర్గాది సుఖములు కలిగింపుము.

    27. అగ్నీ! ఆ యజమానిని స్తోత్రాదులందు నియమింపుము. యజ్ఞాది కర్మములందు నియుక్తుని చేయుము. అట్లు నీచే నియమించబడిన ఈ యజమాని సూర్యునకు ప్రీతిపాత్రుడగును. అగ్నికి ప్రీతిపాత్రుడగును. అతనికి సంతానవృద్ధి కలుగును. పౌత్ర, ప్రపౌత్రాదుల అభివృద్ధి కలుగును.

    28. అగ్నీ! నిన్ను నిత్యము ఆరాధించు యజమానికి వరణీయ రత్నాది ధనప్రాప్తి కలుగును. 'ఉశిక' జనులు నిన్ను అర్చించినారు.  గోధనము కోరినారు. వారు - పూర్వకాలమున పణులచే అపహరించబడి దాచబడిన - గోష్టములను సహితము తెరచినారు.

    (ఉశిజోమేధావినః జ్ఞానకర్మ సముచ్చయ కారిణః అని ఉవట - మహీధర వ్యాఖ్య)

    29. అగ్ని మానవులచే సుఖముగా సేవనీయుడు. అతడు జ్ఞానులగు ఋత్విజాదులచే స్తుతించబడువాడు. అతడు సర్వనేత - సోమసంరక్షకుడు. ద్యావాపృథ్వులు ద్వేషరహితులు. వారిని మేము ఆహ్వానించుచున్నాము.

    దేవతలారా! మీరు మాకు వీరులగు పుత్రులను గో, అశ్వాది ధనమును ప్రసాదించండి.

    ౩౦. (ఉఖాగ్నికి ఉత్తరదిశన శకటముణు నిలిపి యజమాని వనీవాహనము' న సమిధలు వేయును)

    ఋత్విక్కులు, యజమానులారా! సమిధలు సమర్పించి ఈ అగ్నికి పరిచర్యలు చేయండి. అతిథివంటి పూజ్యునకు ఘృతాదులు అర్పించండి. పరిపూర్ణముగ ప్రజ్వలితుడైన అగ్నియందు వివిధ హవిరన్నములచే హొమము చేయండి.     




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.