Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
ఇరువది రెండవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు 1-8 విరాజితము, 9 త్రిష్టుప్.
1. ఇంద్రా ! సోమపానము చేయుము. అదినీకు మత్తు కలిగించవలెను. అశ్వవంత ఇంద్రా ! త్రాటితో కట్టిన గుఱ్ఱమువలె అభిషవకర్త రెండు చేతులతో పట్టిన రాయి సోమమును అభిషవించినది.
2. ఇంద్రా ! నీవు హర్యశ్వవంతుడవు. అనంతధనవంతుడవు. సోమము నీకు ఉపయుక్తమైనది. చక్కగా సమర్పించబడినది. ఆ సోమబలముననే నీవు వృత్రాదులను వధించినావు. అదిగో అటువంటి సోమము నీకు మత్తుకలిగించవలెను.
3. ఇంద్రా ! వసిష్ఠుడు నీ స్తుతిరూప వచనములు చెప్పుచున్నాడు. ఆ వసిష్ఠుని వచనములను గుర్తింపుము. యజ్ఞమున ఈ స్తుతులను స్వీకరింపుము.
4. ఇంద్రా ! నేను సోమపానము చేసినాను. నా శిలాక్రందన వినుము. స్తోతల స్థితిని తెలిసికొనుము. నేను నిన్ను సేవించుచున్నాను అది సహాయకమై మనసులో నిలిచిపోవలెను.
5. ఇంద్రా ! నీవు శత్రుంజయుడవు. నేను నీ బలమును ఎరుగుదును. నిన్ను స్తుతించుట విడువజాలను. నేను ఎల్లప్పుడు నీ యశస్వినామమును ఉచ్ఛరింతును.
6. ఇంద్రా ! మానవులలో నీకు సంబంధించిన అనేక సవనములు ఉన్నవి. మనీషులగు స్తోతలు నిన్నే ఆహ్వానింతురు. మమ్ము నీ నుంచి దూరము ఉంచకుము.
7. శూర ఇంద్రా ! ఈ సవనములన్నియు, వర్ధక స్తోత్రములన్నియు నీకొఱకే ఏర్పడినవి. నీవు అన్నివిధముల మానవులకు ఆహ్వానయోగ్యుడవు.
8. దర్శనీయ ఇంద్రా ! స్తుతించి నీ మహిమను వెంటనే పొందనివాడెవ్వడు? నీ ధనమును పొందని వాడెవ్వడు?
9. జరిగిపోయిన ప్రాచీన ఋషులందరు సవీమలందరు నీకొఱకే స్తుతులు రచించినారు. మాకు నీ సఖ్యత మంగళప్రదము కావలెను. "పాత స్వస్తిభిః సదానః"
ఇరువది మూడవ సూక్తము
ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. సకల స్తోత్రములు అన్నముకోరి వెళ్లినవి. వసిష్ఠా ! నీవు కూడ ఇంద్రుని స్తుతించుము. తన బలమున ఇంద్రుడు సకల లోకములందు వ్యాపించినాడు. నేను అతని వద్దకు వెళ్లదలచినాను. అతడు మా స్తుతివచనములను ఆలకించవలెను.
2. ఓషధులు పెరిగినపుడు దేవతలు ప్రియవచనములు వినగలరు. మానవులలో ఎంతటివాడయినను నీ ఆయువు తెలియజాలడు. మమ్ము సకల పాపములనుండి దాటింపుము.
3. ఇంద్రునివి హర్యశ్వములు. అతని రథము గోప్రాపకము. నేను ఇంద్రుని రథమునకు అశ్వములు పూన్తును. ఇంద్రుడు స్తోత్రములను సేవించును. స్వీకరించును. సకల జనులు అతనిని ఉపాసింతురు. అతడు తన మహిమతో ధ్యావాపృథ్వులను బాధించినాడు. శత్రుబలములను నాశము చేసినాడు.
4. ఇంద్రా ! ఇంకను ప్రసవించని గోవువలె జలము వర్థిల్లవలెను. నీ స్తోతలు జలమును వ్యాపింప చేయవలెను. వాయు నియుత్తుల అశ్వినులు అశ్వముల వద్దకు వచ్చినట్లు నీవు మావద్దకు విచ్చేయుము. కర్మతో నీవు అన్నము ప్రదానము చేయుము.
5. ఇంద్రా ! సోమము మాదకము. అది నిన్ను ఉన్మత్తము చేయవలెను. స్తోతకు బలవంతుడు, బహుధన వంతుడగు పుత్రుని ప్రసాదించుము.
6. వశిష్ఠ జనులు ఈవిధముగనే అర్చనీయ స్తోత్రములద్వారా వజ్రబాహు, అభీష్టవర్షి ఇంద్రుని పూజింతురు. స్తుతుడైన ఇంద్రుడు మాకు వీరత్వము, గోయుక్త ధనము ఇవ్వవలెను. "పాత స్వస్తిభిః సదా వః"
ఇరువది నాలుగవ సూక్తము
ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. పురుహూతఇంద్రా ! నీ నివాసమునకు స్థానము ఏర్పరచబడినది. మరుత్తుల సహితుడవై విచ్చేయుము. నీవు మాకు రక్షకుడవయినావు. మాకు అభ్యుదయకారివి అయినావు. మాకు అట్టి ధనమును ప్రసాదించుము. మా సోమపానమున మత్తుడవగుము.
2. ఇంద్రా ! నీవు ఉభయస్థానములందు పూజ్యుడవు. మేము నీ మనసు తెలిసికున్నాము. సోమము అభిషవించినాము. మధువును పాత్రలో నింపినాము. మధ్యమ స్వరమున పొడదగు ఈ సుసమాప్తస్తుతి ఇంద్రుని ఆహ్వానమునకు ఉచ్చరించబడును.
3. ఇంద్రా ! ఈ యజ్ఞమున సోమపానమునకుగాను స్వర్గమునుండి, అంతరిక్షమునుండి విచ్చేయుము. అశ్వములు ఇంద్రుని ఆనందమునకుగాను మావద్దకు స్తోత్రముల వద్దకు చేర్చవలెను.
4. ఇంద్రా ! నీవు హర్యశ్వవంతుడవు. మంచి దవడలు కలవాడవు. నీవు అన్నిరకముల రక్షణలతో రమ్ము. వృద్ధిగల మరుత్తుల సహితుడవై రమ్ము. శత్రువులను జయించటకు రమ్ము. అభీష్టవర్షి. బలవంతుడగు పుత్రుని ఇచ్చుచు రమ్ము. స్తోత్రమును స్వీకరించుచురమ్ము మా వద్దకు రమ్ము.
5. రథపు గుఱ్ఱపువంటి బలము నిచ్చు మంత్రము మహామహుడు ఓజస్వి ఇంద్రుని కొరకు ప్రతిష్ఠితమైనది. ఇంద్రా ! స్తోత నిన్ను ధనము అడుగుచున్నాడు. నీవు మాకు ఆకాశమందలి స్వర్గమువంటి శ్రీమంతుడగు పుత్రుని ప్రసాదింపుము.
6. ఇంద్రా ! ఆవిధముగా నీవు వరణీయ ధనముతో పరిపూర్ణులను చేయుము. మేము నీ మహా అనుగ్రహమునకు పాత్రులము అగుదుము. మేము హవ్యవంతులము. మాకు వీర్యపుత్రవంత అన్నము అందింపుము.
ఇరువది ఐదవ సూక్తము
ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఓజస్వి ఇంద్రా ! నీవు గొప్పవాడవు. మనుషుల మంచి కోఱువాడవు. నీ సేనలు సమానమాన్యలు. అవి యుద్ధము చేయునపుడు నీచేతి వజ్రము మమ్ము కాపాడవలెను. సర్వత్ర సంచరించు నీ మనస్సు విచలితము కారాదు.
2. ఇంద్రా యుద్ధమున మాముందుకు వచ్చి మమ్ము అవమానించు శత్రువును నాశము చేయుము. మమ్ము నిందించ కోఱువారి కథను అంతము చేయుము. మా కొఱకు సంపదల తెమ్ము.
3. ఉష్ణీ షముగల ఇంద్రా ! నేను సుదాసుడను. నా కొఱకు నీ రక్షలు వందలు కావలెను. నీవందల అభిలాషలు, ధనము నావికావలెను. హింసకుని హింసాసాధనములగు ఆయుధములను నష్టపరచుము. మా కొఱకు వెలుగొందు కీర్తి, రత్నములను తెమ్ము.
4. ఇంద్రా ! నేను నీసమాన వ్యక్తి కార్యమున నియుక్తుడను. నీ సమాన వ్యక్తి దానమున నియుక్తుడను. బలవాన్, ఓజస్వి ఇంద్రా ! రోజంతయు మాకు స్థానము కల్పించుటలో నిమగ్నుడవగుము. హర్యశ్వా! మమ్ము బాధించరాదు.
5. మేము హర్యశ్వ ఇంద్రుని కొఱకు సుఖకరములగు స్తోత్రము పాడుదుము. ఇంద్రుని, దేవప్రేరిత బలము యాచింతుము. సకల దుర్గములను లంఘించు బలము పొందుదుము.
6. ఇంద్రా ! మాకు సంరక్షణ యోగ్యమగు సంపూర్ణ ధనము ప్రసాదించుము. నీ ఆశీర్వాద యుక్తులమై మేము ముందడుగు వేతుము. ఉత్తమ వీరులతో ఉన్న ధనము మాకు అందవలెను. నీవు కాక దేవతలందరు తమ సంరక్షణ సాధన యుక్తులై రక్షించుచుండవలెను. "పాత స్వస్తిభిః సదా నః"
ఇరువది ఆరవ సూక్తము
ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ధనాధిపతి ఇంద్రుని కొఱకు అభిషుతము కాని సోమము తృప్తిచెందదు. అభిషుతమయ్యు స్తోత్రహీన స్తోమము తృప్తిచెందదు. మేము ఇంద్రుని సేవలో ఉక్థ చదువుదుము. ఇంద్రుడు వినును. ఇంద్రుని కొఱకు ఆ నవీన ఉక్థనే నేను చదువుదును. ఉచ్ఛరింతును.
2. విశేష ఉక్థ స్తుతి పాఠకాలమున సోమము ధనదుడగు ఇంద్రునకు తృప్తినిచ్చును. విశేష ఉక్థ స్తుతి పాఠకాలమున అభిషుత సోమము ఇంద్రుని తృప్తిపరచును. ఋత్విక్కులు పరస్పరము కలుసుకొనువారు సమాన ఉత్సాహవంతులు. వారు - కొడుకు తండ్రిని పిలిచినట్లు తమ రక్షణకుగాను ఇంద్రుని ఆహ్వానిస్తారు.
3. సోమాభిషవ కాలమున స్తోతలు ఘనకార్యములను గురించి ముచ్చటించకొందురు ఇంద్రుడు అట్టి సకల ఘనకార్యములను ప్రాచీన కాలముననే చేసినాడు. అతడు ఇప్పుడు అన్యకార్యములు సహితము చేయును. భర్త భార్యను దువ్వినట్లు ఇంద్రుడు శత్రునగరములను దువ్వినాడు.
4. పరస్పరము కలిసిన ఇంద్రునిని అనేక రక్షలు ఉన్నవి. అట్లని ఇంద్రుని గురించి ఋత్విక్కులను చెప్పినారు. ఇంకను చెప్పుకొనునదేమనగా ఇంద్రుడు పూజనీయ ధనముల నిచ్చువాడు ఆపదోద్ధారకుడని.
5. రక్షణకొఱకు ప్రజల అభీష్టపూర్తికొఱకు వసిష్ఠుడు సోమాభిషవమున ఇంద్రుని ఇట్లు స్తుతించినాడు. ఇంద్రా ! మాకు వివిధ ప్రకారముల అన్నములను ప్రసాదించుము. "పాత స్వస్తిభిః సదానః"
ఇరువది ఏడవ సూక్తము
ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. జననులు యుద్ధకార్య సన్నద్ధులైనపుడు యుద్ధమునకు ఇంద్రుని ఆహ్వానింతురు. ఇంద్రా ! నీవు మానవుల కొఱకు ధనదాతవగుము. బలాభిలాషివి అగుము. మమ్ము గోపూర్ణ గోష్ఠమున ప్రవేశపెట్టుము. "గోమతి వ్రజే భజత్వంనః"
2. పురుహోత ఇంద్రా ! నీవద్ద జలమున్నది. దానిని స్తోతలకు అందించుము. నీవు ఎంతోగట్టి పురములను చిందరవందర చేసినావు. అందువలన నీ ప్రజ్ఞను వెల్లడించుము. దాచిన ధనమును బయట పెట్టుము.
3. ఇంద్రుడు జంగమ జగములకును, మానవులకును మహారాజు. నేలమీద ఉన్న ధనములన్నింటికి ఇంద్రుడే రాజు. ఇంద్రుడు ద్రవ్యదాతకు ధనము ఇస్తాడు. ఆ ఇంద్రుడే మా స్తుతులు ఆలకించవలెను. మాకు ధనము పంపవలెను.
4. మేము ధనికుడు, దానకర్త ఇంద్రుని మరుత్తుల సహితునిగా ఆహ్వానించినాము. అందువలన అతడు మమ్ము రక్షించుటకుగాను వెంటనే అన్నము పంపవలెను. ఇంద్రుడే తన మిత్రులకు సంపూర్ణము, సర్వవ్యాపకమగు దానము చేయును. అతడే మానవుల కొరకు ధనము పితుకును.
5. ఇంద్రా ! ధనప్రాప్తికిగాను మాకు వెంటనే వేద ధనము అందించుము. మేము పూజ్యములగు స్తోత్రములతో నీ మనసును ఆకర్షింతుము. నీవు గోవులు, అశ్వములుగల ధనవంతుడవు. "యూయం పాతస్వస్తిభిః సదానః"
ఇరువది ఎనిమిదవ సూక్తము
ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీవు మా స్తోత్రములను గ్రహించుము. ఆ స్తోత్రములవైపు నడక సాగించుము. నీ గుఱ్ఱములు మాముందే పూన్చబడవలెను. ఇంద్రా ! నీవు అందరకు ఆనందకరుడవు. నిన్ను వేరువేరుగా సకల జనులు పిలుస్తారు. కాని నీవు మా ఆహ్వానమును మాత్రమే వింటావు.
2. బలీ ఇంద్రా ! నీవు ఋషుల స్తోత్రములను రక్షిస్తావు. అప్పుడు నీ మహిమ వలన స్తోత్రములు వ్యాప్తిచెందవలెను. నీవు ధరించినపుడు భయంకరుడవు అవుతావు. శత్రువులకు దుర్ధర్షుడవు అగుదువు.
3. ఇంద్రా ! నీ ఉపదేశము ప్రకారము జనులు నిన్ను మరల మరల స్తుతింతురు. అట్టివారిని నీవు ద్యులోక, భూలోకములందు కీర్తివంతులను చేయుదువు. నీవు మహాబలము మహాధనముకొఱకు పుట్టినావు. కావున నిన్ను గూర్చి యజ్ఞము చేయువాడు ఆయాజ్ఞికులను పడవేయు సమర్ధుడగును.
4. ఇంద్రా ! మిత్రునివలె కనిపించు దుష్టులవద్ద నుండి ధనము గుంజుకొనుము. దానినంతటిని మాకు దానము చేయుము. వరుణుడు పాపఘాతకుడు. బుద్ధిమంతుడు. వరుణుడు మావద్ద చూచిన పాపములను రెండు విధములుగా విడిపించుము.
(ద్విదీ అనగా రెండు విధముల అని అర్థము వరుణునకు చెప్పిగాని నీ అంతట నీవుగాని విడిపింపుము అని తాత్పర్యము వరుణుని విషయమున పాపఘాతకుడు అను విశేషణము వాడినాడని గమనించవలెను.)
5. ఇంద్రుడు మాకు చక్కని ఆరాధ్యమగు మహాధనము ప్రసాదించినాడు. అతడు స్తోతను స్తోత్రకార్యమును రక్షించినాడు. ధనవంతుడగు ఆ ఇంద్రునే మేము స్తుతింతుము. "యూయంపాత స్వస్తిభిః సదావః"
ఇరువది తొమ్మిదవ సూక్తము
ఋషి - వశిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీ కొఱకు సోమము అభిషుతమైనది. దానిని స్వీకరించుటకు నీవు త్వరగా రావలెను చక్కగా అభిషుతమైన సోమము పానము చేయుము.
ఇంద్రా ! మేము నిన్ను యాచించుచున్నాము. మాకు ధనము అందించుము.





