Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    9. ఉష దివాగమనమును తెలియజేయుచున్నది. ఉష స్వయం ప్రకాశకము. ఉష తిమిరము నుండి జన్మించుచున్నది. యజ్ఞస్థానమున హవిస్సు మున్నగువానిని ప్రకాశింపజేయుచున్నది. ఉపకారము చేయుచున్నది.

    10. ఉషా ! నీవు కన్యవలె ఉన్నావు. వికసించిన అవయవములుగల ప్రౌఢవయి ఉన్నావు. కోర్కెలు తీర్చగల సూర్యుని ప్రియునిగా పొందినావు. యువతివయి భర్తముందు చిరునవ్వులు చిందించుచు నిలిచినావు. సర్వాంగములను ప్రదర్శించుచున్నావు.

    11. ఉషా ! తల్లి అలంకరించిన తనయవలె విరాజిల్లుచున్నావు. నీవు సర్వజనులకు దర్శనము ఇచ్చుచున్నావు. జగములకు సుఖములు కలిగించు వెలుగు ప్రసరింపచేయుచున్నావు. అందువలన నిన్ను అందరు స్తుతించుచున్నారు. నీవు చీకట్లను పారద్రోలుము. ఇతరులకు ఆ పని అసాధ్యము అగును.

    12. ఉషస్సులు అశ్వవతులు, గోవతులు, సూర్యకిరణవతులు. ఉషస్సులు అంధకారమును అంతముచేయు ప్రయత్నమున ఉన్నవి. ఉషస్సులు ఉపకారకములు, స్తవనీయములు. ఉషస్సులు తరిగిపోవుచున్నవి. ఉషస్సులు తిరిగి అవతరించుచున్నవి.

    13. ఉషోదేవీ ! నీవు సత్యస్వరూపుడగు సూర్యుని కిరణములను దాల్చినావు. మాటి అట్టి శుభకర్మములను, ధనమును ప్రసాదించుము.

                         నూట ఇరువది నాలుగవ సూక్తము

         ఋషి - కక్షీవంతుడు, దేవత - ఉషస్సు, ఛందస్సు - త్రిష్టుప్.


    1. ఉషా ! మండుచున్న జ్వాలలవలె తిమిరములను మ్రింగుచు ఉదయభానునివలె కాంతివంతమయి ప్రకాశించుచున్నావు. మేము ప్రాతఃకాల కర్మలను ఆచరించుచున్నాము. సూర్యుడు గోధనమును ఇతర ధనములను ప్రసాదించవలెను. రాక పోకలు కలిగించవలెను.

    2. ఉష, దేవతా సంబంధమగు వ్రతములను అనుకూలింపచేయుచున్నది. నరులకు సంయోగ వియోగములు కలిగించుచున్నది. గతించిన, రానున్న ఉషస్సులకు సమమయిన నేటి ఉష అవతరించినది.

    3. ఉష ద్యులోకమునకు కూతురు వంటిది. తూర్పున తేజస్సు అణు వస్త్రమును పరచుచున్నది. జనులను పనులకు పురిగొల్పుచున్నది. ఉష సూర్యుని మార్గమును అనుసరించును. అన్నియు తెలిసినదానివలె నాలుగు దిశలను ఎరుకపరచును.

    4. ఉష సూర్యుని కిరణ సమూహతీరమున కనిపించుచున్నది. నోధస్సు తన మంత్రములచే కోరికలను ప్రకటింపచేసినట్లు ఉష తన తేజస్సును ప్రకటించుచున్నది. తల్లి పిల్లలను తిట్టి లేపినట్లు ఉష జనులను జాగృతము చేయుచున్నది. రాత్రి విటుని ఇంటికి పోయి ఉదయము తిరిగివచ్చు జారిణివలె ఉష ఉదయమున వికసించుచున్నది.

    5. సర్వవ్యాపియగు అంతరిక్షపు పూర్వార్థమున ఉష ఉదయించును. ఆమె దిశల జ్ఞానము కలిగించును. ద్యావా పృథ్వులు ఉషకు మాతాపితరులు. ఆమె వారి పక్కన నిలిచి సర్వమును తేజోవంతము చేయుచున్నది.

    6. ఉష విస్తరించును. ఆమె దేవతలకు, మానవులకు సుఖదృష్టి కలిగించును. ఆమెది నిర్మల దేహము. ఆమె ప్రకాశము అల్పవస్తువునుగాని, అనల్పవస్తువునుగాని విడువదు.

    7. తోబుట్టువులు లేని ఆడది పుట్టింటికి చేరినట్లు ఉష సూర్యుని చేరుచున్నది. వితంతువు జీవిక కొఱకు రాజాస్థానములకు చేరినట్లు ఉష సూర్యస్థానము చేరుచున్నది. భర్తవద్దకు వెళ్లు స్త్రీ మంచి దుస్తులు ధరించినట్లు ఉష తన రూపమును వెలిగించుచున్నది.

    8. చెల్లెలు వంటి రాత్రి అక్కవంటి ఉషకు అపరరాత్రిని దాటి అప్పగించి వైదొలగుచున్నది. ఉష సూర్యకిరణములచేత చీకట్లను పారద్రోలించి, లోకములను మెరుపుల మొత్తమువలె వెలిగించుచున్నది.

    9. పురాతన ఉషస్సులు సోదరీభావము కలవి. గడచిన దానిని అనుసరించి ప్రతిదినపు ఉషస్సు వచ్చుచున్నది. నవీన ఉషస్సులు కూడ గడచిన ఉషస్సులను అనుసరించి సత్కర్మానుష్టానము కలవి అగుచున్నవి. అవి మాకు సకల సంపదలు ప్రసాదించవలెను.

    10. ధనవతీ ! ఉషా ! హవిస్సులు అర్పించు మమ్ము మేల్కొలుపుము. ధనలోభము కలిగి మేల్కొనని మా శత్రువులను దీర్ఘనిద్ర పుచ్చుము. నీవు ఆయువు హరించుదానవు. యజమానికి ధన సమృద్ధి కలిగించుము.

    11. ఉష సకల వస్తువులందు చేరి తూర్పు దిక్కున వర్థిల్లుచున్నది. ఉష తన రథమునకు ఎర్రని గోవులను పూన్చుచున్నది. చీకట్లను పారద్రోలుచున్నది. సమస్తమును వెల్లడిచేయుచున్నది. ఇంటింట అగ్ని వెలుగొందుచున్నది.

    12. ఉష ఉదయించినది. పక్షులు గూళ్లు వదిలి ఎగురుచున్నవి. నరులు ఆహారాన్వేషణకు బయలుదేరుచున్నారు. యజమానులు యజ్ఞశాలలందు హవిస్సులు అర్పించుచున్నారు. ఉష వారలకు అధిక ధనము ప్రసాదించుచున్నది.

    13. స్తోతార్హులగు ఉషస్సులారా ! మిమ్ము రెండు సూక్తములందలి మంత్రముల స్తుతించినాను. మాకు అభ్యుదయమును, యాచకులకు అపరిమిత ధనములు ఇవ్వగలిగినంత ధనములను ప్రసాదించుము.

                   నూట ఇరువది అయిదవ సూక్తము

         ఋషి - కక్షీవంతుడు, దేవత - దానము, ఛందస్సు - త్రిష్టుప్.


    1. తనవద్దకు ఉదయమున వచ్చిన వారికి స్వనయుడు అను రాజు రమణీయ ధనములను ఇచ్చును. కక్షీవంతుడు ఆ ధనమును తండ్రికి అర్పించినాడు. అతడు ఆ ధనమును వృద్ధి చేసినాడు. పుత్రపౌత్రులను పోషించినాడు. జీవితమును పెంచుకున్నాడు. మంచి కొడుకులు కలిగి వర్థిల్లినాడు.

    2. పుత్రా ! ఆ రాజునకు నీవు ఉదయపు అతిథివి అయినావు. త్రాటితో మృగములను పక్షులను కట్టినట్లు ఆ రాజు నిన్ను ధనమున బంధించినాడు. అట్టి స్వనయుడు మంచి గోవులు, అశ్వములు, ధనసమృద్ధి కలవాడు కావలెను. ఇంద్రుడు అతనికి అధిక సంపద ప్రసాదించును.

    3. నిన్న ఉదయము ఈ రాజు నా పుత్రునకు ధనమును ఇచ్చినాడు. కర్మానుష్ఠాత అగు ఆ రాజును చూచుటకు ఈ ఉదయము అతని యజ్ఞస్థానమునకు వచ్చినాను. నాకు అందిన ధనముతో సోమము సిద్ధము చేసినాను. దేవతలారా ! సోమము స్వీకరించుడు. శత్రువులను నిరసించు, పుత్రపౌత్రాదులతో కూడిన ఆ రాజును ప్రియసత్యవాక్యములచే వృద్ధి చెందించుడు.

    4. గోవులు పాలను స్రవించుచున్నవి. సుఖములు కలిగించుచున్నవి. గోవులు యాగము చేయు వారిని, చేయబోవువారిని సుఖపెట్టుచున్నవి. జనులను సంతోష పెట్టువారిని జనులను రక్షించువారిని అన్న సమృద్ధి హేతువులగు ఆజ్యధారలు ఆనందపరచుచున్నవి.

    5. దేవతలకు హవిస్సులు అర్పించి వారిని ప్రీతులను చేసిన మానవుడు స్వర్గమును పొందుచున్నాడు. దేవతలమధ్య వర్తించుచున్నాడు. అతనికొఱకు జలము సారవంతమయి ప్రవహించుచున్నది. భూమి సస్యములను ఇచ్చుచున్నది. సర్వవేళల సంతోషపరచుచున్నది.

    6. దానము చేసినవారికే రమ్య వస్తువులు లభించుచున్నవి. దానము చేసినవారికే స్వర్గమున సూర్యానుగ్రహమువలన స్థానము లభించుచున్నది. దానము చేసినవారే మరణములేని వారు అగుచున్నారు. దానము చేసినవారే ఆయువును పొందుచున్నారు.

    7. దేవతలను తృప్తి పరచువారలకు దుఃఖకరమగు పాపము కలుగదు. దేవతలను స్తుతించువారు, వ్రతములు చేయువారికి వార్ధక్యము రాదు. ఈ ముగ్గురు కానివాడు పాపముల పాలగును. దేవతలకు యాగములు చేయనివారు కష్టముల పాలగుదురు.

                                      నూట ఇరువది ఆరవ సూక్తము

        ఋషులు - మొదటి 5-కక్షీవంతుడు; 6- బాయవ్యుడు; 7-రోమశ అను మహిళ;
               దేవత - దానము, ఛందస్సు - తొలి 5 త్రిష్టుప్, మిగిలినవి అనుష్టుప్.

    1. స్వనయుడు సింధు దేశపు రాజు. అతనిని అన్యులు హింసించలేరు. అతడు నాకు వేయి సోమయాగముల కీర్తిని కలుగజేసినాడు. అట్టి రాజు కొఱకు సుమనస్కుడనయి మంచి స్తుతులను కూర్చుచున్నాను.

    2. స్వనయుడు ధనదాత. అతనిని నేను యాచించినాను. అతడు కక్షీవంతుడనునాకు అతని సమస్త ఆభరణములను ఇచ్చినాడు. శుద్ధములు, శుభలక్షణములుగల అశ్వములనిచ్చినాడు. అతని నుండి యజ్ఞములు స్వీకరించినాను. ఆవిధముగా స్వనయుని కీర్తి ద్యులోకమున శాశ్వతము అయినది.

    3. స్వనయుడు కపిలాశ్వములు పూన్చిన, స్త్రీలు కూర్చున్న పది రథములను ఇచ్చినాడు. అరువదివేలకు మించిన గోసముదాయము రథములవెంట సాగినది. కక్షీవంతుడు మరుసటి రోజే వాటిని అన్నింటిని తన తండ్రికి అర్పించినాడు.

    4. పది రథములు వేయిమంది సేవకులు గల గోసమూహము ముందు నలుబది ఎర్రగుఱ్ఱములు వరుసకట్టిసాగినవి. తదుపరి కక్షీవంతుని సేవకులు గడ్డి మొదలగు వానితో సాగినారు.

    5. మా బంధువులు అన్యోన్య అనురాగము గలవారు. ఐకమత్యము గలవారు. హవిస్సులను ఇచ్చువారు. అంగిర వంశస్థులు. మొదటి దానమును అనుసరించి ధనము నిండిన పదకొండు రథములను బంధువుల కొఱకు గ్రహించినాను.

    6. నా భార్య రోమశ సంభోగార్హురాలు. నేను ఆమెను ప్రియముగా పరిగ్రహించినాను. బిడ్డను కన్న ముంగిసవలె విడువరానిది. ఆమె నాకు అనేక సంభోగములను ఇచ్చుచున్నది.

    7. నాధా ! నేను గాంధార దేశపు గొఱ్ఱెవలె రోమములు కలిగి, సంపూర్ణురాలనయి ఉన్నాను. నా అవయవములు అల్పములు అని తలంచకుము. నన్ను సమీపించుము. నన్ను తాకుము.

               (ప్రథమ మండలమున పదునెనిమిదవ అనువాకము సమాప్తము)

         పందొమ్మిదవ అనువాకము - నూట ఇరువది ఏడవ సూక్తము
        ఋషి - పురుచ్చేపుడు, దేవత - అగ్ని, ఛందస్సు - అత్యష్టి.


    1. అగ్ని యజ్ఞనిర్వాహకుడు, దేవతలను పూజించువాడు. సమర్ధుడు. హోమము చేయునపుడు నేతి హవిస్సుల సహితముగా జ్వలించువాడు. అగ్ని గొప్పదాత. సకలజనుల జీవ హేతువు. బలమునకు పుత్రుడు. ప్రజ్ఞావంతుడు. విప్రునివంటి మేధావి. దేవతలను ఆహ్వానించువాడు. అట్టి అగ్నిని స్తుతించుచున్నాను.

    2. అగ్నీ ! నీవు మేదావివి. ప్రకాశవంతుడవు. అంగిరో వంశజులందు ఉత్తముడవు. సర్వత్ర సంచరించువాడవు. సూర్యుని పోలినవాడవు. మానవుల కొఱకు దేవతలను పిలుచువాడవు. జ్వలించువాడవు. కామ్యార్థప్రదాతవు. అత్యంత పూజార్హుడవు. మేము ఋత్విజులము. నిన్ను మంత్రములతో ఆహ్వానించుచున్నాము. యజమానుల కోరికలు తీర్చుము.

    3. అగ్ని సంయోగమున కఠినములు, స్థావరము అయిన పర్వతాదులు ద్రవించును. అగ్ని ప్రకాశమానుడు. పరశు ప్రహారమువలె శత్రువును తెగనరుకువాడు. విలుకానివలె అగ్ని శత్రువును తిరస్కరించి విహరించుచున్నాడు. పారిపోవువాడుకాదు.

    4. దాతలు పరమార్థవేత్తకు ధనములు సమర్పింతురు. అట్లే యజమానులు అగ్నికొఱకు రసవంతములగు హవిస్సులు అర్పించుచున్నారు. అగ్ని అత్యంత తేజోవంతుడు. యజమానులకు స్వర్గాదులు ప్రసాదించుచున్నాడు. అగ్ని అనేక వస్తువులందు వృక్ష సమూహములందు ప్రవేశించుచున్నాడు. తన జ్వాలలతో వాటిని మసి చేయుచున్నాడు. అదేవిధముగా అగ్ని తన తేజమున పాపములను నిశ్శేషముగా నశింపచేయుచున్నాడు.

    5. పగలుకన్న అగ్నిరాత్రి ప్రకాశమానమయి ప్రజ్వరిల్లును. దర్శనీయుడగును. ఆయుష్మంతుడగు అగ్ని కొఱకు పగలు యజ్ఞవేదిక సమీపమున హవిస్సులు అర్పింతుము. తండ్రి గృహమును పుత్రుడు గ్రహించినట్లు అగ్ని హవిస్సులను గ్రహించవలెను. ఆహవనీయాది త్రేతాగ్నులు తనను పూజించువారిని రక్షించుచున్నవి. అగ్ని హవిస్సులు అందుకొని ముదిమిలేనివాడు అయినాడు. అతడు యజమానులను ముదిమిచెందనీయడు.

    6. వేదికలందు మరుత్తుల బలమువలె, అగ్ని అధికధ్వనితో ప్రజ్వరిల్లుచున్నాడు. అగ్ని పూజనీయుడు. సేనా విజయమునకు అర్చింపదగినవాడు. హవిస్సులు స్వీకరించు స్వభావము కలవాడు. యజ్ఞప్రకాశకుడు. ఆహుతులకు ఆనందించువాడు. యజమానులకు ఆనందప్రదాత. మానవుల సుఖప్రాప్తి కొఱకు మంచి మార్గమును అనుసరించినట్లు అగ్నిని అనుసరించుచున్నారు.

    7. భృగు వంశజులయిన ఋషులు ఐహిక, ఆముష్మిక ప్రాప్తి కొఱకు అగ్నిని నుతించుచున్నారు. నమస్కరించుచున్నారు. హవిర్దానము కొఱకు అరణిని మధించుచున్నారు. పాపరహితులు అగుచున్నారు. హోమద్రవ్యముల ధరించి జ్వలించునట్టి అగ్ని రత్నదాత అగుచున్నాడు. యాగప్రధానుడగు అగ్ని కొఱకు ఆజ్య యుక్తములయిన హవిస్సులను అందించుచున్నాము. ప్రజ్ఞావంతుడగు అగ్ని ఈ హవిస్సులను, ఇతర హవిస్సులను అందుకొనుచున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.