Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

                                                 ఆలోచనామృతము
    
    వేద వ్యాసుడు మానవ కళ్యాణ కర్త. గొప్ప సమాజ సంస్కర్త. అతడు భారత జాతికి చేసిన సేవ, గావించిన ఉపకారము అనంతము.
    ఒకవైపున రాజకీయ కల్లోలము అల్లకల్లోలము చేయుచున్నది. కుట్రలు, ప్రతి కుట్రలు , పన్నాగములు మిన్నుముట్టుచున్నవి. అట్టి సమయమున కూడ సమాజ కళ్యాణమునకు పధకము పరచినాడు వేదవ్యాసుడు.
    నరభక్షకులు ఒకజాతిగా బలసినట్లున్నారు. నేటికి నరభక్షకులు , కొన్ని ఖండములందు , అరుదుగా ఉన్నట్లు చెప్పుచున్నారు. నరభక్షకుల వలన మానవ జాతికి ముప్పు వాటిల్లినది. ఆ దురాచారము అంతమొందించు కార్యక్రమమున భాగముననే భీముడు హిడింబుని అడవికి వచ్చినాడు. హిడింబుని వధించినాడు.
    ఒకరిని అంతమొందించినంత మాత్రమున దురాచారము అంతమొందదు. సంస్కరణ అవసరము. అట్టి సంస్కరణలలోని అంతర్బాగమే హిడింబ పెండ్లి.
    హిడింబునిది ఆటవిక జాతి. అజాతికి పెండ్లిళ్ళు తెలిసినట్లు లేదు. రామాయణమందును ఆటవిక జాతి ఉన్నది. శూర్పణఖ ఆ జాతికి ప్రతీక. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి పంపించినాడు. వ్యాసుడు మరొక అడుగు ముందుకు వేసినాడు. హిడింబకు పెళ్ళి చేసినాడు. రాక్షస జాతిలో వివాహ వ్యవస్థను ప్రవేశ పెట్టి సంస్కరించుట వ్యాసుని సంకల్పము.
    ఈ రోజు మనము కులాంతర, మతాంతర వివాహములను గురించి ఆలోచించుచున్నాము. ఆనాడు వ్యాసుడు జాత్యంతర వివాహమును గురించి అలోచించి ఆచరించి చూపినాడు. అందుకు అతడు ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడో ఊహించవలసినదే.
    వ్యాసుడు హిడింబను సిద్దము చేసినాడు. ఏలననగా వ్యాసుని గురించి హిడింబకు తెలియును. వ్యాసుని శాలిహోత్రుని ఆశ్రమమునకు రాక కూడ ఆమెకు తెలియును. "పెండ్లి" దాని ప్రాముఖ్యతను హిడింబకు బోధించినాడు. ఒక మహత్కార్య,ము కొఱకు అన్నను వదులుకోను మహా త్యాగమును ఆమెలో ప్రతిష్టించినాడు . ఇది సామాన్యము కాదు. ఇది వేద వ్యాసుని ప్రజ్ఞా పాటవములకే కాక అతనిలోని అనంత తపనకు నిదర్శనము. అతడు ఒకే ఉపాయమున రెంటిని సాధించినాడు. నరభక్షకుని అంతము- హిడింబ వివాహము ద్వారా సంస్కారము.
    పాండవులు సుక్షత్రియులు. నరభక్షకుని చెల్లెలిని పెండ్లాడుటకు సమ్మతింపరు. ఆ విషయము వ్యాసునకు తెలియును. అందుకే ఆమె త్యాగమును కళ్ళ ఎదుట చూపినాడు. ఆమె ఉపకారమును చవి చూపించినాడు. అప్పుడే కుంతి మెత్తబడినది. భీముడు ఇంకను సంశయము కలిగియే ఉన్నాడు.
    అట్టి సమయమున వ్యాసుడు రంగప్రవేశము చేసినాడు. హిడింబ పేరు మార్చినాడు. కమలపాలికగా నామకరణము చేసినాడు. ఒక కొత్త వివాహ పద్దతిని ప్రవేశ పెట్టినాడు. పుత్రుడు కలుగునంతవరకే భర్త భార్యను ఉంచుకొనును. తరువాత వదిలివేయును. అప్పుడు భీముడు సమ్మతించినాడు.
    ఇంతటి మహా యత్నము తరువాత వ్యాసుని సంకల్పము సిద్దించినది.
    ఘటోత్కచుడు పుట్టినాడు. తల్లిని తీసుకొని వెళ్ళిపొయినాడు. అతడు రాక్షసుల మధ్యనే ఉందును అన్నాడు. బహుశా రాక్షసులను సంస్కరించుటకు , వివాహ వ్యవస్థను గురించి ప్రచారము చేయుటకు వ్యాసుడు అతనిని నియమించి యుండును.
    వ్యాసుని రచనా చమత్కృతి అనన్య సామాన్యము. అతడు ఒక్కొక్క పాత్రను సందర్భానుసారము ప్రవేశ పెట్టును. రానున్న ఒకానొక సన్నివేశమునకు బీజావాపన చేయును. అవసరమగునపుడే మరల ఆ పాత్ర కనిపించును. ఘటోత్కచుడు అట్టివాడే.
    హిడింబుడు వచ్చి అరచినాడు. హిడింబి వడకినది. భీముని చాటున నక్కినది. ఎంత అందమయిన కల్పన! బొమ్మ గీసి మనముందు ఉంచినట్లున్నది. దానికి ప్రాణము వచ్చి కదలివచ్చినదా అన్నంతటి సజీవ చిత్ర కల్పన!!
1. మహాత్ములకు సంతృప్తి లేదు. అది స్వవిషయమున కాదు మానవజాతికి సంక్షేమ విషయమున. మానవ జాతికి సుఖసంతోషములు కలిగించుటకు తమ జీవితములను కప్పురమువలె కరిగించినారు. పూర్వపరజన్మల వృత్తాంతము అట్టివానిలో ఒకటి.
    పూర్వజన్మమును గురించి పరిశోధనలు సాగుచున్నవి. దుష్టాంతములు కూడా కనిపించుచున్నవి. అది అట్లుండగా అందు గురించిన విశ్వాసము, వ్యక్తులను, సమాజమునకును ఎంతో ఉపకరించుచున్నది.
    మానవుని మంచివానిగా మార్చుటకు రాజదండము మాత్రము చాలదు. మనిషిలో సత్ప్రవర్తన కలిగించుటకు స్వచ్చంద సంస్థలు ఎంతో అవసరము. ఆ కాలమున అట్టి సంస్థలు చాల పనిచేసినవి. వాటికి వేదవ్యాసుడు ప్రధాన నాయకుడుగా కనిపించుచున్నాడు. అతడు ఇచట పూర్వజన్మమును గురించి ప్రస్తావించినాడు.
    పూర్వ జన్మ్జము ఉన్నది అని తెలియుట వలన ఈ జన్మమున తాను పడు భాధలకు పూర్వ జన్మమున తాను చేసిన హానియే కారణమని ఎరుగును. ఈ జ్ఞానము వలన ఈ జన్మమున ఇతరులకు బాధ కలిగించడు. ఒకడు మరొకని బాధ కలిగించినది. ఆదర్శ సమాజము. అట్టి సమాజమును గురించి అలోచించినారు మహర్షులు - ఆనాటి సామాజిక శాస్త్రజ్ఞులు.
    పర జన్మము ఉన్నదను విశ్వాసము కూడ ప్రయోజనకారి అగును. తాను ఈ జన్మమున మంచి చేసిన పరజన్మమున తనకు మంచి జరుగును. మానవుడు ఆశావాది. ముందు మంచి జరుగును అని తెలిసిన మంచివాడు కాగలదు. అందరు మంచి వారున్న అది ఆదర్శ సమాజము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.