Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

                                                 బకాసుర వధ
    
    పాండవులు శాలిహోత్రుని వద్ద పెక్కు ధర్మ శాస్త్రములు, నీతి శాస్త్రములు అభ్యసించినారు. ఆ మహర్షి అనుమతి పొందినారు. ఆశ్రమము వదలినారు. మత్స్య త్రిగర్త, కీచక దేశములు దాటినారు. వ్యాసుడు చెప్పిన రీతిగా ఏకచక్రపురమునకు చేరినాడు. వారు బ్రాహ్మణ బ్రహ్మచారుల వేషములు ధరించినారు. ఒక బ్రాహ్మణుని ఇంట ఉన్నారు. పాండవులు నిత్యము భిక్షకు వెళ్ళేవారు. అప్పుడు ఆ ఊరి జనులు వారి తేజస్సు చూచి ఆశ్చర్యపడినారు. "వీరు రాజ్యములు పాలించవలసిన వారు . భగవంతుడు వీరి ఎడల క్రూరుడు అయినాడు. భిక్షుకులుగా చేసినాడు" అనుకున్నారు. వారు నిత్యము బిక్ష తెచ్చువారు. తల్లికి ఇచ్చువారు. కుంతి బిక్షను రెండు భాగములు చేసెడిది. ఒక భాగము భీమునకు పెట్టెడిది. రెండవ భాగమును తాను, మిగిలిన నలుగురు పాండవులు పంచుకొని తినువారు.
    ఆ విధముగా కొంతకాలము గడచినది. ఒకరోజు భీముడు, కుంతి ఇంట ఉన్నారు. మిగిలిన పాండవులు భిక్షకు వెళ్ళినారు. అప్పుడు పాండవులు ఉన్న ఇంట పెద్దగా ఏడ్పులు వినిపించినవి. కుంతి ఆ ఏడ్పులు విన్నది. భీమునితో అన్నది :-
    "ఈ ఇంటి వారికి ఆపద వచ్చినట్లున్నది. నా మనసు పరితపించుచున్నది. మేలు చేసిన వారికి మేలు చేయుట మధ్యమము. మేలు చేసిన వారికి ఎక్కువ మేలు చేయుట ఉత్తమము. మేలు చేసిన వారిని గుర్తుంచుకొనుట పుణ్యము. ఈ ఇంటివారు మనకు మేలు చేసినారు. వారికి ఉపకారము చేయు ఉపాయము చూడుము."
    తల్లి మాటలు విన్నాడు భీముడు. కుంతిని పంపినాడు. వారి ఇల్లు కల్లోలముగా ఉన్నది. బంధువులు జనులు కూడినారు. అందరును దుఖించుచున్నారు. యజమాని కన్నీరు కార్చుచు బంధు జనులతో అన్నాడు:-
    "నా భార్యను రాక్షసునకు అర్పించలేను. ఆమెను అగ్నిసాక్షిగా పెండ్లాదినాను. ఆమె రక్షణ బాధ్యత నామీద ఉన్నది. నా కూతురును పంపలేను. ఆమె కన్య. ఆమెకు పెండ్లి చేసి పంపవలసిన బాధ్యత నామీద ఉన్నది. నా పుత్రుడు చిన్నవాడు. వాడు వృద్ది చెందవలె. కులమును రక్షించవలె. అతనిని పంపలేను. నేనే రాక్షసునకు ఆహారముగా పోయెదను.
    భార్య ఇట్లన్నది:-
    "ఆపద వచ్చినపుడు విచారించరాదు. ఎదిరించవలెను. నేను మీకు పుత్రులను ఇచ్చినాను. నారుణము తీరినది. నేను ఉన్నను పిల్లలను పోషించలేను. మిమ్ము వదలి నేను నిమిషమయినను జీవించలేను. జీవించినను లోకులు చులకనగా చూతురు. పురుషుడు మరల పెండ్లి చేసుకొనవచ్చును. స్త్రీ మరల పెండ్లాడిన లోకము దూషించును. కాబట్టి మీరు జీవించి ఉండి బిడ్డలను అభివృద్ధి చేయుదు. నేనే రాక్షసునకు ఆహారముగా పోయెదను."
    కూతురు ఇట్లన్నది:-
    "తల్లిదండ్రులారా! ఎంత కాలము ఉన్నను పరుల ఇంటికి పోవలసిన దానను. మీదానను కాదు. మీరు జీవించి ఉన్న బిడ్డలను పొందవచ్చును. నేనే రాక్షసునకు ఆహారముగా పోయెదను."
    ఇదంతయు చూచిన బాలుడు నేనే రాక్షసుని చంపుదును. అని కర్ర పట్టుకొని ఉరికినాడు. అంత దుఖమునను బాలుని మాటలు విని అందరు నవ్వినారు.
    కుంతి అది సాంతము విన్నది. వారిని ఒదార్చినది. అసలు కధ అడిగినది. వారు చెప్పిన కధ ఇట్లున్నది.
    అగ్రహారమున కొంత దూరమున యమునా నది ఉన్నది. దాని ఒడ్డున బకాసురుడు ఉండును. అతడు రాక్షసుడు. పూర్వము ఆ ఊరి మీద పడి ఇచ్చవచ్చినట్లు నరులను చంపి తినువాడు. జనక్షయము నుండి ఊరిని రక్షించదలచినారు గ్రామ పెద్దలు. బకాసురునితో ఒక ఒప్పందమునకు వచ్చినారు. ప్రతి నిత్యము ఇంటి వరుసన ఒక మనిషి రెండు దున్నపోతులు, కట్టిన బండి, దానినిండ ఆహారము , మాంసము తీసుకొని వెళ్లి అతనికి ఈయవలెను. అట్లు ఇచ్చిన వానిని అన్నింటిని బకాసురుడు భక్షించును. అందుకు ప్రతిగా ఏకచక్రపురమును రక్షించుచుండును. ఇంత వరకు ఆ రాక్షసుని చంపగల రాజులు పుట్టలేదు. ఈ రోజు ఆ ఇంటి వంతు వచ్చినది. రాక్షసునకు ఆహారముగా ఎవరు పోవలెనని మీమాంస జరిగినది.
    కుంతి అంతయు విన్నది. "అయ్యా! నాకు మీరు ఉపకారము చేసినారు. నాకు అయిదుగురు కొడుకులు. ఒకనిని ఆహారముగా పంపుదును. అట్లు మీ ఋణము తీర్చుకుందును." అన్నది.
    అందుకు యజమాని  అంగీకరించలేదు. "మీరు నాకు అతిధులు. అతిధిని అవమానించుట పాపము. చంపించుట మహాపాపము. కాబట్టి ఇందుకు నేను సంమతించను" అన్నాడు.
    "నా కుమారుడు బలవంతుడు సమర్ధుడు. అతడు ఇంతకూ ముందు రాక్షసులను చంపినాడు. నా కొడుకు బకాసురుని చంపి ఈ గ్రామమును కాపాడగలడు." అని భీముని పిలిచినది. జరిగిన విషయము చెప్పినది. బ్రాహ్మణుని ఆపద తొలగించవలసినదని ఆజ్ఞాపించినది. భీముడు సమ్మతించినాడు. బ్రాహ్మణులు ఎంతో సంతోషించినారు. భీమునకు జయము కలుగవలెనని ఆశీర్వదించినారు.
    భిక్ష నుండి తిరిగి వచ్చిన ధర్మరాజు జరిగినది విన్నాడు. తల్లిని ఆక్షేపించినాడు. "భీముడు లక్క ఇంటి నుండి మనలను రక్షించినాడు. హిడింబాసురుని బారి నుండి రక్షించినాడు. భీముని బలము చూచి దుర్యోధనాదులు వడకుచుందురు. దుఖాతిశయమున నీకు బుద్ది భ్రమ కలిగినది. అందువలననే భీముని పంపుటకు అంగీకరించినావు " అన్నాడు.
    అప్పుడు కుంతి "ధర్మజా! నీవు సకల ధర్మములు తెలిసినవాడవు. నన్ను ఆక్షేపించుచున్నావు. భీముని బలము తెలియక మాట్లడుచున్నావు. భీముడు పుట్టిన పదవనాడు నా చేయి జారి క్రిందపడినాడు. అప్పుడు నల్లరాళ్ళు చూర్ణమయినవి. భీముడు వజ్రకాయుడు. వజ్రాయుధుడుకూడ అతనిని జయించలేడు. మృత్యు భయమున ఉన్నవారిని కాపాడిన క్షత్రియులకు పుణ్య లోకములు కలుగునని వ్యాసుడు చెప్పగా వింటిని. కావున భీముని పంపి బకాసురుని చంపించుటకు నిశ్చయించినాను. నీవన్నట్లు నాకు బుద్ది భ్రమ కలుగలేదు." అన్నది.
    ధర్మరాజు తల్లి మాటలు విన్నాడు. ఆక్షేపించినందులకు నొచ్చుకున్నాడు. భీముని పంపుటకు అంగీకరించినాడు. బకాసురుని చంపుటకు భీముని నియమించినాడు.
    అంత ఆ ఇంటి బ్రాహ్మణులు భీమునకు భోజన పదార్దములు సమకూర్చినారు. పిండివంటలు రాసులుగ తెచ్చినారు. నేతికుండలు, బెల్లపుగడ్డలు, పెరుగు కుండలు తెచ్చి ఇచ్చినారు. భీముడు వాటిని అన్నింటిని అరగించినాడు. బలము పుంజుకున్నాడు. భాక్ష్యాన్నములు వేసిన దున్నపోతుల బండి మీద ఎక్కినాడు. ఉత్సాహమున దక్షిణదిశకు బయలుదేరి వెళ్ళినాడు.
    భీముడు బండితో యమునా నదీ తీరమునకు చేరినాడు. అతడు బకాసురుడు ఉన్న స్థలమునకు వెళ్ళలేదు. దూరమున దిగినాడు. బండి విప్పినాడు. అందులోని ఆహార పదార్ధములను తినుట సాగించినాడు. బకాసురుడు బండి కొఱకు నిరీక్షించినాడు రాలేదు. కొపగించినాడు. లేచి చూచినాడు. భీముడు కనిపించినాడు. ఉరికి వచ్చినాడు. భీముని వీపు మీద ఒక్క పోటు పొడిచినాడు. భీముడు అడరలేదు. బెదరలేదు. వెనుదిరిగి చూడలేదు. తినుట మానలేదు. బకాసురుడు పాల వృక్షమును పెరికినాడు. భీముని మీదకు వచ్చినాడు. భీముడు బండెడు పదార్ధములను తిన్నాడు. చేతులు దులుపుకున్నాడు. ఒళ్ళు విరుచుకున్నాడు. "ఒరే రాక్షసాధమా! నరమాంసము తిని క్రొవ్వినావు. అదంతయు కక్కింతును. మదము అణగింతును. పారిపోకుము. నిలువుము. యుద్దము చేయుము" అని రంకె వేసినాడు. మద్ది చెట్టు లాగినాడు. యుద్దము చేసినాడు. అట్లు వారు చెట్లతో కొట్లాడినారు. అక్కడి చెట్లన్నియు అయిపోయినవి. అప్పుడు మల్ల యుద్దమునకు దిగినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.