Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    మఱ్ఱిచెట్టునకు ఆనతి దూరమున లేత తీవల పొద ఉన్నది. దాని మధ్య ఒక మంటపము ఉన్నది. అందు "హిడంబుడు" అను రాక్షసుడు ఉన్నాడు. అతడు పాండవులను చూచినాడు. నరమాంసము తినవలేనని నోరూరింది. అతడు తన చెల్లెలు హిడింబను పిలిచినాడు. "వంట ఇంటికి కుందేలు వచ్చినట్లు మనుష్యులు ఇచ్చటికి వచ్చినారు. నీవు వెళ్ళి వారిని చంపి నాకు వండి పెట్టుము" అన్నాడు. ఆమెను తొందర పెట్టినాడు . పంపినాడు.
    హిడింబ సాగినది. ఒక చెట్టు చాటున ఆగినది. అచటి నుండి భీమున చూచినది. భీముని ఆకారము చూచినది. వలచినది. మనుజరూపము దాల్చినది. అందమయిన అతివ అయినది. ముందునకు వచ్చినది. స్త్రీలకు భర్త స్నేహమును మించినది లేదు. వేరు స్నేహములు వేయి అయినను దానితో సమానములు కావు. అందువలన వచ్చిన పని మరచినది . వయ్యారముగా నిలిచినది.
    భీముడు హిడింబను చూచినాడు. "ఓ చిన్నదానా! నీవెవ్వరిదానావు? ఇంత రాత్రి ఒంటరిగా సంచరించుట ఏమి? ఎచటికి వెళ్లుచున్నావు? వెంటనే వెళ్ళుము" అన్నాడు.
    "పురుష శ్రేష్టా! ఈ అడవి హిడింబునిది. అతడు నా అన్న. అనంత బలపరాక్రమములు గలవాడు. దేవేంద్రుడు సహితము అతనికి వెరచును. వీరు ఇంటిలో వలె ఆదమరచి నిద్రించుచున్నారు. నా అన్న నరభక్షకుడు. వారిని భక్షించగలడు."
    "నేను నిన్ను వలచినాడు. నన్ను కొట్టుకొనుము. వీరిని రక్షింతును. వేరొక సంకేత స్థలమునకు చేరుతును. నాకు మన్మధ బాధ కలిగినది. దానిని తీర్చుము. నీవే నాకు భర్తవు" అన్నది. జలజల కన్నీరు రాల్చినది హిడింబ.
    హిడింబ రాలేదు. హిడింబుడు కోపగించినాడు. మండిపడినాడు. అగ్ని శిఖవలె ఉరికి వచ్చినాడు. హిడింబను చూచినాడు. అజ్యము పోసినట్లు అయినది. "ఓసీ దుర్మార్గురాలా! నేను ఏమి చెప్పినాను? నీవు ఏమి చేయుచున్నావు?" అని అగ్గి కురిపించినాడు.
    హిడింబ అన్న మాటలు విన్నది. వడకిపోయినది. భీముని చాటునకు చేరినది. అది చూచినాడు. హిడింబుడు. గర్జించినాడు. భీముని మీదకు ఉరికినాడు. భీముడు వాని రెండు చేతులను పట్టినాడు. పడుకున్నవారికి నిద్రాభంగము కలిగించదలచలేదు. వానిని వన మృగమును ఈడ్చినట్లు కొంతదూరము ఈడ్చుకొని పోయినాడు.
    అక్కడ వారిరువురు పోరినారు. వారి పాదఘట్టనలకు చెట్లు కూలినవి. తీగలు వాలినవి. దుమ్ము లేచినది. వారి శరీరములను కప్పినది. అప్పుడు వారు మంచు బిందువులు పడిన పర్వతముల వలె ప్రకాశించినారు.
    హిడింబుడు తన రెండు చేతులతో భీముని కట్టినట్లు పట్టినాడు. విజయాతిరేకమున సింహనాదము చేసినాడు. అనాదమునకు కొండలు కొనలు ప్రతి ధ్వనించినవి. నిద్రించిన కుంతియు ధర్మరాజాదులును ఉలికి పడిలేచినారు. వారు ముందు హిడింబను చూచినారు. తరువాత భీమ హిడింబుల మల్ల యుద్దము చూచినారు. వారు ఆ రాత్రి సాంతము యుద్దము చేసినారు. తూరుపు ఎర్రవారినది. అప్పుడు అర్జునుడు "అన్నా! సంధ్యలలో  రాక్షసుల బలము పెరుగును. ఆటలాడకుము.అంతమొందించుము" అన్నాడు. అది విన్నాడు భీముడు. హిడింబుని రెండు కాళ్ళు పట్టినాడు. లాగినాడు. పడవేసినాడు. కాళ్ళు పట్టుకొని గిరగిర తిప్పినాడు. నేలకు కొట్టినాడు. హిడింబుని నోటి నుండి, చెవుల నుండి నెత్తురు కారినది. హిడింబుడు కూలినాడు. చచ్చినాడు.
    భీముడు నరభక్షుకుని వధించినాడు.
    పాండవులు అక్కడి నుండి బయలుదేరినారు. వారితో హిడింబయు సాగినది. భీముడు ఆమెను వారించినాడు. ఆమె కన్నీరు కార్చినది. కుంతీదేవితో ఇట్లన్నది.
    "అమ్మా! కామము ప్రాణి సహజము. అయినను స్త్రీల విషయమున అది అధికము. నాకు భీముని యందు కామము కలిగినది. అందువలన నా అన్నను , బంధువులను వదులుకున్నాను. నా ఇష్టము తీరకున్న ప్రాణములు వదలుదును. నాకు దివ్యదృష్టి ఉన్నది. జరుగ్నున్నవి చెప్పగలను. ఈ మార్గమున ముందు ఒక సరస్సు ఉన్నది. ఒక వృక్షము ఉన్నది. అది శాలిహోత్రుని ఆశ్రమము. అక్కడికి వెళ్ళిన వేద వ్యాసుడు రాగలడు."
    కుంతి హిడింబ మాటలు విన్నది. ఆమెకు నమ్మకము కలిగినది. ఆమెను భార్యగా స్వీకరించవలసినదని భీముని కోరినది. భీముడు సమ్మతించినాడు. వారు శాలిహోత్రుని ఆశ్రమమునకు చేరినారు. అప్పుడు వేదవ్యాసుడు అక్కడికి వచ్చినాడు. అతడు తేజోవంతుడు. మహాజ్ఞాని.
    పాండవులు వేదవ్యాసుని చూచినారు. నమస్కరించినారు. అర్ఘ్యపాద్యములు ఇచ్చినారు. ఆసనము అర్పించినారు. వేదవ్యాసుడు కూర్చున్నాడు అన్నాడు :-
    "దుర్యోధనుడు దుర్మార్గుడు. పాపాత్ముడు. దుష్టులను ఎన్నటికి నమ్మరాదు. మీకు మేలు చేయగోరి నేను వచ్చినాను. మీకు పూర్వజన్మ ఫలితమున బంధు విరోధము కలిగినది. అందుకు దుఃఖించరాదు. ముందు ముందు మీకు మేలు కలుగును. ఈ సరస్సు నందలి జలము త్రాగు వారికీ ఆకలి దప్పులు ఉండవు. ఈ వృక్షము కింద ఉన్నవారికి శైత్య, వాత, వర్ష , ఆతప భయములు ఉండవు. మీరు కొంతకాలము ఇక్కడ నివసింపుడు. తరువాత ఏకచక్రపురమునకు వెళ్ళుడు. మరల నేను మీవద్దకు రాగలను."
    "మీ వెంట వచ్చిన హిడింబ పతివ్రత. ఈమె పేరు నేటినుండి కమలపాలిక. ఈమెను భీముడు వివాహమాడవలెను. ఈమెను భీముని వలన పుత్రుడు కలుగును. అతడు మీకు ఆపదలందు సాయము చేయగలడు."
    అట్లని చెప్పి వ్యాసుడు అంతర్ధానుడు అయినాడు.
    భీముడు హిడింబను భార్యగా స్వీకరించినాడు. ఆమెకు పుత్రుడు కలుగు వరకు ఆమెతో ఉండునట్లును, తదుపరి ఆమెను వదలివేయునట్లును నియమము ఏర్పరచినాడు. భీముడు కమలపాలిక పగలంతయు అడవులందు, కొండలందు విహరించినారు. రాత్రులు పాండవుల వద్ద ఉండి వారిని రక్షించినారు.
    అట్లు కొంత కాలము గడిచినది. కమలపాలిక సద్యోగర్భము కలిగి పుత్రుని కన్నది. అతని ముఖము భయంకరముగా ఉన్నది . నేత్రములు వికారములు. నల్లని దేహము భయంకరములయిన కోరలు కలిగి వికార రూపము కలిగి ఉన్నాడు. అతడు కామరూపధరుడు. సకల శస్త్రాస్త్రవిద్యలందు సమర్ధుడు.
    ఘటోత్కచుడు పాండవులకు పెద్ద కొడుకు. వారు అతనిని గారాబము చేసినారు. ఘటోత్కచుడు కొంతకాలము పాండవుల వద్ద ఉన్నాడు. ఒకనాడు వారికి నమస్కరించినాడు అన్నాడు :-
    "తండ్రులారా! నేను వెళ్ళేదను. రాక్షసులతో కలిసి ఉండేదను. మీకు నాతొ పని ఉన్న నన్ను తలంపుడు. నేను మీ వద్ద వచ్చివాలుదును" అని కుంతీ వద్దను, పాండవుల వద్దను సెలవు తీసుకున్నాడు. తల్లి కమలపాలికతో ఉత్తర దిక్కునకు వెళ్ళిపొయినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.