Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    కాలూకు సిల్కుగుడ్డమీద చక్కగా చిత్రించి గోడకు తగిలించి ఉన్న ద్విపద కనిపించింది. "చిత్రలేఖనకు జరిగిన ప్రేరణ పద్యరచనకు జరిగిన లాంటిదేనా" అని అడిగాడు కాలూ. పద్యరచన వెనుక ఉన్న చరిత్రంతా కాలూకు తెలుసు.
    ప్రశ్నవిని మోతీచంద్ 'హహ్హహ్హ' అని నవ్వాడు.
    మళ్ళీ సంభాషణ ప్రారంభిస్తూ "కుడిచేతితో ఇచ్చేదానం ఎడమచేతికి తెలియకుండా ఉండాలనే నైతిక నియమం గలవాన్ని" అన్నాడు. అంతటితో ఆపి ఏదో ఆలోచిస్తూ తలవంచి కాగితంమీద వ్రాశాడు.
    "బోర్డు వారివల్ల ఏమీ జరక్కుండా చూస్తారుకదూ?" కాలూ అడిగాడు.
    మోతీచంద్ ఏదో ఆలోచనలో మునిగి మాట్లాడలేదు.
    మోతీచంద్ భావాన్ని కనిపెట్టిన కాలూ కూడా నోరు కదపలేదు. అలాగే ఒక నిముషం గడిచింది. ఆ తరువాత మాట్లాడ్డానికి కాలూ గొంతు సవరించుకుంటూ ఉండగా మోతీచంద్ అడ్డుతగిలి "ఎందుకూ నీ కూతురు అలా ఉంటుంది?" అని అడిగాడు.
    కాలూ బిత్తరపోయి "లేఖా?" అన్నాడు.
    "అవును. ఆమె అంత నీరసంగానూ, పేలవంగానూ ఉంటుందెందుకు? ఆమెకేం జబ్బు?"
    "చంద్రలేఖాకా? జబ్బా?"
    "అబ్బే అంత పెద్ద జబ్బేమీ లేకుండవచ్చు. ఊరికే టానిక్ ఇస్తే సరిపోవచ్చు. అయినా జాగ్రత్తపడ్డం మంచిది."
    కాలూ కలవరపడ్డాడు. లేఖ నిజంగానే జబ్బుపడ్తే? ఒకసారి ఆమెకు జ్వరం వచ్చినప్పుడు రోజులతరబడివెలుగు కనిపించని గాడాంధకారంలో ఉన్నట్లనిపించింది. లేఖ నీరసంగావుందా? ఆమె ఎప్పుడూ అట్టేబలంగా ఉండలేదు.
    "డాక్టరు స్టీవెన్సుకు చూపండి. అతడు గవర్నరుకు డాక్టరు."
    "గవర్నర్ డాక్టరే!" క్షణంపాటు తన కొత్తహోదా మరిచిపోయాడు.
    "అతన్ని పిలిపిస్తా. ఏమంటారు?"
    లేఖ చిక్కిపోతూంది. అప్పుడప్పుడూ నీరసించినట్లు తూలిపోతూంది.
    "మాట్లాడరేం?"
    "అంతపెద్దవారు. మా పేదల ఇంటికి వస్తారా?"
    మోతీచంద్ నవ్వాడు.
    "వినండి. సాయంకాలం మీ ఇంటికి వస్తాను. చంద్రలేఖను చూసి ఆమెవంట్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తరువాత ఆ ఇంగ్లీషు డాక్టర్ను గురించి ఆలోచించవచ్చు." టెలిఫోన్ మ్రోగింది. రిసీవర్ ఎత్తేముందు "ఆ పాలగొడవను గురించి మీరేమీ విచారపడకండి. మీకు అనుకూలంగా నిర్ణయం జరిగేట్టు బోర్డు సభ్యులకు నచ్చచెబుతా" అన్నాడు.
    
                                *    *    *
    
    సిల్కు బట్టమీద చిత్రించబడిన ద్విపదకు మోతీచంద్ సతీమణులతో సంబంధం ఉందనే విషయం కాలూకు తెలియంది కాదు. అసలు అతని అర్ధాంగుల్ను గురించి తెలియని వాడంటూ ఆ మహానగరంలో ఉంటేనా? మోతీచంద్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవడం జనానికి ఆశ్చర్యకారణం అయింది. భార్య బ్రతికి ఉండగా ఇంకొక పత్నిని తెచ్చుకోరాదనే నీతి అతనికి మాత్రం వర్తించదని వారికి తెలిసిపోయింది. అదీ అతని నైతిక నియమం! అతడు ఖచ్చితమైన నైతిక నియమంగలవాడు కాబట్టి వంగదేశం మొత్తంలోనూ నలుగురు భార్యలు కలవాడనే పేరు అతడొక్కడే దక్కించుకున్నాడు.
    మోతీచంద్ కు ఇరవై ఏండ్లైనా  నిండకుముందే మొదటి పెళ్ళాం వచ్చింది. ధనమూ, పలుకుబడీ వీటికోసం జరిగిన పోరాటంలో అతనికి ఆమె అన్నివిధాలా అండగా నిలిచింది. అప్పుడు మోతీచంద్ స్టాకు బ్రోకర్ల గుమాస్తాగా పనిచేత్శూ ఉన్నాడు. గ్రాహకుల డబ్బుతో స్వయంగా సట్టావ్యాపారంచేసి 25వ సంవత్సరానికల్లా దివాలాతీసే ఏర్పాట్లన్నీ చేశాడు. ఇవ్వాల్సిన అప్పులన్నీ రద్దయినాయి. ఆవిధంగా బజార్లో ఇవ్వాల్సిన అప్పులు ఉండకపోగా చాటుగా దాచిన డబ్బుకూడా మిగిలింది. ఒక దశాబ్ధంపాటు అతని జీవితం ఒడుదుడుకుల్తో గడిచింది. అతనిమీద అదృష్టాల దొంతర్లు పడ్డట్లే భార్యమీద వ్యాధులు దొంతర్లు దొంతర్లుగా పడ్డాయి. వ్యాధికానిదల్లా గొడ్రాలితనమే. నోములూ, వ్రతాలూ, ఉపవాసాలూ, ఉప్పిళ్ళూ అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయింది. అది ఆమెకర్మ. అంతే. గతజన్మలో ఏగర్భిణీ స్త్రీనో పీడించి ఉంటుంది. ఆ పాపం ఈ జన్మలో ఇలా బాధిస్తూంది.
    అనాదిగావస్తూ ఉన్న తన వంశాన్ని నిలపెట్టుకోవాలనే విచారం ఆమెకు కుంగతీసింది. మోతీచంద్ కూడా ఆమె బాధలో భాగంపంచుకున్నాడు. అతనివంశం మేవాడ్ రాణి అయిన పద్మినినుంచి వచ్చిందని అతడు చెప్తూ ఉంటాడు. పద్మిని ప్రపంచ ప్రమదాగణంలో ప్రప్రథమురాలు. ఆమె అందాన్నిచూసి మోహించిన ఒక పఠాను అచ్చంగా ఆమె కోసమే మేవాడ్ మీద దండెత్తాడు. దుర్గం శత్రువశం అయింది. ప్రాణాలకు సహితం తెగించిన పద్మిని శత్రువుతో హోరాహోరీ పోరి శత్రువులచేతుల్లో పడదల్చుకోక అయిదువందలమంది అందకత్తెలైన సహచారిణుల సహితంగా అగ్నిప్రవేశంచేసి ఆత్మార్పణం చేసింది. అలా ఆత్మార్పణంచేసిన అయిదువందల నారీమణుల్లోనూ సౌందర్యంలో పద్మినికి తుల్యంఅయిన యశోదకూడా ఒకతి. ఆమె మోతీచంద్ వంశీయురాలు.
    మోతీచంద్ వంశానికి అతడొక్కడే దీపాంకురం. ఇతరబంధువుల్లేరు. సంతనం అందులోనూ పురుషసంతానం - లేకుంటేవేయి సంవత్సరాల వంశచరిత్ర మట్లోకలిసిపోతుంది.
    ఆత్మార్పణంచేసి ఆకాశంలో ధృవతారగా వెలుగుతున్న మోతీచంద్ పూర్వీకురాలు పేరు అతనిభార్యకు రావడం వట్టిసందర్భవశమేనా? యశోధ, పేరుకుతగినట్లు ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకేఒకమార్గం. మార్గాంతరంలేదు. మోతీచంద్ కు మరో భార్య. ఆమె కన్నీటితో "ఇంకో పెళ్ళాన్ని చేసుకొని సంతతి నిలబెట్టమని" భర్తను ప్రార్దించింది. తన సవతికి కలిగిన సంతానం తనకుకలిగినట్లే అవుతుంది. ఆవిధంగా ఆమె వంధ్యాత్వం అంతమొందుతుంది.
    తనకు కష్టంలేనట్లు మీసాలు మెలివేస్తూ "ఊహుఁ, అదెలా కుదురుతుంది?" అన్నాడు.
    అతని ముఖంలో కనిపించిన అంగీకారసూచనలు ఆమెగుండెలో బాకుల్లా గుచ్చుకున్నాయి. అయినా ఆమె అతన్ని బ్రతిమిలాడి అందుకు అంగీకరింపచేయాలి.
    ఆమె భర్తచేయి పట్టుకుని "అయితే వినండి......" అని బ్రతిమిలాడింది.
    అదీ ఆ దంపతుల్నుగురించి జనం చెప్పుకునేవిధం. అసలు విషయాలు అందరికీ తెలిసినవే. వివరాలు ఊహామాత్రాలు.
    మోతీచంద్ నైతికవిలువలు తెలియనివాడంటూలేడు. ఆ విలువలు అతన్ని చూస్తూచూస్తూ ఎలా దిగజారనిస్తాయి? ఆ విలువలు అతనికి ఒకేసారి ఇద్దరు పెళ్ళాలు ఉండడానికి అంగీకరించవు. అంతేకాక ఆ రోజుల్లో 'హిందూలా' విడాకులకు కూడా అంగీకరించేదికాదు.
    మోతీచంద్ చాతుర్యం అతన్ని కాపాడింది. వంశవృక్షాన్ని పచ్చగా ఉంచడానిగ్గాను పాతకాలంనాటి వెధవశాసనాలకు ఎందుకు కట్టుబడి ఉండాలి? తాను స్వయంగా ఒక న్యాయస్థానం ఏర్పర్చి తన స్వంత శాసనం ప్రకారం తీర్పుచెబుతే సరిపోతుంది.
    అతడు తీర్పుఇచ్చేశాడు. అతని తీర్పుప్రకారం యశోద దూరంగా స్వగ్రామంలో ఉండిపోతుంది. యావజ్జీవితమూ ఆమెకు సుఖంగా గడిచేంత బత్తెం ఏర్పాటుచేస్తాడు. ఏకపత్నీత్వంమీదగాఢ విశ్వాసం గల మోతీచంద్, అతని సౌభాగ్యానిగ్గాను దూరగ్రామంలో నివసిస్తూ ఉన్న ప్రథమపత్ని విషయంలో ఉదారంగా ప్రవర్తించకుంటే ఎలా? ఎన్నడూ కనీవినీఎరుగని ఈ పద్దతిని చూసినజనం యశోదపడే మనోవేదనగురించి అంచనావేస్తూ ఉండేవారు.
    ఆవిధంగా మోతీచంద్ ఇంటికి ద్వితీయపత్ని వచ్చింది. పెళ్ళి తరువాత మూడోఏట కొడుకు పుట్టాడు. మోతీచంద్ సంపద పెరుగుతూంది. పైగా వంశాంకురం జన్మించింది. అయితే జీవితం పూలబాటకాని వెన్నెలవాకకానికాదు. అతని రెండో భార్య రోగిష్టి. కొడుకు పుట్టగానే ఆమె మంచంపట్టింది. రోగం ఆమెను తినేస్తూంది.
    మోతీచంద్ అదిరిపోయాడు. తన వంశాంకురం అమూల్యం అయింది. తన జీవితంకూడా అంతే. ఆ జాడ్యం తనకు అంటుకుని తనను తినేస్తే తన కుటుంబాన్ని ఎవరూ పోషిస్తారు? మళ్ళీ అతని నైతికవిలువలు అతనికి సహకరించాయి. నిర్లక్ష్యంగా నిర్ణయం జరిగిపోయింది. మళ్ళీ తన స్వంతన్యాయస్థానంలో స్వంతశాసనం ప్రకారం తీర్పు జరిగిపోయింది. రెండోభార్య పుట్టింటికి వెళ్ళింది. బత్తెం ఏర్పాటైంది.
    మళ్ళీ అతడు ఏకపత్నీత్వ నియమరక్షణకుగాను పెళ్ళిచేసుకున్నాడు.
    తృతీయ కళత్రంతో ఎనిమిది ఏండ్లు గడిచాయి. ఒక కొడుకూ, కూతురూ కలిగారు. మోతీచంద్ నగరంలోని ధనాడ్యుల్లో ఒకడు అయిపోయాడు. అతని పెద్దగుమాస్తా ఠాకూర్ దాస్ బిడ్డనుచూసిందాకా అంతా సవ్యంగానే నడిచింది. దీపావళిపండుగనాడు ఆత్మీయతాచిహ్నంగా మోతీచంద్ గుమాస్తాలందరికీ విందు చేస్తున్నాడు. అప్పుడు ఇతరస్త్రీలతోసహా లోపలికివెళ్తూ ఉండిన ఠాకూర్ దాస్ సొగసుకుమార్తె అతని కంటపడింది. ఆమె కంటికి కనిపించకుండా పోయినా మోతీచంద్ కళ్ళు ఆటేనిల్చిపోయాయి. నోరు పెకల్లేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.