Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda


 
    4. అతిగ్రాహ్య పాత్రలు పంచజనులకు హితకరములు. ఆగ్నేయైంద్ర సౌర్యాఖ్యములగు అతిగ్రాహ్యములు వీనికి ప్రకృతులు. వీని ప్రభావముననే ద్యులోకమున పుట్టిన మేఘము వర్షాభిముఖము అగును. దవడలు వంటి అంచులు గల అతి గ్రాహ్యములు పూరించుటకు అన్నము వంటిదియు, బలము నిచ్చునదియునగు సోమమును గ్రహించుచున్నాను.

        (నాలుగవ అతి గ్రాహ్యమును గ్రహించవలెను.)

    5. చరమగ్రాహ్యమా! సోమము ఉదకరసము. ఉద్భూత అన్నము. సూర్యునిచే పక్వము చేయబడినది. గాయత్రి ద్యులోకము నుండి తెచ్చినది. సోమలత సారమైనది. అట్టిదానితో నిన్ను నింపుటకు - సోమమును - గ్రహించుచున్నాను. ఇది నీకు స్థానమగును. ఇంద్రుని కొరకు నిన్ను ఈ ఖర స్థానమునకు చేర్చుచున్నాను.

    (అయిదవ అతిగ్రాహ్యమును గ్రహించవలెను.)

    6. ప్రజాపతి ఇచట ఉన్నాడు. కర్మలను జరిపించుచున్నాడు. చక్కని కర్మఫలములకు విశాల ద్వారమగుచున్నాడు. ఆ ప్రజాపతి మాకు మధువు వంటి కర్మ ఫలమును కలుగచేయవలెను. మావద్దకు చేరుకొనవలెను. ప్రజాపతి తనను మాయందు చేర్చుచున్నాడు. కావున మేము కర్మ ఫలమును పొందుట నిశ్చయము.

    ఉపయామగ్రహీతోసి ప్రజాపతయే త్వా జుష్టం గృహ్ణామేషతే యోనిః ప్రజాపతయేత్వా|

    ప్రజాపతి దేవతాకమగు 17 గ్రహముల సముదాయమా! నీవు ప్రజాపతికి ప్రియమవు. ప్రజాపతి కొరకుగాను నిన్ను - నీ స్థానమగు ఖర ప్రదేశమున - ఉంచుచున్నాను.

                              పదమూడవ అనువాకము

                                (యాజ్యా పురోనువాక్యలు.)

    1. చైత్రాది మాసములు ఇంద్రుని అనుసరించినవి. అవి మమ్ము అనుగ్రహించవచ్చినవి.

    వనములు, ఓషధులు, పర్వతములు, మమ్ము అభిలషించు రోదసి, జలములు, ఇంద్రుని అనుసరించునవి. అవి మమ్ము అనుగ్రహించవచ్చినవి.

    2. ఇంద్రా! నీవు యాగములందు ఉద్దేశించబడిన వాడవు. నీవు వృత్రుని వధించినావు. తదనంతరము నీకు బలము కలుగుటకు - క్షాత్రము కొరకు - వైరి తిరస్కార శక్తి కొరకు - గొప్పవాడైన నీ కొరకు యాగములందు హవిస్సులను అగ్ని మున్నగు దేవతల అనుక్రమమున సమర్పించుచున్నాము.

    3.  స్త్రీలలో ఇంద్రుని భార్య పతివ్రతయని విన్నాను. మరొక విషయము ఇంద్రాణి భర్తకు వార్ధక్యము మరణము లేకున్నవి.

    4. ఇంద్రాణీ! సోమ పురోడాశాదులు నీట పుట్టినవి. అవి దేవతలకు అందించవలసి ఉన్నది. కాని నేను నీకు ప్రియమైన ఇంద్రుని తప్ప ఇతర దేవతలను కీర్తించుటయే లేదు.

    5. ఇంద్రుడు పుట్టినంతనే ముఖ్యుడు అయినాడు. ధైర్యవంతుడు అయినాడు. వృత్రుని వధించుట వంటి పనులు చేసినాడు. అగ్న్యాది దేవతలను అతిక్రమించినాడు. ఇంద్రుని బలమునకు ద్యావాపృథ్వులు గడగడలాడినవి. అటువంటి ఇంద్రుడు - తన బల మహిమచే - మిమ్ము రక్షించునుగాక.

    6. ఇంద్రా! నీవు ఉగ్రుడవు. నీ రక్షణలు పటిష్ఠములు. నీ అనుగ్రహము కలిగినది. మా సేనలు శత్రువులతో యుద్ధము ప్రారంభించినవి. నీవు నరులతో చేరినపుడు నీ చేతులందలి కరవాలాదుల కాంతులు సర్వత్ర వ్యాపించుచున్నవి. నీ మనసు బహుముఖము కాకుండును గాత. మాయందే ఉండునుగాక.

    7. ఇంద్రా! నీవు మమ్ము - మా ప్రజలను జగడాలమారులను చేయకుము. నీవద్ద - నీకు హవిస్సునిచ్చు - యాజమానికి ఇచ్చుటకు కూడ పెట్టిన ధనమున్నది. దానిని తెచ్చి మా కొసంగుము. ఈ యజ్ఞము నవీనము. నీకు దాన సాధనము. ప్రశస్తము. ఇందు మేము స్తోత్రములచే నుతించుచున్నాము. ప్రార్థించుచున్నాము.

    8. ఇంద్రా! నీవు ధనవంతులకు ధనపతివని విన్నాము. కావున నీవు ధనముతో విచ్చేయుము. ఈ ధనము అన్యులకు చేరరాదు. నీవు హర్యశ్వములమ్,మీద ధనము తెమ్ము. మాకిమ్ము.

    9. ప్రదాత అయిన ఇంద్రుని హవియుక్తులమైన మేము ఆహ్వానించుచున్నాము.

    ఇంద్రా! నీవు రెండు చేతులందు ధనము నింపుకొని రమ్ము. మాకు కుడి, ఎడమ రెండు చేతులతో ధనము నిమ్ము.

    10. ఇంద్రా! నీవు దానగుణము కలవాడవు. వజ్రాయుధము కలవాడవు. వర్షించువాడవు. శత్రుంజయుడవు. బలవంతుడవు. ప్రకాశించువాడవు. వృత్రహంతవు. సోమపాయివి. నీవు యజ్ఞమునకు విచ్చేయుము. వేది మీద దర్భలు పరిచినాము. ఆసీనుడవు అగుము. మాకు సుఖములను కలిగించుము. దుఃఖములు తొలగించుము.

    11. ఇంద్రుడు మాకు గట్టి రక్షకుడు. ధనవంతుడు. సుఖదాయి. అతడు మా సపర్యలు మున్నగు వానిని గ్రహించవలెను. ఇంద్రుడు మమ్ము బాధించు శత్రువులను ద్వేషించును. అతడు మాకు అభయము నీయవలెను. మమ్ము శత్రు పరాభవ సమర్థులను చేయును గాత.

    12. మేము ఇంద్రుని సుమతియందును, మంగళకరమగు సుమనస్సునందును నిలుతుము గాత. ఇంద్రుడు చక్కని రక్షకుడు, ధనవంతుడు. మేము అతనికి హవిస్సులు అర్పించు వారలము. అతడు మమ్ము ద్వేషించు శత్రువును దూరదేశముననే నిలిపి ఉంచును గాత.

    13. జలములు సంపన్నములు. మాకు సంతసము కలిగించునవి. ఎంతో అన్నము కలవి. మేము అట్టి ఉదకములను స్తుతించుచున్నాము. ఆనందించుచున్నాము. మాకు స్వామియగు ఇంద్రునకు జలములు సుఖప్రదములు అగును గాత.

    14. "ఇంద్రుడు అరిభయంకరుడు. యుద్ధములందు ఎదుటివానితో పోరును. వానిని హతమార్చనుంకించును. అయినను తడబడడు. స్థిరముగా నుండును. పారిపోడు"

    అట్లని ఇంద్రుని రథము ఎదుట ఇంద్రుని అర్చించవలెను. ఆ విధముగ పూజింపబడిన ఇంద్రుడు మాకు ఇతర వ్యావృత్తికి ప్రేరకుడై సావధానుడు అగును గాత. శత్రువుల ధనుస్సుల అల్లెత్రాళ్లు తెగిపోవును గాక.


            శ్రీమదాంధ్రవచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 
            మొదటి కాండమునందలి ఏడవ ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.