Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    14. అను మరియు ద్రుహ్యుల గోవులను పొందగోరిన 66వేల 66మందిని సేవాభిలాషి సుదాసునికొఱకు హతమార్చినాడు. ఇవన్నియు ఇంద్రుని ప్రతాప సూచికలు.

    15. దుష్టమిత్రులుగల మూర్ఖులు తుత్సు జనులు ఇంద్రునితో యుద్ధమునకు దిగినారు. తాళజాలక పలాయనమునకు సిద్ధపడినారు. పల్లమునకు పారునీటివలె పారినారు. కాని వత్తిడికి తట్టుకొనలేక సకల భోగ్య పదార్థములను సుదాసునకు వప్పగించినారు.

    16. శూరుడగు సుదాసుని హింసించు వారిని ఇంద్రశూన్యలగు హవ్యదాతలను ఉత్సాహవంతులను ఇంద్రుడు నేలకరిపించినాడు. అతడు క్రోధుల క్రోధమును తలక్రిందులు చేసినాడు. దారినపోవు సుదాసుని శత్రువులు పలాయనం చిత్తగించినారు.

    17. అప్పుడు ఇంద్రుడు దరిద్రుడగు సుదాసునితో ఒక కార్యము చేయించినాడు. అతడు సింహమును మేకతో చంపించినాడు. సూదితో యూపపుకొన కోయించినాడు. ధనమంతయు సుదాసునకు ప్రదానము చేసినాడు.

    ("తాన్యేతాని త్రీణి కర్మాణి" అసంభావితానితి నా శంకనీయాని ఇంద్రస్య మహివెన్నాధికత్వాదితి శాయణవ్యాఖ్య)

    18. ఇంద్రా ! నీశత్రువులలో అధికాంశులు నీకు వశులైనారు. భేదుని నాస్తికుని వశపరచుకొనుము. నిన్ను స్తుతించువారికి నాస్తికుడు ఇష్టము కలిగించును. వారికి వ్యతిరేకముగా శూరులగు యోద్ధలను ప్రోత్సాహపరచుము. వారిని వజ్రమున పరిమార్చుము.

    19. ఈ యుద్ధమున ఇంద్రుడు భేదుని వధించినాడు. యమున ఇంద్రుని సంతుష్టుని చేసినది. తత్సువులు, సహితము ఇంద్రుని సంతుష్టుని చేసినారు. అజ, శిప్రు, యక్షునామక జనపదములవారు ఇంద్రునకు గుఱ్ఱపు తలలు బహూకరించినారు.

    20. ఇంద్రా ! నీ ప్రాచీన అనుగ్రహములు, ధనమును ఉషతో ఉపమించలేము. నీ నూతన అనుగ్రహములు, ధనము సహితము వర్ణనాతీతము. నీవు మన్యమానుని, పుత్రుడగు దేవకుని వధించినావు. కొండ చరియతో శంబరుని వధించినావు.

    21. పరాశర, వసిష్ఠాది ఋషులను అనేకమంది రాక్షసులు వధించదలచినారు. ఇంద్రా ! ఆ ఋషులు నిన్ను కోఱుకున్నారు. వారు తన ఇండ్లవైపు పోవుచు నిన్ను స్తుతింతురు. వారు నీ సఖ్యతను మరువలేదు. ఎందుకనగా నీవు వారి పాలనను మరువలేదు. అందువలన వారికి కాలము సర్వదా సుందరముగా ఉండును.

    22. దేవశ్రేష్ఠ ఇంద్రా ! దేవవాన్ రాజు పౌత్రుడు, పిజివన పుత్రుడు సుదాసుడు మాకు రెండువందల ఆవులు, రెండు రథములు ఇంద్రుని స్తుతించి నందుకుగాను ఇచ్చినాడు రాజహోతయజ్ఞ గృహమున ప్రవేశించినట్లు నేను గృహమున ప్రవేశింతును.

    23. పిజవనపుత్రుడు సుదాసుడు వసిష్ఠునకు నాలుగు గుఱ్ఱములు ఇచ్చినాడు. అవిశ్రద్ధ దానాది యుక్తములు, స్వర్ణాలంకార సంపన్నలు. దుర్గమ ప్రదేశములందు సరళగాములు, అవి పుత్రునివలె పోషించదగు వసిష్ఠ పుత్రుని అన్నము, యశమును మోయును.

    24. సుదాసుని కీర్తి ద్యావాపృథ్వుల మధ్య నిలిచి ఉన్నది. అతడు దాతలందు శ్రేష్ఠుడు. శ్రేష్ఠవ్యక్తులకు ధనదానము చేయును. ఇంద్రుని స్తుతించినట్లు ఏడు లోకములు సుదాసుని స్తుతించును. యుద్ధమునందు నదులు "యుధ్యామధి" నామక శత్రువును నాశనము చేసినవి.

    25. నేతలగు మరుత్తులారా ! ఇతడు సుదాసుని తండ్రి పిజవనుడు లేక దివోదాసుడు దివోదాసును సేవించినట్లే సుదాసుని సేవించండి. సుదాసుని ఇంటిని రక్షించండి, సుదాసుబలము అవినాశ్యము అక్షయము కావలెను.


                                      పందొమ్మిద సూక్తము

          ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు వాడికొమ్ము ఎద్దువలె వంటరిగనే శత్రువును స్థానభ్రష్టుని చేయును. హవ్యశూన్య వ్యక్తుల ఇండ్లు తీసికొనును. ఆ ఇంద్రుడే సోమాభిషవ కర్తకు ధన దానము చేయవలెను.

    2. ఇంద్రా ! అర్జుని పుత్రుడు కుత్సునకు ధనదనము చేసినావు. దాసులు "కువయ" "శుష్ణు" లను వశపరచుకున్నావు. మానవుల మధ్య యుద్ధమున కుత్సుని రక్షించినావు.

    3. ఘర్షక ఇంద్రా ! హవ్యదాత సుదాసును వజ్రము మున్నగు సకల రక్షణలతో రక్షింపుము. భూమికొఱకు జరిగిన యుద్ధము పురుకుత్స పుత్రుడు త్రసదస్యు మరియు పురుని రక్షింపుము.

    4. నేతల స్తుతియోగ్యుడవగు ఇంద్రా ! మరుత్తుల సహితుడవై చేసిన యుద్ధములందు అనేకమంది వైరులను హతమార్చినావు. హర్యశ్వయుక్త ఇంద్రా ! దభీతి, కొఱకుగాను నీవు దస్యు, చుమురి, ధుని నామకులను వధించినావు.

    5. వజ్రహస్త ఇంద్రా ! నీ బలము అపారము. శంబరాసురుని తొంబది తొమ్మిది పురములను ధ్వంసము చేసినావు. నీ నివాసమునకుగాను నూరవ పురమును వశపరచుకున్నావు. వృత్రుని నముచిని వధించినావు.

    6. ఇంద్రా ! హవ్యదాత యజమాని సుదాసుని కొఱకు నీ సంపదలు సనాతనములయినవి. బహుకర్మ ఇంద్రా ! నీవు కోఱికలు తీర్చువాడవు. నీ కొఱకు నేను రెండు కోఱికలు తీర్చు గుఱ్ఱములను రథమున కట్టెదను. నీవు బలిష్ఠుడవు. నిన్ను స్తోత్రములు చేరవలెను.

    7. బలము, అశ్వములుగల ఇంద్రా ! ఈ యజ్ఞమున పరదానము, పాపమున భాగస్వాములము కారాదు. మమ్ము బాధారహిత రక్షలతో కాపాడుము. మేము స్తోతలకు ప్రియులము కావలెను.

    8. ధనపతి ఇంద్రా ! నీ యజ్ఞమున మేముసఖులమై, ప్రియులమై గృహమున ప్రసన్నులను కావలెను. అతిథివత్సలుడగు సుదాసునకు సుఖములు కల్పించుచు తుర్వశ, యాద్వులను వశపరచుకొనుము.

    9. ధనవంతుడవగు ఇంద్రా ! నీ యజ్ఞమున మేము నేతలము. ఉక్థలు - మంత్రములు - ఉచ్చరించువారము. నేడు మేము మంత్రములు ఉచ్ఛరింతుము. నీకు అర్పించిన హవ్యముతో దాతలుకాని వణిజులకు సహితము ధనము ఇచ్చెదము.

    10. నేతృశ్రేష్ఠి ఇంద్రా ! నేతల స్తుతులు నిన్ను పూజనీయుని చేసినవి. వారి హవ్యదానము నిన్ను మావైపు మరల్చినది. యుద్ధమున ఈ నేతలకే నీవు శుభములు కలిగించుము. వారికి మిత్రుడవు, శూరుడవు, రక్షకుడవగుము.

    11. వీరుడవగు ఇంద్రా ! నేడు నీవు స్తుతించబడి, స్తోత్రవంతుడవై దేహమున వర్థిల్లుము. మాకు అన్నము ఇల్లు ఇమ్ము "పాత స్వస్తిభిః సదా నః"

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత అయిదవ అష్టకము ఏడవ మండలమున రెండవ అధ్యాయము సమాప్తము)


        ఓం నతామినన్తిమాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాద్రవాణి
        నరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతాని నమే తస్థివాంసః


                మూడవ అధ్యాయము             ఇరువదవ సూక్తము

                 ఋషి - వసిష్ఠుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు బలశాలి. ఓజస్వి, అతడు వీరకృత్యముల కొఱకే జన్మించినాడు. ఇంద్రుడు ఒక మానవ హితకర కార్యము చేయదల్చుకున్నప్పుడు తప్పక చేయును. ఇంద్రుడు యువతముడు. అతడు యజ్ఞమున రక్షించుటకుగాను యజ్ఞ గృహమునకు వెళ్లును. అతడు మమ్ము మహాపాపములనుండి రక్షించవలెను.

    2. ఇంద్రుడు వర్థిల్లును. వృత్రుని వధించును. అతడు స్తోతకు శరణు ఇచ్చును రక్షించును. అతడు సుదాసుని కొఱకు ఒక ప్రదేశమును ఏర్పరచినాడు. యజమానికి మరల మరల ధనము ఇచ్చును.

    3. ఇంద్రుడు యోద్ధ, పక్షపాతరహితుడు, యుద్ధములు చేయువాడు యుద్ధతత్పరుడు. శూరుడు. అనేకుల పరాభవ కర్త. శత్రువుల అజేయుడు. తనతో పగపెట్టుకొన్న వారిని అతడు హతమార్చును.

    4. ఇంద్రా ! నీవు బహు ధనశాలివి. నీ బలము మహిమలతో ద్యావాపృథ్వులను పరిపూర్ణము చేసినావు. అశ్వవంత ఇంద్రుడు శత్రువు మీదకు వజ్రము విసరుచు, యజ్ఞమున సోమరసముతో సేవితుడు అగును.

    5. యుద్ధము కొఱకే తండ్రి కశ్యపుడు ఇంద్రుని పుట్టించినాడు. ఇంద్రుడు అభీష్టవర్ణి స్త్రీ - అదితి మానవ హితైషి ఇంద్రుని కన్నది. ఇంద్రుడు మానవుల సేనాపతిమయి వారికి స్వామి అగును. ఇంద్రుడు ఈశ్వరుడు శత్రుహంత. గోవుల అన్వేషకుడు. శత్రుపరాభవకారి.

    6. ఇంద్రుడు శత్రునాశక మనమువాడు. అట్టి ఇంద్రుని సేవించువానికి ఏనాటికిని స్థానభ్రష్టముకాదు. అతనికి క్షయములేదు. యజ్ఞోత్పన్నుడు, యజ్ఞరక్షకుడగు ఇంద్రుని స్తుతించువారికి అతడు ధనము ఇవ్వవలెను.

    7. పూర్వపు తండ్రి లేక చిన్నవారికి దానముచేసినది ఒక ధనము; చిన్నవాని నుంచి పెద్దవానికి లభించినది ఒక ధనము. అమృతము వంటి పితృ ధనము పుత్రుడు అందుకొని దూరదేశము వెళ్లినది ఒక ధనము.

    ఇంద్రా ! ఆ మూడు విధముల ధనములను మా కొఱకు తెమ్ము.

    (పూర్వపు తండ్రి అనగా అనౌరసుడు, దత్తత ఇచ్చిన తండ్రి పితృధనము అమృత్నుత్ అమృత ప్రాయము అనుచున్నాడు.)

    8. వజ్రధర ఇంద్రా ! నీకు హవ్యము సమర్పించిన ప్రియమిత్రుడు నీ దానములందే నిలిచి ఉండును. మేము అహింసితులమై నీ దయకు ప్రాప్తులము కావలెను. మేము అందరిని మించిన అన్నవంతులమై మానవులకు రక్షణ ఇవ్వగల గృహమున నివసించవలెను.

    9. ధనశాలివగు ఇంద్రా ! నీ కొఱకు కురిసిన సోమము కన్నీరు రాల్చుచున్నది. స్తోతలు నిన్ను స్తుతించుచున్నారు. నేను నీ స్తోతను ధనాభిలాషిని. కావున నీవు నాకు వెంటనే నివాసయోగ్య ధనము ప్రసాదించుము.

    10. ఇంద్రా ! నీవు అందించిన అన్నము అనుభవించుటకు మమ్ము భరించుము. స్వయముగా హవ్యము అందించు హవ్యధాతను భరింపుము. నిన్ను ఎంతో ప్రశంసించుటకు మాకు శక్తి కలుగవలెను. నేను నీ స్తోతను "పాత స్వస్తిభిః సదానః" 


                                     ఇరువది ఒకటవ సూక్తము

             ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. దీప్తము, గవ్యమిశ్రితమగు సోమము అభిషుతమైనది. ఇంద్రుడు స్వభావతః సోమమున సంగతుడు హర్యశ్వా! యజ్ఞము ద్వారా నిన్ను ప్రబోధింతుము. సోమము వలన కలిగిన మత్తులో మా స్తోత్రములను అర్థము చేసికొనుము.

    2. యజమాని యజ్ఞమున కుశలు పరచును. యజ్ఞస్థానమున శిలలు దుర్ధర్ష ధ్వనిచేయును. అన్నవంత ఇంద్రా ! ఋత్విక్కులచే అభిషవించబడు ధ్వని గృహ మధ్యము నుండి దూరము వరకు వినిపించును.

    3. శూర ఇంద్రా ! వృత్రుడు ఆక్రమించిన అనంత జలమును విడిపించినావు. నీవలననే నదులు రథికులవలె సాగినవి. నీ భయమున విశ్వము గడగడలాడును.

    4. ఇంద్రుడు మానవులకు హితకరములగు సమస్త కార్యములు తెలిసికొనును. ఆయుధములతో భయంకరుడై వ్యాపించును. అసురుల సమస్త నగరములను వడకించును.

    ఇంద్రుడు ప్రసన్నుడు, మహిమాన్వితుడు వజ్రహస్తుడై అసురులను వధించినాడు.

    5. ఇంద్రా ! రాక్షసులు నన్ను బాధించరాదు. బలశ్రేష్ఠ ఇంద్రా ! రాక్షసులు ప్రజలనుండి మమ్ము విడగొట్టరాదు. ఇంద్రస్వామి భయంకర జంతువులను వధించుటకు ఉత్సాహపడును. ఆ బ్రహ్మచారులు మా యజ్ఞమునకు విఘ్నము కలిగించరాదు.

    6. ఇంద్రా ! నీవు నీ కర్మ ద్వారా సకల ప్రాణులను అదుపులో ఉంచగలవు. నీ మహిమ వ్యాప్తిని జగములందు ఎవరును నిలువరించజాలరు. నీ బాహుబలమున వృత్రుని వధించినావు. యుద్ధమున శత్రువు నీపారమును అందుకొనలేకపోయినాడు.

    7. ఇంద్రా ! ప్రాచీన దేవగణములు సహితము బలము మఱియు శత్రువధ విషయమున తమను నీకన్న తక్కువగానే భావించినారు. శత్రువులను పరాజితులను చేయు ఇంద్రుడు స్తోతలకు ధనము ప్రసాదించును. స్తోతలు అన్నప్రాప్తికిగాను ఇంద్రుని ఆహ్వానింతురు.

    8. ఇంద్రా ! నీవు ఈశానుడవు. ఈశ్వరుడవు. తమను రక్షించుమని స్తోతలు నిన్ను ఆహ్వానింతురు. బహుత్రాత ఇంద్రా ! నీవు మా ధనమునకు రక్షకుడవయినావు. నీకు సముడై మమ్ము హింసించువాడున్నచో వానిని నివారింపుము.

    9. ఇంద్రా ! మేము స్తుతులతో నిన్ను వర్థిల్లచేసి నీకు మిత్రులము కావలెను. నీ మహిమతో నీవు ఇందరి రక్షకుడని అయినావు. నీ రక్షణలందు ఆర్య స్తోతలు యుద్ధమునకు వచ్చిన అనార్యుల బలమును అణచవలెను.

    10. ఇంద్రా ! నీవు అందించిన అన్నము అనుభవించుటకు మమ్ము భరించుము. స్వయముగా హవ్యము సమర్పించు హవ్యదాతను భరించుము. నిన్ను ఎంతో ప్రశంసించుటకు మాకు శక్తి కలుగవలెను. "పాత స్వస్తిభిః సదానః"

    (ఋత్విక్కుల ద్వారా కాక స్వయముగా హవి సమర్పించు విధానము వచ్చినట్లున్నది)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.