Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    ప్రజలు రాముని వెంట అడవులకు వెళ్ళుదుము అన్నారు. బయలుదేరినారు. వెళ్ళలేదు. ధర్మరాజు విషయమున కూడ అట్లే జరిగినది.
3. ఇండ్లు కట్టుటయందు మానవుడు కొంత నిపుణత సంపాదించినాడు. అతడు సున్నము వాడినాడు. అంతస్తుల మేడలు కట్టినాడు. నిప్పు త్వరగా అంటుకోను పదార్ధములతో ఇల్లు కట్టుటలో పురోచనుడు నిపుణుడు. అతడు కట్టిన ఇంటికి అయుదాగారము దగ్గరలో ఉన్నది. ఇందును బట్టి ప్రేలుడు పదార్దములు ఆయుధముగా ఉపయోగించినట్లు కనిపించుచున్నది. మహామ్మదీయులే తోలిసారి పేలుడు పదార్ధము తుపాకి, తెచ్చినారని మన కొఱకు ఆంగ్లేయులు వ్రాసిన చరిత్ర చెప్పుచున్నది. ఇందును గురించి విశేషజ్నులు పరిశోధించవలె.
4. రాజప్రాసాదములు కుట్రలకు పుట్టలు అయినవి. ఏపాము ఎప్పుడు వచ్చి కాటు వేయునో ఎరుగుట దుస్తరము అయినది. అది రెండుగా చీలిపోయినది. కౌరవ పక్షము పాండవ పక్షము స్పష్టముగా ఏర్పడినది.
    ధర్మరాజు యువరాజు మాత్రము కాదు సార్వభౌముడు అయినాడు. అతడు ధర్మజ్ఞుడు, ప్రభుత్వమున ఉన్నవారు లేనివారికి అపాయము కలిగించగలరని తెలిసినవాడు. భీముడు మహాబలవంతుడు. అర్జునుని మించిన విలుకాడు లేడు. పాండవులు అనేకమంది రాజులను జయించినారు. సంపదలు తెచ్చినారు. అట్టివారు రాజ్యమును వదులుకున్నారు. ఇందుకు ఏదో బలమైన కారణము, అనంతమయిన కుట్ర జరిగి ఉండవలెను. ధృతరాష్ట్రుని మాతమత్రమున రాజ్యము వదులుకున్నారన్న నమ్మశక్యము కాదు.
    బలమున మాత్రమున రాజ్యము నిలుపుకొను దశ గతించినది. ఎత్తులకు జిత్తులకు ప్రాధాన్యత వచ్చినది. కుట్రలు పన్నుటలో దుర్యోధనుని మించిన వాడు కనిపించడు. అతనికి శకుని అండ ఉన్నది. అతనికి రాజ్యము లేదు. అయినను రాజప్రాసాదమును వశపరచుకున్నాడు. భీష్మద్రోణాదులు పాండవ పక్షపాతులు. వారిని నిర్వీర్యులను చేసినాడు. ధృతరాష్ట్రుని తన పిడికిట బిగించినాడు. హస్తినలో పాండవుల బతుకు దుర్లభము చేసినాడు. హస్తిన కన్న వారణావతము మేలు అనుకోనునట్లు చేసినారు. దుర్యోధనుడు దాడి చేసినాడు. పాండవులు తమ రక్షణకు పూనుకున్నారు.
    పాండవులు తక్కువ వారు కాదు. దుర్యోధనుని కుట్ర ఎరిగినారు. తమ వేగును హస్తినలో నాటినారు. విదురుని వలన లక్క ఇంటి విషయము ముందే గ్రహించినారు.
    ఇందు ఆశ్చర్యకరమయిన వేగు కనిపించును. పురోచనుడు నిషాదస్త్రీని వెంట తెచ్చినాడు. ఆమెకు అయిదుగురు కొడుకులు. వారిని వేగు చేయుటకు నిల్పినాడు. ఆ విషయము పాండవులు గ్రహించినారు. అది వారికి పనికి వచ్చినది. వారు పురోచనుని కాల్చినారు. నిషాద స్త్రీని అయిదుగురు కొడుకులను కాల్చినారు. అందుకు వారు ఎత్తుగడ వేసినారు. వారికి మత్తు పదార్దములు ఇచ్చినారు. లక్క ఇల్లు కాల్చవలసిన నాడు పురోచనుడు నిద్రించినాడు. అతడు అంత ప్రమత్తుడు కాడు. అట్టివారిని దుర్యోధనుడు కార్యమునకు నిర్ణయించడు. పురోధనుని పాండవులే మత్తుని చేసినారు.
    లక్క ఇంటిని కాల్చు రోజు కృష్ణ చతుర్ధశిగా నిర్ణయించబడినది. అది  ఛీకటి రోజు. వెన్నెలరాదు. పాండవులు పారిపోవు ప్రయత్నము సహితము విఫలము చేయవలెనని ప్రయత్నము. కృష్ణచతుర్ధశి హస్తినలో నిర్ణయమైనది. వారణావతరమునకు వార్త అందినది. అంతటి పటిష్టమయిన సంబంధములు ఉన్నవి.
    విదురుడు కనుగొన్నాడు. పాండవులకు ఎరుకపారిచినాడు. అంతేకాదు గనులు తవ్వువానిని పంపినాడు. ప్రత్యేకముగా గనులు తవ్వు వృత్తిలో నైపుణ్యతను ఆర్జించునంతటి శ్రమ విభజన జరిగినది. సంపన్నమయిన రాజ్యముననే కుట్రలు కొల్లలుగా పుట్టును. ఇది ఈనాటికి ఉన్న విషయము. మనకు తెలియును.
    పాండవులు దుర్యోధనుని కుట్రను భంగపరచినారు. కాని అతని ఎత్తుకు పై ఎత్తు వేయలేదు. ఇందులో వారు సాధించినది ఒక్కటి. నిషాదస్త్రీని , ఆమె పుత్రులను కాల్చి పాండవులు చచ్చినారను భ్రమ కలిగించినారు. ఆ విధముగా తాము బలపడుటకు సమయము సంపాదించుకున్నారు.
    దుర్యోధనుడు వెర్రివాడు కాడు. అతడు చచ్చినవారు ఎవరో గ్రహించినాడు. అయినను ప్రజలను నమ్మించదలచినాడు. జనులలో పాండవుల విషయమున ఉన్న ఆదరమును దెబ్బ తీయదలచినాడు. అందుకు పాండవులకు ఉదక క్రియలు జరిపినాడు. వారికీ ఉత్తర క్రియలు సహితము కరిపించినాడు. అట్లు ప్రచారము గావించినాడు. దొరికిన అవకాశమును కొల్లగొట్టినాడు.
    కుట్రలు, ప్రతి కుట్రలు మానవ జీవితమూ అయినది.
    రాజకీయములందు కుట్రలకు, కూహకములకు కుటిలత్వములకు ప్రాముఖ్యత వచ్చినది. మంచికి మంచి రోజులు గతించినవి.

                                                హిడింబ కధ

    పాండవులు బిలము నుండి బయటికి వచ్చినారు. గంగ దాటినారు. మహారణ్యమున ప్రవేశించినారు. అది చీమలు దూరని చిట్టడవి. కృష్ణ చతుర్దశి చీకటి. అంధకార బంధురము. కంటికి అవలిది కనిపించలేదు. పాండవులు కుంతి డస్సీ ఉన్నారు. ఆకలి దప్పులు దహించుచున్నవి. అప్పుడు భీముడు తల్లిని సోదరులను ఎత్తుకొని మహారణ్యమున నడచినాడు. అతనికి చీకటి గాని ముండ్లు గాని తోచలేదు. మహావేశమున నడచినాడు. అతని నడకకు చెట్లు కదలినవి. భూమి అదిరినది. భీముడు చల్లని మర్రి కిందకు వచ్చినాడు. తల్లిని సోదరులను దించినాడు.
    కుంతి సహితముగా అయిదుగురు ఒడలు మరచి నిద్రించినారు. భీముడు అప్రమత్తుడై వారిని రక్షించుచున్నాడు. భీముడు నీటిపట్టును ఎరుగదలచినాడు. మఱ్ఱిచెట్టు ఎక్కినాడు. కొన కొమ్మలకు చేరినాడు. చూచినాడు. దగ్గరలోన ఒక సరస్సు కనిపించినది. తామరల వాసన వచ్చినది. క్రౌంచములు, హంసలు, తుమ్మెదలు, ధ్వనులు చేసినవి. భీముడు కొలను చేరినాడు. స్నానము చేసినాడు. తామరిదోన్నెలలో నీరు తెచ్చినాడు. తల్లికి సోదరులకు ఇచ్చినాడు. అప్పటికి సాయంకాలము అయినది. సూర్యుడు పశ్చిమాద్రికి చేరినాడు. పక్షులు జంతువులు స్వస్థలములకు చేరుకున్నవి. చీకట్లు క్రమ్మినవి. పర్వత గుహల నుండి సర్పసమూహములు బయటపడినవి.
    ఇది అమావాస్య నాటిమాట. ఆనాటి రాత్రి కుంతి నలుగురు కొడుకులు నిద్రించినారు. భీముడు కాపున్నాడు. అతడు వారిని చూచినాడు. దుర్యోధనుడు తమకు కలిగించిన ఇక్కట్లను తలచుకున్నాడు. 'దుష్టుల అండన నగరమున ఉండుటకన్న ఒంటరిగా అరణ్యమున ఉండుట మేలు. యోగ్యులు అడవిలోని చెట్లవంటివారు. ఒకరిని ఒకరు ఆశ్రయించుకొని ఉందురు. వృక్షములు ఫలములను ఇచ్చును. యోగ్యుడు ఇతరులకు ఉపకారము చేయును. వృక్షములు గట్టి వేరులు కలిగియుండును. యోగ్యుడు గొప్ప బుద్ది ఉందును.' అట్లు భీముడు ఆలోచించుచున్నాడు. అప్పుడు దగ్గరలో అలికిడి వినవచ్చినది. అది విన్నాడు. నిద్రించినవారికి కోట అయి నిలిచినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.