Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"అంటే?"
కాలూ ఒకప్రక్కకు ముఖం తిప్పుకొని ఆలోచనామగ్నుడైనాడు. వెంటనే అందుకుని "అయితే అయ్యలారా! పిల్లలు పాలులేకుండా చస్తుంటే మీకు చీమకుట్టినట్లైనా ఉండదుకదూ?"
"మాకేం గుండెల్లేవనుకున్నారా? మేమూ అన్నదానాలు చేస్తాం."
"అందాకా ఎందుకు? మొన్న మా తండ్రిదినాలప్పుడు వేయిమంది కుంటీ, గుడ్డీ బిచ్చగాళ్ళకు అన్నదానం చేశాను"
"గవర్నర్ ధార్మికనిధికి విరాళాలు పోగుచేయడానిగ్గాను నా భార్య సంగీతనృత్య ప్రదర్శనం ఏర్పాటు చేసింది. ఆమె స్వయంగా పది రూపాయల టిక్కెట్లు అమ్మడానికి ఇంటింటికీ తిరిగింది. గత సోమవారం ప్రభుత్వ భవనంలో జరిగిన విందుకువెళ్తే గవర్నరు ఆమెను స్వయంగా అభినందించాడు."
"ఇలాంటివన్నీ మీతో చెప్పడంలో అర్ధంలేదు. దేవునికికూడా సమర్పించాలని మా అభిలాష."
కాలూ వినిపించుకోలేదు. ఏదైనా ఉపాయం దొరుకుతుందేమోనని ఆలోచిస్తున్నాడు. అతనికి చటుక్కున ఒక ఉపాయం తట్టింది.
"అయ్యలారా! మీరు చెప్పేదంతా ముగిసిందా? ఇంకేమైనా ఉందా? నేనేదో ఒప్పందాన్ని భగ్నంచేశానంటున్నారు కదూ?"
"అది అంతకేవస్తుంది"
"అయితే నా మాట వినండి. ఇప్పటికి మీరు వృధా అయినాయనుకుంటున్న పాలఖరీదు వాపసు ఇచ్చేస్తాను. ఇకముందువిషయం వినండి. ఇప్పటికి నా లిస్టులో ఉన్నవారి పేర్లన్నీ కొట్టేసి నా షరతులకు అంగీకరించేవారితో కొత్తపట్టిక తయారుచేస్తా. ఇదిగో పాతలిస్టు."
"ఇది చాలా విచిత్రంగా ఉంది" అన్నాడు ధర్మకర్తల్లో ఒకడు.
"మీకు చిత్రం అయినా కాకున్నా నేను చేయదల్చుకున్నది అది. ఈ పద్మమండపంలో కూర్చున్న వారితోనే ప్ర్రారంభిస్తా. చెప్పండి ఎవరెవరిపేర్లు కొట్టేయాలో, నా షరతుప్రకారం పాల దానానికి ఎవరెవరు ముందుకువస్తారో రండి."
చాలసేపు దాకా ఎవరినోటివెంటా మాటరాలేదు.
కాలూ ఇద్దరు బంగారు వర్తకులవైపు తిరిగి "మీరు ఇద్దరూ నష్టపడ్డారుకదూ? మీరిచ్చిన పాలఖరీదు పుచ్చుకోండి. మరుసటినెల పట్టికలోంచి మీపేర్లు తొలగిస్తున్నా. ఏమంటారు? సమ్మతమేనా?" అతడు వరుసగా ఒకరితరువాత ఒకర్ని చూశాడు.
ఎవరూ జవాబు చెప్పలేదు. వారు ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ చూపుల్లోని అర్ధం కాలూకు తెలుసు. బంగారపు ధర పెరగాలని ఒకడూ, తరగాలని ఒకడూ కోరుకుంటున్నారు.
"ఇదిగో మీపేరు కొట్టేస్తున్నా" కాలూ పెన్సిల్ కదిలించాడు.
"ఆగండాగండి"
"ఇదిగో మీ పేరుపోతూంది" మళ్ళీ పెన్సిలు కదిలింది.
"ఆగండాగండి"
'ఆగడం ఎందుకూ? దేవునికి ఇచ్చే అభిషేకపు పాల విలువ మీకు గిట్టడం లేదుగా? మీ రూపాయికి పదహారణాలు తిరిగిరావడం లేదని మీ వుద్దేశం. మరోవిధంగా ఆలోచించే వారు చాలామంది ఉన్నారు. కొంతలో కొంత ఫలించినా వారికీ సంతృప్తి. మీ అభిప్రాయం అదికాదు. కాబట్టి ఉపసంహరించుకోవడమే మేలు. ఏమంటారు. మాట్లాడరేం?"
"నా పేరు ఉండనివ్వండి."
"నా పేరుకూడా."
కాలూకు పెద్దనవ్వు తరంగంగా వచ్చింది. కాని ఆపుకున్నాడు.
"మీరు......మీరు" అని కాలూ తనచూపు అందరిమీదా నిగిడ్చాడు.
"మావికూడా ఉండనివ్వండి"
కావులూ ఆలోచనాపూర్వకంగా పెన్సిలు నోటుబుక్కుమీద కొట్టాడు. పాపలకు పాలు సాధించాడు. అతని విజయంలో అతనికి ఒక సరికొత్త ఆయుధం లభించింది. ఆ ఆయుధమే పెద్దవాళ్ళల్లో ఉండే స్వార్ధపు తగాదాలు, ఈర్ష్య, అసహ్యతలు. అతడు పూజారివైపు తిరిగి "పూజారీ, విన్నావా? వీరంతా శివునికి అభిషేకం చేసిన పాలు పిల్లలకు ఇవ్వాలంటున్నారు. తెలిసిందా? గంగాభవానికి పాలు ఇవ్వనంతమాత్రంతో ఆమె కోపగించదని వారు అనుకుంటున్నారు. మరి నువ్వేమంటావ్?"
పూజారి ఏంచెపుతాడు? పాపం అతనికళ్ళు మిణుకుమిణుకు మన్నాయి. గడ్డం వణికింది.
కాలూ విజయగర్వంతో పొంగిపోయాడు.
"మరొకసారి దేవాలయపు గంట మ్రోగించి ఆత్మాంధకారపు ఏడు పొరల్నూ తొలగించుకోండి," అతని చిరునవ్వు వారిని వెక్కిరించింది. అయినా ఓదారుస్తున్నట్లు "రండి, అందరమూ భగవంతుని సేవించుకుందాం" అన్నాడు.
14
వెడల్పైన బల్లమీద పరచివున్న పచ్చని గుడ్డమీద మోచేతులు ఆన్చి, అక్కడికి వచ్చిన కాలూతో "అయితే క్షీరదాతల్ను చవటల్నుచేసి కూర్చోపెట్టారు. అంతటితో అయిపోయిందనుకున్నారేమో? ఇప్పుడు బోర్డువారి ముందుంది తమాషా అంతా" అన్నాడు మోతీచంద్. కాస్త ఆగి "బోర్డుమెంబర్లు అందరూ గట్టివాళ్ళే. ఎవరితో ఎలా ప్రవర్తించాలో వారికి బాగా తెలుసు" అన్నాడు ధ్వని తగ్గించి.
కాలూలో కలవరం చెలరేగింది. మెడగోక్కుంటూ మెత్తటి కుర్చీలో కూలబడ్డాడు. నేలమీద తివాసీ వేసుకొని కూర్చోవడానికి అలవడ్డ కాలూకు అణుగుతూ, లేస్తున్న కుషన్ కుర్చీలో కూర్చోవడం సాధ్యపడ్డంలేదు. కాలూ తన ముందున్న డెస్క్ పట్టుకొని కూర్చున్నాడు.
"అయితే వారు ఒప్పుకుంటారంటారా?" జవాబు ఏంవస్తుందో తెలిసికూడా అడిగాడు కాలూ.
"మనం ప్రజల సేవకులం. వారి ఆజ్ఞప్రకారం నడుస్తాం. అందులో పెద్దపరువుతక్కువ పనేమీలేదని నా అభిప్రాయం."
"ఆకలితో చచ్చే దరిద్రులు మాత్రం ప్రజలుకారా?"
"దయచేసి నాకాదరిద్రులమీద సానుభూతి లేదనుకోండి. నిజం చెప్పాలంటే నేను వారినిచూచి ఏడ్చాను. నాకళ్ళవెంట నీరు కాలువలుగా ప్రవహించింది," మోతీచంద్ అర్ధనిమీలితనేత్రుడై తన నాయన ద్వయంనుంచి బాష్పధార ప్రవహించిన దృశ్యం చూచినట్లు నటించాడు. "ఒకనెలక్రితం సూర్యగ్రహణంనాడు మా కాంపౌండులోని టెన్నిస్ కోర్టుప్రక్కన పిల్లలుకాక, 500 మంది ఆడా మగా అందరికి అన్నదానం చేయడం జరిగింది. కూరలూ అన్నమేకాక నెయ్యికూడా వడ్డిద్దామనుకున్నా. కాని వారి ఎండుడొక్కలు నెయ్యి ఇముడ్చుకోలేవని మళ్ళీ మనసు మార్చుకున్నా. వారు కడుపునిండా తిని త్రేన్చుకుంటూ నాకు దీర్ఘాయువూ, సకలసంపదలు కలగాలని ప్రార్ధిస్తూ వెళ్ళిపోయారు"
అతని కోలముఖంలో దయ వెలిగింది. అతని దృష్టి గోడమీద ఉన్న ఒక చిత్రంమీద పడింది.
కాలూ చుట్టూ కలయచూశాడు. ఒకనెలక్రితం ఆఫీసుకు వచ్చినప్పుడు అప్పుడప్పుడే కొత్తగా గోడకు వ్రేలాడతీసిన ఆ చిత్రం అతనికంట పడింది. అది ఎరుపు నీలిరంగులతో కూడివున్న ఒక చిత్రం. బొమ్మకంటే రెండింతలు వెడల్పుగల ఖరీదైన గిల్టుఫ్రేము చేయబడింది ఆ చిత్రానికి. ఆచిత్రం దిగువ 'నా అంతర్వాణి' అని వ్రాయబడి వుంది.
కాలూ దాన్నిచూచి ఆశ్చర్యపడినట్లు పండ్లికిలించాడు. అతని మనోఫలకంమీద 'నా అంతర్వాణి' అనేవాక్యం మెరుపులా మెరిసింది. ఆ చిక్కుగీతల్లో అతనికి కనిపించిందల్లా దుఃఖపూరిత నేత్రాలుగల మూడు చిన్నచిన్న పందిపిల్లలమీద ఒకరకపు ఎర్రని ఏనుగు తలక్రిందులుగా పడివుంది.
మోతీచంద్ ఆ చిత్రం గీయడానికిగల కారణం అతనికి తెలుసు. అమాంతంగా ఒకనాడు అతనికి చిత్రం గీయాలనిపించింది. ఎరుపు నీలిరంగు పెన్సిళ్ళతో కళాకార్నిలా గీతలు గీశాడు. కళారూపకంగా తన అభిప్రాయం వ్యక్తపర్చడం మోతీచంద్ కు అదే ప్రథమ పర్యాయం. ఆరునూరైనా, నూరుఆరైనా తన భావాలకు కళారూపం ఇవ్వాలి. అందుకు ఆత్మదర్శనమే ఉత్తమ మార్గం. ఆత్మప్రేరణతోనేకదా మానవుడు భగవత్స్యరూపాన్ని సిద్దంచేసుకునేది!
"ఆ ప్రేరణ ఎలా ఎక్కడినుంచి వచ్చింది?" అని కాలూ అడిగాడు.
మోతీచంద్ తలపంకించి ఊరుకున్నాడు. అతడు తన రహస్యం బైట పెట్టదల్చుకోలేదు.





