Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    7. అశ్వములారా! మా అన్నములను రక్షించండి. మా ధనములను రక్షించండి.

    అశ్వాభిమాన దేవతలారా! మీరు బ్రాహ్మణులవలె స్నానమున పరిశుద్ధులు. అమరులు. శ్రమరహితులు. గమ్యమును ఎరిగినవారు. నీవారసంబంధమగు చరురసము మధుసమము. పరుగెత్తుటకు ముందును - పరుగెత్తిన తరువాతను దానిని సేవించండి. సంతృప్తులు కండి. దేవయానమార్గమున గమ్యమును చేరండి.

    8. అశ్వములు గతికుశలములు. ఆహ్వానములు వినునవి. అన్నవంతములు. అవి మా పిలుపును వినునుగాక.

    9. అశ్వములు ఎంతటి దారినైన, కొంచెపు దారిని చేసి పోవును. అన్నరాశులు దానము చేయును. యజ్ఞప్రదలు. మాకు ధనమును ఇవ్వకోరునవి. యుద్ధములందు శత్రుధనములు హరించునవి. ప్రసిద్ధములు. అట్టి అశ్వములు మాకు సుఖప్రదములు అగును గాత.

    10. అశ్వములు పాములు, తోడేళ్ల వంటి రాక్షసులను హతమార్చునవి. మావ్యాధులను చప్పున దూరము చేయునవి. దూరమార్గములను దగ్గర చేయునవి. అర్చింపదగినవి.

    11. ఈ అశ్వము యొక్క మెడ, నడుము, ముఖములందు పటకాలు ఉన్నవి. ఇవి దారిలోని రాళ్లను దాటుచున్నవి. యజ్ఞకర్త అభిప్రాయమును అనుసరించి సాగుచున్నవి. ఎత్తుపల్లములను ఎరుగుచున్నవి. కొరడానే త్వరపెట్టుచున్నవి.

        (కొరడాతో పనిలేకనే సాగుతున్నవని.)

    12. ఈ అశ్వము గమ్యము చేరుటకు డేగవలె ఎగురుచున్నది. పర్వతాదులను లంఘించుచున్నది. ఇది బలముగా సాగుచున్నది. వేగముగా సాగుచున్నది. ఆ విధముగా సాగుట వలన దీని అలంకారములైన వస్త్రాదులు అశ్వపు రెక్కలవలె తోచుచున్నవి.

        (అగ్నీధ్రుడు హోమము చేయవలెను.)

    13. అన్నపు ఉత్పత్తి నావద్దకు చేరునుగాక. ద్యావాపృథ్వులు జగములకు సుఖకరములు అగుచు నా వద్దకు వచ్చెదరు గాక. నా తలిదండ్రులు - చిరకాలము ఉండుటకు - నా వద్దకు రావలెను. సోమదేవత నాకు అమృతత్వము కలిగించుటకు నా వద్దకు విచ్చేయును గాత.

        (హోమము చేయవలెను.)

    14. అశ్వములారా! మీరు అన్నము జయించుటకు ఉద్యమించుచున్నారు. మీరు అన్నము కొరకే ఉరుకులు పెట్టుచున్నారు. అన్నమును జయింపనున్నారు. అట్టిమీరు - బృహస్పతి సంబంధమగు- చరుభాగమును ఆఘ్రాణించండి.

        (అశ్వములచే చరుభాగము వాసన చూపించవలెను.)

    15. అశ్వములారా! మీరు బృహస్పతి సంబంధ చరువును గ్రహించవలసి ఉన్నది. పరిశుద్దులు కండి. మీరు అన్న సంపాదనకు ఉద్యమించినారు. అన్నములకై పరుగులు పెట్టినారు. అన్నములను జయించినారు.

        (అశ్వములు గమ్యము చేరిన తరువాత చరువును వాసన చూపించవలెను.)

    16. రథములారా! మీరు ఇంద్రుని అనుగ్రహమున బాగుగా పరిగెత్తినారు. ధావన ప్రతిజ్ఞను పూర్తి చేసినారు.

        (గుర్రములను విప్పవలెను. రథమును అనుమంత్రించవలెను.)

    17. చెట్టునుండి పుట్టిన దుందుభులారా! మీరు యజ్ఞకర్తచే అన్నము జయింపచేసినారు. ఇక మీ బంధముల నుండి విముక్తులు కండి.

        (దక్షిణవేది అంచున కట్టిన 17 దుందుభులను విడదీయవలెను.)

                                తొమ్మిదవ అనువాకము

                            (యూపారోపణము చెప్పుచున్నాడు.)

    1. ఆజ్యమున తడిపిన వస్త్రమా! నీవు క్షత్రియ యజమాని దేహమును కప్పుచున్నావు. దర్భమయమైన వస్త్రమా! నీవు క్షత్రియ యజమానురాలిని చలినుండి కాపాడు దానవు అగుచున్నావు.

    (నేతిబట్టను యజమానికి, దర్భబట్టను యాజమాన పత్నికి కట్టించవలెను. 2. దర్భబట్ట నారబట్ట కావచ్చును.)

    2.  'పత్నీ! మనము స్వర్గమును అధిరోహింతము రమ్ము అని పతి ఆహ్వానించినాడు. 'స్వర్గమును అధిరోహించుచున్నాము అని పత్ని అన్నది. నేను - మన ఉభయుల కొరకు - స్వర్గమును అధిరోహించుచున్నాను, అని యజమాని అన్నాడు.

    3. అన్నము - అన్నపు ఉత్పత్తి - అన్నపు పునరుత్పత్తి - స్వర్గము చైత్రాది మాసములు సంతృప్తి చెందును గాక. ఆయుర్యజ్ఞేన కల్పతామ్ - ఆయువు యజ్ఞము నుండి ఏర్పడును గాక. ప్రాణోయజ్ఞేన కల్పతామ్. అపానః యజ్ఞేన కల్పతామ్. వ్యానోయజ్ఞేన కల్పతామ్. చక్షుర్యగనెన కల్పతామ్. శ్రోత్రం యజ్ఞేన కల్పతామ్. మనో యజ్ఞేన కల్పతామ్. వాగ్యజ్ఞేన కల్పతామ్.

    4.  ఆత్మాయజ్ఞేన కల్పతాం. యజ్ఞో యజ్ఞేన కల్పతామ్.

    (12 ఆహుతులను హోమము చేయవలెను.)   
 
    5.  మేము స్వర్గము నందలి దేవతలను చేరినాము. అమరులము అయినాము. ప్రజాపతికి ప్రీతిపాత్రులము అయినాము. ప్రజలము అయినాము.

    (యజమాని రెండు చేతులెత్తి ఈ మంత్రమును ఉచ్చరించవలెను.)

    6. నేను సంతానముతో కూడి ఉన్నాను. సంతానము నాతో కూడి యుండునుగాక. నేను ధనసమృద్ధితో కూడియున్నాను. ధనసమృద్ధి నాతో కూడి యుండును గాక.

    (యజమాని ఈ లోకమును చూడవలెను.)

    7. యజమానీ! నిన్ను సామాన్యుల అన్నము కొరకు కొట్టుచున్నానని అధ్వర్యుడు - రాజామాత్య అన్నము కొరకు కొట్టుచున్నానని బ్రహ్మ - అపూపాది అన్నము కొరకు కొట్టుచున్నానని హోత - సమస్త అన్నముల కొరకు కొట్టుచున్నానని ఉద్గాత - యూపము నుండి దిగుచున్న యజమానిని అసపుటములతో కొట్టవలెను.

    (1. నలుగురు నాలుగు దిశల నుండి యజమానిని కొట్టవలెను. 2. రావి ఆకునందు చవితిని కట్టిన పొట్లము అసపుటము. 3. ఇది యజమాని మీదకు విసరుట. కొట్టుట సరికాక పోవచ్చును.)

    8. బంగారమా! నీవు అమృతమవు. నీవు పుష్టివి. నీవే సంతానమును ఇచ్చుదానవు.

    (యూపము దిగుచున్న యజమాని కొరకు మేకచర్మము పరచి, దానిమీద బంగారమును ఉంచవలెను.)

                               పదవ అనువాకము

                  (అన్నహోమములు చెప్పబడుచున్నవి.)

    1. అన్నములను పృష్టించినవాడు సృష్టి ఆది యందే జలములందును, ఓషధులందును సోమలత యొక్క దీప్తిని కలిగించినాడు. 'తా అస్మభ్యం మధుమతీర్భవన్తు' - అవి మాకు మధురములు అగునుగాక. మేము దేశమునందు పురోగాములము అగుదుము గాక.

        (ఏడు హోమములందు ఇది మొదటిది.)

    2. అన్నములను సృష్టించినవాడు ఈ కర్మలను కల్పించినాడు. ఈ జగములనన్నింటిని సర్వత్ర కల్పించినాడు. అతడు మాకు సంతానమును, పుష్టిని, అభివృద్ధిని కలిగించినాడు. అతడు మమ్ము తెలిసికొని, హోమమున సమర్పించబడుచున్న ఈ అన్నమును అంతటను అందుకొనునుగాక.

        (ఇది రెండవ హోమము.)

    3. అన్నములను సృష్టించువాడు ఈ స్వర్గమును, సమస్త భువనములను ఆశ్రయించినాడు. అతడు రాజాధిరాజు. నేను హవిస్సును అర్పించ కోరుట లేదని గ్రహించినాడు. అయినను అతడే నాకు వీరపుత్రులను, ధనమును ప్రసాదించునుగాక.

        (ఇది మూడవ హోమము.)

    4. అగ్నీ! ఈ యజ్ఞమున మాకు అభిముఖుడవు అగుము. మాకు హితవు బోధించుము. మా విషయమున మంచి మనసు కలవాడవు అగుము.

    హే భూమిపతే! నీవు మాకు స్వామివి. ధనమును ఇచ్చువాడవు. కావున మాకు అధిక ధనము ప్రసాదించుము.

        (ఇది నాలుగవ హోమము.)

    5. ఆర్యమ మాకు ధనము నొసంగవలెను. భగదేవత మాకు ధనము నీయవలెను. బృహస్పతియు, అన్య దేవతలును మాకు ధనము ప్రసాదించవలెను. సత్యదేవత మాకు ధనమునీయవలెను. వాగ్దేవియు మాకు మరింత ధనములను ప్రసాదించవలెను.

        (ఇది అయిదవ హోమము.)

    6. ప్రభూ! మాకు ధనము ప్రసాదించుటకు ఆర్యమను - బృహస్పతిని - ఇంద్రుని - సత్య దేవతను - ఇంద్రుని - విష్ణువును - సరస్వతిని - సూర్యుని ప్రేరేపించుము.

        (ఇది ఆరవ హోమము.)

    7. సోమరాజును - వరుణుని - అగ్నిని - ఆదిత్యులను - విష్ణువును - సూర్యుని - బ్రహ్మను - బృహస్పతిని అనుసరించి మేము యజ్ఞమును ఆరంభించుచున్నాము.

        (ఇది ఏడవ హోమము.)

    8. యజమానీ! నిన్ను సవితా దేవత ప్రేరణ వలనను - అశ్వినుల బాహువులతోనూ - పూష హస్తములతోను - సరస్వతి వాక్కుతోను - అంతర్యామి అగ్ని దేవత అనుమతి తోను - ఇంద్ర, బృహస్పతుల అనుజ్ఞతోను - సామ్రాజ్యము లభించునట్లు, స్వర్గముచే అభిషేకము చేయుచున్నాను.

    (అధ్వర్యుడు యజమానికి స్వర్ణాభిషేకము చేయవలెను.)

                               పదకొండవ అనువాకము

                          (ఉజ్జితి మంత్రములు చెప్పుచున్నాడు.)

    అగ్ని ఒక అక్షరమున వాక్కును జయించినాడు. అశ్వినులు రెండు అక్షరములచే ప్రాణ అపాన వాయువులను జయించినారు. విష్ణువు మూడు అక్షరముల చేత మూడు లోకములను జయించినాడు. సోమదేవుడు నాలుగు అక్షరములచేత నాలుగు కాళ్ళ జంతువులను జయించినాడు. పూష అయిదు అక్షరములచేత పంక్తి ఛందస్సును జయించినాడు. ధాత ఆరు అక్షరముల చేత ఆరు రుతువులను జయించినాడు. మరుత్తులు ఏడు అక్షరములచేత ఏడు అక్షరముల శక్వరీ ఛందస్సును జయించినాడు. బృహస్పతి ఎనిమిది అక్షరములచేత ఎనిమిది అక్షరముల గాయత్రి ఛందస్సును జయించినాడు. మిత్రుడు తొమ్మిది అక్షరములచేత త్రివృత్ స్తోమమును జయించినాడు.

    వరుణో దశాక్షరేణ విరాజ ముదజయత్. ఇంద్ర ఏకాదశాక్షరేణ త్రిష్టుభముదజయత్. విశ్వేదేవా ద్వాదశాక్షరేణ జగతీముదజయన్. వసవః త్రయోదశాక్షరేణ త్రయోదశగం స్తోమ ముదజయన్. రుద్రాః చతుర్దశాక్షరేణ చతుర్దశగం స్తోమముదజయన్. ఆదిత్యాః పంచదశాక్ష రేణ పంచదశగం స్తోమ ముదజయన్. అదితిః షోడషాక్షరేణ షోడశగం స్తోమ ముదజయత్. ప్రజాపతిః సప్తదశాక్షరేణ సప్తదశగం స్తోమ ముదజయత్.

    (యజమాని ఈ మంత్రమును చదువవలెను.)

                                 పన్నెండవ అనువాకము

                           (అతిగ్రాహ్య మంత్రములు చెప్పబడినవి.)

    1. ప్రథమాతిగ్రాహ్యమా! నీవు దారు నిర్మితవు. నదులలోను - వృక్షములందును, భువనములలోను స్వామివి అయి ఉన్నావు. ఇంద్రునకు ప్రియమవు. ఈ ఖరప్రదేశము నీ స్థానము అగును. ఇంద్రుని కొరకు గాను నిన్ను ఖర స్థానమున ఉంచుచున్నాను.

    (అతి గ్రాహ్యములలో ఒకదానిని ఖర ప్రదేశమున ఉంచవలెను.)

    2. ద్వితీయాతిగ్రాహ్యమా! నీవు దారు పాత్రచే గ్రహించబడినావు. నీవు జలములందున్నావు. ఘృతమునందున్నావు. ఆకాశమునందు ఉన్నావు. ఇంద్రునకు ప్రియమైన దానవు. ఈ ఖరము నీ స్థానమగును. ఇంద్రుని కొరకు నిన్ను ఖర స్థానమున ఉంచుచున్నాను.

    (రెండవ దానిని ఖరమున ఉంచవలెను.)

    3. ఉపయామ గృహీతోసి పృథివిషదం త్వాన్తరిక్షసదం నాకసద మిన్ద్రాయజుష్టం గృహ్ణామ్యేషతే యోని రిన్ద్రాయత్వా




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.