Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



                                     పదునాలుగవ సూక్తము

        ఋషి - వశిష్ఠుడు దేవత - అగ్ని, ఛందస్సు మొదటిది బృహత్, తక్కినవి త్రిష్టుప్.

    1. మేము హవివంతులము. సమిధలతో అగ్నిని సేవింతుము. దేవస్తులతో అగ్నిని సేవింతుము. హవ్యము అర్పించి శుభ్రదీప్తాగ్ని సేవింతుము.

    2. అగ్నీ ! మేము సమిధలతో నిన్ను సేవింతుము. యజనీయా ! మేము స్తుతులతో నిన్ను సేవింతుము. కళ్యాణమయ జ్వాలామయ అగ్నీ ! హవి అర్పించి నిన్ను సేవింతుము.

    3. అగ్నీ ! నీవు హవ్యము సేవించుచు దేవతల వెంట మావద్దకు విచ్చేయుము. నీవు ప్రకాశవంతుడవు. మేము నిన్ను సేవిస్తాము. "పాతస్వస్తిభిః సదానః"


                                      పదిహేనవ సూక్తము

          ఋషి - వసిష్ఠుడు దేవత - అగ్ని - ఛందస్సు - గాయత్రి.

    1. అగ్ని మాకు సమీపతమ బంధువు. ఋత్విక్కులు అగ్నివద్ద కూర్చుండువారు. వారు మనోరధపూరకుడగు అగ్ని నోట హవ్యము అర్పించవలెను.

    2. ప్రాజ్ఞుడు, గృహపాలకుడు, నిత్య తరుణుడగు అగ్ని పంచజనుల పరితి ఇంటిముందు కూర్చుండును.

    (పంచజనులనగా నాలుగు వర్ణములవారు నిషాదుడు అని శాయణుని వ్యాఖ్య. ఐదుగురి ఇళ్లముందు అగ్ని సమానముగా కూర్చున్నట్లు చెప్పబడినది. నిషాదుడు అసముడుకాడు)

    3. ఆ అగ్నియే మాకు మంత్రి. సకల ధనములకు బాధకలుగనట్లు రక్షింపవలెను. మమ్ము పాపములనుండి రక్షించవలెను.

    4. మేము ద్యులోకమునందలి శ్యేనపక్షివంటి వేగగమనముగల అగ్ని కొఱకు కొత్త మంత్రములను కల్పింతుము. అతడు మాకు కావలసినంత ధనము ఇవ్వవలెను.

    5. యజ్ఞపు అగ్రభాగమున వెలుగొందు అగ్గి వెలుగులు పుత్రవంతుడు మానవుని ధనమువలె కనులకు విందు చేయును.

    6. యాజ్ఞికుల ఉత్తమ హవ్యవాహక అగ్ని ఈ హవ్యమును కోఱవలెను. మా స్తుతులను స్వీకరించవలెను.

    7. దరికి చేరదగినవాడు, విశ్వపతి, యజమానులు పిలిచిన అగ్నీ ! నీవు ప్రకాశమానుడవు. సువీరుడవు. మేము నిన్ను స్థాపించినాము.

    8. నీవు రాత్రింబవళ్లు వెలుగుము. అందువలన మేము శుభంకర అగ్నివంతులము కాగలము. నీవు మమ్ము ఇష్టపడుము. నీవు సుందర స్తుతివంతుడవగుదువు.

    9. అగ్నీ ! ప్రతాపశాలి యజమాని ధనలాభమునకు నీ వద్దకు చేరును.

    10. శుభ్రశిఖావంత, అమర, స్వయం శుద్ధ, శోధక, స్తుతియోగ్య అగ్నీ ! రాక్షసులను హింసించుము.

    11. బలపుత్రా ! నీవు జగదీశ్వరుడవై మాకు ధనము ఇమ్ము. భగుడు సహితము మాకు వరణీయ ధనము ఇవ్వవలెను.

    12. అగ్నీ ! నీవు పుత్ర, పౌత్రాదియుక్త అన్నము ఇమ్ము. సవిత సహితము వరణీయ ధనము ఇవ్వవలెను. భగుడు అదితి కూడ ఇవ్వవలెను.

    13. అగ్నీ ! మమ్ము పాపములనుండి రక్షింపుము. జర ఎరుగని దేవా ! హింసకులను అత్యంత తాపకర తేజమును దహించును.

    14. నీవు దుర్ధర్షుడవు. ఇప్పుడు మా మానవుల రక్షణకుగాను లోహ నిర్మిత శతభుజపురము ఏర్పరచుము.

    15. అహింసనీయ అంధకారమును తొలగించు అగ్నీ ! మమ్ము పాపములనుండి, పాపకర్మములనుండి రక్షింపుము.


                                      పదహారవ సూక్తము

             ఋషి - వసిష్ఠుడు దేవత - అగ్ని - ఛందస్సు - బృహతి.

    1. బలపుత్రుడు, ప్రియుడు, విద్వత్ శ్రేష్ఠుడు, గతిశీలుడు, సుందర యజ్ఞవంతుడు, అందరిదూత ఆనిత్యాగ్నిని స్తోత్రములతో పిలుచుచున్నాను.

    2. అగ్ని రోచకుడు. అందరిపాలకుడు. అతడు రెండు గుఱ్ఱములను రథమున పూన్చును. దేవతలవద్దకు ఎంతో వేగముగా చేరును. అతడు సుందర రూపమున ఆహూతుడు. సుందర స్తుతివంతుడు. సుందర యజ్ఞవంతుడు. సుందరకర్ముడు. వసిష్ఠ వంశజుల హవిరూప ధనము అగ్నిని చేరవలెను.

    3. అభీష్టవర్షి, ఆహూతుడగు అగ్ని తేజము పైకి పైకి పోవుచున్నది. రోచకమగు ఆకాశమంటుచు పొగలు లేచుచున్నవి. మానవుడు నిప్పును మండించుచున్నాడు.

    4. బలపుత్ర అగ్నీ ! నీవు కీర్తిశాలివి. మేము నిన్ను దూతను చేస్తాము. హవ్యము ఆరగించుటకు దేవతలను పిలువుము. మేము నిన్ను యాచించినప్పుడు మానవులకు భోగయోగ్యమగు ధనము అందించుము.

    5. లోకములు మన్నించు అగ్నీ ! మా యజ్ఞమున గృహపతివి, పోతవగుము. వర్థిల్లుము. వరణీయ హవ్యమును యజింపుము, ఆరగింపుము.

    6. సుందర కర్ముడవగు అగ్నీ ! నీవు రత్నదాతవు. యజమానికి రత్నములిమ్ము. మా యజ్ఞమున అందరిని చురకువారిని చేయుము. వృద్ధిచెందు హోతను మరింత వర్థిల్లచేయుము.

    7. సుందరరూప ఆహూత అగ్నీ ! నీకు స్తోతలు ప్రియులు కావలెను. జలసముదాయమునకు, గోసముదాయమునకు దానములిచ్చు ధనవంతులు సహితము నీకు ప్రియులుకావలెను.

    8. ఏ గృహములందు ఘృతహస్త, అన్నరూప, హవిర్లక్షణ దేవి పూర్ణ రూపమున ఆసీనురాలగునో, అగ్నీ ! ఆ ఇంటివారిని ద్రోహులనుండియు నిందకులనుండియు కాపాడుము. మాకు కలకాలము నిలుచునట్టి స్తుతియోగ్యమగు సుఖములను ప్రసాదించుము.

    9. అగ్నీ ! నీవు హవ్యవాహకుడవు. విద్వాంసుడవు. ముదము కలిగించునదియు, ముఖమునందున్న జిహ్వ-జ్వాల-తోమాకు ధనము ఇమ్ము హవ్యదాతను కర్మకు ప్రోత్సహించుము.

    10. యువతమ అగ్నీ ! యశముకోరి సాధకరూపము, అశ్వాత్మకమగు హవ్యము అర్పించు యజమానిని పాపముల నుండి రక్షింపుము. నూరు నగరములతో పాలింపుము.

    11. అగ్ని ధనదాత. అతడు మీ హవిపూర్ణ స్రుక్కును వాంఛించును. సోమపాత్ర సిద్ధము చేయుము. సోమదానము చేయుము. అనంతరము అగ్ని నిన్ను భరించును.

    12. దేవతలారా ! మీరు ఉత్తమ బుద్ధి అగ్నిని యజ్ఞవాహకుని హోతను చేసినారు. అట్టి అగ్ని పరిచర్యకారులగు హవ్యదాతలకు శుభంకరము, పౌరుషవంతము, రమణీయమగు ధనమును ప్రసాదించవలెను.


                                        పదిహేడవ సూక్తము

             ఋషి - వసిష్ఠుడు దేవత - అగ్ని - ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! శోభన సమిధలతో సమృద్దుడవగుము. అధ్వర్యలు అందముగా కుశలు పరచవలెను.

    2. దేవాభిలాషులకుగాను యజ్ఞద్వారములు దేవద్వారములు, తెరువుము, యజ్ఞాభిలాషులగు దేవతలను ఈ యజ్ఞమునకు పిలువుము.

    3. జాతధన అగ్నీ ! దేవతలముందుకు వెళ్లుము. హవ్యముతో దేవతల యజ్ఞము చేయుము. దేవతలను శోభన యజ్ఞవంతులను చేయుము.

    4. జాతధన అగ్నీ ! అమర దేవతలను సుందర యజ్ఞ యుక్తులను చేయుము. హవ్యముతో యజ్ఞము చేయుము. స్తోత్రములతో ప్రసన్నులను చేయుము.

    5. సుబుద్ధి అగ్నీ ! మాకు వరణీయ సమస్త ధనములను దానము చేయుము. నేడు మా ఆశీస్సులు నిజము కావలెను. "సత్యాభవన్త్వాశిషోనో అద్య"

    6. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. ఈ దేవతలే నిన్ను హవ్యవాహకుని చేసినారు.

    7. నీవు ప్రకాశమానుడవు. మేము నీకు హవి సమర్పింతుము. నీవు మహామహుండవు. దగ్గరకు చేర యోగ్యుడవు. మాకు రత్నములు ధనము దానము చేయుము.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత అయిదవ అష్టకము ఏడవ మండలమున మొదటి అనువాకము సమాప్తము)


                రెండవ అనువాకము             పద్దెనిమిదవ సూక్తము

                ఋషి - వశిష్ఠుడు దేవత - ఇంద్రుడు - ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! మా పితరులు నిన్ను స్తుతించినారు. నీ నుండి సకల మనోహర ధనములను పొందినారు. నీ వలననే గోవులు సులభముగా పాలుపితుకుటకు యోగ్యములు అగును. నీలోనే అశ్వములు ఉన్నవి. దేవాభిలాషులకు నీవు తగినంత ధనము ప్రదానము చేతువు.

    2. ఇంద్రా ! నీవు భార్యలతో కూడి రాజువలె వెలుగొందుదువు. నీవు విద్వాంసుడవు. కవివి. స్తోతలకు హిరణ్యాదులు దానము చేయుము. గోవులు, అశ్వములిచ్చి కాపాడుము. మేము నిన్ను కోఱుకుందుము. ధనము కొఱకుగాను మమ్ము సంస్కారవంతులను చేయుము.

    ("రాయె శిశిషి" మంత్రభాగము. "ధనార్థంచ సంస్కురు" శాయణుని వ్యాఖ్య. సంస్కారవంతులవద్ద ఉన్న ధనమునకు మాత్రమే సార్థకత ! ధనము కలుగుటకు సంస్కారము అవసరము !! సంస్కారములేనివాని ధనము పిచ్చివాని చేతిరాయి !!! అది సమాజమునకు హానికారకమగును. నేడు ధనము సంస్కారహీనుల పరమైనది. దాని దుష్ట పరిణామములు నగ్న నేత్రమునకు అగుపించుచున్నవి)

    3. ఇంద్రా ! ఈ యజ్ఞపు స్పర్ధమాన, రమణీయ స్తుతులు నీవద్దకు చేరవలెను. నీ ధనము మావద్దకు చేరవలెను. మేము నీ కృపాపాత్రులము కావలెను. మేము సుఖించవలెను.

    4. ఉత్తమ తృణవంతమగు గోశాలలోని గోవులవలె, ఇంద్రా ! నిన్ను పితుకుకోరికగలవాడై. వసిష్ఠుడు స్తోత్రరూపవత్సమును చేయును. సమస్త లోకములు నిన్నే గోవులకు స్వామి అనును.

    ఇంద్రా ! సుందరములగు మా స్తుతులవద్దకు విచ్చేయుము.

    5. స్తవనీయ ఇంద్రా ! పురుష్ణి నది పొంగిపొరలుచున్నపుడు సహితము నీవు సుదాసుడను రాజును నీరు అంటకుండ నదిని దాటు యోగ్యుని చేసినావు. స్తోతల కొఱకుగాను నదులు జనులను అడ్డగించు శాపమును తొలగించినావు.

    6. యాజ్ఞికుడు, పురోదాత తుర్వశుడను రాజు ఉండెను. అతడు చేపవలె నీటకట్టబడినాడు. అయినను భృగువులు, ద్రుహ్యులు, ధనాశచే సుదాసు, తుర్వశులను విడిపించినారు. వారిద్దరిలో ఇంద్రుడు, తుర్వశుని వధించినాడు. సుదాసుని రక్షించినాడు.

    7. హవ్యపాచకులు, కళ్యాణముఖులు, దీక్షితులు, శుభప్రదులు ఇంద్రుని స్తుతింతురు. సోమపానమున మత్తుడగు ఇంద్రుడు ఆర్యుని గోవులను హింసకులనుండి విడిపించినాడు. యుద్ధముచేసి గోతస్కర శత్రువులను వధించినాడు.

    8. దుష్టమానసులు, మందమతులగు శత్రువులు పురుష్ణి నదిని త్రవ్వుచు దాని దరులను కూల్చినారు. ఇంద్రుని కృపవలన సుదాసుడు విశ్వవిఖ్యాతుడు అయినాడు. చయమాన పుత్రుడు కవిని పశువును పడేసినట్లు పడవేసి చంపినాడు.

    9. ఇంద్రుడు పురుష్ణి తటములను బాగుచేసినాడు. అప్పుడు ఆ జలము పోవలసిన చోటునకు నదిలోనికి వెళ్లిపోయినది. ఇటునటు పోలేదు. సుదాసుని అశ్వము సహితము గంతవ్యస్థలము చేరినది. ఇంద్రుడు సుదాసుని కొఱకుగాను మానవులలో సంతానవంతులు, వాగుడు శత్రువులను వారి సంతానముల సహితముగా వశపరచుకున్నాడు.

    10. కాపరిలేని గోవులు చేలమీదికి పోయినట్లు తల్లిపంపిన మరుద్గణములు తమ పూర్వ ప్రతిజ్ఞననుసరించి మిత్రుడగు ఇంద్రునివైపు వెళ్లినారు. మరుత్తుల నియుక్తులు సహితము సంతోషించినవి.

    11. కీర్తి ఆర్జించుటకుగాను సుదాసుడను రాజు రెండుచోట్ల ఇరువది ఒక్క మందిని వధించినాడు. యువ అధ్వర్యుడు యజ్ఞగృహమున కుశలు కోసినట్లు, ఆ రాజు శత్రువులను కోతకోయును, వీరుడగు ఇంద్రుడు సుదాసుని సహాయమునకు మరుత్తులను సృష్టించినాడు.

    12. అదికాక ఇంద్రుడు శ్రుత, కవష, వృద్ధ, ద్రుహ్య, నామకులను నీళ్లలో ముంచినాడు. అప్పుడు ఇంద్రుని కోఱుకొని ఇంద్రుని స్తుతించినవారు సహచరులయినారు మిత్రులయినారు.

    13. ఇంద్రుడు స్వశక్తితో ఉక్త శ్రుత, మున్నగు సుదృఢ నగరములను ఏడు విధముల రక్షా సాధనములను అతిత్వరగా ధ్వంసము చేసినాడు. అను పుత్రుడు గృహుని తుత్సునకు ఇచ్చినాడు ఇంద్రా ! మేము దుష్టవచనులను గెలువవలెను అట్లని అనుగ్రహింపుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.