Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
ఆకలితో అలమటిస్తూన్న బాలలకు పాలుయిచ్చినందుకు ఒక తుఫానులేవబోతూంది. దేవాలయద్వారందగ్గర నిల్చినకార్లల్లోంచి దిగిన డజనుమందిలోనూ కాలూస్మృతిపథంలో, నిల్చిపోయిన కొందరుకూడా ఉన్నారు. లావై, చట్టిముక్కుగల బంగారు వర్తకుడూ, పుల్లలా బక్కగా ఉన్న బంగారు వర్తకుడూ, కన్నపుదొంగలాంటి చూపుగల మూతకళ్ళ ఆసామి, నున్నని గడ్డంగల ప్రభుత్వాధికారీ, తట్టంత తలపాగా ఉన్న హోటల్ మేనేజరూ ఉన్నారు. మిగతావారిని కాలూ అంతకుముందు చూడకపోలేదు. కాని అతనికి వారు అంతగా గుర్తులేరు.
వారు పూజారిని పిలిపించి మాట్లాడారు. కాలూ ఇరకాటంలో ఉంటే చూడాలని పూజారి ఆదుర్దాగా ఉన్నట్లుకనిపించాడు. దాతలు అన్ని విషయాలు కనిపెడ్తూనే ఉన్నారని పూజారి యింతకుముందోసారి కాలూతో
ఈ రెండు రోజులూ ఆ పిల్లలు, అదృష్టవంతులు. ఎల్లుండినుంచి ఆ పిల్లలు పాపం మళ్ళీ......వారిమీద ఉండే సానుభూతితో కాలూ నాలుక ఎండిపోయింది.
ఈ సాయంకాలానికి సెవాయ్ నుంచి అదనంగా రెండు బకెట్లు పాలుకూడా వస్తాయి. హోటల్ యజమాని నగరంలో లేకున్నా మేనేజర్ టెలిగ్రాంద్వారా ఆదేశం అందుకున్నాడు. పాలుగంగలో కలుపాలని వారు పట్టుపడ్తే?
పూజారి సగౌరవంగా వారిని గుళ్ళోకి తీసికెళ్ళాడు. ఒక్కొక్కరూ గర్భగుడిముందున్న పెద్ద కంచుగంటను రెండు రెండుసార్లు మ్రోగించారు. ఆ ధ్వని వారిచెవుల ద్వారా ఆత్మలో ప్రవేశించి అజ్ఞానాంధకారాన్ని పారదోలి పాలనుగురించి తగాదాపడ్డానికి గట్టిశక్తి స్తోమతలు ఇస్తుంది!.
వారంతా కాలూను ఎదుర్కోవడానికి సిద్దం అయినారు. కాలూ ముఖంమీద ఒక స్థిరనిర్ణయం కనిపించింది. అభిషేకపు పాలల్లోంచి ఒక్కచుక్కైనా గంగలో కలుపరాదని అతడు దృఢనిశ్చయం చేసుకున్నాడు.
నిముషంలో జనమంతా మండపంవైపుకు వచ్చారు. కాలూ వారిని అభినందించి ఆహ్వానించాడు. చెప్పులు అక్కడేవదిలి అంతా చలవరాతి మెట్లవైపు నడిచారు.
వచ్చినవారంతా గుండ్రనిస్తంభాలకు ఆనుకుని తివాసీలమీద కూర్చున్నాడు.
"ఇదొక మహాపర్వం" అన్నాడు కాలూ.
మూతకండ్ల మహానుభావుడు "శివరాత్రిలాంటి పర్వదినం లేనేలేదు" అన్నాడు.
నొసట సమదూరం లేకుంటంచూసి 'ఇంకా భగవద్ధర్శనం చేసుకోలేదా?' అని కాలూ అందర్ని అడిగాడు.
కన్నపుదొంగ సరిగ్గా కీలుపట్టుకున్నాడు.
"మా రాకనుగురించి మీకు వేరేచెప్పాల్సిన అవసరం లేదనుకుంటా."
కాలూ ఆశ్చర్యం నటించి 'ఏఁ, భగవద్దర్శనానికి కాదా?' అని అడిగాడు.
"అవునవును. అందుకే కాని ఒక విషయం మాకు బాధగా ఉంది. అదే అభిషేకపు పాలవిషయం." అందుకున్నాడు మూతకళ్ళవాడు.
"ఎందుకలా ఆదుర్దా పడ్తారు. అసలువిషయం వినకుండానే?"
"ఏమిటీ" అని అందరికళ్ళూ పూజారిమీద పడ్డాయి.
"అదేమిటి అలా అంటారు. విశ్వనాథుడేమన్నా మనసు మార్చుకుని పాలు గంగలో కలుపుతున్నాడా? పోనీ అలాచేస్తున్నా మంత్రహీనం అవుతే ఏంప్రయోజనం?" అని గట్టిగా అరిచినట్లు అన్నాడు అర్చకుడు.
"పూజారి మీకు చెప్పింది నిజమే. కాని దాని అర్ధంవేరు."
'అర్ధం ఏమిటి?'
"పాలు వృధా కావడంలేదు. అవి పూర్తిగా వినియోగపడ్తున్నాయి"
లావుపాటి బంగారువర్తకుడు మాటకు అడ్డువచ్చి "పాలు గంగాభవానికి అందుతున్నాయా? లేదా? అనే విషయం మాకు కావాల్సింది" అన్నాడు కచ్చితంగా.
"పాలు గంగాభవాని బిడ్డలకు అందుతున్నాయి."
"గంగాభవాని బిడ్డలా!"
"ఈ దేశం గంగాభవానిది. వంగం గంగభిక్ష లక్షల సంవత్సరాల పాటు మట్టిని తెచ్చిపేర్చి సాగరునిలో లీనంఅయి వున్న ఈ భూమిని పైకితెచ్చింది జాహ్నవి. అదే వంగం. నవవంగం. స్వర్ణవంగం. అలా ఈ గడ్డను సిద్దంచేసిన తల్లి నీటినిచ్చి పచ్చనిపంటలు పండిస్తూంది. ఆ మహాతల్లి లేకున్నట్లైతే మనపల్లెపదాల్లోని సోనార్ బంగ్లా (స్వర్ణవంగం) ఉండేదేకాదు"
"అక్కడేవచ్చింది చిక్కంతా. అలాటి మహాతల్లి ఆమె భా......."
"ఆగండి. మీరు ఆకలితో అలమటిస్తూంటే మీతల్లి పొట్ట నింపుకుంటుందా? ఆమెబిడ్డలు ఆమెపక్కనే అన్నార్తులై కృంగి కృశించి నశిస్తూంటే పాలు ఆ తల్లికి పోయడంకంటే ఆమెను అవమానపర్చడం ఎలా ఉంటుంది?"
"దేవతలూ మనుషుల్లాంటివారేనా?"
"మనం దేవుణ్ణి మానవరూపంలో పూజిస్తున్నాం. వారికీ మనలాంటి అవసరాలు ఉంటాయని అనుకుంటున్నాం. అందుకే ఆ పరమేశ్వరునికి పా,లు అర్పిస్తున్నాం. మన అవసరాలే దేవునికి ఉంటాయనుకున్నప్పుడు మన భావనలే వారికీ ఉన్నాయనుకోవాలి. గంగానదిలో సజీవమైన తల్లిని చూడాలి"
"ఇవన్నీ శుష్క ప్రియాలు. ఆకలితో వేలమంది చచ్చారు. చస్తున్నారు. నలుగురు ఎక్కువో తక్కువో ఛస్తే వచ్చేభేదం ఏమిటి? ఈ సమస్య వెధవ నాలుగు ప్రాణాలకంటే ఉత్క్రుష్టం అయింది."
హోటల్ మేనేజర్ అందుకున్నాడు. "అయిందేదో అయింది. నాక్కావల్సింది ఈ సాయంకాలపు పాలనుగురించి. నా పాలు రేపు ప్రాతఃకాలం సమంత్రకంగా గంగలో కలిపివేయబడాలి. అదీ నా కోర్కె."
"నా కోర్కె కూడా అదే"
"నేనూ అదే అంటున్నా"
"నేను, నేననేదీ అదే. ఈ ఒప్పందం తూచ తప్పకుండా అమలు జరగాలి."
కాలూ ముఖంఎత్తి "ఒప్పందం?"
"అవును, ఒప్పందమే గంగలో పాలు కలపకుంటే పూజ ఎలా పూర్తిఅవుతుంది?"
"నేను పాలు గంగలో కలుపుతానని మీకు మాట ఇచ్చానా?"
"సరిగ్గా అదే మాటల్లో చెప్పలేదనుకోండి. కాని మీరు స్వయంగా ఏర్పర్చిన ఆచారాన్ని మీరే భంగపరుస్తారని ఎవరనుకుంటారు?"
"ఆ పాలు ఒట్టిపాలేమీకావు. వాటితో మా ప్రార్ధన కూడా దేవునికి చెందాలనేవిషయం మీకు తెలియదా?" అన్నాడు సన్నటి బంగారు వర్తకుడు.
"అవును. ఆ పాలు మా ప్రార్ధనాయుక్తంగా ఉంటాయి. పూజ సరిగా జరుగుతేనే మా అభిష్టం నెరవేరుతుంది" అన్నాడు లావుపాటి బంగారు వర్తకుడు.
అమాంతంగా వారిద్దరికీ ఒకేసారి ఒకరిమీద ఒకరికి అనుమానం కలిగినట్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
"మొన్నటి నా పాలన్నీ వృధా అయినాయి. మళ్ళీ మరుసటినెల నావంతువరకన్నా సంపూర్ణార్చన జరగాలని నా కోర్కె"
"నా కోర్కె అదే. పాలల్లో సుగంధద్రవ్యాలూ, పంచదార, బాదాం కలపడానిగ్గూడా నేను సంసిద్దున్ని" అన్నాడు సన్నటి బంగారు వర్తకుడు.
"ఏమిటీ! నాకే అంత దరిద్రంపట్టిందీ? నేనూ పాలల్లో సుగంధద్రవ్యాలూ పంచదారా కలుపుతా" నన్నాడు లావుపాటి బంగారు వర్తకుడు తోటి వర్తకునితో పోటీపడుతూ.
వారి అనుమానాలు స్థిరపడ్డాయి. ఇద్దరూ ఒక్కొక్కరు కటువుగా చూసుకున్నారు.
వారి ముఖాల్లో కనిపించిన భావాల్ను కాలూ పసికట్టాడు. 'ప్రత్యేక విరుద్దమైన కోరికలతో ఒకే వస్తువును భగవంతునికి సమర్పించినప్పుడు అతడు ఏంచేస్తాడు? ఎవరి ప్ర్రార్ధనణు అంగీకరిస్తాడు?' అని తనను తానే ప్రశ్నించుకున్నాడు కాలూ.
కాలూ కన్నపుదొంగవైపు తిరిగి "నీకూ ఒకకోర్కె ఉంది కదూ?" అని ప్రశ్నించాడు.
"నాకా? ఎందుకుండదూ?"
కాలూ ప్రభుత్వాధికారివైపు చూచాడు.
"నీ ప్రమోషనుకు ఇంకెవరైనా అడ్డుతగులుతూ ఉండవచ్చు"





