Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    6. వేదిమీద దర్భలు పరచబడి ఉదకములు కూడ చేర్చబడును. అందువలన వేది తృణయుక్తము, ఉదకయుక్తము అగును. అట్టి తృణజలోపేతమగు వేదియే యజ్ఞకర్తకు స్థానము అగుచున్నది.

    7. వేది మధ్యభాగమున జలపూర్ణపాత్రను ఉంచవలెను. అందువలన యజమాని తనస్థానమునందు తృణసమృద్ధిని, ఉదక సమృద్ధిని కలిగించిన వాడగుచున్నాడు.

    8. 'పూర్ణకుంభమా! నీవు శోభనమైన దానవు. నాకొరకు యోగ్యమైన దానవు అగుము' అని మంత్రము చెప్పుచున్నది.

    ఉదకములు యజ్ఞసాధనములు. కావున యజ్ఞస్వరూపలు. అవి జీవన హేతువులు. కావున అమృతరూపములు. అందువలన యజమాని అమృతస్వరూపమగు యజ్ఞమును తనయందు చేర్చుచున్నాడు.

    9. 'సర్వభూతములు యజ్ఞము చేయువానిని అనుసరించుచున్నవి. దేవతలు, ఋత్విజులు తూర్పుదిశను పావనము చేయుదురుగాక' అనునది మంత్రము.

    ఏ భూతములు యజ్ఞము చేయువానిని అనుసరించుచున్నవో యజమాని వాని సహితముగ అవభృథమును పొందుచున్నాడు. ఇదియే దర్శపూర్ణమాస యాగముల అవభృతము అగుచున్నది.

    10. దేవతలు విష్ణువును ప్రధాన దేవతగా చేసినారు. ఛందోభిమాన దేవతలతో కూడినారు. ఈ లోకములను అజేయములను చేసినారు. సర్వత్ర జయించినారు. పాదక్షేపముల వలన యజమానియే విష్ణువు అగుచున్నాడు. ఛందోభిమాన దేవతల సహితుడు అగుచున్నాడు. ఈ లోకములను అజేయములను చేయుచున్నాడు. సర్వత్ర జయించుచున్నాడు.

    11. 'ప్రథమపాదన్యాసమా! నరక ప్రదమగు పాపమును నశింపచేయునట్టి నీవు విష్ణుపాదన్యాసమవు అగుచున్నావు' అని మంత్రము.

    గాయత్రి భూలోకస్వామి. త్రిష్టుప్ అంతరిక్షస్వామి. జగతి ద్యులోకస్వామి. అనుష్టుప్పు దిశలకు స్వామి. యజమాని ఈ ఛందస్సు అభిమాన దేవతల సహితుడై ఈ లోకములను అజేయము చేయుచున్నాడు. తాను సర్వత్ర జయించుచున్నాడు.

                                  ఆరవ అనువాకము

                        (ఉపస్థానాది మంత్రముల వ్యాఖ్యానము.)   

    1. ఆహవనీయాగ్నీ! నీ అనుగ్రహమున మేము సువర్లోకమును, తదుపరి ఆదిత్యలోకమును పొందినాము అని చెప్పబడినది. అట్లగుట వలన యజమాని స్వర్గమునే పొందుచున్నాడు.

    2. 'ఆహవనీయాగ్నీ! నీ అనుగ్రహమున నేను స్వర్గమును పొందుటకు భంగము కలుగలేదు. నీ కొరకు నేను చేయు తపస్సునకు భంగము కలుగలేదు' అన్నది మంత్రము. కావున మంత్రోక్త ప్రకారముగనే జరుగును.

    3. 'సూర్యదేవా! నీవు సుభువువు. కిరణములు గల ఛంద్రాది దేవతలందు శ్రేష్ఠుడవు. ఆయువును ఇచ్చువాడవు. నాకు ఆయువు ప్రసాదించుము' అనునది మంత్రము. యజమాని ఇట్టి ఆశీస్సులనే కోరుచున్నాడు.

    4. విష్ణుపాదన్యాసములను దాటిన వాడు ఈ లోకములను దాటుచున్నాడు. విష్ణుపాద విక్షేపములు స్వర్గమునకు మార్గములు అగుచున్నవని బ్రహ్మవాదులు చెప్పుచున్నారు.

    శత్రువులను జయించి, ఈ లోకమును అనుభవించి, స్వర్గము చేరి, తిరిగి ఈ లోకమునకు వచ్చిన యజమానియే వాస్తవముగా విష్ణుపదన్యాసములను అనుసరించినవాడు అగుచున్నాడు.

    5. 'నేను శత్రువులను దిశలనుండియు, దివము నుండియు తొలగించుచున్నాను' అనునది మంత్రము. ఇదియే స్వర్గము నుండి ఈ లోకమునకు దిగివచ్చు విధము. ఈ మంత్రప్రభావమున యజమాని శత్రువులను జయించి, ఈ లోకమును అనుభవించి, స్వర్గము చేరి, ఈ లోకమునకు మరలి వచ్చుచున్నాడు.

    6. 'నేను సూర్య తేజస్సును కలుసుకుందునుగాక' అనుటవలన యజమాని ఈ లోకమున కీర్తి ప్రతిష్ఠలు పొందుచున్నాడు.

    7. 'నేను ఆదిత్య సంబంధమగు ఆవృతిని అనుసరించి తిరుగుచున్నాను' అని చెప్పబడినది. ఇంద్రుడు ఆదిత్యుడు అగును. కావున యజమాని ఆదిత్యుని ఆవృతిని అనుసరించియే సంచరించుచున్నాడు.

    8. ఆదిత్యుడు కుడివైపుగా తిరుగుచున్నాడు - ప్రదక్షిణ చేయుచున్నాడు. దానిని బట్టియే వ్యక్తియొక్క కుడిభాగము శక్తి కలది అగుచున్నది. అందువలన ఆదిత్యుని ప్రదక్షిణను అనుసరించియే నరుడు తిరుగవలెను.

    9. 'నేను సంతానముతో కలసి ఉందునుగాక. సంతానము నాతో కలసి ఉండునుగాక' అని చెప్పబడినది. అట్లగుట వలన యజమాని అటువంటి ఆశీస్సులను అభిలషించువాడు అగుచున్నాడు.

    10. 'అగ్నీ! సమిధచే వెలిగిన నీవు నాకొరకు ప్రకాశించుము. నిన్ను దీపింప చేసిన నేను నీ అనుగ్రహమున ప్రకాశించెదను' అనుటవలన మంత్రోక్త ప్రకారముగనే జరుగ గలదని తాత్పర్యము.

    11. 'ఆహవనీయాగ్నీ! నీ అనుగ్రహమున యజ్ఞము ధనము కలది యగుచున్నది. నేను సహితము ధనవంతులందు అధికుడను అగుదునుగాక' అనుట యజమాని అట్టి ఆశీస్సులను అర్థించుట అగుచున్నది.

    12. గార్హ పత్యాగ్ని సన్నిధి యందు బహుపాతకములు జరుగుచుండును. కావున అగ్ని, పవమాన దేవతాకములైన "అగ్న ఆయుగంషి" మున్నగు ఋక్కులచే గార్హ పత్యాగ్నిని సేవించవలెను. అందువలన గార్హ పత్యాగ్నిని పవిత్రము చేసినవాడగును. యజమాని ఆ ఋక్కుల వలన స్వయముగా పవిత్రుడు అగుచున్నాడు.

    13. అగ్నీ! నీవు గృహపతివి. నీ అనుగ్రహమున నేను మంచి గృహపతిని అగుదునుగాక. నేను గృహపతినై నిన్ను పూజించుచున్నందున నీవు గృహపతివి అగుము. వంద హేమంతములు నిన్ను పూజించుచున్న నేను నాకు బుద్ధిమంతుడగు పుత్రుడు కలుగవలెనని ప్రార్థించుచున్నాను. అట్లనుట వలన బ్రహ్మవర్చస్సు గల పుత్రుడు కలిగినాడు.

    14. యజ్ఞమును అనుష్ఠించి ఉద్వాసన చేయని యజమాని అప్రతిష్ఠ పాలగుచున్నాడు.

    యజ్ఞమా! నిన్ను ఏ ప్రజాపతి నియమించినాడో అతడే నిన్ను విముక్తుని చేయును గాత అని మంత్రము.

    ప్రజాపతి కిం శబ్దవాచ్యుడు. కావున యజమాని ప్రజాపతి చేతనే యజ్ఞము ప్రారంభించి ప్రజాపతి చేతనే ఉద్వాసన చేయవలెను. అందువలన అతనికి ప్రతిష్ఠ కలుగును.

    15. ఉద్వాసన చేయని యజ్ఞము యజమానిని మరింత కాల్చుటకు సమర్థమగును. అగ్నీ! యజ్ఞమును ఆచరించినాను అని మంత్రము. ఆ మంత్రము యజ్ఞమునకు శాంతి కలిగించుచున్నది. మంటలను చల్లార్చుచున్నది.

    16. యజ్ఞము యొక్క పునరావృతిని ఎరుగని యజమానికి యజ్ఞము విముఖము అగుచున్నది. పునరావృతము అగుటలేదు. పునరారంభము తెలిసి యజ్ఞము చేసినవానికి యజ్ఞము అభిముఖముగనే పునరావృతము అగుచున్నది.

    17. యజ్ఞము పూర్తి అయినది. యజ్ఞము పునరావృతమగును గాక అని మంత్రము. ఆ మంత్రము వలననే యజమాని యజ్ఞమును పునరావృతము చేయుచున్నాడు.

    18. ఆహితాగ్ని యగుచు సభలేని యజమానికి ఎన్నటికిని ప్రకాశవంతమగు సభ కలుగకున్నది. పశవః ఖలు బ్రాహ్మణస్య సభా - బ్రాహ్మణుని సభ పశువులదే అగును.

    19.యజ్ఞకర్త యాగము చేసి తూర్పుదిశగా జరిగి అగ్నీ! పునరాగమనము కోరబడుచున్న యజ్ఞము బహుగోమంతము, అజవంతము, అశ్వవంతము కావలెనని ప్రార్థించవలెను. అందువలన యజమాని సభావంతుడు - బహు పశువంతుడు - సంతాన, అన్న సమృద్ధి కలవాడు అగును.

                              ఏడవ అనువాకము

           (ఈ అనువాకము నుండి వాజపేయ మంత్రములు.)

    1. సవితాదేవా! యజ్ఞమును ప్రవర్తింప చేయుము. యజ్ఞపతికి సంపద ప్రసాదించుము. దివ్య గంధర్వుడు జనులకు విజ్ఞానము కలిగించువాడు. అతడు మాకు విజ్ఞానము కలిగించును గాత. వాచస్పతి ఈ కర్మయందు మాకు వాక్కును కలిగించును గాత.

        (అధ్వర్యుడు సావిత్రిహోమము చేయవలెను.)

    2. రథమా! నీవు శత్రుంజయుడగు ఇంద్రుని వజ్రాయుధమవు. నీ సహాయమున ఇతడు తన శత్రువులను వధించును గాక.

        (యజ్ఞపదార్థముల రథమును వేదివద్దకు తేవలెను.)

    3. భూమి అన్నధాత్రి. అన్నము ఉత్పత్తి చేయుటకు గాను భూమిని అఖండమైన దానినిగా స్తుతించుచున్నాము. ఇది సమస్త భూజాతములకు నిలయమైన నేల. ఈ నేలమీద నివసించుటకు సవిత అనుమతించును గాత.

        (రథమును వేది మధ్యకు తేవలెను.)

    4. అన్నవంత అశ్వములారా! జలములందు అపమృత్యునివారక అమృతము ఉన్నదనియు, రోగనివారక ఓషధులు ఉన్నవనియు అందురు. మీరు అట్టి గుణవంతములగు జలములతో సంబంధము కలవారలు కండి.

        (అశ్వములను నీటితో కడుగవలెను.)

    5. అశ్వమా! వాయువు, మనువు, 25 మంది గంధర్వులు మొత్తము ఇరువది యేడు మంది - నిన్ను నాకన్న ముందు రథమునకు కట్టినారు. వారు నీకు వేగమును కలిగించినారు.

        (దక్షిణాశ్వమును రథమునకు కట్టవలెను.)

    6. అశ్వమా! నీవు నీటిని క్షీణింపనీయని దానవు. ఈ తరంగము మూపురము వలె ఎత్తైనది, ఉపద్రవమును పోగొట్టునది, అన్నము ఇచ్చునది అగును. ఆ తరంగము వలన నీవు మాకు అన్నమును సాధించుము.

        (గుర్రపు వీపును కడుగవలెను.)

    7. యజమానినగు నా ప్రథమ పాదక్షేపమా! నీవు విష్ణువుయొక్క తొలి అడుగుపెట్టుట వలన జయించబడిన భూలోకమవు. రెండవ పాదక్షేపమా! నీవు విష్ణువు యొక్క రెండవ అడుగు పెట్టుట వలన జయించబడిన అంతరిక్షమవు. మూడవ పాదక్షేపమా! నీవు విష్ణువుయొక్క పరాక్రమమున జయించబడిన త్రివిష్టపమవు అగుచున్నావు.

        (యజమాని అడుగులు వేయుచు రథమును చేరవలెను.)

    8. రథచిహ్నములు కలవియు- వాయువు యొక్క అగ్రపుధ్వని కలవియు - సంచరించునవియు - ఇంద్రియవంతములును అగు 'దురేహేతి' 'పతత్రి' అను పేర్లు గల కోరికలు తీర్చునట్టి అగ్నులు మమ్ము పారము చేర్చును గాత.

                               ఎనిమిదవ అనువాకము

                    (రథధావన మంత్రములు చెప్పబడుచున్నవి.)

    1. సవితృదేవుని అనుమతి కలుగవలెను. అన్నములను జయించు బృహస్పతి అనుగ్రహించవలెను. అప్పుడు నేను అన్నవిజేతను కాగలను.

    (అధ్వర్యుడు రథమును ఎక్కవలెను.)    

    2. సవితృదేవుని అనుమతి లభించవలెను. అన్నములను జయించు బృహస్పతి అనుగ్రహించవలెను. నేను మిక్కిలి వర్థిల్లుదును. స్వర్గమును అధిరోహింతును.

    (బ్రహ్మ రథచక్రమును అధిష్ఠించవలెను. దానిని ప్రదక్షిణముగ మూడుసారులు త్రిప్పవలెను.)

    3. సభాసదులారా! ఈ యజమాని ఇంద్రుని వంటివాడు. అతనిని ఆశీర్వదించుడు. అతనికి అన్నవిషయిక జయము కలిగించండి. యజమాని అన్నములను గెలుచును గాత.

    4. ఓ కొరడా! నీవు అన్నవతివి. అశ్వవతివి. యుద్ధమునందు అశ్వములను నడిపించుము.

    5. దక్షిణాశ్వమా! నీవు అశ్వజాతికి చెందినదానవు. మధ్యమాశ్వమా! నీవు సప్తి జాతి దానవు. ఉత్తరాశ్వమా! నీది వాజి జాతి యగుచున్నది.

    (అధ్వర్యుడు అశ్వములను తోలవలెను.)

    6. అశ్వములారా! మీరు అన్నము ఆర్జించవలసి ఉన్నది. వేగముగ పరుగెత్తండి. దేవతల అనుమతిచే అన్నము సంపాదించండి. ఎన్నో యోజనములు పరిగెత్తండి. కొన్ని యోజనములంత పరిగెత్తండి. త్వరగా గమ్యము చేరండి.

    (అధ్వర్యుడు రథమును తోలుచు పై విధముగా అనవలెను.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.