Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    9. అగ్నీ ! హవిర్దాతలకు అనంత అన్నము, ధనము జనులకు వినిపించు బలము ప్రసాదించుము. వైశ్వానరాగ్నీ ! నీవు రుద్ర వసువులతో కలిసి మాకు సుఖములనిమ్ము.


                                      ఆరవ సూక్తము

         ఋషి - వసిష్ఠుడు  దేవత - వైశ్వానరుడు  ఛందస్సు  త్రిష్టుప్

    1. నేను పురభేదకులకు ప్రణమిల్లుదును. సామ్రాట్టు బలశాలి, స్తుతియోగ్యుడు, ఇంద్రునివంటి వైశ్వానరుని స్తుతింతును. అతని కార్యములను కీర్తింతును.

    2. అగ్ని ప్రాజ్ఞుడు ప్రజ్ఞాపకుడు. పర్వతధారి. దీప్తిశాలి, సుఖదాత, ద్యావాపృథ్వులకు ప్రభువు. దేవతలు అట్టి అగ్నినే ప్రసన్నునిచేయుదురు. అగ్ని పురవిదారకుడు నేను అతని ప్రాచీనములును, మహాకార్యములను స్తుతించుచు కీర్తనలు గానము చేస్తాను.

    3. దస్యులు యజ్ఞశూన్యలు హింసావాక్కులు. శ్రద్ధా రహితులు. బుద్ధిశూన్యులు. యజ్ఞరహితులు, పమిమ్ నామకులు; అగ్నీ ! వారిని దూరము చేయుము. నీవు ప్రధానుడవై అన్య యజ్ఞశూన్యులను నీచులను చేయుము.

    4. నేతృత్వవంతుడగు అగ్ని అంధకారమున మునిగిన ప్రజను ప్రసన్నులను చేసినాడు. తన ప్రజ్ఞతో ప్రజలకు సరళ మార్గము చూపినాడు. నేను ధనాధిపతి, అనవనతుడు, యోద్ధులను అణచువాడగు అగ్నిని స్తుతింతును.

    5. ఆసురీ విద్యను ఆయుధముతో హీనపరచిన వాడు సూర్యపత్ని ఉషను సృష్టించినవాడు. అదిగో ఆ అగ్నియే ప్రజలను తన బలమున నిర్భంధించినాడు. నహుషరాజుకు పన్నులు ఇచ్చునట్లు చేసినాడు.

    6. సకల మానవులు తమ సుఖముకొఱకు ఎవని అనుగ్రహము పొందుటకు హవ్యసహితులై అరుదెంతురో ఆ వైశ్వానరాగ్ని పితృ, మాతృ తుల్యములగు ద్యావాపృథ్వుల మధ్యకు చేరినాడు.

    7. సూర్యుడు ఉదయించగనే వైశ్వానరాగ్ని అంతరిక్షపు అంధకారమును గ్రహించును. అగ్ని అంతరిక్షపు క్రింది అంధకారమును గ్రహించును. వారు సముద్రము, ద్యులోకము భూమినుండి అంధకారము గ్రహింతురు.


                                        ఏడవ సూక్తము

               ఋషి - వసిష్ఠుడు దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! నీవు రాక్షసుల పరాభవకర్తవు. అశ్వము వంటి వేగవంతుడవు. విద్వాంసుడవు. మా యజ్ఞమునకు దూతవగుము. దేవతలలో నీవు దగ్ధద్రుముడవని విఖ్యాతుడవు.

    2. అగ్నీ ! నీవు స్తుతియోగ్యుడవు. దేవతల మిత్రుడవు. నీ తేజోబలమున నేలమీద చెట్టు చేమను ధ్వనింపచేతువు. నీ జ్వాలలతో అరణ్యములను కాల్చి, బాటచేసికొని విచ్చేయుము.

    3.తరుణతమ అగ్నీ ! నీవు సుందర సుఖవంతుడవై ఆవిర్భవించినపుడు యజ్ఞము చేయబడును. కుశలు పరచబడును. స్తుతియోగ్యుడగు అగ్నియు, హోతయు తృప్తి చెందుదురు. అందరకు స్వీకరణీయమగు తల్లివంటి ద్యావాపృథ్వులు ఆహ్వానించబడుదురు.

    4. విద్వజ్జనులు యజ్ఞమున నేత అగ్నిని వెంటనే ఆవిర్భవింపచేతురు. అగ్నికి హవ్యము అర్పించువారి గృహములందు విశ్వపతి, మాదకుడు, మధువచనుడు, యజ్ఞవంతుడగు అగ్ని నివసించును.

    5. అగ్ని ద్యులోక, భూలోకములను వర్థిల్లచేయును. విశ్వస్వీకరణీయ అగ్నిని హోతలు యజ్ఞము చేయుదురు. హవ్యవాహకుడు, బ్రహ్మ, అందరిని భరించు అగ్ని ద్యులోకము నుండి వచ్చి మానవ గృహములందు తిష్ఠ వేసినాడు.

    6. ఇష్టముగా మంత్రములను సంస్కరించినవారు వాటిని వినదలచి వర్ధిల్లినవారు సత్యభూత అగ్నిని ప్రదీప్తము చేసిన మానవులు అన్నముతో ప్రాణులను వర్థిల్ల చేయుదురు.

    7. బలపుత్రా ! అగ్నీ ! నీవు వసువులకు పతివి. వసిష్ఠ గణములు నీ స్తోతలు. హవిష్మంతులను అన్నముతో శీఘ్రముగా వ్యాపింపచేయుము. మమ్ము ఎల్లప్పుడు స్వస్తి ద్వారా పాలింపుము. "పాతస్వస్తిభిః సదా నః"


                                         ఎనిమిదవ సూక్తము

                 ఋషి - వసిష్ఠుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్

    1. అగ్ని రూపమును ఘృతముచే ఆహ్వానించబడును. నేతలు హవియుక్తులై, నమస్కరించి అగ్నిని స్తుతింతురు. అతడే రాజు-స్వామి అగ్ని స్తుతులతో సమిద్ధుడగును. ఉషకన్నముందు అగ్ని ప్రదీప్తుడగును.

    2. ఇతడే హోత మాదకుడు విశాలుడు అగ్ని. మానవులు అగ్నిని మహామహుడుగా గణింతురు. అగ్ని వెలుగులు పరచును. కృష్ణ మార్గ (మసిదారి) అగ్ని భూమిమీద పుట్టి చెట్లలో పెరుగును.

    3. అగ్నీ ! నీవు ఏ హవిద్వారా మా స్తుతులను వ్యాపింప చేతువు స్తూయమానుడవై స్వధను పొందుదువు శోభన దానశీలి, అగ్నీ ! మేము ఎప్పుడు దుస్తర ధనములకు స్వాములము అగుదుము - భాగస్వాములమగుదుము.

    4. అగ్ని, సూర్యునివలె మహాప్రతాపశాలియై ప్రకాశము పొందినపుడు భరతుని ద్వారా ప్రఖ్యాతిగాంచును. యుద్ధమున పురు అసురుని పరాభవించిన దీప్యమాన, దేవతల అతిథి అగ్ని ప్రజ్వలితుడైనాడు.

    5. అగ్నీ ! నీకు నీవు కోఱిన హవి లభించినది. సమస్త తేజస్సులతో ప్రసన్నుడవగుము. స్తోతల స్తోత్రములు వినుము. స్తుతించబడి స్వయముగా నీ శరీరమును వర్థిల్లచేసి కొనుము.

    6.నూరు గోవుల విభాగకారి, వేయిగోవుల సంయుక్తకర్త, విద్యావంతుడు, కర్మిష్ఠి మహా వసిష్ఠుడు అగ్ని కొఱకని ఈ స్తోత్రమును సృష్టించినాడు.

    7. సూత్వామగ్నే ఈ మహే వశిష్ఠా ఈశానాం సూనోసహ సోవసూనాం!
    ఇష స్తోత్రుభ్యోమఘవద్య్భనే అనాంగూనయంపాత స్వస్తిభిస్సదానః||

                           ఏడవ సూక్తపు ఏడవ మంత్రము పునరావృతము


                                          తొమ్మిదవ సూక్తము

                  ఋషి - వసిష్ఠుడు దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని సకల ప్రాణులకు ఆధారభూతుడు. హోత, హర్షదుడు. ప్రజ్ఞాతముడు శోధకుడు, అగ్ని ఉషస్సు నడుమ జాగృతుడైనాడు. అతడు దేవతల, మానవుల ప్రజ్ఞాకారకుడు దేవతలకు హవ్యము. పుణ్యాత్ములకు ద్రవ్యము అందించువాడు.

    2. అగ్ని పణుల ద్వారములు బద్దలుకొట్టినాడు. అందుకే సుకృతాత్ముడయినాడు. మా కొఱకు బహుక్షీరయుక్తములు, అర్చనీయములగు గోవులను హరించినాడు. అతడు దేవతలను పిలుచువాడు. హర్షదుడు శాంతమనస్కుడు. అగ్ని రాత్రి చీకట్లను యజమానుని చీకట్లను పారద్రోలుచు కనిపించును.

    3. అగ్ని అమూఢుడు కవి, అదీనుడు దీప్తిమనంతుడు. శోభన గృహవంతుడు. మిత్రుడు, అతిథి, మాకు శుభప్రదుడు. అతడు దీప్తియుక్తుడయి ఉషస్సు ముఖమున శోభిల్లును. జలగర్భమున పుట్టును. ఓషధులందు ప్రవేశించును.

    4. అగ్నీ ! నీవు మానవుల యజ్ఞములందు స్తుతి యోగ్యుడవు. జాతధనుడగు అగ్ని యుద్ధములందు దీప్తుడై ప్రకాశించును. అతడు దర్శనీయ తేజమున శోభిల్లును. స్తుతులు సమిద్ధ అగ్నిని ప్రబోధితునిచేయును.  

    5. అగ్నీ ! నీవు దేవతలముందుకు దేవకార్యమునకు వెళ్లుము. ప్రజా సంఘములనువలె మా స్తోతలను హింసించకుము. మాకు రత్నములు ప్రసాదించుటకుగాను నీవు సరస్వతి, మరుద్గణములు, అశ్వినులు, జలము మున్నగు సకల దేవతల యజ్ఞములు చేస్తావు.

    6. అగ్నీ ! వసిష్ఠుడు నిన్ను సమిద్ధుని చేస్తాడు. నీవు కరకుమాటల రాక్షసులను వధించుము. జాతవేద అగ్నీ ! అనేక స్తోత్రములతో దేవతలను స్తుతించండి. "పాతయ స్వస్తిభిః సదానః"
   

                                      పదవ సూక్తము

             ఋషి - వసిష్ఠుడు - దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉషాప్రియుడగు సూర్యునివలె అగ్ని విస్తృత తేజమును ఆశ్రయించును. అత్యంత దీప్తిమంతుడు, కోరికలు తీర్చువాడు, హవ్యప్రేరకుడు, పరిశుద్ధుడగు అగ్ని కర్మలను ప్రేరేపించును. దీప్తితో ప్రకాశమునొందును. అగ్ని అభిలషులను జాగృతము చేస్తాడు.

    2. అగ్ని పగటిపూటనే, ఉషముందే, సూర్యునివలె శోభిల్లును. ఋత్విక్కులు యజ్ఞము విస్తరించుచునే మానవీయ స్తోత్రములు ఉచ్ఛరింతురు. విద్వాంసుడు, దూత, దేవతల వద్దకు వెళ్లువాడు, దూత శ్రేష్ఠుడగు అగ్ని ప్రాణులను ఆర్ద్రులను చేయును.

    3. అగ్ని దర్శనీయుడు. సుందరుడు. చక్కని నడకలవాడు. హవ్యవాహకుడు. మానవులకు స్వామి. దేవాభిలాషి, ధన యాచక, గతిశీల స్తుతిరూప వచనము అగ్నిముందు నిలుచును.

    4. అగ్నీ ! మా కొఱకుగాను నీవు వసువులతో కలిసి ఇంద్రుని ఆహ్వానించుము. రుద్రులతో కలిసి మహారుద్రులను ఆహ్వానించుము. ఆదిత్యులతో కలిసి విశ్వహితైషి అదితిని ఆహ్వానించుము. అంగిరులతో కలిసి బృహస్పతిని ఆహ్వానించుము.

    5. కోరికల మానవులు స్తుత్యుడు, హోత, యువతముడు అగ్నిని యజ్ఞములందు స్తుతిస్తారు. అగ్ని రేయివాడు. అతడు దేవతల యజ్ఞము కొరకు హవ్యదాతకు ఆరాటములేని దూత అగును.   


                                        పదకొండవ సూక్తము

                    ఋషి - వసిష్ఠుడు దేవత - అగ్ని ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! నీవు యజ్ఞప్రజ్ఞాపకుడవు. మహామహుడవు. నీవు లేకున్న దేవతలు ఉన్మత్తులు కాలేరు. నీవు దేవతలందరితో రథయుక్తుడవై విచ్చేయుము. ముఖ్యహోతవై కుశలమీద కూర్చుండుము.

    2. అగ్నీ నీవు గమనశీలుడవు. మనవులగు హవిర్దాతలు దౌత్య కార్యమునకుగాను ప్రార్థింతురు. ఒక యజమాని కుశలపై దేవతల సహితుడవై నీవు కూర్చున్నచో అతని రోజులు వెలుగును.

    3. అగ్నీ ! ఋత్విక్కులు మానవ హవ్యదాతలకొఱకు రోజుకుమూడుసార్లు నీలో హవ్యము అర్పింతురు. ఈ యజ్ఞమునకు దూతవైరమ్ము. మనువువలె యజ్ఞము చేయుము. మమ్ము శత్రువుల బారినుండి రక్షింపుము.

    4. అగ్ని మహాయజ్ఞములకు స్వామి. సకల సంస్కృత హవ్యములకు భర్త. వసువులు అగ్నియొక్క కార్యములను సేవింతురు. దేవతలు అగ్నిని హవ్యవాహకుని చేసినారు.

    5. అగ్నీ ! హవ్యభక్షణకుగాను దేవతలను పిలువుము. ఈ యజ్ఞమున ఇంద్రాని దేవతలను ఉన్మత్తులను చేయుము. దీనిని ద్యులోకమునందలి దేవతల వద్దకు తీసికొనిపొమ్ము "పాతస్వస్తిభిః సదా నః"


                                       పన్నెండవ సూక్తము

                 ఋషి - వసిష్ఠుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని తన గృహమున సమిద్దుడగను. ప్రదీప్తినొందును. అతడు తరుంతముడు. విస్తీర్ణుడు. ద్యావాపృథ్వుల మధ్యనిలిచినవాడు. విచిత్ర జ్వాలావంతుడు. సుందరుడు. ఆహూతుడు. సర్వత్ర సంచరించువాడు. అట్టి అగ్నివద్దకు మేము నమస్కరించి చేరుదుము.

    2. జాతధనుడగు అగ్ని తమ మహిమతో సకల పాపములను తుడిచివేయును. అగ్ని యజ్ఞగృహమున స్తుతించబడును. అతడు మమ్ము పాపములనుండి, నిందాకార్యములనుండి రక్షించవలెను. మేము అగ్నిని స్తుతింతుము. అతని యజ్ఞము చేస్తాము.

    3. అగ్నీ ! నీవే మిత్రుడవు. నీవే వరుణుడవు. వసిష్ఠ వంశీయులు తమ స్తుతులతో నిన్ను వర్థిల్ల చేయుదురు. నీయందన్నధనము సులభసాధ్యము కావలెను. "పాతస్వస్తిభిః సదా నః"


                                       పదమూడవ సూక్తము

        ఋషి - వసిష్ఠుడు దేవత - వైశ్వానరాగ్ని - ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని అందరి ఉద్దీపకుడు. కర్మధారకుడు. అసురనిహంత. అట్టి అగ్నిని స్తుతించండి. కర్మచేయండి. నేను ప్రసన్నుడను అయినాను. మనోరథదాత వైశ్వానరాగ్నిని యజ్ఞమున హవ్యసహితముగా స్తుతింతును.

    2. అగ్నీ ! నీవు కాంతులతో కాంతిమంతుడవైనావు. నీవు పుట్టి ద్యావాపృథ్వులను పూరించినావు. జాతధనవైశ్వానరా ! నీ మహిమతో దేవతలను శత్రువులనుండి విముక్తులను చేసినావు.   

    3. అగ్నీ ! నీవు సూర్యరూపమున ఉత్పన్నుడవగుము. స్వామివగుము. సర్వత్ర గమనశీలుడవగుము. గోపాలుడు పశువులను చూచుకున్నట్లు నీవు సమస్త ప్రాణులను చూచుకొందువు. అప్పుడు నీకు స్తోత్రరూపమగు ఫలము లభించును. "పాతస్వస్తిభిః సదా నః"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.