Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    సెవాయ్. అతని హృదయంలో పూర్వస్మృతులు మెరిశాయి. అతనికి ఒక చలన చిత్రం చూస్తున్నట్లనిపించింది. తాను దరిద్రుడుగా ఉన్నప్పుడు ఒకనాడు సెవాయ్ ముందునుంచున్నాడు. పెద్దపెద్ద రబీరువాల్లోవున్న జలచరాలు అతన్ని ఇట్టే ఆకర్షించాయి. అతడు ఒక పెద్ద ఎండ్రకాయను చూస్తూ నుంచున్నాడు. ఎండ్రకాయను కళ్ళతో కొలుస్తూ అందులో ఒక సేరు మాంసం ఉండొచ్చా? అని తర్కించుకున్నాడు. ఇంతలో సామాన్యంగా వినిపించే 'చలో' అనే గర్జన వినిపించి ఉలిక్కిపడి చూశాడు. యాంత్రికంగా కాలూ కాళ్ళు నడిచాయి. సెవాయ్ ఎడమ చివరదాకా వెళ్ళాడు. అక్కడ ఒక అన్నార్తులగుంపు కనిపించింది. వారంతా మెడలు వెనక్కువంచి మేడ మూడవ అంతస్తు కిటికీవైపు ఆశాదృక్కుల్తో చూస్తున్నారు. కాలూకూడా పైకిచూచాడు. ఇద్దరు తెల్లసైనికులు కిటికీలోంచి తొంగిచూస్తున్నారు.
    నిశ్శబ్దం ఆవరించింది. దరిద్రులంతా ప్రతిమల్లా పైకి చూస్తున్నారు. ఒక క్షణం దొర్లిపోయింది. ఆ సైనికుల్లో ఒకడు చేతిలో ఏదో తీసుకొని జనంవైపు విసిరాడు. ప్రతిమలకు ప్రాణంవచ్చి మోకాళ్ళ మీదపడి తడుముకున్నారు. దేవుళ్ళాడారు. ప్రాణంలేని కేకల్తో తిట్టుకున్నారు. నెట్టుకున్నారు. రొప్పుతూ మళ్ళీ జనం అంతా లేచినుంచున్నారు. ఇద్దరు ముగ్గురు మాత్రం తమకు దొరికిన రొట్టెముక్కల్ను గబగబా మింగేస్తున్నారు.
    ఎందుకు వారలా మింగేస్తున్నారు? కాలూ చూస్తూ ఉండగానే ఒక దరిద్రుడు ఇంకొక అన్నార్తుని నోట్లో చేయిపెట్టి బలవంతంగా తెరిపించి వాడినోట్లోవున్న రొట్టెముద్దను కాస్తా నోట్లోవేసుకున్నాడు. కర్రపుల్లల్లాంటి చేతులుగల విజితుడు నిస్సహాయుడై చూస్తూ ఉండిపోయాడు.
    కాలూ మళ్ళీ తలెత్తి సైనికుల్ని చూశాడు. వారు ఆనందంతో కేరింతలు పెడుతున్నారు. ఇంకో తెల్లచేయి మళ్ళీ రొట్టెముక్కను గాలిలో విసిరింది. మళ్ళీ తడుములాట, నెట్టుకోవడం, తిట్టుకోవడం జరిగాయి. ఒక ముసలివాడు చావుదెబ్బలు తిని, బైటపడి పేవ్ మెంట్ చివర్న కూర్చొని భోరున ఏడ్చాడు.
    పీడితులు చేతులు జోడించి 'ఇంకాస్తదొరా.....ఇంకాస్త' ని ప్రార్దించారు. వారు తమ ఎండు డొక్కల్ను చేతుల్తో చరుచుకున్నారు. కాని సోల్జర్లకు ఈ తమాషా విసుగుపుట్టింది. చాకచక్యంగల ఇద్దరు వయసు కుర్రాళ్ళు ఒక ఉపాయం కనిపెట్టారు. వారు హో అంటే హో అంటూ మాంసహీనములైన తమ తొడలమీద వస్తాదుల్లా చేతుల్తో చరుచుకున్నారు. పెద్దకేకలువేస్తూ కుస్తీకి దిగారు. ఒకడు లాగి ఇంకొకని చెంపమీద కొట్టగా, ఇంకొకడు మూతిమీద పుచ్చుకున్నాడు. ఎముకల వ్రేళ్ళు మాంసంలేని చెంపలమీద చెళ్ళుమన్నాయి. మిగతా వాళ్ళందరూ వీళ్ళ ఆకస్మాద్వైరం చూసి ముందుముందు ఆశ్చర్యపడ్డారు. తరువాత వారికి అర్ధం అయింది. మరుక్షణంలో పోరాటపు ఆంతర్యం గుర్తించారు. ఇంకేముంది? గొంతునరాలు పొంగేదాకా యుద్దనినాదాలు చేశారు. ఒకర్నొకరు కొట్టుకున్నారు, గుద్దుకున్నారు. బూటకపు పోరాటం వాస్తవరూపం ధరించింది. వారు పిచ్చెక్కిన క్రూర మృగాల్లా పోట్లాడుకున్నారు. ఒక కంకాళం వేరొక కంకాళం మీద పడింది. వారు పట్లుపట్టారు, కొట్టుకున్నారు. గీరుకున్నారు. వారి శరీరాల్లో ఇంకా రక్తం ఉందని సూచించడానికి వారి నగ్నశరీరాలనుంచి రక్తం కొద్దికొద్దిగా శరీరాలమీద కనిపించింది.
    గెలుపు మీదనే వారి జీవితం ఆధారపడివున్నట్లు శక్తి ఉన్నంతసేపూ పోరాడారు. వారి ఉచ్చ్వాస నిశ్వాసాలు పగిలినతిత్తిలోంచి బైటపడేగాలిలా వినిపించాయి. శక్తి ఉడిగి కేకలువేస్తూ భయం ప్రతిబింబిస్తూవున్న మూరెడులోతు పీక్కుపోయినకళ్ళతో చూస్తూ అలాగే పడిపోయారు.
    తెల్లముఖాల పళ్ళు బయటపడి ఇకిలించాయి.
    కాలూకు వాంతి వచ్చినంతపని అయింది.
    కాలూ మనోఫలకం మీద అతి సూక్ష్మవివరాల్తో సహా ఆ చిత్రం బాగా హత్తుకుంది. ఆ చిత్రం అంతాచూచి అతడు వగర్చాడు.
    అది శివరాత్రి మహాపర్వం. మండపం మీద నుంచొని తెల్లని స్తంభాల గేటులోంచి వచ్చి దేవాలయ ప్రాంగణం నింపుతున్న భక్తజన పవాహాన్ని చూడవచ్చు. శివరాత్రి సంవత్సరానికి ఒకే ఒకసారి వస్తుంది. ఆనాడు ఒక్కసారి శివదర్శనం చేసుకున్నా కావలసినంత పుణ్యం లభిస్తుంది.
    కాలూ డైరీపుటలు తిప్పాడు. అతనికి ఇతర దాతలు కూడా తలపునకు వచ్చారు. ఇంకోవ్యక్తి అర్ధనిమీలితనేత్రుడై, సర్వజ్ఞుడైన భగవంతుని తన కోర్కె తెలుసునన్నాడు. కోర్కె బోట పెట్టలేదు. వాడు కన్నాలువేసే దొంగ అయి ఉండాలి అనుకున్నాడు కాలూ. రాత్రికి తనకు మంచి అవకాశం లభింపజేయాలని ప్రార్ధిస్తూ లింగాన్ని సహితం తన దుష్కార్యంలో భాగస్వామిని చేస్తున్నాడు. దాతల్లో నున్నగా గడ్డంగొరుక్కున్న ప్రభుత్వోద్యోగి కూడా ఉన్నాడు. అతనికి ప్రమోషన్ కావాలి. రెండు సంవత్సరాల్లో రిటైర్ అయిపోతున్నాడు. ఈ లోగా పై ఉద్యోగాలకు కాళీ ఏర్పడే అవకాశం లేదు. తనకు అడ్డం ఉన్నవాన్ని తొలగించి తనకు సహాయం చేయాలని అతడు భగవంతుని ప్రార్దించాడు.
    మళ్ళీ డైరీపుటలు తిరిగాయి. అతనికి మరోరకపు మనుషులు కనిపించారు. నాలుగుసార్లు పరీక్ష తప్పిన కొడుకుగల తల్లి కొడుకును పరీక్షలో ఉత్తీర్ణుని చేయాలని భగవంతుణ్ణి ప్రార్దించింది.
    డైరీలో శ్రీపురవాస్తవ్యుడైన గోవిందదాస్ మనుమడు, రామదాసు కుమారుడు రతన్ దాస్ అనేపేరు కనిపించేవరకు అతని గుండె జల్లు మంది. రతన్ దాస్ ఒక రైతు. అతని ఊరు ఎక్కడో చాలదూరపు జిల్లాలో ఉంది. ఆకలిమంటలు తరుముతూంటే భార్య, కూతురు, ఇద్దరు కొడుకుల సహితంగా కలకత్తా వచ్చాడు. అందరికంటే చిన్నవాడు ఆకలితో అలమటించి అంతమొందాడు. ఒకరోజు బిచ్చానికి తిరుగుతూంటే రతన్దాస్ ఒకవైపూ భార్యాబిడ్డలు ఒకవైపూ అయినారు. నగరం మూల మూలలా గాలించాడు. బాగ్ బజారు నుంచి బాలీగంజ్ వరకూ, సీల్డా నుంచి హౌరావరకూ వారిని వెదుకుతూ తిరిగాడు. అయినా అతనికి ఎవరూ కనిపించలేదు. భగవంతుడు తన భార్యాబిడ్డల్లో ఎవరినైనా ఒక్కర్నైనా తనతో కలుపుతాడా? అంతే ఒక్కరు. ఒక్కరేచాలు. అతడు అత్యాశకు పోలేదు. ఒక్కరైతే చాలు. అతడు లజ్జతో నేలవైపు చూస్తూ మూసినా అరచేయి తెరచి చూపించాడు. అయిదు కాన్లున్నాయి!
    కాలూ అదిచూసి నిలువునా నీరైనాడు. "తమ్ముడూ, నీ తరఫున నేను పాలు నివేదిస్తాను" అన్నాడు.
    ముసలిరైతు వంగి బ్రాహ్మడి కాళ్ళు పట్టుకున్నాడు. "నామాట కాదనకండి. అంతకంటే శక్తిలేదు. ఈ ముష్టి అయిదు కానులకు సగంగ్లాసుకంటే ఎక్కువ పాలురావని నాకు తెలుసు. అయినా ఈ మాత్రం ఇవ్వకుంటే దేవుడు మెచ్చడు" అన్నాడు.
    కాలూ చాలా బాధపడ్డాడు. కాని డబ్బు తీసుకోక తప్పిందికాదు. గుళ్ళో ఉన్నది నిజమైన దేవుడుకాడు. వట్టి బూటకపు బండ. దానిమీద పోసిందంతా బూడిదలో పోసిన పన్నీరే అని అతనికి ఎలా చెప్పాలి? సంపన్నులు ఖర్చుచేసే వేలకంటే ఈ దరిద్రుని గుండెపిండిన అయిదుకానుల బరువు హెచ్చుగా ఉంది. తాను పగతీర్చుకోవడానిగ్గాను ధనికుల్ను మోసగిస్తున్నాడు. దరిద్రుల్ను మోసగించడం అంటే తనను తానే మోసగించుకోవడం. తన రక్తానికీ ఎముకలకూ స్వయంగా తానే ద్రోహంచేయడం. అయిదుకాన్ల పాలుకొని మిగతా మూడు బకెట్లకూ తానే డబ్బిచ్చి కొంటే కొంతబరువు తగ్గవచ్చు.
    డైరీ మూసేసి కాలూ తలెత్తి బైటికి చూశాడు. గేటుదగ్గర రోడ్డుకు రెండువైపులా చిన్నచిన్న దుకాణాలు వెలిశాయి. పూలు, బిల్వ పత్రాలు, ప్రమిదలు మున్నగు పూజా సామగ్రియావత్తూ అక్కడే అమ్ముతున్నారు. వార్నిషు రంగులు వేసిన మంచి మంచి మట్టి బొమ్మలూ గురుగులూ తట్టల్లో పెట్టుకొని అమ్ముతున్నారు. పూజకుగాను జనం పూలు బాగా కొన్నారు. అయితే అప్పుడప్పుడు కొందరు యువతులు పూలుకొని సిగల్లో తురుముకుంటున్నారు. పండుగ పసందుగా జరుగుతూంది.
    పర్వదినాల్లో అతడు మండపం మీద కూర్చొని విజయగర్వం పొంగి పొర్లుతున్న ముఖంతో హారతులు తన కాళ్ళకే అర్పిస్తున్నట్లూ, భావించేవాడు. నిజానికి అంతే. దేవాలయం ఎక్కడిదీ? అంతా కపటనాటకం. నాటకకర్త తానుకదూ?
    "నిజంగానా?"
    ఈ ప్రశ్న అతనిలో పెరిగిన ఆత్మగౌరవాన్ని వక్కలు చెక్కలు చేసింది.
    అయిదు కాన్లు చేతిలో వేసుకొని వచ్చిన ఆ నిర్భాగ్యుడు మాత్రం భక్తుల్లో ఒకడు కాదూ? డబ్బువెదజల్లి పుణ్యం కొనుక్కొని, పుణ్యం చౌగ్గా లభించిందని ఆనందించే ధనమదాంధులకంటే సామాన్యప్రజలే గుడికి వందరెట్లు ఎక్కువగా వస్తున్నారు.
    అది నగ్న సత్యం. జనప, పత్తి మిల్లుల కూలీలు, పసిపాపల్ను ఎత్తుకొని పళ్ళూ, పూలు ప్రమిదలు కొని దేవాలయానికి వస్తూ ఉంటారు. రిక్షా కొన్ని సంవత్సరాలు లాగిన వాడికి ఊపిరితిత్తుల వ్యాధి తప్పదట. అలాంటివాళ్ళు సహితం ఒక్కొక్క వారపు ఆదాయాన్ని ఆ భగవంతునికి ఖర్చుపెడుతున్నారు. భక్తుల్లో వీధి బిచ్చగాళ్ళు, గుడ్డి, కుంటివారు, తమ చూపుల్ను పైసలుగా మార్చుకునే బోగం కత్తెలూ ఉన్నారు. వీరికంటే కష్టపడి సంపాదించే దెవరు? వీరు ఖర్చుచేసే ప్రతి రాగిడబ్బులో ఎర్రని రక్తం కనిపిస్తూంటుంది! అంటరానివారు గుడికి దూరంగానే ఉన్నా గుడికివచ్చే వాళ్ళల్లో పీడితుల సంఖ్య ఎక్కువగానే ఉంది. తాను డొక్క మాడ్చుకుని లేఖకు చిక్కుళ్ళు ఇచ్చినలాంటి వృద్ధులు దూరంనుంచే దేవుని పూజించి ధన్యులు కావాలి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.