Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



                                     మూడవ అనువాకము

                       (అన్వాహార్యవిధి - దాని ప్రశంస చెప్పబడుచున్నది.)

    1. యాగము నందు ఇంద్రాది దేవతలు కంటికి కనిపించువారు కారు. వారు యాగములందు పరోక్షముగ ఉద్దేశించ బడినవారు. ఇతర దేవతలు - ఋత్విజాదులు - ప్రత్యక్షముగ ఉద్దేశించబడినవారు. పరోక్షదేవతలను యజించిన వాడే యాగము చేసినవాడు అగుచున్నాడు.

    2. అన్వాహార్యము క్షీరాన్నమగును. యజమాని ఋత్విజులకు అన్వాహార్యమును ఇచ్చును. వీరే దేవతలకు ప్రత్యక్షరూపులు అగుచున్నారు. కావున యజమాని అన్వాహార్య దానము చేత వారినే సంతోషపెట్టుచున్నాడు.

    3. అన్వాహార్యదానము యజ్ఞపు దక్షిణ కూడ అగును. ఇది యజ్ఞమునందలి లోపమును తీర్చును.

    4. యజ్ఞవిధులందు తక్కువలు, ఎక్కువలు జరుగవచ్చును. అన్వాహార్యదానమున అవి పరిహరింపబడుచున్నవి. అందువలన అన్వాహార్యమునకు 'సరిచేయుట' అణు అర్థము ఏర్పడినది.

    5. ఋత్విజులు దేవదూతలు. వారికి అన్వాహార్యము దానము చేసిన దేవదూతలనే సంతోష పెట్టినట్లగుచున్నది.

    6. పూర్వము ప్రజాపతి దేవతలకు యజ్ఞములను పంచి ఇచ్చినాడు. అప్పుడు ప్రజాపతి తనకు యాగము లేదని గుర్తించినాడు. అన్వాహార్యము దేవతలకు ఇవ్వనందున తన కొరకు ఉంచుకున్నాడు.

    ఈ విషయము తెలిసిన యజమాని అన్వాహార్యమునిచ్చి ప్రజాపతినే సంతుష్టుని చేసినవాడు అగుచున్నాడు.

    7. ప్రజాపతికి పరిమితులులేవు. అతడు సర్వయజ్ఞములందు వ్యాపించినవాడు. కావున అన్వాహార్యము ప్రజాపతి కొరకే అగుచున్నది.

    8. దేవతల వలెనే అసురులు యజ్ఞములు చేసినారు. కాని దేవతలు మాత్రమే అన్వాహార్యమును కనుగొన్నారు - సంపాదించినారు. అందువలన వారు విజయులు అయినారు. అన్వాహార్యమును కనుగొనక పోవుటవలన అసురులు పరాజితులు అయినారు.

    యజమాని ఈ విషయము తెలిసికొనవలెను. అన్వాహార్యమును దానము చేయవలెను. అందువలన అతడు ధైర్యవంతుడు, శత్రుంజయుడు అగుచున్నాడు.

    9. యజ్ఞము వలన ఇష్టకర్మలు చేసినట్లును - అన్వాహార్యమున పూర్తి కర్మలు చేసినట్లును అగుచున్నది. ఈ విషయము తెలిసి అన్వాహార్య దానము చేసినవాని కోరికలు తీరుచున్నవి.

    10. అన్వాహార్యము ప్రజాపతి భాగమని చెప్పబడినది. అందువలన అది  ప్రజాపతికే సమర్పించినట్లగును.

    11. అన్వాహార్యము బలము కలదనియు, ప్రాయము కలదనియు చెప్పబడినది. అన్వాహార్య దానము వలన బలము ప్రాయము కలుగుచున్నవి.

    12. అన్వాహార్యమా! నాయొక్క ప్రాణాపానములను రక్షించుము - సమానవ్యానములను రక్షించుము అని యజ్ఞకర్త ప్రార్థించుచున్నాడు. అందువలన అతనికి ప్రాణ, అపాన, వ్యాన, సమాన ప్రాణముల రక్షణ లభించుచున్నది.

    13. "అన్వాహార్యమా! నీవు క్షయము లేనిదానవు. కావున నాకు క్షయము కలుగకుండుటకై నిన్ను దానము చేయుచున్నాను. పరలోకమునందు నేను అనుభవించవలసిన భోగములు క్షీణించకుండునుగాక. అట్లగుటచే నిన్ను పరలోకమున స్వేచ్చగా అనుభవించగలను" అని అన్వాహార్యమంత్రము చెప్పుచున్నది.

    భూలోకమున చేసిన అన్నదానాదుల ఆధారముననే జనులు పరలోకమునందు జీవించుచున్నారు. కావున అభిమంత్రించి దానము చేసిన అన్వాహార్యము పరలోకమునందు క్షీణించకుండును - "నాస్యాముష్మిల్లోకేన్నంక్షీయతే"

                                      నాలుగవ అనువాకము

    (శేషాహుత్యనుమంత్రణ, అనూయాజానుమంత్రణ మంత్రములు వ్యాఖ్యానించబడుచున్నవి.)

    1. బర్హిష, దేవయజ్యలచేత నేను సంతాన వంతుడను అగుదును గాక అని మంత్రము చెప్పుచున్నది. బర్హి షాదుల వలననే ప్రజాపతి ప్రజలను సృష్టించినాడు - సృష్టించుచున్నాడు.

    నరాశంస దేవయజ్యల చేత నేను పశుమంతుడను అగుదును గాక అని మంత్రము చెప్పుచున్నది. నరాశంసాదుల వలననే ప్రజాపతి పశువులను సృష్టించినాడు - సృష్టించుచున్నాడు.

    స్విష్టకృత దేవయజ్యచేత నేను అయుష్మంతుడను అగుదునుగాక. యజ్ఞము యొక్క సంపూర్ణ ప్రతిష్ఠను పొందుదునుగాక అని మంత్రము చెప్పుచున్నది. ఆ విధముగ  ప్రార్థించిన వానికి ఆయువు, సంపూర్ణయజ్ఞ ప్రతిష్ఠ లభించుచున్నది.

    2. దేవతలు దర్శపూర్ణమాస యాగమును సంపూర్ణముగ అనుష్ఠించినారు. మహాబలమును పొందినారు. గెలిచినారు. దర్శపూర్ణయాగముల చేతనే దేవతలు రాక్షసులను పరాజితులను చేసినారు.

    యజమాని దేవతా సంబంధమగు దర్శపూర్ణమాస యజ్ఞమున సంపూర్ణముగ అనుష్ఠించవలెను. అందువలన అతనికి మహాబలము కలుగును. దర్శపూర్ణ మాసమున అతడు శత్రువులను జయించును.

    3. వాజశబ్ద ఘటిత ఋక్కులచేత అధ్వర్యుడు చేయుచున్న వ్యూహనమును యజమాని అనుమంత్రణము చేయవలెను. వాజశబ్దమే అన్నము అయినందున యజమానికి అన్నము లభించుచున్నది - ఇది నిశ్చయము.

    4. యజమాని తనకు స్థిరత్వము కలుగుటకు రెండు మంత్రములచే ప్రార్థించవలెను. 1. యజ్ఞఫలరూపమగు ఆశీస్సులు సత్యములు అగునుగాక. 2. యజ్ఞఫలరూపమగు ఆశీస్సులు నాయందు చేరును గాత.

    5. యజ్ఞమునందు రెండు మంత్రములచే ప్రార్థించుటను యజమాని తెలియవలెను. ఆ విధముగ తెలిసి యజ్ఞము చేసిన వానికి రెండు ప్రార్థనల ఫలము లభించుచున్నది.

    ఈ రెండింటియందు 'ఏమాఅగ్మన్' నన్ను చేరును గాత అనునది మరొక దోహము. "సతాశీః" ఆశీస్సులు సత్యములు అనునది ఇంకొక దోహము.

    6. హోత యజమాని పేరు పలుకును. అప్పుడు యజమాని 'ఏమా అగ్నన్నాశిషోదోహకామా' అను మంత్రమును పలుకవలెను. ఆ విధముగా పలికినచో హోతస్తుతించిన దేవతలందరి ఫలితమును యజమాని పొందును.

    అంతేకాక మొదటి, రెండవ మంత్రముల ఫలమును కూడ పొందును.

    (ఈ రెండు మంత్రములు 4వ మంత్రమున పేర్కొనబడినవి.)

    7. ప్రస్తరమా! అగ్ని నన్ను రోహిత అశ్వముపై సూక్తమునందు చెప్పిన దేవతల వద్దకు చేర్చును గాత అని మంత్రము చెప్పినది. ఆ మంత్రము నందు చెప్పిన రోహిత, హరి ఏతశ, అశ్వములే అగ్ని, ఇంద్ర, సూర్య దేవతలవి.

    యజమాని ఎంతటి యజ్ఞసాధనమో ప్రస్తరము అంతటి యజ్ఞసాధనము అగుచున్నది. దేవాశ్వములు ప్రస్తరమును దేవతల వద్దకు చేర్చినచో - ప్రస్తరము యజమానిని స్వర్గమునకు చేర్చును.

    (1. ప్రస్తరము - దర్భలకట్ట. 2. ఇందు వ్యంగ్యము ధ్వనించుచున్నది. దేవతాశ్వములు ప్రస్తరమును దేవతల వద్దకు చేర్చుట, నిజమైన ప్రస్తరము యజమానిని స్వర్గమునకు చేర్చును.)

    8. అగ్నీ! నీ రశనలగు పరిధులను తొలగించుచున్నాను అనునది మంత్రము. అదియే అగ్ని విమోకము అగును. దాని వలననే అగ్నికి విమోచనము కలుగుచున్నది.

    9. నేను వ్యాపకుడగు శంయుని యజ్ఞము చేసి కీర్తి పొందుదును అనునది మంత్రము. యజ్ఞమే విష్ణుస్వరూపము. కావున యజ్ఞపరిసమాప్తి యందు యజమానికి కీర్తి కలుగుచున్నది.

    10. నేను సోముని యజించుచున్నాను. నేను సురేతుడనై రేతస్సును ధరింతును అనునది మంత్రము.

    సోముడే రేతస్సు కలిగించువాడు. కావున యజమానికి అతని వలననే రేతస్సు కలుగుచున్నది.

    11. నేను త్వష్ట దేవతను యజించుచున్నాను. నేను పశువంతుడనై వానిని పోషింతును గాత అనునది మంత్రము.

    త్వష్టయే మిథునాత్మకములగు పశువులను కల్పించుచున్నాడు. కావున అతని వలననే యజమానికి పశువులు కలుగుచున్నవి.

    12. గృహపతియగు అగ్నియు దేవపత్నులును మిథునము. నేను ఆ మిథునమును యజించుచున్నాను. నేను కొడుకులు, కూతుళ్లచే వర్థిల్లుదునుగాక అనునది మంత్రము.

    ఈ మిథునము నుండియే ప్రజాపతి స్త్రీ పురుష మిథునమును సృష్టించినాడు. ఆ మిథునము వలననే యజమానికి పుత్రీ, పుత్రులు కలిగి వర్థిల్లుచున్నాడు.

    13. ప్రస్తరమా! నీవు వేదనామము కలదానవు - ధనదాతవు అగుచున్నావు. నాకు ధనము ప్రసాదించుము అనుచున్నది మంత్రము.

    దేవతలు వేదమను పేరుగల దర్భల కట్టచేతనే అసురుల పూర్వ, పరధనమును పొందినారు. అందువలననే దర్భల కట్టకు 'వేద' శబ్దము సార్థకమైనది.

    (విత్తమనేనేతి - దీనివలన విత్తము పొందుచున్నాడు అను వ్యుత్పత్తిచే 'వేద' శబ్దము అని వ్యాఖ్యానము.)

    14. యజమాని తన శత్రువునకు సంబంధించినది ఏదికోరుచున్నాడో దానిని మంత్రమధ్యమున చేర్చిచెప్పవలెను. అందువల్ల శత్రువుకు సంబంధించిన 'దానిని' పోగొట్టినవాడు అగుచున్నాడు.

    (అది యజమానికి చేరుటలేదు. శత్రువు పోగొట్టుకొనుచున్నాడు. ఇది ఇతరుల బాధచూచి సంతోషించుట - SADISM.)

    15. ఘృతవంతము - బహుగృహోపేతము - అన్నసమృద్ధము - సహస్రసంఖ్యాక ధనమును నాకొసంగుమని మంత్రము వేదమను దర్భల కట్టను ప్రార్థించుచున్నది. అందువలన యజమానికి సహస్రసంఖ్యాక పశుసంపద కలుగుచున్నది.

    (పశుసంపద కలిగిన పైన పేర్కొన్న వన్నియు కలిగినట్లేకదా!)

    16. ఈ విధమగు మంత్రార్థమును తెలిసికొన్న యజమాని సంతానములో అన్నసమృద్ధికళ పుత్రులు జన్మించుచున్నారు.

                                   అయిదవ అనువాకము

                         (ఆప్యాయనాది మంత్రముల వ్యాఖ్యానము.)

    1. ధ్రువము హోమము నందలి పాత్రయగును. దానిని నేతితో నింపనిదే యజ్ఞము సంపూర్ణము కానేరదు. యజ్ఞము సంపూర్ణము కాకున్న యజమానికి యజ్ఞఫలము లభించదు. యజ్ఞకర్త సంతానము అన్నములేనిది అగును.

    ధ్రువమును నేతితో నింపిన యజ్ఞము సంపూర్ణమగును. యజ్ఞము సంపూర్ణమైనందున యజమానికి యజ్ఞఫలము లభించును. యజ్ఞకర్త సంతానమునకు అన్నసమృద్ధి కలుగును.   

    2. 'ధ్రువము ఘృతముచే నింపబడునుగాక' అన్నది మంత్రము. కావున ధ్రువమును ఘృతముచే నింపవలెను. ఆజ్యపూర్ణమగు ధ్రువమును అనుసరించి యజ్ఞము సంపూర్ణమగు చున్నది. అందువలన యజమానికి యజ్ఞఫలము - సంతానము - అన్నసమృద్ధి కలుగుచున్నది.

    3. 'నేను యజమానిని. నాకు చెందిన హవిర్భాగమా! నాతో పాటు నిన్ను విభాన్నామలోకమునకు చేర్చుచున్నాను' అనునది మంత్రము.

    అందువలన యజమాని తనభాగమును భూలోకమునందే ఉంచినట్లయినది. ఏలననగా భూలోకమే కదా ప్రజాపతి యొక్క విభాన్నామలోకము - "అయం వై ప్రజాపతే ర్విభాన్నామలోకః"

    4. యజమాని యజ్ఞము చేయును. అందువలన ద్రవ్యము వ్యయము అగును. అతడు రిక్తునివలె కనిపించును. హోమశేష హవిర్భాగము స్వీకరించుట వలన యజమాని సంపూర్ణుడు అగుచున్నాడు.

    5. హవిస్సు యజ్ఞమునందు హోమము చేయబడును. మిగిలినది హవిశేషమగును. అందులో కొంత భాగము యజమాని భుజించును - కొంత ఋత్విజులు భుజింతురు. యజమాని భుజించినది అతనికి ఇహలోకము నందు పనికి వచ్చునది. ఋత్విజులది దేవభాగము కావున అది యజమానికి ఉపకరించదు. హవిశ్శేషభాగ సేవనము వలన యజమాని యజ్ఞమును తనయందే చేర్చుకొనుచున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.