Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    2. సుకర్ములు, శుచిమంతులు, కర్మలను భరించు దేవగణములు సోమసంబంధము, హవిసంబంధమును సేవింతురు. వారిలో అగ్ని యజనీయుడు. మానవులకు కీర్తనీయుడు. అట్టి అగ్ని మహిమలను మేము స్తోత్రములతో స్తుతింతుము.

    3. అగ్ని బలశాలి. స్తుతియోగ్యుడు. దక్షుడు. ద్యావాపృథ్వుల మధ్య దూత. సత్యవాది. మానవులవలె మనువు ద్వారా సమిద్ధుడు. యజమానులారా ! అట్టి అగ్నిని సర్వదా పూజించండి.

    4. సేవాభిలాషులు మోకరిల్లి పాత్రను పూరించి అగ్నికి నమస్కారయుక్త హవి సమర్పిస్తారు. అధ్వర్యులారా ! ఘృత పుష్పము, స్థూలబిందు యుక్త హవిస్సును అగ్నికి అందించండి.

    5. సుకర్ములు, దేవాభిలాషులు, రథములను కోరువారు యజ్ఞద్వారమును ఆశ్రయించినారు. ఆవులు దూడలను నాకినట్లు - నాకు నట్టి జుహువును అధ్వర్యులు నదివంటి యజ్ఞమున తడిపెదరు.

    6. దివారాత్రులు యువతులు. దివ్యలు మహిమాన్వితలు. కుశలపై ఆసీనులగునవి. బహుస్తుతులు, ధనవతులు, యజ్ఞార్హలు. కామధేనువువలె శుభములకుగాను మాకు ఆశ్రయము కలిగించవలెను.

    7. విప్రులు, జాత ఘనులు, మానవుల యజ్ఞకర్తలగు యజ్ఞకర్తలగు హోతలారా ! యజ్ఞము చేయించవలసినదని మిమ్ము స్తుతింతును. స్తుతులు పూర్తి అయినంత కుటిలము ఎరుగని మా యజ్ఞమును దేవాభిముఖము చేయండి. దేవతలవద్ద ఉన్న వరణీయధమును విభజించండి.

    8. భారతీయగణముల సూర్యసంబంధుల సహితముగ భారతి రావలెను. దేవ, మానవ సహితమై "ఇళ" రావలెను. సారస్వతుల సహితముగా సరస్వతి రావలెను. ఈ ముగ్గురు దేవేరులు వచ్చి కుశలపై కూర్చుండవలెను.

    9. అగ్నిరూప త్వష్టా ! వీరుడు , కర్మకుశలుడు, బలశాలి, సోమాభిషవకర్త, దేవాభిలాషి అగు పుత్రుని పుట్టించగలవు. నీవు సంతుష్టుడవై మాకు రక్షాకుశలము, పుష్టికరమగు శౌర్యమును ప్రదానము చేయుము.

    10. అగ్నిరూప వనస్పతీ ! దేవతలను మావద్దకు తెమ్ము. పశువులను సంస్కరించు అగ్ని వనస్పతి. అతడు దేవతలకు హవ్యము అందించవలెను. యజ్ఞరూప దేవత జనులను పిలుచు అగ్ని మాత్రమే దేవతల జన్మము ఎరుగును. అందువలన ఆ అగ్నియే యజ్ఞము చేయవలెను.

    11. అగ్నీ ! నీవు దీప్తివంతుడవగుము. ఇంద్రుడు మున్నగు త్వర చేయు దేవతల సహితుడవై ఒకే రథమున మా ముందుకు విచ్చేయుము. సుపత్రయుక్త అదితి మా కుశలై కూర్చుండవలెను. నిత్యదేవగణములు. అగ్నిరూప స్వాహాకారులపై తృప్తులుకావలెను. 


                                      మూడవ సూక్తము

           ఋషి - వసిష్ఠుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని మానవులందు స్థిరముగ ఉండువాడు. యజ్ఞవంతుడు. తాపకుడు. తేజోవంతుడు. ఘృతాన్న సంపన్నుడు. శోధకుడు. యాజ్జికులందు శ్రేష్ఠుడు. అన్య అగ్ని సమూహములతో కలసినవాడు.

    దేవతలారా ! అట్టి అగ్నినే యజ్ఞములందు దూతను చేయండి.

    2. గుఱ్ఱము గడ్డిని మేసినట్లు అగ్ని గడ్డిని కాల్చుచు, ధ్వనిచేయుచు, వృక్షములందు దారురూప అగ్ని నిలిచిఉండును. అప్పుడు అగ్నియొక్క దీప్తి ప్రవహించును. అనంతరము అగ్నిదేవుని మార్గము నలుపు మసిగా మారును.

    3. అగ్నీ ! నీవు నవజాతవు. వర్షకుడవు. నీజ్వాల ఆజరము. సమిధలు చేర్చుకొని పైకి ఎగయుదువు. ఆ జ్వాల యొక్క సుందరధూమము ద్యులోకమునకు చేరును. నీవు దూతవై దేవతలను చేరుదువు.

    4. అగ్నీ ! నీవు దంతముల జ్వాలలతో కఱ్ఱలు భక్షించునపుడు నీ తేజస్సు భూమిలో కలిసిపోతుంది. భూమి నల్లపడుతుందని అర్థము. విముక్తమగు సేనవలె నీ జ్వాలలు పరుగులిడును. నీ జ్వాలలతో భువనములవలె కలపమున్నగు వానిని కాల్చితిందువు.

    5. అగ్ని యువ అతిథి వంటి పూజ్యుడు. మానవులు అగ్ని స్థానమును ఎల్లపుడు పరుగులిడు గుఱ్ఱమువలె రాత్రింబవళ్లు సేవింతురు. ఆహూతుడు, అభీష్టవర్షి అగ్ని శిఖ జ్వాల ప్రదీప్తమగును.

    6. అగ్నీ ! నీవు సుందర తేజోవంతుడవు. సూర్యుడు కిరణములవలె దీప్తితో వెలుగొందినపుడు అత్యంత దర్శనీయుడవగుదువు. అంతరిక్షమునుండి నీ వెలుగు మెరుపు వలె వెడలును. దర్శనీయ సూర్యుని వలెనే నీవు సహితము స్వయం ప్రకాశకుడవు.

    7. అగ్నీ ! మేము గవ్యము, ఘృతయుక్త హవ్యముతో నీకు స్వాహాదానము సమర్పింతుము. నీవు సహితము అట్లే అపరిమిత లోహమయ లేక స్వర్ణమయ నగరములతో మమ్ము రక్షింపుము.

    8. అగ్నీ ! నీవు బల పుత్రుడవు. జాతధనుడవు. దానశీలుడవు. నీవు నీ శిఖలు, మాటలు ధ్వనులతో పుత్రవంతులను ప్రజలను రక్షింతువు. అట్లే మమ్ము రక్షింపుము. ప్రశస్తులగు హవ్యదాతలను స్తోత్రములను రక్షింపుము.

    9. విశుద్ధ అగ్ని తన దేహముతో కృపాపరవశము సుభగసుందరమగు జ్వాలలు కఱ్ఱలనుండి వెలువరించినపుడు యజ్ఞ యోగ్యుడగును. సుందర, సుకృత, శోధకమగు అగ్ని మాతృరూపములగు రెండు చెక్కలనుండి ఆవిర్భవించును.

    10. అగ్నీ ! మాకు సుభగ సుందరమగు ధనము ప్రసాదించుము. మాకు యాజ్ఞీకుడు, విశుద్ధాంత కరణుడగు పుత్రుడు కలుగవలెను. మాధనము సాంతము ఉద్గాతలది, స్తోతలది కావలెను. నీవు సదా శుభకార్యములతో మమ్ము పాలింపుము.

   
                                        నాలుగవ సూక్తము

              ఋషి - వసిష్ఠుడు, దేవత - అగ్ని  ఛందస్సు - త్రిష్టుప్.

    1. హవివంతులారా ! మీరు శుద్ధుడు, దీప్తివంతుడగు అగ్నికి పరిశుద్ధ హవ్యము స్తోత్రము సమర్పించండి. అగ్ని, దేవతలలోను, మానవులలోను సమస్త పదార్థములందును తన ప్రజ్ఞతో ప్రవేశించును.

    2. అరణిద్వయమునుండి తరుణతముడై అగ్ని ఉత్పన్నుడయినాడు. అగ్ని మేధావి. అతడు యువకుడు కావలెను. దీప్తజ్వాలల అగ్ని అరణ్యములను ఆరగించును కాల్చి మసి చేయును.

    3. విశుద్ధమగు అగ్ని పరిగ్రహించువారికిని అట్లు పరిగ్రహించిన అగ్నిని సేవించువారికిని అగ్ని వారి శత్రువులకు దుస్సహరూపము జాజ్వలన మానుడగును.

    4. కవి ప్రకాశకుడు, అమృతమూర్తి అగు అగ్ని కవులగు మానవులలో నిలుచును. అగ్నీ ! మేము నీ విషయమున సదా సుబుద్ధిగలవారమగుదుము. నీవు మమ్ము హింసించకుము.

    5. అగ్ని తన ప్రజ్ఞలతో దేవతలకు అమృతము అందించినాడు. అందువలన అగ్ని దేవతల స్థానమున ఆసీనులు అయినాడు. వనములు, వృక్షములు గర్భమున అగ్నిని దాల్చును. భూమి సహితము అగ్నిని ధరించును.

    6. అగ్ని అధిక అమృతము అందించ సమర్థుడు అందమగు అమృతము ప్రసాదించ సమర్థుడు బలశాలివగు అగ్నీ ! మేము పుత్రరహితులము కారాదు. రూపరహితులముకారాదు. సేనా శూన్యలముకారాదు.

    7. "పరిషద్యహ్యరస్య రేక్ణో" అప్పులేని వాని వద్ద వలసినంత ధనములుండును. మేము నిత్యము ధనపతులము కావలెను. అగ్నీ ! మా సంతానము అన్యజాతము అనౌరసము కారాదు. అవిదుష, మార్గమును అనుసరించరాదు.

    ("అన్యజాతమ్" అన్నాడు. ఇతరులకు పుట్టినవాడు. సంతానము కలుగనపుడు తన భార్యకు ఇతర పురుషులతో సంతానము కలిగించుట ఆచారమైనట్లున్నది. మహాభారతమున కౌరవ, పాండవులు అట్టి సంతానము. అది దేవర న్యాయమైనది. అట్టి సంతానముకాక స్వసంతానము కావలెనని కోఱిక)

    8. "అన్య ఉదర్యః" ఇతరుల ఉదరమున పుట్టినవాడు దత్తపుత్రుడు సుఖీవహుడుఐనను అతనిని పుత్రునిగా భావింపరాదు. అతడు మరల తనస్థానమునకేచేరును. అందువలన అన్నవంతా ! శత్రుహంతా ! మాకు నవజాత శిశువును ప్రసాదించుము.

                                    (దత్తత నేటికిని శాసనబద్ధము)

    9. అగ్నీ ! మమ్ము హింసకులనుండి రక్షింపుడు. పాపములనుండి రక్షింపుము. నిర్దోషము అన్నము నిన్ను చేరవలెను. అభిలషణీయము వేల ధనములు మాకు అందవలెను.

    10. "ఏతానో అగ్నిఏ సౌభగాది దీద్యపి క్రతుంసుచేతసంవతేమ
        విశ్వాస్తోత్రుభ్యో గృణతే చ సన్తు యూయం పాత స్వస్తిభిః సదానః"

                        మూడవ సూక్తమున పదవ మంత్రము పునరావృతము.


                                         అయిదవ సూక్తము

          ఋషి వసిష్ఠుడు  దేవత - వైశ్వానరాగ్ని - ఛందస్సు - త్రిష్టుప్.

    1. వైశ్వానరాగ్ని - యజ్ఞమందు జాగృతులైన సకల దేవతలతో ప్రవృద్దుడగును. అతడు పృథివ్యంతరిక్షముల సంచరించును. అట్టి అగ్నిని స్తుతించండి.

    2. నదులచేత జలవర్షకుడు, పూజ్యుడు అగు అగ్ని భూమి, అంతరిక్షము నుండి వెడలినాడు. ఆ వైశ్వానరాగ్ని హవ్యముతో వర్థిల్ల మానవ ప్రజముందు శోభిల్లును.

    3. వైశ్వానరాగ్నీ ! నీవు పురుని వద్ద దీప్తుడవయినావు. అతని శత్రుపురములను చెదరగొట్టినావు. అట్లు ప్రజ్వలితుడవయినపుడు నీ భయమున నలుపు ప్రజ బెదిరి అన్నములు వదిలి పారినారు.

    4. వైశ్వానరాగ్నీ ! అంతరిక్షము, పృథ్వి ద్యులోకము నీకు ప్రీతి కలిగించు పనులు చేయును. నీవు సంతత ప్రకాశమున శోభితుడువు. నీ దీప్తితో ద్యావాపృథ్వులను విశాల పరతువు.

    5. వైశ్వానరాగ్నీ ! నీవు మానవులకు స్వామివి. ధనములకు నేతవు. ఉషకు దినమునకు కేతన స్వరూపుడవు. మేము అశ్వగణములు కోరి నిన్ను సేవింతుము. పాపహరములు, ఘృత యుక్తములగు వచనములు నిన్ను సేవించును.

    6. మిత్రుల పూజయుత అగ్నీ ! వసువులు నీకు బలము ప్రసాదించినారు. నీ కర్మలను సేవించినారు. ఆర్యులకు అధిక తేజము ఉత్పన్నము చేసినావు. దస్యుల అనార్యులను వారి స్థానములనుండి పెకిలించినావు.

    7. నీవు దూరస్థ అంతరిక్షమున సూర్యరూపమున భాసింతువు. వాయురూపుడవై సర్వ ప్రథమ సోమపానము చేసెదవు. జాతధనుడవగు అగ్నీ ! జలమును కలిగింతువు. సంతానమువలె పాలనీయ వ్యక్తి కోరికలు తీరుస్తావు. విద్యుద్రూపమున గర్జిస్తావు.

    8. అందరు వరించదగిన అగ్నీ ! నీవు అన్నముతో ధనమును రక్షింతువు. అన్నముతో హవ్యదాత యశస్సును రక్షింతువు. మాకు దీప్తమంతమగు అట్టి అన్నమును అందించుము.

    (ధనము, కీర్తికన్న అన్నము ఆహారమునకు ప్రాధాన్యత ఇచ్చుచున్నాడు. ఆహారము లేని ప్రాణము నిలువదు. ప్రాణమున్నకదా ధనము, యశము ! అందుకే అన్నం బ్రహ్మేతి వ్యజనాత్) అని వేదము ఘోషించినది. అన్నమే బ్రహ్మమని తెలిసికొనుము అనుచున్నాడు. అన్నము ఆహార పదార్థములు ధనమును సృష్టించును. కేవలము ధనము దేనిని సృష్టించజాలదు. కనీసము తనను సృష్టించుకొనజాలదు. డబ్బు మాత్రము ధనము ఎన్నిటికిని రాజాలదు. అన్నపానాదులు యశస్సు ధన ఉత్పత్తికి కారణములగును.

    కావున ప్రాణికి అన్నమే ప్రధానమగును. అందుకే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.