Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    యస్తేస్తనః శశయో యోమయో భూర్యోరత్నధా వసువిద్యాః సుదత్రః |
    యేనవిశ్వాపుష్యసి వీర్యాణి సరస్వతి తమిహదాతవోకః ఉర్వ్య న్తరిక్షమన్వేమి ||

                                     ఏడవ ప్రపాఠకము

                                    మొదటి అనువాకము
   
                              (ఇడా ప్రశంస చెప్పబడుచున్నది.)   

    1. ఆహితాగ్ని యొక్క పాక యజ్ఞమును అనుసరించి పశువులు లభించుచున్నవి. ఇడయే పాక యజ్ఞము అగుచున్నది. అది యజమాని యజ్ఞమందు ప్రయాజ - అనుయాజల మధ్యమున వ్యవస్థితమైనది.

    2. హోతృ సమీపమునకు తీసికొనివచ్చు ఇడను 'హేసురూపవర్షవర్ణేః ఏహి' అని అభిమంత్రించవలెను. ఇడయే పశువులు అగుటవలన యజమాని పశువులనే ఆహ్వానించినట్లగును.

    3. పూర్వము దేవతలు యజ్ఞములు చేసినారు. అన్ని యజ్ఞ ఫలములను పిండుకున్నారు. ఆ యజ్ఞము అసురులను బలరహితులను చేసినది. యజ్ఞము వలన నిస్సారులైన అసురులు పరాభూతులు అయినారు.

    యజ్ఞమును దేవతలు రిక్తపరచుట - యజ్ఞము అసురులను రిక్తపరచుట తెలిసికొన్న యజమాని ఇతర యజమానులను రిక్త పరచుచున్నాడు.

    4. ఈ యజ్ఞము యొక్క ఆశీస్సులు సత్యములు అగునుగాక. ఈ ఆశీస్సులే యజ్ఞఫలము అగును. దీనివలననే నేను ఇతర యజమానుల బలమును గ్రహించుచున్నాను.

    5. తొలుత దూడ ఆవుపాలు త్రాగును. అప్పుడు ఆవు చేపును. పాలిచ్చును. అట్లే ఇడ చేసి యజమానికి ఫలములను ఇచ్చుచున్నది. 'ఇడోపహూతాః' అను మంత్రభాగము ఇడకు స్తనములు అగుచుండగా వాయువు వత్సము అగుచున్నది.

    6. హోత ఇడను ఆహ్వానించును. అప్పుడు యజమాని హోతను చూచుచు వాయువు మనసునందు ధ్యానించవలెను. ఆ విధముగా చేసిన తల్లి ఆవు వద్దకు దూడను విడిచినట్లగును.

    7. దేవతలు అందరు సంపూర్ణ దర్శపూర్ణమాస యజ్ఞమును ఆచరించియే స్వర్గమును పొందినారు. కాని మనువు మాత్రము పాక యజ్ఞము మాత్రమే చేసినాడు. ఇడయు మనువు నందు చేరినది.

    ఆ ఇడా దేవతను దేవాసురులు ఆహ్వానించినారు. దేవతలు ప్రతీచీ పద్ధతిని అనుసరించినారు. 'ఇడోపహోతా' అని ఆహ్వానించినారు. అసురులు పరాచీ పద్ధతిని అనుసరించినారు. 'ఉపహుతేడా' అని ఆహ్వానించినారు. ఇడ దేవతల ఆహ్వానమును మన్నించినది. వారిని చేరినది. పశువులు ఇడా స్వరూపము కదా! అందువలన పశువులు దేవతలను చేరినవి. అసురులను విడిచినవి.

    8. అధ్వర్యుడు ఒకనిని పశుహీనుని చేయదలచినపుడు పరాచీ పద్ధతిన ఇడను ఆహ్వానించవలెను. అట్లయిన అధ్వర్యు ఎవనిని ఉద్దేశించినాడో వాడు పశు విహీనుడు అగును.

    (ఇది 1 - 10 - 10 వంటి హేయమైనది.)

    9. ఎవడు ఇడా దేవతను ప్రతీచీ పద్ధతిన ఆహ్వానించి ఇడా దేవత యందు తనను లీనము చేయునో అతడే ఇడను ఆహ్వానించిన వాడు అగుచున్నాడు. అట్లని వేదవేత్తలు చెప్పుచున్నారు.

    10. ఇడా దేవతా! నీవు ఎంతో ప్రియమవు. మా శత్రువులను సంహరించు దానవు. ధనవతివి. అని 'సానః ప్రియే' అను మంత్రమున ఇడను ఆహ్వానించి, ఇడ మనసున ప్రతిష్ఠించినవాడు ఇడను ఆహ్వానించిన వాడు అగుచున్నాడు.

    11. ప్రధానయాగము పూర్తి అగును. అనూయాజాది యాగములు ప్రారంభము కావలసి ఉండును. ఆ రెండింటి మధ్యభాగమున ఋత్విజులు పురోడాశలేశమును భక్షింతురు. ఉదక లేశమును తలలపై చల్లుకుందురు. ఈ రెండును యాగరూపములు కావు. అందువలన యజ్ఞము విచ్చిన్నము అయినట్లు అగును. వీనివలననే రాక్షసుల యజ్ఞము విచ్చిన్నము అయినది. అట్లగుట వలన దేవతలు జాగ్రత్తపడినారు. ఒక సమర్థుని చేత విచ్చిన్న యజ్ఞమును సంధానము చేయించినారు.

    12. 'బృహస్పతిస్తనుతామిమం' అనుమంత్రమున యజ్ఞమును సంధానము చేయవలసినదని బృహస్పతిని కోరినారు. బృహస్పతియే దేవతలకు బ్రహ్మ కదా! అందువలన బ్రహ్మయే యజ్ఞమును సంధానము చేసినట్లయినది.

    13. ఒక యజ్ఞము విచ్ఛిన్నమైనపుడు దానిని సంధానము చేయవలెననియు, అవిచ్ఛిన్నము చేయవలెననియు ప్రార్థించుటకే 'విచ్ఛినమిత్యా' ది మంత్రములు వచించబడినవి.

    14. 'విశ్వేదేవా ఇహమాదయన్తామ్' అను మంత్రము విశ్వేదేవతలకు తృప్తి కలిగించుటకు చెప్పబడినది. యజ్ఞము అవిచ్ఛిన్నముగ కొనసాగవలెనని ఆదేశించుచున్నది.

    15. యజ్ఞకర్త ఋత్విజులకు ఇచ్చిన దక్షిణలో అతని పశువులు కూడ చేరును. అందువలన యజ్ఞకర్త పశుహీనుడు కాగలడు. కావున దేవతారూపులైన ఋత్విజులకు ఇచ్చిన దక్షిణ వారికి చెందునట్లును - పశువులు తనవద్దనే ఉండునట్లును యజమాని ఏర్పాటు చేయవలెనని పెద్దలు చెప్పుదురు.

    16. "బధ్నపిన్వస్వ" అను మంత్రము ఋత్విజులను సంతృప్తి చెందించుమని యజ్ఞపురుషుని ప్రార్థించుచున్నది. యజ్ఞము బధ్నశబ్ద వాచ్యము. కావున యజమాని యజ్ఞమును గౌరవించినట్లు - పూజించునట్లు అయినది. ఆ ప్రకారము యజమాని ఋత్విజులకు ఇచ్చిన దక్షిణ దేవతలకు చెందినట్లును, పశువులు అతని వద్ద ఉండునట్లును అగుచున్నది.

    17. నేను ఇచ్చినది క్షీణించకుండును గాక అనుట వలన అది అక్షయము అగుచున్నది.

    18. యజ్ఞము చేయుచున్న నా శక్తి సామర్థ్యములు క్షీణించకుండు గాక అని యజమాని ప్రార్థించుచున్నాడు. అందువలన అతడు మరింత వర్థిల్లుచున్నాడు.

    (16 వ మంత్రమున పశువులను ఇచ్చి మరల నామమాత్రపు వెలకు తిరిగి తీసికొనుట కావచ్చును.

    17 వ మంత్రమున దేవతలకు సమర్పించుట వరకే - పదార్థములు వ్యక్తుల వద్దనే ఉండుటను - చెప్పుచున్నట్లున్నాడు. ఇది నాకు తోచినది మాత్రమే.)

                                   రెండవ అనువాకము

                            (ఇది ప్రశ్నోత్తర రూప ఇడా ప్రశంస.)

    1. సువర్చనసుని పుత్రుడు సంశ్రవసుడు. ఉపోదితి పుత్రుడు తుమింజుడు. మొదటివాడు రెండవ వానిని అడిగినాడు.

    2. తుమింజా! నీవు యాగకర్తలకు హోతవు అయినావు కదా! ఎట్టి గుణములు కల ఇడను ఆహ్వానించినావు?

    3. ప్రాణవాయువున దేవతలను నిలుపునదియు - వ్యానమున నరులను బ్రతికించునదియు - అపానమున పితృదేవతలను భరించునడియునగు ఇడాదేవిని ఆహ్వానించినాను. అని తుమింజుడు బదులు పలికినాడు.

    4. ఇడ గోరూపకదా! దానిని దక్షిణగా గ్రహించిన వారిని నశింప చేయుచున్నదా? నశింపచేయుట లేదా? అని అడిగినాడు.

    5. నశింపచేయుచున్నది అని బదులు చెప్పినాడు.

    6. నీవు ఇడాదేవత దేహమునే కదా ఆహ్వానించినావు. అట్లయిన గ్రహీత నాశనమెందుకు?

    7. గోవుయే ఇడయొక్క శరీరమగును. ఇది తెలిసిన వారే ఇందును గురించి వాదులాడుకున్నారు.

    8. యజ్ఞములందు గోవు దక్షిణగా ఇవ్వబడుచున్నది. ఆ గోవు ప్రాణవాయువున దేవతలను నిలిపినది. ఆ గోవు వ్యావాయువున నరులను జీవింపచేయుచున్నది. పితరుల కొరకు హింసించ బడునట్టి ఆ గోవు పితరులను భరించుచున్నది.

    ఈ విషయములు తెలిసికొన్నవాడు పశువులు గలవాడు అగుచున్నాడు.

    (అష్టకా శ్రాద్ధమున గోవును వధించుట కలదు. అదియే గోవును హింసించుట.)

    9. ఇంకను ప్రభువు కల ప్రజకు అభిముఖముగా ఉన్న ఇడా దేవిని ఆహ్వానించినాను అని చెప్పినాడు.

    10. ఇడ యొక్క అన్నమునే కదా ఆహ్వానించినావు? అని అడిగినాడు.

    11. ఓషధయో వా అస్యా అన్నం. ఓషధులే ఇడకు అన్నములు. కావున ఓషధులు ప్రభువు గల ప్రజల కొరకు అగుచున్నవి.

    12. య ఏవం వేదాన్నాదో భవతి - ఇది తెలిసికొన్నవాడు అన్నాదుడు అగుచున్నాడు.

    13. లేదా ఏ ఇడాదేవత వ్యాధి పీడితులను అనుగ్రహించుచున్నదో - పరాభూతులను కరుణించుచున్నదో అట్టి ఇడను ఆహ్వానించుచున్నాను అన్నాడు.

    14. అట్లయిన ఇడయొక్క భూరూప ప్రతిష్ఠను కదా ఆహ్వానించినావు? అని అడిగినాడు.

    15. ఈ భూమియే ఇడ యొక్క ప్రతిష్ఠ అగుచున్నది. భూరూపమైన ఇడయే వ్యాధి పీడితులను అనుగ్రహించుచున్నది. పరాభూతులను కరుణించుచున్నది.

    16. య ఏవం వేద ప్రత్యేవ తిష్ఠతి - ఇది తెలిసికొన్నవాడు ప్రతిష్ఠకలవాడు అగుచున్నాడు.

    17. లేదా ఇడ వృష్టిరూపయగుచున్నది కురిసిన వాన ఏరులుగా పారుచున్నది. ఆ నీరు త్రావి జనులు జీవించుచున్నారు. అట్టి ఇడను ఆహ్వానించుచున్నాను అన్నాడు.

    18. వృష్టిరూపమగు ఇడ జనులను నశింపచేయుచున్నదా? చేయకున్నదా? అడిగినాడు.

    19. నశింపచేయుట లేదు. అంతేకాదు. పుట్టించుచున్నది. పెరిగించుచున్నది అన్నాడు.

    20. వృష్టిరూప ఇడను ఆహ్వానించినాను అన్నావు కదా! అందువలన నీవు నిజమైన ఇడను ఆహ్వానించిన వాడవు అయినావు అన్నాడు.

    21. వర్షమే ఇడ యగును. వాన కురియును. ఏరులు పారును. ఆ నీరు త్రాగి జనులు జీవించుచున్నారు.

    య ఏవం వేద ప్రైవజాయతేన్నాదో భవతి. అది తెలిసికొన్నవాడు సంతానవంతుడు, అన్నాదుడు అగుచున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.