Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    (ఇది హేయము. నీచము. యజమాని సొమ్ముతిని, అతని శత్రువునకు ఫలము నందించకోరుట ద్రోహమగును. ఇది హోత యజమానిని వప్పగించినట్లగును. ఏ సభ్య సమాజము ఈ పద్ధతి అంగీకరించదు. ఇందు ఒకటి ఆధిక్యత స్పష్టము!)

    11. పెక్కురు యజమానులు చేయు యజ్ఞములు ఉండును. ఆ యజ్ఞ ఫలము అందరకు సమానముగా అందవలెనన్నచో హోత పురోనువాక్యలోని ఋక్కు యొక్క అర్ధభాగము ఉచ్ఛరించిన వెంటనే మొదటి వ్యాహృతిని - యాజ్య ప్రారంభమునకు ముందు రెండవ వ్యాహృతిని - యాజ్యలోని ఋక్కు యొక్క సగభాగము ఉచ్చరించగనే మూడవ వ్యాహృతిని ప్రయోగించవలెను. అందువలన యజ్ఞ ఫలము యజమానులందరకు సమానముగా లభించును.

    12. పర్జన్యుడు వర్షము - అందరి కొరకు సమముగా వర్షించును. అట్లే యజ్ఞము యజమానులందరకు సమాన ఫలమును ఇచ్చుచున్నది. నదీ తీరపు జనులందరు నీరు తీసుకుందురు. అట్లే యజమానులు యజ్ఞ ఫలమును అనుభవించుచున్నారు.

    13. స్రువము నందలి ఆఘారాజ్యమా! నీవు మనసువు. మనసు ప్రజాపతి సంబంధి. యజ్ఞము సహితము ప్రజాపతి సంబంధియే. కావున నీవు వానితో కూడి నన్ను ఆవహించుము. 'మనోసి' అను మంత్రము ఈ విషయమునే చెప్పినది.

    మనో వై ప్రాజాపత్యం ప్రాజాపతో యజ్ఞో మనసు ప్రజాపతియే. యజ్ఞము ప్రజాపతియే. కావున మనసు తనయందే యజ్ఞమును ధరించుచున్నది.

    ఆఘారాజ్యమా! నీవు ఇంద్ర సంబంధివి. శత్రు నాశకమగు వాక్కువు. నీవు నన్ను ఆవహించుము. 'వాగసి' అను మంత్రము ఈ విషయము చెప్పినది.

    వాక్కు ఇంద్ర సంబంధము. అందువలన వాక్కు తనయందే ఇంద్రుని ధరించుచున్నది.

                                  పదకొండవ అనువాకము

                     (ఆశ్రావణాది మంత్రములు విధింపబడుచున్నవి.)

    1. ప్రజాపతి సర్వ యజ్ఞములను అనుసరించి ఉండువాడు. అతడు సప్తదశనామకుడు. ఈ విషయము తెలిసిన యజమాని సంపూర్ణ యజ్ఞము చేసినవాడు అగుచున్నాడు. అతని యజ్ఞము భ్రష్టము కాకున్నది.

    (ఆశ్రావణాది మంత్రములు 17 అక్షరములవి. కావున ప్రజాపతి సప్తదశనామకుడు.)

    2. ఆశ్రావయ 4 అక్షరములది + అస్తుశ్రౌషట్ 4 అక్షరములది + యజ 2 అక్షరములది - యే యజామహే 5 అక్షరములది + వౌషట్ 2 అక్షరములది. ఈ 17 అక్షరముల అయిదు మంత్రముల గుచ్చము ప్రజాపతి అగును. ఆ ప్రజాపతి అన్ని యజ్ఞములందు ఉన్నాడు. ఈ విషయము తెలిసిన యజమాని సంపూర్ణ యజ్ఞము చేసిన వాడగుచున్నాడు. అతని యజ్ఞము భ్రష్టము కాకున్నది.

    3. యజ్ఞపు ఆరంభమును - మధ్యమ - సమాప్తిని తెలిసిన యజమాని సాంగము, వైకల్య రహితమగు యజ్ఞము చేసినవాడు అగుచున్నాడు. అతనికి సకల యజ్ఞ ఫలము లభించుచున్నది.

    4. మంత్ర పంచకమునందలి తొలి మంత్రము యజ్ఞపు ఆరంభము. 2,3,4 మంత్రములు మధ్యమం - 5వది సమాప్తి అగుచున్నవి.

    5. సత్యవాక్కు యొక్క ఫలితమును తెలిసికొనిన యజమాని సూనృత వాక్కు యొక్క ఫలితమును పొందుచున్నాడు.

    6. 'యజ్ఞో వై సూనృతా' - యజ్ఞమే సత్యవాక్కు. ఈ సూనృతము గోవును "ఆశ్రావయ" అను మంత్రముచే పిలుచుచున్నాడు. "అస్తుశ్రౌషట్" అను మంత్రముచే దూడను విడుచుచున్నాడు. 'యజ' అను మంత్రమున పాలు పితుకు పాత్రను అందుకొనుచున్నాడు. 'యే యజామహే' అను మంత్రమున పాలు పితుకువాడు ఆవు వద్ద కూర్చొనుచున్నాడు. 'వషట్' అను మంత్రము వలన పాలు పితుకుచున్నాడు.

    ఈ విషయములు తెలిసిన యజమాని వాస్తవముగా సూనృత గోవు పాలు పితుకుచున్నాడు.

    7. ఒకప్పుడు దేవతలు యజ్ఞమునందు ఆసీనులు అయినారు. అప్పుడు దిశములు రిక్తములుగా అగుపించినవి. అంతట దేవతలు మంత్ర పంచకమును కనుగొన్నారు. వారు తొలి మంత్రమున వాయువును, రెండవ మంత్రమున ఆకాశమును, మూడవ మంత్రమున విద్యుత్తును, నాలుగవ మంత్రమున ఉరుమును, అయిదవ మంత్రమున వర్షమును కల్పించినారు. అప్పుడు దిశలు ఆప్యాయములు అయినవి.

    ఈ విషయములు తెలిసి కొనిన యజమానికి దిశలు ఆప్యాయములు అగును.

    8. ఒక యజమాని సప్తదశాక్షరమయ ప్రజాపతిని గ్రహించినాడు. అంతట ప్రజాపతి ఆ యజమానిని అనుగ్రహించినాడు. ప్రజాపతి అనుగ్రహము పొందిన యజమాని ఇతర యజమానులందు శ్రేష్ఠుడు అయినాడు.

    9. మంత్ర పంచకమునందలి సప్తదశాక్షర ప్రజాపతియే తెలియదగినవాడు. ఆ ప్రజాపతిని ఎరిగిన యజమాని ఉత్కృష్టుడు అగుచున్నాడు.

    10. వసంతమును సంతోష పెట్టుచున్నాను అనుట వలన రుతువులే ప్రయాజ మంత్రములైనవి. యజమాని రుతువులను సంతోష పెట్టుట వలన రుతువులు అతనికి అనుకూలములు అగుచున్నవి.

    ఈ విషయము తెలిసికొన్న యజమానికి రుతువులు అనుకూలములు అగుచున్నవి.

    11. అగ్నిషోమ సంబంధ దేవయజ్యచే నేను నేత్రవంతుడనగుదును. అట్లని అగ్నిషోమాభ్య మంత్రమునుడివినది.

    నేత్రవంతులగు అగ్నిషోమాది దేవతల యజ్ఞము చేసినవాడు నేత్రవంతుడు అగుచున్నాడు.

    12. అగ్నిర్వైదేవానామన్నాదో - అగ్నియే దేవతలకు అన్నము అందించుచున్నాడు. అగ్ని యందే అన్నమిచ్చుట చేరి ఉన్నది. అట్లని 'అగ్నేరహం' అను మంత్రాదులు చెప్పినవి.

    13. ఉపాంశు యాజముననే దేవతలు రాక్షసులను సంహరించినారు. దానిచేతనే శత్రువులను వధించినారు. అట్లని 'దబ్ధిరస్యదబ్దో' అను మంత్రము వచించినది.

    14. అగ్నిషోమ దేవతల దేవయజ్యము వలననే నేను వృత్రహంతను అయినాను. అని అగ్ని షోమాది మంత్రము చెప్పుచున్నది.

    ఇంద్రుడు వృత్రహంతయగు అగ్నిషోమముల వలననే శత్రువులను హింసించి, వధించ గలిగినాడు.

    15. ఇంద్రాగ్నుల దేవయజ్య వలననే నేను ఇంద్రియపటుత్వము కలవాడను. అన్నాదుడను అగుదును అని చెప్పబడినది.

    ఇంద్రియ పటుత్వము కలవాడే అన్నాదుడు అగుచున్నాడు.

    16. ఇంద్రుని దేవయజ్య వలన నేను ఇంద్రియ పటుత్వము కలవాడను అగుదును అని 'ఇంద్రసాహ' ఇత్యాది మంత్రములు చెప్పుచున్నవి.

    అందువలన యజమాని 'ఇంద్రవ్యేవభవతి' ఇంద్రియ పటుత్వము కలవాడు అగుచున్నాడు.

    17. మహేంద్ర దేవయజ్యవలన నేను విజేతను, మహిమాన్వితుడను అగుదును అని 'మహేంద్రస్వాహ' ఇత్యాది మంత్రములు వచించుచున్నవి.

    అట్లగుటచే యజమాని విజేతయు, మహిమాన్వితుడును అగుచున్నాడు.

    18. స్విష్టకృత అగ్ని దేవయజ్య వలన నేను ఆయుష్యమును, ప్రతిష్ఠను పొందుచున్నానని 'అగ్నేస్స్విష్టకృతో' ఇత్యాది మంత్రములు చెప్పినవి.

    కావున యజమానికి ఆయువు, ప్రతిష్ఠ కలుగుచున్నవి.

                                   పన్నెండవ అనువాకము

                                   (యాజ్యా పురోను వాక్యలు.)

    1. పుత్ర, భృత్యాదుల కొరకు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. అతడు కేవలము మావాడు అగును గాత.

    2. నరులు ఇంద్రుని అర్ధ హవిస్సు వహించుటకు ఆహ్వానించుచున్నారు. పారమును ఎరిగిన యజమానులు కర్మలను అనుష్ఠించుచున్నారు.

    ఇంద్రా! నీవు శూరుడవు, ధనదుడవు, బలములను పెంచువాడవు. మాకు గోవ్రజమును ఇమ్ము.

    3. ఇంద్రా! నీవు శతక్రతువవు. నీ అనుగ్రహము వలన నేను పంచ జనుల సామర్థ్యమును సంపూర్ణముగా తెలియుచున్నాను.

    4. ఇంద్రా! నీవు యాగోద్దేశ్యుడవు. యాగములందు దేవతలందరి కన్న గొప్పవాడవు. నీవు వృత్రుని వధించినావు. క్షత్రియ జాత్యభిమానము కలవాడవు. బలయుతుడవు. శత్రువును తిరస్కరించ గలవాడవు. అందువలన నీకు హవిస్సులు - దేవతలతో క్రమముగా అందించ బడుచున్నవి.

    5. సూర్యుని అశ్వములు ఏడును రథమున తమంత తాముగా తగులుచున్నవి. సూర్యుడు అతీంద్రియజ్ఞాని. కీర్తిమంతుడు. ప్రకాశవంతుడు. అంతటివాడు ఇంద్రునకు అతిథి యగుచున్నాడు. ఇంద్రుని మహిమ అంతటిది!

    6. ఇంద్రా! చెట్లకు కాయగసరు లేకుండెను. వర్షము కలిగించినావు. వాటికి కాయలను, ఫలములను కలిగించినావు. సూర్యుని ఆకాశమునందు స్థాపించినావు.

    యజమానులు ఇంద్రునకు ప్రియమగు పురోడాశాదులను - భక్తియుక్తముగ, సామములచేత - చక్కగా కాల్చుదురు గాత. చక్కని స్తుతులచే స్తుతింతురు గాత.

    7. సామగాయకులు బృహత్ సామమున ఇంద్రుని స్తుతించుచున్నారు. అర్కిణులు ఋక్కులచే ఇంద్రుని స్తుతించుచున్నారు. అన్యవచనము సహితము ఇంద్రుని నుతించుచున్నది.

    8. శతక్రతూ! ఉద్గాతలు నిన్ను కీర్తించుచున్నారు. అర్కిణులు నిన్ను భజించుచున్నారు. అధ్వర్యులు వంశమును వలె నిన్ను ఉన్నతుని చేయుచున్నారు.

    9. ఇంద్రా! గ్రీష్మకాలమున దావాగ్నిచే భూములు పరితప్తములు అగుచున్నవి. వర్షము కలిగించి వానిని నీవు పునరుజ్జీవింప చేయుచున్నావు. నిన్ను మేము సంతోషపెట్టదలచినాము. స్తుతించు మంచి మనసు కలిగి ఉన్నాము. నీవు ఈ హవిస్సును స్వీకరించుము. అందువలన యజమాని కోరికలు ఫలించును గాత.

    10. ఇంద్రా! నిన్ను ఆనంద పరచ దలచినందున మేము సుబుద్ధులము అయినాము. కావున మరణము వరకు నిన్నే స్తుతింతుము. నది దాటించుమని ఉభయతీరముల జనులు నావికుని ఆహ్వానింతురు. అట్లే పాపవిముక్తులమైన మమ్ము ఉభయవంశజులు ఆహ్వానించుచున్నారు.

    11. ఇంద్రుడు ప్రకాశించువాడు. యాగములకు ముఖ్యుడు. పాపములను విడిపించువాడు. యజ్ఞఫలములను ఇచ్చువాడు. వర్షమును తరుగనీయని వాడు. ఋత్విజులారా! అట్టి ఇంద్రుని మరింతగా స్తుతించండి
   
    అశ్వినులారా! ఇతనికి ఇంద్రియ పాటవమును - బలమును కలిగించండి.

    12. ఇంద్రా! మా శత్రువులను హింసింపుము. మమ్ము చంపదలచి సేనను కూర్చువాని తలవంచుము. మమ్ము అంతటను నశింప చేయు శత్రువును పాదా క్రాంతుని చేయుము.

    13. ఇంద్రా! మమ్ము క్షతినుండి రక్షించు బలము కలిగి జన్మించినావు. నీవు నరుల కోర్కెలు తీర్చువాడవు. శత్రుభావము గలవారిని తిరస్కరించినావు. దేవతలకు హవిస్సులు అర్పించువారికి సకల భోగములు కల్పించినావు.

    14. ఇంద్రా! నీవు భయంకరమైనదియు, ప్రాణులను భక్షించునదియు, పర్వతము లందు ఉన్నదియునగు సింహము వలె, మా విరోధిని పరిమార్చుటకు, దూర దేశము నుండి వచ్చినావు. నీ వజ్రము వైరులను చీల్చునది. తీక్ష్ణమైనది. దానికి పదును పెట్టుము. శత్రువును కొట్టుము. యోధులను తలదన్నుము.

    15. ఇంద్రా! నీవు శత్రుయోద్ధలను రాల్చుము. వృత్రుని దవడలు పగులగొట్టుము. ఉగ్రుడవగుము. మమ్ము క్షీణింపచేయువాని కోపమును పోగొట్టుము.

    16. రక్షించు వాడగు ఇంద్రుని హువేమ - ఆహ్వానించుచున్నాను. అవరోధముల నుండి రక్షించువాడగు ఇంద్రుని హువేమ. శూరుడగు ఇంద్రుని హువేమ. సర్వ యాగములందు ఆహ్వానించదగిన ఇంద్రుని హువేమ. సర్వకార్య సమర్థుడగు ఇంద్రుని హువేమ.

    మఘవుడు మాకు శుభములను కలిగించును గాత.

    17. ఇంద్రా! నీవు బలశాలివి. మా రక్షణ కొరకు ఈ యాగము చేయుచున్నాము. ఇందు మేము లోపములు చేయకుండునట్లు అనుగ్రహింపుము. హర్యశ్వఇంద్రా! ఏనాటికిని మేము నిన్ను అవమానించకుందుముగాక. మాకు బాధలు లేని ఇల్లు ప్రసాదించుము. విద్వాంసులగు యజమానులందు మేము నీకు ప్రీతిపాత్రులము అగుదుము గాక.

    18. పురుహూత ఇంద్రా! నీ రథమున గుర్రములు కట్టుటకు నరులు ఏర్పాట్లు చేయుదురుగాక. త్వష్ట నీ వజ్రాయుధమునకు పదును పెట్టును గాత. ఋత్విజులు మంత్రములచే నిన్ను భజింతురుగాక. పాపములను నశింప చేయుటకు ఇంద్రుని వర్థిల్ల చేయుదురు గాత.

    19. ఇంద్రా! నీ యాగము కోరికలు తీర్చునట్టి దగును. ఆ యజ్ఞ సాధనములగు దృషదుపలాదులను అలంకరించు చున్నాము. అవి నిన్ను, అదితిని సంతోష పరచును గాత. ఇంద్రుని వజ్రాయుధాదులు - రథాశ్వములతో నిమిత్తము లేకుండగనే అసురులను సంహరించును గాత.


            శ్రీమదాంధ్రవచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 
            మొదటి కాండమునందలి ఆరవ ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.