Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    11. ఆరణ్యక ధాన్యము ఇంద్రియాభివృద్ధి హేతువగును. యజమాని ఆ ధాన్యమును భుజించి ఇంద్రియాభివృద్ధిని పొందవలెను.

    12. యజమాని భుజించకున్న ఆకలిగొన్న వాడగును. భుజించినచో రుద్రుడు అతని పశువులను వధించును.

    13. అట్లగుట వలన యజమాని నీరు త్రాగవలెను. అందువలన భోజనము చేసినట్లుగాని చేయనట్లుగాని కాకుండును. ఆకలిగొన్నవాడు కాకుండును. ఆ విధముగ చేసిన రుద్రుడు యజమాని పశువులను వధించడు.

    14. యజ్ఞము వజ్రాయుధము వంటిది కాగా ఆకలి శత్రువు వంటిది అగును. ఉపవసించిన యజమాని వజ్రాయుధము అగుచున్నాడు. తన శత్రువగు ఆకలిని సంహరించుచున్నాడు.

                                 ఎనిమిదవ అనువాకము

          (జల ప్రణయనము, యజ్ఞాయుధ సంభృతి చెప్పబడుచున్నది.)

    1. శ్రద్ధవహింపక యజ్ఞము చెసినట్లయిన దేవతలు అట్టి యజ్ఞమును అంగీకరించరు.

    2. ఉదకములు శ్రద్ధా స్వరూపములు. కావున ఉదకములను ప్రణయనము చేయవలెను. అట్లయిన యజ్ఞమున శ్రద్ధ వహించినట్లగును. ఆ యజ్ఞము నందు దేవతలు, మానవులు సంతసింతురు.

    3. ఉదకములు శరీర ధర్మములను, వాక్కును కూడ అతిక్రమించుచున్నవి. మనసును మాత్రము అతిక్రమించజాలవని పెద్దలు చెప్పుచున్నారు.

    4. యజమాని మనసుతో పృథ్విని ధ్యానించుచు జల ప్రణయనము చేయవలెను.

    5. పృథివియే మనస్సగును. కావున పృథివిని ధ్యానించి అపాంప్రణయనము చేసిన యజమాని పృథివి చేతనే అపాంప్రణయనము చేసినవాడు అగుచున్నాడు.

    6. అది తెలిసికొనిన యజమాని హవిస్సు లుప్తము కాకుండును.

    7. అధ్వర్యుడు యజ్ఞ పరికరములను సాధించవలెను. యజ్ఞ సాధనములే యజ్ఞమగును. కావున యజ్ఞ సాధనములను ఆర్జించినచో యజ్ఞమును ఆర్జించినట్లగును.

    8. యజ్ఞ సాధనములను ఒక్కొక్క దానిని ఉపయోగించిన పితృ దేవతాకమగును. ఒకేమారు అన్నింటిని ఉపయోగించిన మానవ సంబంధమగును.

    9. యజ్ఞ సాధనములను జంటలుగా ప్రయోగించవలెను. అట్టి ప్రయోగమునకు 'యాజ్య పురోవాక్యల రూపము' స్త్రీ పురుషాత్మక మిథునత్వము సిద్ధించును.

    10. యజ్ఞపు మొదటనే యజ్ఞ సంబంధములగు పది విధములగు పరికరములను తెలిసికొని సంపాదించిన యజమాని యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగగలదు.

    11.   1. స్ఫ్య 2. కపాలిని 3. అగ్నిహోత్ర హవణి 4. శూర్పము 5. కృష్ణాజినము 6. శమ్య 7. రోలు 8. రోకలి 9. దృషద్ అను శిల 10. ఉపల అను రాయి. ఈ పది యజ్ఞ సాధనములు అగును.

    12. దేవతలు వినునట్లు యజ్ఞము చేసిన యజమాని యొక్క హవ్యమును దేవతలు స్వీకరించుచున్నారు.

    13. ఈ యజ్ఞమునకు దేవతలను ఆహ్వానించువాడు అగ్ని. నేను అటువంటి అగ్నిని ఆహ్వానించుచున్నాను. అని పాత్ర యందుంచిన హవిని అభిమంత్రించవలెను.

    14. ఈ అభిమంత్రణము యజ్ఞమునకు స్వీకార స్వరూపము అగును. దీనిని గ్రహించి యాగము చేయవలెను.

    15. అట్టి అభిమంత్రణము యజ్ఞపు స్థిరత్వమునకని చెప్పవలెను. వాక్కును నియంత్రించవలెను.

        (మంత్రము చెప్పి మౌనము వహించవలెను.)

    16. శబ్దోచ్చారణమున మనసు యజ్ఞము నుండి తొలగును. కావున మనసుతోనే ప్రజాపతి యజ్ఞమును ప్రారంభించినాడు. రాక్షస సంచార పరిహారార్థమై యజమానియు మౌనము వహించి మనసుచే యజ్ఞమును ఆచరించవలెను.

    17. యోగము కలిసినపుడు యజమాని యాగము చేయవలెను. అట్టివాడు యజమానులందు ప్రసిద్ధుడు అగుచున్నాడు.

    18. ఏ ప్రజాపతి నిన్ను యజ్ఞమునకు యోగ్యునిగా చేయవలసినవాడో - ఆ ప్రజాపతియే నిన్ను యజ్ఞ యోగ్యుని చేయును అని చెప్పబడినది. కావున ఆ ప్రజాపతియే ఈ యజ్ఞమును యోగ్యము చేయుచున్నాడు. యోగకాలమున యాగము చేయువాడే యాగము చేయువాడు అగుచున్నాడు. 

                                  తొమ్మిదవ అనువాకము

                         (ద్వాదశ ద్వంద్వసంపత్తి వివరించబడినది.)

    1. ప్రజాపతి అగ్ని హోతాద్రి యాగములను సృష్టించినాడు. వానిలో అగ్నిహోత్రము - అగ్నిష్టోమము ఒక ద్వంద్వము అగును. పౌర్ణమాసి - ఉక్థము ఒక ద్వంద్వము అగును. అమావాస్య - అతిరాత్రము ఒక ద్వంద్వము అగును.

    ప్రజాపతి వానిని సరిసమానముగా ఏర్పరచినాడు. అగ్నిష్టోమము ఇచ్చినంత ఫలముచే అగ్నిహోత్రయాగము కలిగించును. పూర్ణమాసి అంతటి ఫలమునే ఉక్థము కలిగించును. అమావాస్య అంతటి ఫలమునే అతిరాత్రము కలిగించును.

    2. ఏ యజమాని ఈ విషయమును తెలిసికొని అగ్నిహోత్రయాగము చేయునో అతనికి అగ్నిష్టోమ యాగమంతటి ఫలము కలుగును.

    ఏ యజమాని ఈ విషయము తెలిసినవాడై పౌర్ణమాసి యాగము చేయునో అతనికి ఉక్థ యాగమంతటి ఫలము లభించును.

    ఏ యజమాని ఈ విషయమును తెలిసినవాడై అమావాస్య యాగము చేయునో అతనికి అతిరాత్రయాగమంతటి ఫలితము దక్కును.

    3. పరమేష్ఠి కన్న మున్నే దర్శపూర్ణమాస యజ్ఞము ఏర్పడినది. ఆ యజ్ఞమును అనుష్ఠించిన యజ్ఞకర్త పరమేష్ఠిత్వ పదవిని చేరుకున్నాడు.

    ఆ యజ్ఞము ప్రజాపతిని ప్రోత్సహించినది. ప్రజాపతి దర్శపూర్ణమాస యజ్ఞము చేసినాడు. ఉత్తమ పదవిని పొందినాడు.

    అది ఇంద్రుని ప్రోత్సహించినది. ఇంద్రుడు దర్శపూర్ణమాస యజ్ఞము చేసినాడు. ఉత్తమ పదవిని పొందినాడు.

    అది అగ్నిషోమ దేవతలను ప్రోత్సహించినది. వారు దర్శపూర్ణమాస యజ్ఞమును అనుష్ఠించినారు. ఉత్తమ పదవిని పొందినారు.

    ఏ యజమాని ఈ విషయములను తెలిసికొన్నవాడై దర్శపూర్ణ మాస యజ్ఞమును అనుష్ఠించునో అట్టివాడు నిశ్చయముగ పరమపదమును పొందుచున్నాడు.

    4. దశ పూర్ణమాస యజ్ఞములను విశేషముగా చేసిన యజమానికి సంతానము, పశువులు, మిథునములు కలిగి వర్థిల్లుచున్నాడు. సంవత్సరమునందు గల పన్నెండు నెలలలోనూ దశ పూర్ణమాసయాగము, ద్వాదశ ద్వంద్వములు చేయవచ్చునని చెప్పుచున్నారు.

    5.  1. అధ్వర్యుడు ఆవుపాలు పితుకుటకు దూడను విడువవలెను. 2. ఉఖ యను పాత్రను గార్హ పత్య అగ్ని మీద పెట్టవలెను. 3. ధాన్యమును దంచవలెను. 4. దృషద ఉపల శిలలచే పోటు వేయవలెను. 5. దృషత్తునందు పిండి చేయవలెను. 6. పురోడాశమును వండుటకు పాత్రను నిప్పు మీద పెట్టవలెను. 7. ఉడికించవలెను. 8. నేయి పోయవలెను. 9. వేదిని అమర్చబోవు స్థలమున స్తంభయుజువును హరించవలెను. 10. గడ్డి, దుమ్మును దోసిలితో ఎత్తి పోయవలెను. 11. వేదిని ఏర్పరచవలెను. 12. యాజమానపత్ని నడుమునకు త్రాడు కట్టవలెను. 13. స్ఫ్య చే గీయబడిన గీతయందు ప్రోక్షణీ పాత్రను ఉంచవలెను. 14. గీచిన గీతలో నేయి వేయవలెను.

    6. ఇవియే దశ పూర్ణమాస యాగమునందలి ద్వంద్వ ప్రక్రియలు. వీనిని అనుష్ఠించి యాగము చేసిన యజమాని "ప్రప్రజయా పశుభిర్మిథునైర్జాయతే"

    (5వ మంత్రమున చెప్పినవి 14. అనగా 7 ద్వంద్వములు అగును. 8వ అనువాకము నందలి 11వ మంత్రమున చెప్పబడిన 10 - 5 ద్వంద్వములు అగును. 7 + 5 = 12 అనగా ద్వాదశ ద్వంద్వములు అగును.)  

                                 పదవ అనువాకము

                       (హవిస్సాదనము వివరించబడుచున్నది.)

    1. ధ్రువోసి ఇత్యాది మంత్రము జ్ఞాతుల స్థిరత్వమును చెప్పుచున్నది. ఉగ్రోసి ఇత్యాది మంత్రములు జ్ఞాతులు ప్రతివాదులు కారు అని చెప్పుచున్నది. యజమానికి ప్రతికూలుడై, అతనిని నశింప చేయగోరు జ్ఞాతి విషయముననే యజమాని ఉగ్రుడు అగుచున్నాడు అని "అభిభూరసి" అను మంత్రము చెప్పుచున్నది.

    2. యజమాని అగ్నిని "యునజ్మీత్యాది" మంత్రములచేతనే నియమించుచున్నాడు అని చెప్పబడినది.

    3. యజ్ఞము సమృద్ధమైనప్పుడు దేవతలు స్వర్గమును పొందినారు. యజ్ఞము సమృద్ధము కానప్పుడు దేవతలు రాక్షసులను పరాభవించినారని "యన్మే అగ్నీ" అను మంత్రము చెప్పుచున్నది.

    అందువల్ల యజమాని యజ్ఞమును సమృద్ధము చేసినపుడే స్వర్గమునకు చేరుచున్నాడు. యజ్ఞము సమృద్ధము కాకున్న శత్రువులను పరాభవించుచున్నాడు.

    4. యజమాని 'భూః' 'సువః' అను వ్యాహృతులచే హోత్రకర్మ అగ్నియందు హవిసులను చేర్చవలెను.

    5. అగ్నిహోత్ర కర్మ యజ్ఞములకు ముఖము వంటిది అగును. భూర్భువాది వ్యాహృతులు బ్రహ్మ స్వరూపములు. వీనివలన యజ్ఞముఖమునందు బ్రహ్మ స్వరూపములగు వ్యాహృతులు చేసినట్లగును.

    6. అగ్నిహోత్ర కర్మ చేసిన సంవత్సరము తరువాత సహితము ఈ వ్యాహృతులచేతనే హవిని అర్పించవలెను.

    7. అగ్ని హోత్ర క్రతువు యొక్క ఆద్యంతదినములందు వ్యాహృతులను బ్రహ్మయే ఏర్పరచినాడు. కావున యజమాని ఆ సంవత్సరమును బ్రహ్మ రూపముగనే పరిగ్రహించుచున్నాడు.

    8. దశపూర్ణమాస, చాతుర్మాస్య క్రతువులు చేయు యజమాని ఈ వ్యాహృతులతోనే అగ్నియందు హవిస్సులు సమర్పించవలెను.

    దశపూర్ణమాస, చాతుర్మాస్యములు యజ్ఞములకు ముఖము వంటివి. వ్యాహృతులు బ్రహ్మస్వరూపములు. కావున వీనివలన యజ్ఞముఖమునందు బ్రహ్మస్వరూపములగు వ్యాహృతులు చేసినట్లగును. సంవత్సరము తరువాత కూడ ఈ వ్యాహృతులచేతనే హవిని అర్పించవలెను. అందువలన బ్రహ్మస్వరూపమైన సంవత్సరమును గ్రహించినట్లగును.

    9. సామవేద మంత్రములచేత అనుష్ఠించబడిన యజ్ఞముయొక్క ఫలితము దేశమునకు చెందును. ఋగ్వేద మంత్రముల చేత అనుష్ఠించబడిన యజ్ఞము యొక్క ఫలితము దేశప్రజలకు చెందును. అందువలన యజమాని ఫలితము లేని యజ్ఞము చేసినవాడు అగును.

    కావున మంత్రములకు ముందు వ్యాహృతులను చేర్చవలెను. అందువలన బ్రహ్మస్వరూప వ్యాహృతులు ఆదిగా మంత్రము చదివినట్లగును. అందువలన యజమాని ఫలసహితమగు యజ్ఞము చేసినవాడగును.

    10. హోత యజమాని కొరకు యజ్ఞము చేయించును. ఒకప్పుడు హోత యజమానికి వ్యతిరేకి కావచ్చును. అట్లయినపుడు హోత యజ్ఞ ఫలమును యజమాని శత్రువులకు అందించదలచును. అట్టితరి పురోనువాక్యయందు వ్యాహృతులను ప్రయోగించవలెను. పురోనువాక్య శత్రుదేవతాకము కదా! అందువలన యజ్ఞఫలము శత్రువునకు చెందును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.