Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    9. దర్భగుచ్ఛమా! నీవు వేదనామకవు. ద్రవ్యలాభ సాధనమవు. నీవు అనుగ్రహించుము. నేను ధనము పొందగలవాడను.

    నీవు కర్మనామకవు. వేదిని సమ్మార్జనము చేయుసాధనమవగుచున్నావు. ధవదాతవు అగుచున్నావు. నీవు అనుగ్రహింపుము. నేను ఋత్విగాదులకు ధనదానము చేయగలవాడను అగుదును.

    నీవు వేదస్వరూపవు. నాకు ఆజ్యాది సమృద్ధిని ప్రసాదించుము. గృహాది వసతులు కలిగింపుము. అన్న సమృద్ధిని కలిగింపుము.

        (వేది మధ్యమున దర్భగుచ్ఛమును ఉంచవలెను.)

                                అయిదవ అనువాకము

                   (ఆప్యాయనాది మంత్రములు చెప్పబడుచున్నవి.)

    1. ఋత్విజులు ప్రతి ఆహుతికి దేవతలను ఆహ్వానించుచున్నారు. వారు ధ్రువమును హోమసాధనమును పట్టినారు. ఆ ధ్రువము - సూర్య పత్నియు, గోరూపధారిణియగు ఉషయొక్క పాలునిండిన చన్నువలె - నేతితో నిండవలెను.

    ఈ యజ్ఞమున పృథివి వేది రూపమున ఉన్నది. ఆమె వడిలో ద్రువమను పాత్ర ఉన్నది. అది మాటి మాటికి నేతితో నింపబడుచున్నది. అదియే ఆజ్యమహాధారయై వేది రూపమున ఉన్న భూమిని నింపును గాత.

    2. ద్రువమా! నీవు ప్రజాపతి సంబంధివి. యజమానిని అగు నేను - నిన్ను విభాన్నామ లోకమున ఉంచుచున్నాను.

        (యజమాని హవిశేషమును భుజించవలెను.)

    3. జలపూర్ణపాత్రమా! నీవు శోభించుదానవు. నాకు అనుకూలవు అగుము. నీవు సర్వదిశలందు వ్యాపించి ఉన్నదానవు. నన్ను సర్వకార్య సమర్థుని చేయుము. నీటితో నిండిన దానవు. నన్ను పరిపూర్ణుని చేయుము. నీవు క్షయము లేని దానవు. నన్ను అక్షయుని చేయుము.   

    4. ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయన్తామ్. తూర్పుదిక్కును దేవతలు, ఋత్విజులు పావనము చేయుదురు గాక.

    దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయాన్తామ్.
    ప్రతీచ్యాం దిశి గృహాః పశవో మార్జయన్తామ్.
    ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయన్తామ్.
    ఉర్ధ్వాయాం దిశి యజ్ఞస్సంవత్సరో యజ్ఞపతి ర్మార్జయన్తామ్.

    5. మొదటి పాద విన్యాసమా! నీవు నరకమును నశింపచేయువాడగు విష్ణువు యొక్క పాదమవు. ఈ పృథ్వి గాయత్రీ ఛందమును అభిమానించునది. దాని మీద నాతొలి అడుగువేయుచున్నాను. మేము ద్వేషించు పాపములు తొలగిపోయినవి.

    రెండవ పాదవిన్యాసమా! నీవు అపవాదులు పోగొట్టునట్టి విష్ణువు యొక్క పాదమవు అగుచున్నావు. త్రిష్టుభ ఛందమును అభిమానించునది అంతరిక్షము. దాని మీద నా రెండవ అడుగు వేయుచున్నాను. మేము ద్వేషించు అపవాదులు తొలగిపోయినవి.

    మూడవ పాదవిన్యాసమా! నీవు శత్రుహంతయగు విష్ణువు పాదమవు అగుచున్నావు. ద్యులోకము జగతీ ఛందమును అభిమానించునది. దానిమీద నా మూడవ అడుగు వేయుచున్నాను. మేము ద్వేషించు శత్రువు తొలగి పోయినాడు.

    నాలుగవ పదవిన్యాసమా! నీవు హింసించకోరు శత్రువును హతమార్చు విష్ణువు యొక్క పాదమవు అగుచున్నావు. దిశలు అనుష్టుప్ ఛందమును అభిమానించునవి. దానిమీద నాలుగవ అడుగును ఉంచుచున్నాను. మేము ద్వేషించు హింసక శత్రువు తొలగిపోయినాడు.

    (వేది మధ్యమున యజమాని వేయు అడుగులను విష్ణుపాదములుగ భావించి వేయవలెను. మూడు అడుగులు మంత్రసహితముగను - నాలుగవ అడుగు మంత్ర రహితముగను వేయవలెను.)

                                    ఆరవ అనువాకము

                           (ఇందు సూర్య ప్రార్థన చెప్పబడినది.)

    1. ఆహవనీయాగ్నీ! నీ అనుగ్రహము కలిగినది. అందువలన తొలిభోగములు అనుభవించదగిన భూమిని పొందినాము. తదుపరి ఆదిత్యలోకమును పొందినాము. నీ అనుగ్రహమున మాకు భంగము వాటిల్లలేదు. మేము చేయు తపములకు సహితము భంగము కలుగకున్నది.

    2. ఆదిత్యా! నీవు చక్కని వాడవు. కిరణ్మంతములగు చంద్రాదిగ్రహములందు శ్రేష్ఠుడవు. ఆయువును ఇవ్వగలవాడవు. నాకు ఆయువును ఇమ్ము. వర్చస్సునిచ్చువాడవు. నాకు వర్చస్సునిమ్ము.

    3. మేము ద్వేషించు శత్రువును సమస్త దిశల నుండి - దివినుండి - అంతరిక్షమునుండి - భూమినుంచి తొలగించు చున్నాను. మేము ఏశత్రువును ద్వేషించుచున్నామో అతడు తొలగించబడినాడు.

    4. నేను సూర్యునంతటి తేజస్సు కలవాడను అగుదును గాత.

    5. ఆదిత్యుని ఆవృతమును అనుసరించి నేనును పరిభ్రమింతును గాత.

        (యజమాని కుడివైపునకు తిరుగవలెను.)

    6. నేను సంతానముతో కలసి ఉందును గాత. సంతానము నాతో కలసి ఉండును గాత. నేను ధనసమృద్ధితో కలసి ఉందును గాత. ధనసమృద్ధి నాతో కలసి ఉండును గాత. (ఉత్తరమునకు తిరుగవలెను.)

    7. అగ్నీ! నీవు సమిధచే జ్వలించుచున్నావు. నా కొరకు మరింత జ్వలించుము. నేను సహితము ప్రకాశవంతుడను అగుదును గాక - స్వాహా.

        (ఆహవనీయాగ్ని యందు సమిధ వేయవలెను.)

    8. యజ్ఞము వసుమంతము అగునుగాక. అగ్నీ! నేను ధనవంతులందు అధికుడను అగుదును గాత.

        (ఆహవనీయాగ్నిని ప్రార్థించవలెను.)

    9. అగ్నీ! నీవు ఆయుష్యములను పోషించుచున్నావు. మాకు సర్వత్ర బలమును, అన్నమును కలుగచేయుము. శత్రుసేనను దూరముననే నివారింపుము.

    అగ్నీ! నీవు చక్కని కర్మములవాడవు. మమ్ము పవిత్రులను చేయుము. వర్చస్సు నిమ్ము. సామర్థ్యము కలిగించుము. పుష్టినిమ్ము. ధనము ప్రసాదించుము.

        (గార్హ పత్యాగ్నిని సేవించవలెను.)

    10. అగ్నీ! నీవు గృహపతివి. నీవలన నేను సుగృహపతిని అగుదును. గృహపతినగు నా వలన నీవు సుగృహపతివి అగుదువు.

    నాకు శతహిమముల ఆయువు కలుగునట్లును, సంతానము కలుగునట్లును, నా బుద్ధి ప్రకాశించునట్లును ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను.

        (గార్హ పత్యాగ్నిని సేవించవలెను.)

    11. యజ్ఞమా! ఏ ప్రజాపతి నిన్ను నియమించినాడో - అతడే నిన్ను విముక్తను చేయును గాత.

        (యజ్ఞమునకు ఉద్వాసన చెప్పవలెను.)

    12. అగ్నీ! నీవు యజ్ఞమునకు అధిపతివి. నేను యజ్ఞమును ఆచరించినాను. అందుకు సమర్థుడను అయినాను. ఆ యజ్ఞము నాకు సమృద్ధి ప్రసాదించినది.

        (ఆహవనీయాగ్నిలో సమిధ వేయవలెను.)

    13. యజ్ఞము ముగిసినది. అది మరల మరల జరుగును గాత. యజ్ఞము మమ్ము గుర్తించినది. అది వర్ధిల్లును గాత.

    యజ్ఞము దేవతలకు అధిపతి అగునుగాక. అది మమ్ము అధిపతులను చేయును గాత. మేము ధనపతులము అగుదుముగాక.

        (యజమాని ఈ మంత్రమును జపించవలెను.)

    14. అగ్నీ! ఈ యజ్ఞము గోమంతము, అజవంతము, అశ్వవంతము, ఋత్విగ్వంతము అగును గాత. ఈ యజ్ఞము ఎన్నడును తిరస్కరింపబడకుండును గాత.

    ఈ యజ్ఞము అన్నవంతము, బహుధనోపేతము, అవిఘ్నము, విద్వద్యుక్తము అగునుగాక.

    బలవాన్ అగ్నీ! ఈ యజ్ఞము మరల మరల జరుగుచుండును గాత.

    (యజమాని తూర్పుదిశగా ముందుకు జరిగి ఈ మంత్రమును జపించవలెను.)

                                ఏడవ అనువాకము

                   (దేవతా పరిగ్రహాదికము వివరించబడినది.)

    1. ఒకే కాలమందు జరుగు సోమయాగములెట్లో ఏక కాలమున జరుగు యజ్ఞములు అగుచున్నవి. దర్శపూర్ణమాస యాగములను అనేకులగు యజమానులు ఒకే సమయమున చేయుదురు. అప్పుడు ఏ యజమాని యజ్ఞమునకు దేవతలు వచ్చెదరు? ఏ యజమాని యజ్ఞమునకు రాకుందురు?

    ఏ యజమాని - ఇతరులకన్న - ముందు యాగము ప్రారంభించి దేవతలను ఆహ్వానించునో అతడు ఆ దేవతలను మరుసటి రోజు యజించవచ్చును.

    (దేవతలు వివిధ రూపములు ధరించి అనేక యజ్ఞములకు ఒకేసారి రాగలరు అనునది ఒక పక్షము.)

    2. ఆహవనీయాగ్ని దేవతల పరిగ్రహార్థ ప్రదేశమగును. ఆహవనీయ, గార్హ పత్యాగ్నుల మధ్య స్థానము పశువుల పరిగ్రహార్థ ప్రదేశమగును. గార్హ పత్యము మానవుల పరిగ్రహార్థ ప్రదేశమగును. దక్షిణాగ్ని పితృ దేవతల పరిగ్రహార్థ ప్రదేశమగును.

    3. యజమాని తొలుత ఆహవనీయ, గార్హ పత్య, దక్షిణాగ్ని స్థానములందు అగ్నిని స్థాపించవలెను. తదుపరి దేవతల పరిగ్రహణ స్థానము నందు దేవతలను ఆహ్వానించవలెను. మరుసటి రోజు దేవతలను ఉద్దేశించి యాగము చేయవలెను.

    4. అగ్ని వ్రతపతి. వ్రతమున అతడు వ్రతయోగ్యుడు అగుచున్నాడు. యజమాని వ్రతముననే వ్రతవంతుడు అగుచున్నాడు.

    5. యజమాని వ్రతమును అవలంబించదలచును. అప్పుడు అతడు 'అగ్నీ! నేను వ్రతము అవలబించుచున్నాను' అని చెప్పవలెను.

    6. దేవతలందరిలో అగ్నియే వ్రతపతి యగును. కావున అగ్నిని ఉద్దేశించియే యజ్ఞము చేయవలెను.

    7. బర్హి రాహణము - దర్భలను సేకరించుట - పూర్ణిమ యందు చేయవలెను. వత్సాపాకరణము - గోవుల నుండి దూడలను విడదీయుట - అమావాస్యనాడు చేయవలెను.

    ఈ తిథులు యాగమునకు గాను నిర్ణయించబడినవి.

    8. అగ్నిని దర్భ పరిస్తరణమునకు పూర్వుడుగను. అపరుడుగను యజించదగిన వాడని చెప్పబడినది.

    9. మానవులు గడ్డికప్పుగల ఇంటిని కోరుచుందురు. దేవతలు అది లేని దానిని కోరరు కదా! దేవతల అనుగ్రహమున - అప్పుడప్పుడు - అక్కడక్కడ - నూతన నివాస గృహములు ఏర్పడుచున్నవి. అది తెలిసిన యజమాని అగ్నిని యజించవలెను. అప్పుడు యజమాని వద్దకు దేవతలు వచ్చెదరు. మరుసటి రోజున అతడు యాగము చేయవలెను.

    10. యజమానియగువాడు గ్రామ్య, అరణ్య పశువులను సంపాదించవలెనని చెప్పబడినది. గ్రామ్యములగు ధాన్యాదులను భుజించక ఉపవసించినదో గ్రామ్య పశువులు లభించును. అరణ్య ధాన్యములగు నీవారాదులు భుజించుట వలన అరణ్య పశువులు లభించును. ఉభయ విధి ధాన్యములు వర్జించి ఉపవసించిన పితృ దేవతాకమగును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.