Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
11. ఆజ్యభాగములు అగ్నిషోమ దేవతాకములు. యజమానిని అగు నేను సమంత్రకముగా ఆజ్యాహుతులు ఇచ్చుచున్నాను. నేను నేత్రవంతుడను అగుదునుగాక.
(యజమాని ఇష్ఠియందు ఆజ్య భాగములను అభిమంత్రించవలెను.)
12. నేను అగ్నికి సమంత్రకముగ ఆజ్యాహుతులు ఇచ్చుచున్నాను. నేను అన్నభోక్తను అగుదును గాక.
(అగ్నిని అభిమంత్రించవలెను.)
13. ఉపాంశు యాగదేవా! మేము ద్వేషించు శత్రువును నీవు హింసించు చున్నావు. ఇక నన్ను శత్రువులు హింసించ జాలరు. నన్ను ద్వేషించు శత్రువును నేను సంహరించగలవాడనగుదును.
(ఉపాంశు యాజను అనుమంత్రించవలెను.)
14. అగ్ని షోమ మందు సమంత్రకముగ ఆహుతులు అర్పించుచున్నాను. నేను శత్రుహంతను అగుచున్నాను.
(అగ్ని షోమమును అనుమంత్రించవలెను.)
15. ఇంద్రాగ్ని యజ్ఞమందు సమంత్రకముగ ఆహుతులు అర్పించుచున్నాను. నేను ఇంద్రియోపేతుడను అన్నాదుడను అగుచున్నాను.
16. ఇంద్ర యజ్ఞమందు సమంత్రకముగ ఆహుతులు అర్పించుచున్నాను. ఇంద్రియవంతుడను అగుచున్నాను.
17. మహేంద్ర యజ్ఞమున సమంత్రకముగ ఆహుతులు అర్పించుచున్నాను. జయశీలుడను, మహిమాన్వితుడను అగుచున్నాను.
18. అగ్ని యాగము నందలి దోషములను పరిహరించినాడు. చక్కగా జరిపించినాడు. అట్టి అగ్నికి యజ్ఞమున సమంత్రకముగ ఆహుతులు అర్పించుచున్నాను. ఆయుష్మంతుడను అగుచున్నాను. యజ్ఞము విధివత్తు పూర్తి అయినందున ప్రతిష్ఠగలవాడను అగుచున్నాను.
(అగ్నిని అనుమంత్రించవలెను.)
మూడవ అనువాకము
(భక్షింపదగిన ఇడాది భాగమునకు అనుమంత్రణ చెప్పబడుచున్నది.)
1. అగ్ని దూషితముల నుండి నన్ను రక్షించును గాత. సవిత పాపవర్తనులనుండి నన్ను కాపాడును గాత.
2. నాపై శత్రుత్వము వహించిన వాడు దూరపు వాడయినను, దగ్గరివాడైనను - వారిని ఇడాది హవిభాగమున జయింతును.
(యజమాని ఇడాది భాగమును అందుకొనవలెను.)
3. ఇడా దేవతా! నీవు శృంగ పృచ్చాదులు కలదానవు. నీరు, నేయి రెండు వానల దానవు. శుక్ల, కృష్ణ, కపిల వర్ణవు. మా గృహములు శాస్త్రోక్త యజ్ఞగృహములు. నీవు వానికి అనుకూలవగుచు విచ్చేయుము. నీవు స్నేహ పూర్వక ఆఘ్రాణాదులు గల దానవు. వానిచే నా తలను శోధించుము.
హే ఇడే ఏహి - రమ్ము. హే అదితేః ఏహి. హే సరస్వతిః ఏహి. హే రన్తే ఏహి. హే రమతే ఏహి. హే సూనః ఏహి. నిన్ను ఆహ్వానించినాము. నీ అనుగ్రహము పొందినాము. నీ అనుజ్ఞ లభించినది.
మాకు ఈ యజ్ఞపు ఫలము లభించవలెను. యజ్ఞమునందలి ఆశీస్సులు సత్యములు కావలెను. ఆదరపూర్వక మనసు కలిగి యజ్ఞఫలము సాధించుటకు సమర్థుడను కావలెను.
నేను చేసిన యజ్ఞము స్వర్గమునకు చేరును గాక. చేరిన యజ్ఞము హవిర్భోక్తలగు దేవతలు ఉన్న చోటునకు పోవునుగాక. పోయిన హవిస్సు దేవతల భోజనశాలకు చేరునుగాక - దేవతలు దానిని అందుకొందురుగాక.
ఇంద్రుడు ఈ యజ్ఞమునకు సంతుష్ఠుడు అగును గాత. మరొక యజ్ఞము చేయుటకు మాకు అవయవ పాటవము కలిగించును గాత. చేయనున్న యజ్ఞములకు గాను మాకు ధనాదికములు లభించునుగాక. మాకు యజ్ఞఫలరూపమగు ఆశీస్సులు లభించును గాత.
ఇడా దేవతా! నీవు మాకు ప్రీతి పాత్రమవు. మా కొరకు శత్రువులను ఎంతో హింసించుము. నీవు ధనవతివి అగుము.
(ఇడను అనుమంత్రించ వలెను.)
4. అవాంతర ఇడా! నీవు ప్రీతి స్వరూపమవు. మమ్ము సంతోష పరచుము. మేము నిన్ను సేవించుచున్నాము. నీవు మమ్ము అనుగ్రహింపుము.
(1. భుజింప తగిన ఇడలోని ఒకభాగము అవాంతర ఇడ అగును. 2. అవాంతర ఇడను అనుమంత్రించవలెను.)
5. అగ్ని పూజనీయుడు. అతడు ఆహుతులందలి ఘృతమును సేవించును గాత. యజ్ఞదోషములను నివారించును గాత. యజ్ఞమును యోగ్యము చేయును గాత. బృహస్పతి ఈ యజ్ఞమును విస్తరించును గాత. ఈ యజ్ఞము వలన దేవతలందరు సంతృప్తులు అగుదురు గాత.
(వేది మధ్యభాగమును జలముచే మార్జనము చేయవలెను.)
6. యజ్ఞపురుషా! మమ్ము సంతోష పరచుము. మేము ధనమును ఇచ్చు వారలము. మా ధనమును క్షీణింప చేయకుము. మేము యజ్ఞము చేయుచున్నాము. మా శక్తిని క్షీణింప చేయకుము.
7. అన్వాహార్యమా! నీవు ప్రజాపతి భాగమవు. బలము కలదానవు. పాల వంటి రుచిగలదానవు. నీవు నా ప్రాణాపానములను కాపాడుము. సామానవ్యానములను కాపాడుము. ఉదాన వ్యానములను కాపాడుము. నీవు అక్షయమవు. నాకు క్షయము కలుగకుండుటకు నిన్ను దానము చేయుచున్నాను. పరలోకమందు నాకు కలుగబోవు భోగములను తరగనీయకుము. అచట నేను నిన్ను పరిపూర్ణముగ అనుభవించు వాడను కావలెను.
(పితృయజ్ఞము తరువాత చేసిన కర్మయందు దక్షిణాగ్నిలో వండిన అన్నము అన్వాహార్యము అగును.)
నాలుగవ అనువాకము
(శేషాహుతులగు అనుయాజాదుల అనుమంత్రణము.)
1. బర్హి అను అగ్నికి సమంత్రక ఆజ్యాహుతులు అర్పించుచున్నాను. సంతానవంతుడను అగుచున్నాను. నరాశంసమను అగ్నికి సమంత్రక ఆజ్యాహుతులు ఇచ్చుచున్నాను. పశువంతుడను అగుచున్నాను.
(అనుయాజాదుల హోమద్రవ్యములను అనుమంత్రించవలెను.)
2. నేను అగ్నికి ఆహుతులు అర్పించినాను. వానివలన అగ్ని రాక్షసాదులను జయించినాడు. అగ్నివలెనే నేను సహితము విజేతను అయినాను.
నేను సోమమునకు ఆహుతులు అర్పించినాను. వాని వలన సోమము రాక్షసాదులను జయించినది. సోమము వలెనే నేను సహితము విజేతను అయినాను.
నేను అగ్ని షోమమునకు ఆహుతులు అర్పించినాను. వాని వలన అగ్నిషోమము రాక్షసాదులను జయించినాడు. అగ్నిషోమము వలెనే నేను సహితము విజేతను అయినాను.
నేను ఇంద్రాగ్నులకు ఆహుతులు అర్పించినాను. వాని వలన ఇంద్రాగ్నులు రాక్షసాదులను జయించినారు. ఇంద్రాగ్నుల వలెనే నేను సహితము విజేతను అయినాను.
నేను ఇంద్రునకు ఆహుతులు అర్పించినాను. వాని వలన ఇంద్రుడు రాక్షసాదులను జయించినాడు. ఇంద్రుని వలెనే నేను సహితము విజేతను అయినాను.
నేను మహేంద్రునకు ఆహుతులు అర్పించినాను. దానివలన మహేంద్రుడు రాక్షసాదులను జయించినాడు. మహేంద్రుని వలె నేను సహితము విజేతను అయినాను.
నేను స్విష్ట కృదగ్నికి ఆహుతులు అర్పించినాను. వానివలన స్విష్ట కృదగ్ని రాక్షసాదులను జయించినాడు. స్విష్ట కృదగ్ని వలెనే నేను సహితము విజేతను అయినాను.
3. ఇంద్రుడు అన్నమును ఉత్పత్తి చేయవలసి ఉన్నది. అందుకు నేను స్రువమును ఎత్తినాను. అప్పుడు ఇంద్రుడు నన్ను ఉత్కర్ష వంతుని చేసినాడు. స్రువమును క్రిందకు దించినాను. అప్పుడు ఇంద్రుడు నా శత్రువులను పరాభూతులను చేసినాడు.
స్రువమును ఎత్తుట, దించుటచేత దేవతలు, బ్రహ్మయు నన్ను వర్థిల్ల చేసినారు.
ఇంద్రాగ్నులు నా శత్రువులను పారద్రోలి, నశింపచేయుదురు గాత.
4. ఈ యజ్ఞమునందలి ఆశీస్సులు మమ్ము చేరును గాత. మేము ఆయురారోగ్యములు కోరుచున్నాము. ఇంద్రవంతులము అగుచున్నాము. ఇంద్రుని సేవించు చున్నాము. మాకు సంతానము, ఆయురారోగ్యములు కలుగుచున్నవి.
5. ప్రస్తరమా! అగ్ని రోహిత అశ్వమునెక్కి నిన్ను చేరును గాత. ఇంద్రుడు హర్యశ్వము నెక్కి నిన్ను చేరును గాత. సూర్యుడు ఏతశ అశ్వమునకు ఎక్కి నిన్ను చేరును గాత.
(ప్రస్తరమును అనుమంత్రించవలెను.)
6. అగ్నీ! నీవు పరిధులను ధరించినావు. అట్టి నీ యొక్క రశన - గుర్రపు నడుమునకు కట్టుత్రాటి - నుంచి నిన్ను విముక్తుని చేయుచున్నాను. రశ్మి - ముఖమునకు తగిలించు కళ్లెము - నుండి నిన్ను విముక్తుని చేయుచున్నాను. యోక్త్ర - గుర్రపు పగ్గము - నుండి నిన్ను విముక్తుని చేయుచున్నాను. కావున మాకు ధనములను సుఖములను ప్రసాదించుము. మేము దేవతలకు హవిర్భాగములు ఇచ్చుచున్నాము కదా! అందును గురించి దేవతలకు మిక్కిలిగా తెలియ పరచుము.
7. సర్వవ్యాపకుడగు శంయునకు సమంత్రక ఆహుతులు అర్పించుచున్నాను. యజ్ఞమును పూర్తి చేయుట వలన నేను ప్రతిష్ఠ గలవాడను అగుచున్నాను.
(శంయు పరిధిని అనుమంత్రించవలెను.)
8. నేను సోమ దేవతకు సమంత్రక ఆహుతులు అర్పించుచున్నాను. అందువలన ఫలవంతమగు రేతస్సు కలవాడను అగుచున్నాను. త్వష్టకు సమంత్రక ఆహుతులు అర్పించుచున్నాను. అందువలన పశువులు కలవాడను అగుచున్నాను. దేవపత్నులకు, గృహపతియగు అగ్నికి - యజ్ఞమిథునమునకు సమంత్రక ఆహుతులు అర్పించుచున్నాను. అందువలన బిడ్డలు కలవాడను అగుచున్నాను.
(హవిస్సును అనుమంత్రించవలెను.)





