Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
యస్తేస్తనః శశయో యోమయో భూర్యోరత్నధా వసువిద్యాః సుదత్రః |
యేనవిశ్వాపుష్యసి వీర్యాణి సరస్వతి తమిహదాతవోకః ఉర్వ్య న్తరిక్షమన్వేమి ||
ఆరవ ప్రపాఠకము
మొదటి అనువాకము
(ఆజ్య గ్రహణాది మంత్రములు చెప్పబడినవి.)
1. సన్నాజ్యమా! నాకు బృహస్పతి ప్రేరణ కలిగిఉన్నది. నేను ఆయువును, ధనమును ఆర్జించుచున్నాను. ఈ మంత్రమున నిన్ను పాత్రకు ఎత్తుచున్నాను. ఈ యజ్ఞమున యజమానిని హింసించకుము.
(1. పాత్రలో పోయునపుడు క్రిందపడినది సన్నాజ్యము. 2. ఆయువును ఆర్జించవచ్చును అనుచున్నాడు.)
2. ఆజ్యమా! నీవు ప్రాపకమవు. సత్యమవు. సత్యాధ్యక్షవు. హవివి. వైశ్వానరమవు. వైశ్వదేవమవు. ఉద్దీపిత బలము కలదానవు. సత్యబలవు. సహమవు. సహమానమసి.
ఆజ్యమా! నీవు శత్రువులను పరాభవింపుము. శత్రుత్వము కోరువారిని పరాభవింపుము. శత్రుసేనలను పరాభవింపుము. సహస్రవీర్యవు. నాకు సుఖములు కలిగించుము.
ఆజ్యమా! నీవు ఆజ్యమునకు ఆజ్యమవు - సత్యమునకు సత్యమవు - సత్యాయుష్యవు - సత్యజలవు అగుచున్నావు. అట్టి నిన్ను సత్యరూపమగు ఆజ్యముచే అభిఘరించుచున్నాను. నేను నిన్ను అందుకొనుచున్నాను.
3. ఆజ్యమా! అయిదు ప్రాణములను నియంత్రించుటకును, జగములను ధరించుటకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! అయిదు ఋతువులను నియంత్రించుటకును, జగములను ధరించుటకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! అయిదు దిశలను నియంత్రించుటకును, జగములను ధరించుటకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! పంచజనులను నియంత్రించుటకును, జగములను ధరించుటకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! పంచబిలములను నియంత్రించుటకును, జగములను ధరించుటకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! బ్రహ్మవర్చస్సును నియంత్రించుటకును, జగములను ధరించుటకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! క్షాత్ర ఓజస్సును నియంత్రించుటకును, జగములను ధరించుటకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! కృషి, గోరక్ష, వాణిజ్యాదులను నియంత్రించుటకును, జగములను ధరించుటకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! మంచి బలము కొరకును, మంచి సంతానము కొరకును, ధనసమృద్ధికొరకును, బ్రహ్మవర్చస్సు కొరకును నిన్ను గ్రహించుచున్నాను.
ఆజ్యమా! మాకు శ్రేయస్సువు అగుము. దేవతలకు హవిస్సువగుము. యజమానికి ఆశీర్వాదమవగుము. దేవతలకు తృప్తి కలిగించుము. ఇన్ని కలిగించు నిన్ను గ్రహించుచున్నాను.
కామాయ త్వా గృహ్ణామి. నాకోరికల కొరకు నిన్ను గ్రహించుచున్నాను.
రెండవ అనువాకము
(హవిర్హో మానుమంత్రణము చెప్పబడుచున్నది.)
1. మధ్యమ పరిధీ! నిన్ను రాక్షసులు కదిలించజాలరు. అందువలన స్థిరమైన దానవు. నిన్ను అభిమంత్రించుట వలన నేను బంధువులందు స్థిరుడను - ధీరుడను. రాక్షస హననము తెలిసిన వాడను సంపన్నుడను అగుచున్నాను.
దక్షిణ పరిధీ! రాక్షస వధ విషయమున నీవు ఉగ్రమైన దానవు. నిన్ను అభిమంత్రించుటచే నేను బంధువులందు ఉగ్రుడను - ధీరుడను - రాక్షసవధ తెలిసినవాడను - సంపన్నుడను అగుచున్నాను.
ఉత్తర పరిధీ! నీవు రాక్షసులను పరాభవించు దానవు - నిన్ను అభిమంత్రించుట వలన నేను జ్ఞాతులను పరాభవించువాడను - ధీరుడను - రాక్షస వధ తెలిసిన వాడను - సంపన్నుడను అగుచున్నాను.
2. నిన్ను దేవతలకు యోగ్యమగు మంత్రములచే అర్చించుచున్నాను. దేవతలకు హవ్యవాహనుని చేయుచున్నాను.
3. అగ్నీ! నిన్ను జ్వలింప చేయుచున్నాము. నిన్ను పూజించుచున్నాము. అట్లు చేయుటవలన మేము సంతానవంతులము, భృత్యవంతులము, చిరంజీవులము అగుదుము గాక.
(సమిధలను వెలిగించ వలెను.)
4. అగ్నీ! నేను యజ్ఞము చేయుచున్నాను. ఇందలి ఏ దర్భలు నశించునో, జుహువు మున్నగు వానినుండి ఏ ఆజ్య బిందువు క్రిందపడునో వానితోనే అంతము చేయరాని శత్రువును వధించుచున్నాను. వానిని పాప దేవత వడిలో పడవేయుచున్నాను.
(వేది మధ్యనున్న హవిస్సులను అభిమంత్రించవలెను.)
5. ఈ హవిస్సులు భూలోక, భువర్లోక, సువర్లోకమునకు చెందినవి.
(వీనిచే అగ్నిని ఆసాదనము చేయవలెను.)
6. అగ్నీ! నిన్ను దేవతలు ప్రజ్వలింపచేసినారు. మనువు ప్రజ్వలింపచేసినాడు. నీవు చాచిన నాల్కలు - జ్వాలలు - హర్షదాయకములు. నీ బలమును యజమానికి వ్యక్తపరచుము. వర్థిల్లుము. క్షీణించుచున్న బలముగల శత్రువునకు నీ బలము వ్యక్తపరచ వలసిన పనిలేదు. ఏది - వర్ధిల్లుము.
7. హోతాగ్నీ! నీవు మరణము ఎరుగని వాడవు. నీతల మీద నేయి పారించుచున్నాను. యజమానికి మంచిసంతానము, ధనము, భటులను కలిగించుము.
8. స్రువము నందలి ఆఘోర ఆజ్యమా! నీవు మనస్సువు. పజాపతి సంబంధివి. ప్రజాపతి యజ్ఞముతోను - నీ మనస్సుతోను నన్ను ఆవహింపుము.
(స్రువము యజ్ఞసాధనము. అందలి ఆజ్యమునకు ఆఘోర ఆజ్యమని పేరు.)
9. స్రుచమునందలి ఆఘోరాజ్యమా! నీవు ఇంద్ర సంబంధివి. శత్రుక్షయ కారిణి వగు వాక్కువు. నీవు నీ వాక్కుతోను, చక్షురాది ఇంద్రియముల తోడను నన్ను ఆవహింపుము.
10. ఋతూనామ్ వసన్తమ్ ప్రీణామి - ఋతువులందు వసంతమును సంతోషపెట్టుచున్నాను. సమాప్రీతః ప్రీణాతు. అట్లు సంతోషపడినది నన్ను సంతోషింప చేయవలెను.
గ్రీష్మమృతూణాం ప్రీణామి సమాప్రీతాః ప్రీణాతు.
వర్షాఋతూణాం ప్రీణామి తామాప్రీతాః ప్రీణన్తు.
శరద మృతూణాం ప్రీణామి. సామాప్రీతాప్రీణాత.
హేమన్త శిశిరా మృతూణాం ప్రీణామి తోమా ప్రీతౌప్రీణీతా.





