Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    13. దారములచే బట్ట ఏర్పడుచున్నది. ముప్పది మూడు యజ్ఞతంతువులచే ఈ యజ్ఞము విస్తరించుచున్నది. ఋత్విగాదులు హవిస్సుచే యజ్ఞము చేయుచున్నారు.

    యజ్ఞాంగములందు ఏది విచ్చిన్నమైనను మరొక దానిని సమకూర్చుచున్నాడు. స్వాహా.

    కాలిన కలశము దేవతలను చేరును గాత.

    (1 - 6 వరకు గల మంత్రములు అగ్ని ఉపస్థానవిషయికములు.)

                                 పదకొండవ అనువాకము

                                 ( యాజ్య, పురోనువాకములు.)

    1. వైశ్వానరాగ్ని వచ్చును గాక. దిగ్గున లేచి వచ్చును గాక. దూరదేశము నుండి వచ్చునుగాక. మా కొరకు వచ్చును గాత. మమ్ము రక్షించును గాత.

    2. వైశ్వానరాగ్ని సత్యసంధుడు. అభీష్టఫలప్రద యజ్ఞ పాలకుడు. నిత్యప్రకాశకుడు. ఆ అగ్ని మాయందు చేరుచున్నాడు.

    3. ఒక బుద్ధిమంతుడగు యజమాని సత్కర్మలచే వైశ్వానర వ్రతము అవలంబించినాడు - మహాఫలమును పొందినాడు.

    ద్యావాపృథ్వులు ప్రభూత రేతస్కులు. వారు అగ్నికి తల్లిదండ్రులయినారు - లోకపూజ్యులు అయినారు.

    4. ఈ అగ్ని ద్యులోకమున ఆదిత్యరూపమున ఉన్నాడు. భూలోకమున దహనరూపమునను, పక్వము చేయువాడుగను ఉన్నాడు. సమస్త ఓషధులందు ఉన్నాడు.

    వైశ్వానరాగ్ని సాహసవంతుడు - బలవంతుడు. అతడు మమ్ము పాపములనుండి రాత్రింబవళ్లు రక్షించవలెను.

    5. అగ్నీ! నీవు అన్నవంతుడవు. సర్వత్రగామివి. గొల్లలు తమ పశువులను గుర్తించిన రీతి నీవు పుట్టుకతోనే సమస్త లోకములను - నీ తేజస్సున గుర్తించినావు.

    వైశ్వానరాగ్నీ! ఈ కర్మకొరకు మార్గమును ఏర్పరచుము. మమ్ము సదాశుభములందు రక్షించుము.

    6. అగ్నీ! నీవు ఎంతో ప్రకాశించువాడవు. పుట్టినంతనే నీ కాంతులను లోకములందంతను నింపినావు. లోకములను తెలిసికున్నావు.

    వైశ్వానరాగ్నీ! నీవు మహిమాన్వితుడవు. ఋత్విజులను పాపములనుండి విముక్తులను చేసినావు.

    7. అగ్నీ! మాకు ఇంద్రుని వంటి పాలకుని ప్రసాదించుము. అతడు తలవంచనివాడు - జరారహితుడు - సామర్థ్యము కలవాడు కావలెను.

    అగ్నీ! నీపాలనమందు మేము వేల అన్నములను పొందగలము.

    8. వైశ్వానరుడు సర్వలోక ప్రకాశకుడు. పుట్టినంతనే విశ్వమును చాటిచెప్పినవాడు. అతడు పగలు సూర్యుడుగా ప్రకాశించుచున్నాడు. మేము ఆ వైశ్వానరాగ్ని అనుగ్రహము సంపాదింతుము.

    9. వరుణదేవా! నీకు నమస్కరించుచున్నాము. నీ యజ్ఞములు చేయుచున్నాము. పురోడాశాది హవిస్సులు అర్పించుచున్నాము. నీ క్రోధమును శాంతింపచేయుచున్నాము.

    వరుణదేవా! నీవు బలవంతుడవు. మా కొరకు ఇచట నివసించుము. మా పాపములను పోగొట్టుము.

    10. వరుణదేవా! నీ పాశములు నా శిరస్సునందు, పాదములందు, శరీర మధ్యభాగమున ఉన్నవి. వానిని తొలగించుము. నాశనము చేయుము. అట్లు నీ మూడు పాశములు నాశనము చేసి మమ్ము పాపరహితులను చేయుము. నీ కర్మ చేయుటకు మాకు యోగ్యత కలిగించుము.

    11. దధిక్రావనుడను అగ్ని దేవత జయశీలుడు. వ్యాప్తికలవాడు. అన్నవంతుడు. నేను అతని యజ్ఞము చేసినాను. అతడు మా ముఖములను సురభిళతములను చేయును గాత. మా ఆయువులు పెంచును గాత.

    12. దధి క్రావనుడు శత, సహస్రసంఖ్యాక ధనములను ఇచ్చువాడు. అన్నవంతుడు. భూమి మీద సంచరించు వాడు. సూర్యుడు తన తేజస్సున నీటిని గ్రహించి వర్షము కలిగించినట్లు - పంచజనులకు అన్నము కల్పించి పెంచినవాడు. అతడు మధురములగు మాస్తుతులను స్వీకరించును గాత.

    13. అగ్ని భువనములకు శిరోభూతుడు.

    14. దేవతలారా! మేము సుఖములను ఆశించుచున్నాము. మిమ్ము స్వర్గమునుండి ఆహ్వానించుచున్నాము. మీరు మావద్దకు విచ్చేయండి.

    15. దేవతలారా! మిమ్ము సేవించు వారికి సుఖములు కలిగించు చున్నారు. యజ్ఞములందు హవిస్సులు అర్పించువారికి సుఖములను కలిగించుచున్నారు. అట్టి సుఖములనన్నింటిని మాకు కలిగించండి. మీరు కోరిన వారములు ఇచ్చువారుకదా! మాకు ధనమును సుపుత్రులను ప్రసాదించండి.

    16. అదితి మమ్ము రక్షించును గాత. అదితి మాకు సుఖములను ఇచ్చును గాత. అదితి పాపములనుండి మమ్ము కాపాడును గాత.

    17. మా రక్షణకు అదితినే ఆహ్వానించుచున్నాము. ఆమె మంచి పనులు చేయువారికి తల్లివలె హితము కూర్చును.

    అదితి సత్య సంరక్షిణి. అనేకులగు రాజులచే పాలించ బడినది. జరారహిత. విశాలధాత్రి. సుఖములు కలది. సుఖములు కలిగించునది.

    18. భూదేవి విశాల. ప్రకాశమాన. కాలస్వరూప. కర్మలకు వీలు కలిగించునది. మనిషి చేసిన నావ నీట తేలియాడును. భూమి దేవనిర్మిత నౌక. అది మహాజలముపై తేలి యాడుచున్నది.

    భూదేవి శత్రువులనుండి రక్షించును. పాపరహిత. ఛిద్రరహిత.

    మేము మాక్షేమము కొరకు అదితిని - భూమిని ఆశ్రయించుచున్నాము.

    19. భూమి నావవంటిది. దానిని నేను పొందుచున్నాను. భూమి వద్ద శత్రువునుండి రక్షించగల ఆయుధములు ఉన్నవి. తేలుటకు తరణ దండములు ఉన్నవి.

    భూమి రంధ్రములేనిది. అభీష్ట ఫలములను ఇచ్చునది.


            శ్రీమదాంధ్రవచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 
            మొదటి కాండము నందలి అయిదవ ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.