Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
32. అగ్నిని ప్రజ్వలితము చేయువారును - యజ్ఞవేది మీద దేవతలు ఆసీనులు అగుటకు దర్భాసనములు పరచునట్టి యజమానులు - నిత్య యవ్వన ఇంద్రునకు మిత్రులు అగుదురు.
సోమరసమా! నిన్ను ఉపయామగ్రహమున సేకరించినాము. ఇది నీ స్థానము. ఇంద్రాగ్నుల నిమిత్తము నిన్ను ఈ స్థానమున నిలుపుచున్నాను.
(ఇంద్రాగ్ని సంబంధ గ్రహమును తీసికొనవలెను)
33. విశ్వే దేవతలారా! మీరు రక్షకులు. ప్రజలను భరించువారు. మీరు యజ్ఞమునకు విచ్చేయండి. మీకు సోమహవి సమర్పించు యజమానికి వివిధ రత్నములు ప్రసాదించండి. ఇచట అభిషుత సొమము సిద్ధముగా ఉన్నది. మీరు త్వరత్వరగా విచ్చేయండి.
సోమరసమా! నిన్ను విశ్వే దేవతల నిమిత్తము ఉపయామ గ్రహమున సేకరించినాము. ఇది నీ స్థానమగును. నిన్ను విశ్వే దేవతల కొరకు ఈ వేది మీద నిలుపుచున్నాను.
34. విశ్వేదేవతలారా! మీరు నా ఆహ్వానమును ఆలకించండి. ఇచటికి విచ్చేయండి. ఈ దర్భాసనము మీద ఆసీనులు కండి.
సోమమా! నేను నిన్ను విశ్వేదేవతల కొరకు ఉపయామ గ్రహమున సేకరించినాను. ఇది నీవు నిలుచుస్థానము అగును. నిన్ను విశ్వేదేవతల నిమిత్తము ఈ వేదిమీద స్థాపించుచున్నాను.
(విశ్వేదేవగ్రహమును అందుకొనవలెను.)
ప్రాతఃకాల సవనమున గ్రహించదగిన గ్రహముల మంత్రములు ముగిసినవి.
35. మరుత్తుల సహితుడవగు ఇంద్రా! నీవు ఇచటికిరమ్ము. శర్యాతి యజ్ఞమున అభిషుత సోమరసమును ఎగబడి త్రాగినావే- అట్లే ఈ యజ్ఞమున సోమరసమును సేవింపుము.
శౌర్యోపేత ఇంద్రా! కవిజనులు - సుయజ్ఞము చేయు యజమానులు - నీ అనుగ్రహముననే సుఖముగా కాలము గడుపుచున్నారు.
సోమమా! నిన్ను నేను మరుద్యుక్త ఇంద్రుని కొరకు ఉపయామ గ్రహమున స్వీకరించినాను. ఇది నీవు నిలుచుచోటు అగును. మరద్యుక్త ఇంద్రుని కొరకు నిన్ను ఇచట నిలుపుచున్నాను.
శర్యాతి వృత్తాంతము శతపథమ్ జైమినీయ బ్రాహ్మణములందున్నది. చ్యవనుడు శర్యాతిపై అలిగినాడు. శర్యాతి తన కూతురు సుకన్యను చ్యవనునకు ఇచ్చినాడు. అప్పుడు చ్యవనుడు ప్రసన్నుడైనాడు. అశ్వినులు చ్యవనునకు యవ్వనము ప్రసాదించినాడు.
చ్యవనప్రాశమను ఆయుర్వేద ఔషధము ఈ చ్యవనుని పేరనే వెలసినది.
పురాణములందు సుకన్య కథ విఖ్యాతము.
36. మరుద్యుక్త ఇంద్రా! నీవు జలవర్ధకుడవు. అభివర్ధన శీలుడవు. దివ్యుడవు. శాసకుడవు. సర్వజిత్తువు. మహాబలివి. బలదాతవు. అట్టినిన్ను - ఈవేళ - ఈ నవీన యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాను. యజ్ఞమును రక్షింపుము.
సోమమా! నిన్ను మరుద్యుక్త ఇంద్రుని కొరకు ఉపయామ గ్రహమున సేకరించినాను. ఇది నీ స్థానము. మరుద్యుక్త ఇంద్రుని కొరకు నిన్ను ఇచట నిలుపుచున్నాను. (మరుద్వతీ గ్రహమును అందుకొనవలెను)
మరుద్వతీగ్రహమా! నిన్ను నేను ఉపయామగ్రహమున తెచ్చినాను. నిన్ను నేను మరుత్తుల ఓజస్సు కొరకు గ్రహించుచున్నాను.
(మూడవ మరుద్వాతీ గ్రహమును తీసికొనవలెను)
37. శూరఉంద్రా! నీవు మరుత్తుల విషయమున ప్రీతి గలవాడవు. మరుద్గణయుక్తుడవు. ఇది మధ్యందిన సవనపు అభిషుత సోమము - స్వీకరించుము. శత్రువులను బాధించుము. హింసక రాక్షస, అసురులను వధించుము. మాకు నలువైపుల అభయమిమ్ము.
సోమమా! నేను నిన్ను మరుద్యుక్త ఇంద్రుని కొరకు ఉపయామ గ్రహమున నింపినాను. ఇది నీ స్థానమగును. ఇచట నిన్ను మరుద్యుక్త ఇంద్రుని కొరకు స్థాపించినాను.
38. మరుద్యుక్త ఇంద్రా! నీవు అభీఎష్టవరదుడవు. యుద్ధమందును. ఉల్లాసమందును పురోడాశాది యుక్తమగు ఈ సోమరసమును సేవింపుము. ఈ మధుర సోమరస తరంగములను జఠరమున చేర్చుము. పాడ్యమి మొదలుకోని అభిషవించిన ఈ సోమమునకు నీవు ఏకమాత్ర స్వామిని.
సోమమా! నేను నిన్ను మరద్యుక్త ఇంద్రుని కొరకు ఉపయామగ్రహముణ పోసినాను. ఇది నీ స్థానమగును. ఇచట నిన్ను మరుద్యుక్త ఇంద్రుని కొరకు స్థాపించినాను.
39. ఇంద్రుడు మహానుడు. యజమానులవాడు. ప్రజలను అన్నధనాదులతో నింపువాడు. ద్యులోకభూలోకములను మించిన వాడు. శత్రుదమనుడు. బలశాలి. శత్రుంజయుడు. మాకు అభిముఖుడగువాడు. ఉదారుడు, విస్తరించువాడు. అతడు వర్షరూప వీరకృత్యముల కొరకు వర్దిల్లినాడు.
సోమమా! నిన్ను నేను ఇంద్రుని కొరకు ఉపయామ గ్రహమున నింపినాను. ఇది నీ స్థానము. ఇంద్రుని కొరకు ఇచట నిన్ను స్థాపించినాను.
40. ఇంద్రుడు మహానుడు. బలియుతుడై పెరుగువాడు. పర్జన్యుడు తన ఓజస్సుతో వర్షయుక్తుడైనట్లు - వత్సఋషి స్తోత్రములచే ఇంద్రుడు అత్యంత అభ్యుదయమునందినాడు.
సోమమా! నీవు ఉపయామ గ్రహమున స్వీకరించబడినావు. ఇంద్రుని కొరకు నిన్ను నేను అందుకొనుచున్నాను. ఇది నీ స్థానము. ఇచట నిన్ను ఇంద్రుని కొరకు స్థాపించుచున్నాను.
41. సూర్యుడు జ్ఞాతవ్యుడు స్వప్రకాశమున సర్వము కనబరచువాడు. అగుపించు సూర్యుని ప్రజ్ఞాపక కిరణములు - అందరు దర్శించు కొనుటకు ఊర్ధ్వాకాశమున నిలిచినవి. అట్టి సూర్యునకు ఆహుతి - సూర్యాయ స్వాహా.
(దక్షిణ హొమమున ప్రథమ ఆహుతి ఇవ్వవలెను.)
42. (బుట్టలో బంగారము కట్టి స్రువమునందుంచుకొనవలెను)
అగుపించు కిరణముల విచిత్ర పుంజమగు సూర్యుడు పైకి వచ్చినాడు. అతడు మిత్ర, వరుణ, అగ్నులకు నేత్రరూపుడు. సూర్యుడు ద్యావాపృథ్వులను - అంతరిక్షములను పూరించినాడు. ఈ భానుమూర్తి చరాచరజగత్తుకు ఆత్మ అగును. 'సూర్యాయ స్వాహా' (రెండవ ఆహుతి అర్చించవలెను)
43. అగ్నీ! నీవు సన్మార్గమున ధనము పొందుమార్గమున మమ్ము నడిపించుము. నీకు సమస్త దానధారలు తెలియును. కుటిల పాప- మార్గములనుండి మమ్ము తొలగింపుము.
అగ్నీ! మేము నీ యెడల అత్యంత భక్తియుక్తులము. వినమ్ర నమస్కారయుక్త స్తవములు పాడుచున్నాము. 'అగ్నయేస్వాహా' (అగ్నీధ్రమున ఆహుతి అర్పించవలెను)
44. ఈ అగ్ని మేము కోరిన ధనము లభించునట్లు చేయవలెను. అగ్ని - హింసక రాక్షసులను అసురులను పరిమార్చుచు- మమ్ము రక్షించుటకు మాకు అగ్రగామి కావలెను. ఎంతో ప్రసన్నుడైన అగ్ని శత్రువులను జయించవలెను. అగ్నయేస్వాహా (ఆహుతి అర్చించవలెను)
45. (ఋత్విజులకు దక్షిణగా ఇచ్చుగోవులను సంబోధించి)
గోవులారా! నేను నా స్వరూపసహితముగా మీ స్వరూపమును పోందినాను. సర్వధనములకు ప్రభువు పరబ్రహ్మ - ప్రజాపతి. అతడే ఋత్విజులమగు మాకు మిమ్ము మా భాగముగా ప్రసాదించినాడు. సువర్ణ దక్షిణయుక్తలగు గోవులారా! ఈ యజ్ఞమార్గమున మీరు మాతో చేరండి. నేను స్వర్గపథము పితృయానము, అంతరిక్షమును దర్శించుచున్నాను.
(యజమాని అనవలసినది) దక్షిణధనమగు గవాదులారా! మిమ్ము యజ్ఞసదస్యులగు ఋత్విజులకు సమర్పించినాను. అయినను మీరు మరింత మరింత ఆదిక్యత పొందండి.
46. (యజమాని అగ్నీధ్రము వద్దకుచేరి)
అగ్నీధ్రబ్రహ్మణుడు ఉత్తమ పిత, పితామహవంతుడు. మంత్రార్థకర్త. ఋషికులీనుడు. దక్షిణలందు సదాస్వర్ణము పొందువాడు. అట్టిబ్రహ్మణునకు దక్షిణ సమర్పించుచున్నాను. దక్షిణ యందు ఇచ్చిన ధనమా! మేము నిన్ను దానము చేసినాము. దానము యొక్క పుణ్యము కొరకు నీవు దేవతలను చేరుము. తిరిగి వచ్చి దాతయగు యజమానిని - అభివృద్ధి చెంది - చేరుము.
(యజ్ఞఫలము సాధించి తిరిగి యజమానిని చేరునని అర్థము)
47. సువర్ణమా! వరుణదేవుడు నిన్ను - అగ్ని స్వరూపుడగు - నాకు దానము చేసినాడు. నిన్ను అందుకొని నేను అమృతత్వమునందు కొందును. యజమానికి నీవు ఆయుష్యమగుము - ప్రతిఫలము కలుగచేయుము. అందుకున్న నాకు సుఖస్వరూపవై ఫలించుము.
గోమాతా! వరుణ దేవుడు నిన్ను- రుద్రస్వరూపుడనగు - నాకు దానము చేసినాడు. నిన్ను అందుకున్న నేను అమృతత్వమును అందుకొందును. నీవు దాతయగు యజమానికి ప్రాణరూపునివై ప్రతిఫలము కలుగచేయుము. అందుకున్న నాకు పాలుపెరుగు మున్నగు ఖద్యపదార్థములు ఇచ్చిఫలింపుము.
వస్త్రమా! వరుణదేవుడు స్వయముగా నిన్ను- బృహస్పతిరూపుడనగు నాకు దానము చేసినాడు. నేను నిన్ను పోందినాను. అమృతత్వము పోందినాను. దాత యజమాని కొరకు నీవు అతని త్వచారూపమవై ప్రతిఫలము ప్రసాదించుము. అందుకున్న నాకు సుఖస్వరూపమవై ఫలించుము.
అశ్వమా! నిన్ను వరుణదేవుడు స్వయముగా - యమస్వరూపుడనగు - నాకు దానము చేసినాడు. నేను నిన్ను అందుకున్నాను. అమృతత్వమునందుకున్నాను. దాతయజమాని కొరకు నీవు మరల అశ్వమై ప్రతిఫలమునందించుము. అందుకున్న నాకు సుఖరూపమవగుము.
(ఈవిధముగా దేవతలను తలచుకోని దానములు ఇవ్వవలెను)
48. ఇచ్చువాడెవడు? ఎవరికి ఇచ్చును? కోరికయే ఇచ్చును. కోరికకే ఇచ్చును. కోరికయే దాత. కోరికయే గ్రహీత.
కోరికా! అట్లుదాత- గ్రహీతలు ఇరువురు నీ రూపమే అయినారు. ఇచ్చిపుచ్చుకొనుట వలన సర్వధనాదులు నీవే అయినవి కదా!
క్కోదాత్కస్మా అదాత్కామ్కో దాత్కామాయాదా
త్కామోదాతా కామః ప్రతిగ్రహీతా కామైతత్తే.
ఎంత చక్కగా చెప్పినాడు! కోరికలే కదా అన్నింటికి కారణము!! ఈ లోకములు కోరికల వలననే నిలిచి ఉన్నవి!!!
మోక్షము సహితము కోరికయేగదా!
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
ఉపాంశ్వాది ప్రదానాన్తమగు ఏడవ అధ్యాయము సమాప్తము.





