Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
17. (మంథనగ్రహమున యవలు, సత్తు కలుపవలెను) యజ్ఞకార్యములంది ఆరాటపడువారు అధ్వర్యు ప్రతిప్రస్థాతలు. వారికి సోమయోగము తెలియును. వారు స్వకర్మమున మనసు వంటి ఉత్సాహము గల శుక్ర, మంథన గ్రహములను తీసికొందురు. ప్రభూత దక్షిణ గల పాత్రలో ఏ అధ్వర్యుడు సోమము మరియు సత్తును సర్వదిశలందు కలుపునో అతడు ప్రధానఋత్విక్కు.
మంథనగ్రహమా! ఇది నీ స్థానము. నీవు ఇచట ఉండి యజమాని ప్రజలను పాలింపుము. (ప్రతిప్రాస్థాత మంథన గ్రహమును ప్రోక్షిత యూపశకలమున మూయవలెను. అప్రోక్షిత యూపశకలమును శుద్ధిచేయవలెను)
అసుర పురోహిత మర్కుని అపవిత్రతను యజ్ఞమునందు పవిత్రము చేయనైనది. (ప్రతిప్రస్థాత హవిర్ధాన మండపమునుండి బయటికి రావలెను)
మంథనగ్రహమా! సోమరసపానము చేయు దేవతలు యజ్ఞస్థానమున నిన్ను గ్రహించవలెను. ఉత్తరవేదిశ్రోదే! నీవు సర్వథా అహింసితవగుము.
18. (ప్రతిప్రస్థాత ఉత్తర యూపస్థానమునకు వెళ్లవలెను) మంథగ్రహమా! నీవు సుప్రజాయుక్తుడవు. నీవు ఉత్తమప్రజను సృష్టించుము. ధనమును, అన్నమును యజమానికి అందించుము. ఈ మంథగ్రహము ద్యాహపృథ్వులచే సంగతమగును. మంథ జ్యోతి రూపమున యూపమున చేరును. (ప్రతిప్రస్థాత యూపశకలమును బయటవేయవలెను) అసురపురోహిత మార్కుడు యజ్ఞమునుండి బహిష్కృతుడైనాడు. (ప్రతిప్రస్థాత యూపశకలమును ఆహవనీయమున వేయవలెను)
యూపశకలమా! నీవు మంథగ్రహపు ఆధారమవు.
19. దేవతలు ద్యులోకమున పదకొండుమంది భూలోకమున పదకొండు మంది. అంతరిక్షమున స్వమహిమచే నిలిచినవారు పదకొండుమంది. ఆ దేవతలందరు ఈ మా యజ్ఞమును ప్రీతిపూర్వకముగ గ్రహించవలెను.
20. (ఆగ్రాయణ గ్రహమును తీసికొని) ఆగ్రాయణ గ్రహమా! ఉపయామ గ్రహము ద్వారా నిన్ను అందుకున్నాను. నీవు ముందుకు నడిపించుదానవు. నీ శ్రేష్ఠత్వమున మమ్ము రక్షింపుము యజ్ఞదేవత విష్ణువు. అతడు తన బలమున నిన్ను రక్షించవలెను. యజ్ఞమును కాపాడుము. యజ్ఞ స్వామి యజమానిని కాపాడుము. నీవు విష్ణువును కాపాడుము. మూడు సవనములను కాపాడుము.
21. ("హింకార త్రయం కృత్య" 'హిం' కారమును మూడుసార్లు జపించి)
సోమము దశాపవిత్రమున పావనమగును. అది పాత్రయందు చేరును. ఇది బ్రాహ్మణుని కళ్యాణము కొరకు - క్షత్రియుని కళ్యాణము కొరకు- అభిషవించు ఈ యజమాని కొరకు పావనమగును. అది వర్షము కొరకును - కాంతి కొరకును పావనమగును - జలములు ఓషధులు కొరకు పావనమగును. ద్యావాపృథ్వుల కొరకు పావనమగును. ఇంతెందుకు సకలము చక్కగా ఉద్భవించుటకు పావనమగును.
ఆగ్రాయణ గ్రహమా! నిన్ను నేను విశ్వేదేవతల కొరకు అందుకొనుచున్నాను. ఇదిగో ఇది నీ స్థానము. విశ్వేదేవతల ప్రీతికొరకు నిన్ను నేను ఇచట స్థాపించుచున్నాను.
22. సోమమా! నిన్ను ఉపయమా గ్రహమునగైకొన్నాను. ఉక్ధ్యగ్రహమా! ఇంద్రుడు ఉక్థరక్షకుడు. బృహత్సామ, సోమాన్న యుక్తుడు. నిన్ను ఆ ఇంద్రుని కొరకు పట్టుకున్నాను.
ఇంద్రా! నీది మహత్ సోమాన్నము. ఆ సోమపానము కొరకు నిన్ను ఆహ్వానించుచున్నాను.
సోమమా! యజ్ఞాదిదేవత విష్ణువు కొరకు నిన్ను అందుకొనుచున్నాను.
సోమమా! ఇది నీ స్థానము. నిన్ను సర్వ ఉక్థముల కొరకు గ్రహించుచున్నాను. నీవు దేవతలకు ఆనందము కలిగించు దానవు. సకలదేవతల ఆనందము నిమిత్తము నిన్ను గ్రహించుచున్నాను. యజ్ఞపు దోషరహిత సమాప్తి కొరకు గ్రహించుచున్నాను.
అగ్నిద్వ్కఉక్తిస్యాహుతయ ఏవధమ్ అని శతపథము.
అగ్నిఉక్త + ఆహుతులు థమ్ = ఉక్థమ్.
23. సోమమా! నీవు దేవతలకు తృప్తినిచ్చుదానవు. మిత్రావరుణుల కొరకును - దోషరహిత యజ్ఞ సమాప్తి కొరకును నిన్ను అందుకొనుచున్నాను.
సోమమా! నీవు దేవతలకు ప్రీతులను చేయుదానవు. ఇంద్రుని కొరకును - దోషరహిత యజ్ఞసమాప్తికొరకును నిన్ను అందుకొనుచున్నాను.
సోమమా! నీవు దేవతలకు ఆనందము కలిగించుదానవు. ఇంద్రాగ్నుల కొరకును - దోషరహిత యజ్ఞసమాప్తికొరకును నిన్ను అందుకొనుచున్నాను.
సోమమా! నీవు దేవతలను సంతోషపెట్టుదానవు, ఇంద్రావరుణుల కొరకును - దోషము లేకుండ యజ్ఞసమాప్తికొరకును నిన్ను అందుకొనుచున్నాను.
సోమమా! నీవు దేవతలను తృప్తులను చేయుదానవు. ఇంద్రబృహస్పతుల కొరకును- దోషరహిత యజ్ఞసమాప్తి కొరకును నిన్ను అందుకొనుచున్నాను.
సోమమా! నీవు దేవతలకు ముదము చేకూర్చుదానవు. ఇంద్ర విష్ణువుల కొరకును- లోపములేకుండ యజ్ఞసమాప్తి కొరకును నిన్ను అందుకొనుచున్నాను.
24. వైశ్వానరాగ్ని ద్యులోకమున సూర్యభూతుడు. శిరము వంటివాడు. భూమిని త్రిప్పువాడు. యజ్ఞపు అరణి స్థానమున ఉత్పన్నుడు. క్రాంత ద్రష్ట. సామ్రాట్టు. యజ్ఞాదులందు అతిథిస్వరూపుడు. ముఖమందు సర్వదా నిలిచినవాడు. స్రువ స్వరూపఖాద్యపాత్రగలవాడు.
అట్టి వైశ్వానరాగ్నిని దేవతలు సృజించినారు.
25. సోమమా! నీవు ఉపయాన గ్రహమున తీసి కొనబడినావు. ధ్రువగ్రహమా! నీవు ధ్రువ సంకేతమవు. వైశ్వదేవీ శంసన ప్రస్థానము వరకు సదా ధ్రువభావమున స్థిరముగా ఉండుదానవు. నీవు అత్యంత స్థిరత గలదానవు. ధ్రువపాత్రమా! ఇది నీ స్థానము. వైశ్వానరాగ్ని నిమిత్తము నిన్ను ఇచట ఉంచుచున్నాను. (ధ్రువపాత్ర మందలి సోమరసారమును హొతయొక్క చమసమున పోయవలెను) నేను స్థిమితమనస్కుడనై ధ్రువపాత్రమందున్న సోమమును హొత యొక్క చమసమున గుమ్మరించుచున్నాను. ఇక ఇంద్రుడే మన ప్రజలను శత్రురహితులను - పరస్పరప్రేమగల వారిని చేయవలెను.
26. (తొణికిన సోమరసమునకు ప్రాయశ్చిత్తమునకు గాను చేయు ఘృతహొమమునకు విప్రుట్ హొమము, అని పేరు. ఆ హొమము చేయు అధ్వర్యు.)
సోమమా! నీ బిందువు ద్రోణ, ఘటాదులనుండి రాలును. నీ లతాఖండములు అభిశవ శిలల ప్రక్కన పడిపోవును. అధ్వర్యుచేతి నుండి జారిపడును. దశాపవిత్రమున జల్లించునపుడు క్రిందపడును. అట్లుపడిపోయిన భాగముల పూర్తి కొరకు ఘృతహొమము చేయుచున్నాను. ఇది ఘృతాహుతి అగును. (అధ్వర్యు తెచ్చిన రెండు గడ్డిపరకల నుండి ఒకటి చాత్వాలమున వేసి) చాత్వాలమా! నీవు దేవతలు ఎక్కు స్వర్గమునకు సోపానభూతమవు.
27. ఉపాంశుగ్రహమా! నీవు బ్రహ్మవర్చస్సును ఇచ్చుదానవు. కావున నీవు నాకు బ్రహ్మవర్చస్సు, ప్రాణములను. ప్రసాదించుటకు స్వకర్మమున ప్రవర్తితవగుము.
ఉపాంశు సవనమా! నీవు బ్రహ్మవర్చస్సు ప్రదాతవు. నాకు బ్రహ్మవర్చస్సు - ధ్యానపుష్టి కలిగించుటకు స్వకర్మమున ప్రవర్తిల్లుము.
అంతర్యామగ్రహమా! నీవు బ్రహ్మవర్చస్సుప్రదాతవు. నాకు బ్రహ్మవర్చస్సు - ఉదాన పుష్టి కొరకు స్వకర్మమున ప్రవర్తిల్లుము.
మైత్రావరుణ గ్రహమా! నీవు బ్రహ్మవర్చస్సు ప్రదాతవు. నాకు యజ్ఞము- బలము. బ్రహ్మవర్చస్సును ఇచ్చుటకు స్వకర్మమున ప్రవృత్తమగుము.
అశ్వినిగ్రహమా! నీవు బ్రహ్మవర్చస్సును ఇచ్చుదానవు. నాకు బ్రహ్మవర్చస్సు -శ్రోత్రపుష్టిని కలిగించుటకు స్వకర్మమున ప్రవర్తిల్లుము.
శుక్ర మంథనగ్రహమా! మీరు బ్రహ్మవర్చస్సు ప్రదాతలు. నాకు బ్రహ్మవర్చస్సును -నేత్రముల పుష్టిని ప్రసాదించుటకు స్వకర్మమున ప్రవర్తిల్లండి.
(ఇవి యజమానితో అనిపించవలసిన మంత్రములు)
28. ఆగ్రాయణగ్రహమా! నీవు బ్రహ్మవర్చస్సు ప్రదాతవు. నాకు బ్రహ్మవర్చస్సు - భూతాత్మపుష్టి కలిగించుటకు స్వకర్మమున ప్రవర్తితవు అగుము.
ధ్రువగ్రహమా! నీవు బ్రహ్మవర్చస్సు ప్రదాతవు. నాకు బ్రహ్మవర్చస్సు - ఓజోబల, ఆయుష్య పుష్టి కొరకు స్వకర్మమున ప్రవర్తితవు అగుము.
ధ్రువగ్రహమా! నీవు బ్రహ్మవర్చస్సు ప్రదాతావు. నాకు బ్రహ్మవర్చస్సు - ఓజోబల, ఆయుష్య పుష్టి కొరకు స్వకర్మమున ప్రవర్తితవు అగుము.
పూతభృద - ఆహవనీయగ్రహములారా! మీరు బ్రహ్మవర్చస్సు ప్రదాతలు. మీరు నాకు బ్రహ్మవర్చస్సు- అక్షయ ప్రజల పుష్టి కొరకు స్వకర్మమున ప్రవర్తితలు కండి.
29. (యజమాని ద్రోణ. కలశమును ఉద్దేశించి) ద్రోణ కలశమా! నీవు ప్రజాపతివి. ప్రజాపతి తమవు. ప్రజాపతి సంబంధివి. ప్రజాపతి నామకవు. అట్టి ప్రజాపతి భూతుడగు ప్రజాపతినాథుని మేము తెలిసికొవవలెను.
ద్రోణకలశమా! ప్రజాపతి రూపవగు నిన్ను సోమరసమున సంతుష్ట పరచుచున్నాము. భూర్భువస్వః - అగ్ని, వాయు, సూర్యులారా! మేము చక్కని సంతానవంతులము కావలెను. మంచి వీరులను కలిగి వీర్యవంతులము కావలెను. సమృద్ధి అన్నము గలవారమై - గొప్ప అన్నదాతలము కావలెను.
30. అధ్వర్యు మరియు ప్రతిప్రస్థాత 12 ఋతువుల హొమము చేయవలెను. మొదటి ఋతువును అధ్వర్యు, రెండవ దానిని
ప్రతిప్రస్థాత వచించుచు పన్నెండింటిని హొమము చేయవలెను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను మధు చైత్ర - మాసము నిమిత్తము గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను మధు వైశాఖ - మాసము నిమిత్తము గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను శుక్ర - జ్యేష్ఠ - మాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామ గ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను శుచి - ఆషాఢ - మాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను నభస్య - భాద్రపద - మాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను ఆశ్వయుజ మాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను ఊర్జ కార్తీక - మాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను సహస మార్గశీర్ష - మాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను సహస్య పుష్య- మాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను తపస మాఘమాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను తపహమ - ఫాల్గుణ మాసము కొరకు గ్రహించుచున్నాను.
ఋతుగ్రహమా! నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు. నేను నిన్ను అంహసస్పతి - పదమూడవ- మాసము కొరకు గ్రహించుచున్నాను.
మొదట చెప్పినవి వేదినామములు. తరువాత ఇచ్చినవి ప్రస్తుత వ్యవహార మాసనామములు.
అంహః పాపం తస్య పతిః అహం సస్యపతి. దీనిని పదమూడవనెల అధికమాసముగా పేర్కొనుట జరిగినది. ప్రస్తుత పద్ధతిన అధిక మాసమునకు వేరు పేరులేదు.
31. ఇంద్రాగ్నులారా! మీరు ఈ యజ్ఞమునకు సోమపానము చేయుటకు విచ్చేయండి. ఈ సోమము సూర్యసమము. వాంఛించ దగినది. దీనిని మీరు స్వీకరించుటకు అభిషవించినాము. మేము మిమ్ము స్తుతించుచున్నాము. ప్రార్థించుచున్నాను. మీరు మేమిచ్చు సోమరసమును ఆస్వాదించండి.
సోమరసమా! నిన్ను ఇంద్రాగ్నుల నిమిత్తము ఉపయామ గ్రహమున స్వీకరించినాము. ఇది నీ స్థానము. ఇంద్రాగ్నుల నిమిత్తము నిన్ను ఈ స్థానమున నిలుపుచున్నాము.





