Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



               జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
               ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||

                           ఎనిమిదవ అధ్యాయము


1.    ఉపయామగృహీత్కో స్యాదిత్యేభ్యస్త్వా విష్ణో |
    ఉరుగా యైష తే సోమస్త్వం రక్షస్వమాత్వా దభన్ ||

    (ఇది తృతీయ సవన విధానము ద్రోణకలశమునుండి ఆదిత్యగ్రహమున సోమరసము నింపి -ప్రతిప్రస్థాత)

    సోమరసమా! నీవు ఉపయామగ్రహము ద్వారా గ్రహించబడినావు. (ద్విదేవత్య ఆహుతులు అగ్నికి అర్పించి -శేష సోమ రసమును స్థాళిలో పోసి, ఆదిత్యస్థాలి మూతపెట్టి) సోమరసమా! ద్వాదశ ఆదిత్యుల కొరకు నేను ఈ స్థాళిలో పోయుచున్నాను.

    ఉరుక్రమవిష్ణో! ఇది నీ సోమరసము. దీనిని రాక్షసాదుల నుంచి రక్షింపుము. సోమమా! ఇక నిన్ను రాక్షసాదులు హింసించజాలరు.

    2. ఆదిత్య ఇంద్రా! నీవు ఎన్నటికిని హింసకుడవుకావు. హవిర్దాత యజమాని హవిరన్నమును సర్వదా చేరుకొందువు.

    ధనవాన్ ఇంద్రా! నీ యొక్క అధికాధిక దానము మాకు లభించుచునే ఉండును.

    సోమరసమా! నేను నిన్ను ఆదిత్యుల కొరకే అందుకొందును.

    3. (పూతభృతఘటము నుంచి సోమరసమును ఆదిత్యగ్రహమున నింపవలెను)

    ఆదిత్యా! నీవు ఎన్నటికిని ప్రమాదము కలిగించవు. నీవు దేవతలను, మానవులను రక్షించెదవు. ఇది తృతీయసవనము. దీనికి చెందిన సోమము బలకరము.ఇది నీ కొరకు వేదిమీద వేచిఉన్నది. నీ యొక్క అమృతమయ రూపము ద్యులోకమందున్నది.

    సోమమా! నేను నిన్ను ఆదిత్యుల కొరకు అందుకొనుచున్నాను.

    4. (ఆదిత్య గ్రహమున నింపిన సోమరసమున పెరుగు కలుపువలెను)

    దేవతలకు సుఖము కొరకు యజ్ఞము జరుగును. ఆదిత్యులారా! మీరు మాకు సుఖములు కలిగించుచు విచ్చేయండి.

    దేవతలారా! మీబుద్ధి అనుగ్రహము గలది. అది మావైపు మరలవలెను. మీ అనుగ్రహాత్మకమగు బుద్ధి పాపులకు ధనము కలిగించరాదు.

    5. (ప్రతిప్రస్థాత రాతిచే సోమమును దధితో కలుపవలెను)

    అంధకారనాశక ఆదిత్యా! ఇది దధిమిశ్రిత సోమరసము. నీ పానము కొరకు అర్పించుచున్నాము. పానము చేయుము. పరిపూర్ణతృప్తుడవగుము.

    (యజమాన పత్ని పూతభృతఘటమును దర్శించి ఋత్విజులతో ఇట్లనును)

    బ్రహ్మాది ఋత్విజులారా! మీరు ఆశీర్వదించగల సమర్థులు. మమ్ము ఆశీర్వదించుటయందు శ్రద్ధవహించండి.

    (ఋత్విజులు అనవలసినది)

    ఈ యజమాన పతిపత్నులు కోరిక ధనమును అనుభవింతురు గాక. వీరికి పురుషత్వోపేత పుత్రులు కలుగుదురు గాక. ఆ పుత్రులకు అధిక ధనము లభించునుగాక. వారు తమ ఇంటనే ఉండి పుత్ర- ధనాదులచే వర్ధిల్లుదురుగాక.

    6. (సాయంసవన సంబంధశేషకర్మను పూర్తిచేసి- ఉపయామ గ్రహమును సవిత కొరకు సోమము గ్రహించవలెను)

    సవితాదేవా! మాకు నేడు కోరిన ధనము లభించవలెను. గుర్తుంచు కొనదగిన ఆ ధనము మాకు రేపుకూడ లభించవలెను. మాకు నిత్యము వరణీయ ధనస్రోతస్సును అందించుము. మేము అధికము - అధికమేమి? అత్యధిక ధనపూర్ణ గృహమునకు ప్రభువులము కావలెను.

    దేవా! మేము ఈస్తుతిచే ధనభాజనులము కావలెను.

    7. సోమరసమా! నీవు ఉపయామ పాత్రలో గ్రహించబడినావు. నీవు సవితా దేవుని పానమవు. అన్నము ప్రసాదించుదానవు. అన్నదాతా! మాకు అన్నము అందించుము. ఈయజ్ఞమును దేవతల కృపా పాత్రము చేయుము. ఈ యజ్ఞస్వామి యజమానిని ప్రసన్నుని చేయుము.

    సోమరసమా! నిన్ను ఐశ్వర్యవంతుడగు సవిత కొరకు గ్రహించుచున్నాను.

    8. (అధ్వర్యు పూతభృత ఘటము నుంచి మహావైశ్వదేవ పాత్రలోనికి సోమరసము తీసికొనవలెను)

    వైశ్వదేవ గ్రహమందలి సోమమా! నిన్ను ఉపయామ పాత్రలో తీసికున్నాము. నీవు చక్కని సుఖదాతవు. సుందర రూపవు.


    బృహత్ సేక్త - ప్రజాపతికి నమస్కారములు.

    సోమరసమా! నిన్ను విశ్వేదేవతల కొరకు అందుకొనుచున్నాను. ఇది నీ స్థానము. విశ్వే దేవతల కొరకు నిన్ను ఈ వేది మీద స్థాపించుచున్నాను.

    9. (ప్రతిప్రస్థాత పత్నీవద్గ్రహమును అందుకొనవలెను).

    సోమరసమా! నిన్ను ఉపయామగ్రహమున తీసికొన్నాము. నీవు ఆహ్లాదకమవు. యజ్ఞస్వామి యజమాని నిన్ను వీర్యశాలిగా అభిషవించినాడు. నేను పత్నీవ్రత గ్రహమునందలి సోమమున ప్రతి ప్రస్థాత కలుపవలెను.)

    (మంత్రద్రష్ట ఋషి పలుకుచున్నాడు.)

    పరలోకమును అందుకున్నవాడను నేనే. నేనే అధోలోకగత పృథివ్యాది స్వరూపుడను. ఈ అంతరిక్షము నాకు తండ్రి అయినాడు. నేను సూర్యుని అభయదిశల నుండి దర్శించినాను. దేవతలు నివసించు పరమ గుహ్య స్థానమును నేను చూచినాను.

    అహంపరస్తాదహమవస్తాద్యదన్తరిక్షం తదుమే పితాభూత్|
    అహం సూర్యముభయతో దదర్శాహం దేవానాం పరమంగుహా యత్|

    10. (పత్నీవ్రతగ్రహపు అగ్నికి ఉత్తర భాగమున హొమము చేయవలెను)

    పత్నీయుత అగ్నీ! నీవు త్వష్ట సహితముగా ప్రీతుడవగుము. ఈ సోమరసమును సేవించుము. అగ్నయేస్వాహా

    (నేష్ట పేరుగల ఋత్విక్కు ఉత్తరద్వారము నుండి యజమానపత్నిని తెచ్చి 'ఉద్గాత ఋత్విజుని' ఉత్తర దిశను కూర్చుండ పెట్టవలెను. యజమాన పత్ని ఉద్గాతను చూచుచు అనవలసినది)

    ఉద్గాతా! నీవు సంతానముల స్వామిని. వీర్యము ధరింపచేయగలవాడవు. నీవు నాలో వీర్యమును నిలుపుము. నీవు ప్రజాపతివి. సేక్తవు. వీర్యాధారమవు. నీ వీర్యము వలన వీర్యధారి పుత్రుని కనగలను.

    11. (ఆగ్రాయణ ఘటము నుంచి హరియోజన గ్రహమును సోమరసమున నింపవలెను)

    సోమరసమా! నీవు ఉపాయమ పాత్రమున గ్రహించబడినావు. నీవు హరితవర్షవు. హర్యశ్వములను తన రథమున కూర్చు ఇంద్రుని భాగమవు. నిన్ను నేను ఋక్, సామ మంత్రముల కొరకు గ్రహించుచున్నాను.

    యవలాజలారా! మీరు ఇంద్రుని హర్యశ్వములకు మేత అగుదురు. సోమసహితముగా ఇంద్రునకు ఖాద్యము కండు.

    12. (ఋత్విజులందరు యవల పేలాలను అందుకొని వాసన చూచి - ఉత్తరవేది మీద చల్లుదురు)

    యవయుక్త సోమరసమా! దేవతలు భక్షించు నీవు ఆశ్వములు, గోవులు ఇచ్చుదానవు. యజువులకు ప్రీతికరమై- ఉద్గాతలు స్తుతించునదై - హొతలు ప్రశంసించునదై - అనుజ్ఞాత అనుజ్ఞాతమైన నిన్ను నేను భక్షించుచున్నాను.

    13. (ఋత్విజులందరు ఆరేసి చొప్పున యూపఖండములను అగ్నిలో వేయవలెను)
   
    యూపఖండమా! యజ్ఞాదులు చేయక దేవతల విషయమున చేసిన పాపమును నశింపచేయగల దానవు. మానవుల విషయమున నిందాదుల వలన పాపములను నశింపచేయగల దానవు. పితృదేవతలకు పిండాదులు అర్పించని పాపమును నశింపచేయగల దానవు. స్వయం నిందా- శ్లాఘముల పాపమును నశింపచేయగల దానవు. ఇతర పాపములన్నింటిని నాశనము చేయగలదానవు. నేను తెలిసి చేసిన పాపములను, తెలియక చేసిన పాపములను నశింపచేయగలదానవు.

    14. (చాత్వాలమున ఉన్న నిండు కుండలను వాటివాటి చమసములచే తాకవలెను)

    మేము బ్రహ్మవర్చస్సు-బలము-పుష్టిగల అవయములు-నిర్మల మనస్సు గలవారము కావలెను. దాత త్వష్ట మాకు మహాధనములు ఈయవలెను. మాయందున్న పాపమును - వికారమును దూరము చేయవలెను.

    15. ('సమిష్టయజు'వను ఆహుతులచే హొమము చేయవలెను)

    ఇంద్రా! నీవు మాకు మనసున నుంచి కోరికలను గోవులను-విద్వాంసుల స్వస్తి వచనములను దేవతలనిమిత్తము యజ్ఞమును - యజనీయదేవతల సద్భుద్ధిని కలిగించుము. ఇంద్రాయ స్వాహా (తొలి ఆహుతి అర్పించవలెను)

    16. మేము బ్రహ్మవర్చస్సు-జలము-పుష్టి కల అవయములు నిర్మల మనస్సు గలవారలము కావలెను. దాత త్వష్టమాకు ధనములు ప్రసాదించవలెను. మాయందున్న పాపములను - వైకల్యమును దూరము చేయవలెను. (రెండవ ఆహుతి అర్థించవలెను)

    17. దానశీలధాతయు, సవితయు, ధనపాలప్రజాపతియు, ద్యోతమాన అగ్నియు ఈ యజ్ఞమును స్వీకరించవలెను. త్వష్టయు, దానములిచ్చి ప్రజలను సమృద్ధులను చేయు విష్ణువును యజమానికి ధనములు అందించవలెను -స్వాహా (మూడవ ఆహుతి అర్పించవలెను)

    18. ఈ యజ్ఞమును ప్రీతికరము చేయుటకు వచ్చిన వారలారా! మీ అందరి కొరకు సులభముగా లభించు సుఖాసములు పరచినాను.

    నివసింపచేయు దేవతలారా! మీరు హవ్యవాహకులు. హవిస్సులను స్వముఖాదులందు ధరించిపోవువారు. మీరు మాకు ధనములను అందించండి - స్వాహా (నాలుగవ ఆహుతిని అర్పించవలెను)

    19. ద్యోతమాన అగ్నీ! హవిస్సులు కోరుదేవతలను - హవిస్సులు అందుకొనుటకు -ఇచట తీసికొని వచ్చినావు. ఇక నీవు  వారందరిని తమతమ స్థానములకు సాగనంపుము. వారు చరు, పురోడాశాదులను ఆరగించినారు. సోమరసపానము చేసినారు. వారు వాయు, ఆదిత్య, ద్యులోకములందలి వారివారి స్థానములకు ప్రస్థానము చేయవలెను -స్వాహా (అయిదవ ఆహుతిని అర్పించవలెను.)

    20. అగ్నీ! నిన్ను ఇచటికి మా యజ్ఞమునకు - ఆహ్వత రూపమున విచ్చేయామని ప్రార్థించినాము. నీవు యజ్ఞమందు సమృద్ధి కలిగించు దేవతలను యజించినావు. యజ్ఞమున జరిగిన లోపములను ఉపశమింపచేసినావు. ఇక మా యజ్ఞము సంపూర్ణమైనట్లుగా భావించి స్వస్థానమునకు విచ్చేయుము. (ఆరవ ఆహుతి అర్పించవలెను)

    21. యజ్ఞసమాప్తి తెలిసిన దేవతలారా! మీరు మీ మీ స్థానములకు ప్రస్థానము చేయండి. మా మనసునందలి యజ్ఞసంకల్పమును పాలించు ప్రజాపతీ! ఈ యజ్ఞమును నేను నీకు అర్పించుచున్నాను. నీవు దీనిని వాయువును ధరించుము. స్వాహా (ఏడవ ఆహుతి అర్పించవలెను)

    22. యజ్ఞమా! నీవు నీ స్వస్థానమగు యజ్ఞదేవత విష్ణువును చేరుకొనుము. నీఉత్పత్తికి నిమిత్త భూతము - క్రియాశక్తికి మూలభూతమగు వాయువును చేరుకొనుము. (ఎనిమిదవ ఆహుతి అర్పించవలెను)

    స్తోత్రస్తవన - చరుపురోడాశ- వధ్యపశుయుక్త ఈ యజ్ఞమునకు స్వామియగు యజమానీ! ఈ యజ్ఞమునీది. దీనిని ప్రీతియుక్తముగ సేవింపుము. స్వాహా (తొమ్మిదవ ఆహుతి అర్పించవలెను)

    23. (యజమాని తనచేతనున్న మృగశృంగమును, నడుముకు ఉన్న మేఖలను తీసి చాత్వాలమున పారవేయవలెను)

    మేఖలా! నేను నిన్ను విసరివేసినాను. నీవు సర్పము, అజగరము కాకుము.

    (అధ్వర్యు చాత్వలపు తూర్పువైపు ముఖము ఉండునట్లు నిలిచి అవభృత స్నానమునకు సిద్ధపడిన యజమానితో అనిపించవలసినది)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.