Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    5. ఆహవనీయాగ్నిని సేవించిన యజమాని భూలోకమును విడిచి - స్వర్గమును చేరుచున్నాడు. గార్హపత్యమును సేవించినవాడు భూలోకమునందే ప్రతిష్ఠ కలవాడగును. కావున ఆహవనీయమునందు తత్పరమైన గార్హ పత్యమును సేవించవలెను. అట్లయిన సిద్ధికలుగును.

    6. గాయత్రీఛందముగల 'అగ్నేత్వంనో అంతమః' అను ఋక్కులచే ప్రార్థించవలెను. గాయత్రి తేజో స్వరూపము. అది యజమానిని తేజోవంతుని చేయును.

    7. గార్హ పత్యాగ్ని వలన వీరులు ఉద్భవింతురు. ఈ విషయము గ్రహించి, గార్హ పత్యాగ్నిని సేవించిన యజమానికి వీరులగు పుత్రులు కలుగుదురు.

    8. ఇంటి పశువులారా! క్షీరాది రససంపదను నేను మీ నుండి ఆశించుచున్నాను. మీరు నానుండి క్షీరాదులు కలుగు పోషణను ఆశించుచున్నారు.

    9. చక్కని ప్రేరణ కలిగించమని 'తత్సవితుర్వరేణ్యమ్' చెప్పుచున్నది.

    'సోమానగం స్వరణమ్' యజమాని సోమభాగఫలమును పొందుచున్నాడని వచించుచున్నది.

    'కృణుహిబ్రహ్మవర్చసే' అనునది యజమానికి బ్రహ్మవర్చస్సు కలుగుచున్నదని చెప్పబడినది.

    10. రాత్రులు చోర వృశ్చికాది భయబాధలతో కూడినవి. 'కదాచనస్తరీ' అను మంత్రార్థము తెలిసి సేవించిన యజమానికి రాత్రులు సుఖములగును.

    11. అగ్నికి నలువైపుల వేసిన సమిధల పరిధి నిత్యనూతనమై ఉండవలెనని 'పరిత్వాగ్నే' ప్రవచించుచున్నది.

    12. 'అగ్నేగృహపతే' యజుస్సును అనుసరించినది - అగ్ని విషయిక స్తోత్రమగునని వచించినది.

    13. 'శతగంహిమాః' అను మంత్రము అగ్నిని వందఏళ్లు జ్వలింపచేయుదును అనుటను వివరించినది.

    14. పుత్రుని పేరుచెప్పి అతనికి అన్నాది సుఖములు కలుగవలెనని ప్రార్థించవలెను. తన కుమారునకు - పేరు చెప్పి - జ్యోతిష్మంతమగు దీవెనలు కోరుచున్నాను అనవలెను. అట్లు ప్రార్థించిన ఆ పుత్రుడు తేజస్సు, బ్రహ్మవర్చస్సు కలవాడు అగును.

    పుట్టబోవు పుత్రుని కొరకు జ్యోతిష్మంతమగు ఆశీస్సులు కోరుచున్నాను అని ప్రార్థించవలెను. ఆ విధముగా ప్రార్థించిన యజమానికి తేజస్వియు, బ్రహ్మవర్చస్సు గల పుత్రుడు కలుగుచున్నాడు.

    ("ఇది అగ్నేగృహపతే" అను 16వ మంత్రమునకు వివరణ.)

                                తొమ్మిదవ అనువాకము

     (అగ్ని ఉపస్థానమునకు అగ్ని అంగము అను విషయము వివరించబడుచున్నది.)

    1. యజమాని పాలు, పెరుగులతో 'అగ్నిహోత్రము' అను హోమము చేయవలెను. ఆ విధముగా హోమము చేసిన క్షీరాదులు నశించవు. అవి ఆ యజమానికే చెందినవై ఉండును.

    2. యోని యందుంచిన వీర్యము సంతానము కలిగించును. నశించదు. అగ్ని యోని వంటివాడు. కావున అగ్నియందు హుతమైనది నశించదు - వర్థిల్లును.

    3. గ్రీష్మమున చెలరేగిన దావాగ్ని ఓషధులను దగ్ధము చేయును. ఇది నిజము. వర్షము వచ్చినంత ఆ ఓషధులే మరిన్నిగా మొలచి పెరుగును. ఇది నిజము.

    (2 మంత్రమునకు ఇది దృష్టాంతము.)

    4. యజమాని చేయు సాయంకాల హోమము రేతస్సు ఉంచుటవంటిది. ప్రాతః కాలమున చేయు హోమము సంతానోత్పత్తి వంటిది.

    5. యోని యందు రేతస్సు చేరుచున్నది. కాని త్వష్ట అట్లు చేరిన రేతస్సు నంతటిని సంతానముగా పుట్టించుటలేదు. ఏ రేతస్సు, ఎంత ఏరూపములుగ సృష్టించవలెనో త్వష్ట నిర్ణయించుచున్నాడు. దానిని అనుసరించి సంతానము పుట్టుచున్నది.

    ఇచట యజ్ఞకర్త దేవతలచే నియమించబడిన త్వష్ట అయి ఉన్నాడు. అతడు అనేక ఋక్కులచే అగ్నిని సేవించుచున్నాడు. అతడు రేతస్సునుండి అనేక రూపములను కలిగించుచున్నాడు.

    6. అది తెలిసికొని అగ్నిని సేవించు యజమానికి సంతానము కలుగుచున్నది. నిత్యము అభివృద్ధి కలుగుచున్నది.

    7. రాత్రింబవళ్లు రెండు భాగములైనవి. పగళ్లు దేవతలవి - రాత్రులు రాక్షసులవి అయినవి. దేవతలకు పశువులు సంపద అయి ఉండెను. రాత్రులందు రాక్షసులు దేవతల పశువులను అపహరించినారు. అంధకారమున ఎచటనో దాచినారు.

    దేవతలు ధనహీనులు అయినారు. వారు పశువులను రప్పించదలచినారు. ఆలోచించినారు. అగ్ని రాత్రులందు అధికముగా ప్రకాశించును. కావున ఆగ్నేయమగును. పశువులు అగ్ని దేవతాకములు. కావున ఆగ్నేయములు. దేవతలు ఆ విషయము తెలిసికున్నారు. అగ్నిని స్తుతించినారు. అగ్ని రాత్రిపూట పశువులను తెచ్చినది. పగటిపూట దేవతలకు ఇచ్చినది. దేవతలు పశువులను పొందినారు. భోగములు అనుభవించినారు.

    "య ఏవం విద్వా నగ్నిముపతిష్ఠతే పశుమాన్భవతి" ఈ విషయమును తెలిసి అగ్నిని స్తుతించినవాడు పశువులు కలవాడు అగుచున్నాడు.

    8. ఆదిత్యుడు భూలోకమునుండి స్వర్గలోకమునకు చేరినాడు. అక్కడ అతడు భూలోకమును గురించి ఆలోచించినాడు. భూమికి దిగి వచ్చినాడు. అక్కడ అతడు మృత్యోరభిభిబేత్ - మృత్యువునకు దడుచుకున్నాడు.

    భూలోకము మృత్యుసంయుతము కదా అనుకున్నాడు. 'అగ్నిని స్తుతించిన అగ్ని నన్ను స్వర్గలోకమునకు పంపించును' అనుకున్నాడు. అగ్నిని స్తుతించినాడు. స్త్యుత్యుడగు అగ్ని ఆదిత్యుని స్వర్గలోకమునకు చేర్చినారు.

    యు ఏవం విద్వా నగ్నిముపతిష్ఠతే సువర్గమేవ లోకమేతి సర్వమాయురేతి - స్వర్గమునకు చేరును. పరిపూర్ణ ఆయువును పొందును.

    9. అగ్నిని రాత్రియందే సేవించవలెను. ప్రాతః కాలమున సేవించరాదు. రాత్రులందు చేసిన వ్రతములు సంకీర్లములు అగును.

    కర్మలు శాస్త్రీయములు అశాస్త్రీయములు అయి ఉన్నవి.

    అగ్ని తేజస్సు అగును. రాత్రి అంధకారము అగును. రాత్రి పూట అగ్నిని సేవించిన తేజస్సు అంధకారమును తరిమివేయును. ఇది ఒక పూర్వపక్షము.

    11. అగ్ని పూజనీయుడు అగునా? కాదా? ఈ విషయము ఆలోచనీయము - చర్చనీయము.

    రాజు మానవమాత్రుడు అగును. ఒకడు అతని వద్దకు ప్రతిరోజు వచ్చును. ఫలాదికములు కానుకగా ఇచ్చును. తనకు కావలసినది యాచించును. ఇచట యాచన రాజునకు బాధాకరము అగునుకదా!

    అట్లయిన మహామహిమాన్వితులైన దేవతలను ఎవడు బాధించగలడు? అందువలన అగ్ని పూజనీయుడు కాడని మరొక పూర్వపక్షము.

    12. యజమాని తన కోరికలు తీరుటకే అగ్నిని యజించుచున్నాడని విద్వాంసులు వక్కాణించుచున్నారు.

    అగ్నిని సేవించుట యజమాని ఆహితాగ్నిని మంత్రపూర్వాకముగ ప్రార్థించుటయే కదా! తస్మాత్ ఉపస్థేవ్యః - అందువలన అగ్ని సేవింప తగిన వాడే అగును.

    11 మంత్రమునందలి ఉదాహరణ యందువలె బాధించుట దోషమగును కాని స్తుతించి, సంతోషపెట్టి యాచించుట దోషము కాదు కదా! కావున అగ్ని ప్రాతః సాయంత్రములందు సేవనీయుడు, పూజనీయుడు అగునని సిద్ధాంతము.

    13. ప్రజాపతి పశువులను సృష్టించినాడు. వానిని అహోరాత్రులు దాచిపెట్టినవి. ప్రజాపతి ఛందోబద్ధములైన ఋక్కుల వలన మరల వానిని సాధించినాడు.

    యజమాని ఋక్కులచే ప్రార్థించి తన వస్తువులను సాధించ వచ్చును.

    14. నిత్యము అగ్నిని సేవించు యజమాని ప్రార్థనలకు జాగు ఉండదు. వెంటనే ఫలితము కలుగునని పెద్దలు చెప్పుచున్నారు.

    15. పడమటి ముఖముగా సేవించువానిని అగ్ని దహించుచున్నాడు. పెడముఖముగా సేవించు వానిని సంతానము పశువులు లేనివానిని చేయుచున్నాడు. కొంచము అడ్డముగా ఉన్నవాని వలె సేవించువాని దహించుట లేదు - పశు, సంతాన వియుక్తుని చేయుట లేదు.

                                   పదవ అనువాకము

        (పూర్వార్థమున ప్రవాసము చేయబోవు యజమానికి సంబంధించిన అగ్నిని సేవించు మంత్రములు చెప్పబడినవి. ఉత్తరార్ధమున దర్శపూర్ణమాసాంగ భూత మంత్రములు కొన్ని చెప్పబడినవి.)

    1. అగ్నీ! నాకు తల్లిదండ్రులు ఒక పేరు పెట్టినారు. నేను తిరిగి వచ్చువరకు నీవు నాపేరు ధరించుము. నేను నీపేరు ధరించి తిరిగివత్తును.

    (అగ్ని యజమాని రూపమున ఇంటిని కాపాడును. యజమాని అగ్ని రూపమున నిర్విఘ్నముగ కార్యము నిర్వర్తించును.)

    2. అగ్నీ! మనము ఉభయులము - బట్టలు మార్చుకున్నట్లు - పేర్లు మార్చుకున్నాము కదా! ఇక మార్పుమాని ఎవరిపేర్లను వారలము ధరింతము. అందువలన జీవనము, ఆయువు కలుగుచున్నవి.

    3. అగ్నిని ఎవ్వరును బాధించజాలరు. తిరస్కరించజాలరు. అగ్ని ప్రకాశమానుడు. అతనిని సహించుట అసాధ్యము. అపరిమిత అన్నము కలవాడు. విశ్వజిత్తు. సహనశీలి. శ్రేష్ఠగంధర్వుడు. అట్టి అగ్నికి నమస్కరించుచున్నాను.

    4. అగ్నీ! నీవు దేవతలను పాలించుచున్నావు. దేవతల ఆహుతులు నీయందే ఉన్నవి. దేవతలకు నీవే ప్రకటన కర్తవు.

    "సం మాయుషా సంగౌపత్యేన సుహతే మాధాః." - నన్ను ఆయుష్యముతో సంధానము చేయుము. నన్ను గోపతిగా సంధానము చేయుము. నన్ను మంచి హితము నందు స్థాపించుము.

    5. ఈ అగ్ని శ్రేష్ఠతముడు. ఈ అగ్ని భగవత్తముడు. ఈ అగ్ని శ్రేష్ఠతమ దాత. ఇతడు నాకు సువీర్యమును ప్రసాదించును గాత.

    6. అగ్ని తేజస్సు పూజనీయము. అది ఈ హోమము ఘృతమును సేవించును గాత. ఈ ఆహుతులు ప్రాతః, సాయంకాలములకు సంబంధించినవి. ఇతర యజమానులచే విధివిహితముగ అనుష్ఠించబడినవి. నేను ప్రస్తుతము అనుష్ఠించుచున్నవి. నేను ఈ ఆజ్యహవిస్సులను అవిచ్చిన్నము చేయుచున్నాను.

    7. ఓషధులు సారము కలవి. లతలు సారము కలవి. పాలు సారము కలవి. నన్ను వాటన్నింటి సారములతో చేర్చుము.

    8. అగ్నీ! నీవు కర్మలకు అధిపతివి. నేను కర్మలు ఆచరించువాడను. నన్ను కర్మలు చేయుటకు సమర్థుని చేయుము.

    (యజమాని సముద్రమును ధ్యానించవలెను.)

    9. అగ్ని యజ్ఞములందు దేవతలను ఆహ్వానించువాడు. నేను అట్టి అగ్నిని ఆహ్వానించుచున్నాను. యజ్ఞము ఎవరిని ఉద్దేశించినదో ఆ దేవతలను ఆహ్వానించుచున్నాను. ఆ దేవతలు మంచి మనసుతో విచ్చేయవలెను. నేను సమర్పించు హవిస్సులను ఆరగించవలెను.

    (హవిస్సును అభిమంత్రించవలెను.)

    10. యజ్ఞమా! ఏ ప్రజాపతి నిన్ను అంతటను యోగ్యముగా చేయుచున్నాడో - ఆ ప్రజాపతియే నిన్ను ఇచట సహితము యోగ్యముగా చేయును గాత.

    (యాగస్థలమును చూడవలెను.)

    11. ఋత్విజులు బ్రహ్మసమానులు. పోషకులు. వారు యజ్ఞమందు పాత్రలను అగ్నియందు ఉంచినారు. యజ్ఞము పూర్తి అయినంత ఇంద్రవాయువులు ఆ పాత్రలను అగ్ని నుండి తీయుదురుగాక.

    (అధ్వర్యు యజమానులు జపించవలెను.)

    12. కాలిన భాండము జీవమును ఇచ్చును. కాలినందున వేరుగా కనిపించును. అయినను మంత్రప్రభావమున అది భిన్నము కాదు. వేరే అని భావించినను మట్టి రూపమే అగును కదా!

    సమిధలు, వేది, పరిధులు యజ్ఞపు ఆయువును అనుసరించి నిలిచిఉండును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.