Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                           జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                     ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||

                                     ఏడవ అధ్యాయము


1.    వాచస్పతయే పవస్వ వృష్ణో అంశుభ్యాం గభస్తిపూతః
    దేవోదేవేభ్యః పవస్వ యేషాం భాగ్కోసి

    సోమమా! నీవు అంగుళులతో అభిషుతుడవు. నీ రసస్రావ అంశమున వాణియొక్క స్వామి కొరకు అభిషుతమగును. దశా పవిత్రమున జల్లించబడుము. (ప్రథమ ఉపాంశు గ్రహమును పట్టుకొని) సోమమా! నీవు ఏ దేవతల భాగమవో - ఆ దేవతల కొరకు నీవు దేవతవై జల్లించబడుము. (రెండవ ఉపాంశుగ్రహమును అందుకొనవలెను.)

    2. సోమమా! మాకు కలుగు వర్ణములను మధురము చేయుము. (మూడవ ఉపాంశు గ్రహమును అందుకొని) సోమమా! నిన్ను అణచగలవారు లేరు. నీవు సదా జాగృతుడవు. అందుకే నీకు సోమనామము కలిగినది. అట్టి సోమాయ స్వాహా. (రెండవసారి స్వాహా అని బయటికి రావలెను) నేను విశాల అంతరిక్షమును అందుకొందును. "అంతరిక్షమన్వేమి"

    3. ఉపాంశుగ్రహమా! సమస్త ఇంద్రియముల కొరకును, దివ్య మరియు పార్థివ దేవతల కొరకును ఉత్పన్నమగుము. నిన్ను మనస్సు- ప్రజాపతి - వ్యాపింప చేయవలెను. స్వాహా. (ఉపాంశు గ్రహమున నిండియున్న సోమమును ఆహుతి ఇవ్వవలెను.)

    చక్కగా ఉత్పన్న మైన ఉపాంశు గ్రహమందలి సోమమా! నేను నిన్ను సూర్యునకు ఆహుతి అర్పించుచున్నాను. లేపమా! మరీచుల పాలకులయిన దేవతలకు నిన్ను అర్పింతును. (చేతిలో ఉన్న సోమమును పశ్చిమ పరిధికి పూయవలెను.)

    సోమాంశమా! నా శత్రువును వధించవలసినదని నిన్ను వేడుకున్నానే- ఆ శత్రువు వాస్తవముగనే ఊర్థ్వగామి సోమాభిచారమున హతుడైనాడు. ఫట్ - అభిచార ఆహుతి.

    ఉపాంశు గ్రహమా! ఇప్పుడు నిన్ను యథాపూర్వము స్థాపించుచున్నాను. (ఉపాంశు గ్రహమును చేతితో శుభ్రము చేసి యథా స్థానమున ఉంచవలెను.) నిన్ను ప్రాణము కొరకును - న్యాయము కొరకును ఇచట స్థాపించు చున్నాను.

    ప్రాణోహవ్కా అస్య (యజ్ఞస్య) 2. అథవా ఉపాంశుః ప్రాణ ఏవ 3. యజ్ఞము ఖం వా ఉపాంశుః 4. ఇయం (పృథివీ) మవ ఉపాంశుః 5. ఉపాంశు పాత్రోవా న్వజాః ప్రజాయన్తే.

    ఉపాంశువు ప్రాణము - యజ్ఞముఖము - పృథివీ అగును. ఉపాంశు గ్రహము ఉపాంశముగల  పాత్ర. సోమమును ప్రాణముగ భావించి పాత్రయందుంచినట్లున్నారు.

    ప్రాణో హి సోమః అని తాడ్త్యము.

    4. ఉపాంశు గ్రహమా! నిన్ను చేబూనినాము. ఇక నీవు నీలోన సోమమును ధరించుము.

    ధనవంత ఇంద్రా! సోమరసమును పానము చేయుము. రక్షించుము. మమ్ము వర్షముతో చేర్చుము. - మాకు వర్షము కలిగించుము.

    5. ఇంద్రదేవా! నీ అనుగ్రహమున నేను ద్యావాపృథ్వులను నాలో చేర్చుచున్నాను. అంతరిక్షమును నాలో చేర్చుచున్నాను. నీవు సాధారణ - ఉత్కృష్ణ దేవతలకు సమానుడవు. అంతర్యామ పాత్రయందున్న సోమమును సంతృప్తిగా ఆస్వాదించుము.

    మానవుడు మహిమాన్వితుడు. ద్యావాపృథ్వులు, అంతరిక్షము మానవుని యందే ఉన్నవి. మానవుడు లేకున్న ఏమున్నది? తనతోటిదే లోకము. తాను లేకున్న లోకములు లేవు.

    ఇంతటివాడు మానవుడు. అయినను తనను  తాను తెలియజాలడు. ఇదియే అజ్ఞానము. తనను తాను తెలియుట సామాన్యము కాదు. ఇది అందరకు సాధ్యపడునది కాదు.

    శ్రీమదాంధ్ర మహాభాగవతమున ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో అన్న ఈ పద్యము దృష్టాంతము.

    లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవింద్రియా
    నీకము జిత్తము గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ
    భీకర శత్రులార్వుర ప్రభిన్నుల జేసిన బ్రాణి కోటిలో
    నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వరా!

    లోకములను సులభముగా గెలువవచ్చునేమో! ఇంటిని గెలుచుట కష్టము. ఇంటిని సహితము గెలిచినా గెలువ వచ్చునేమో తనను గెలుచుట దుర్లభము!

    తనను గెలుచుట చాలా దూరము. తనను తెలియుటయే అసాధ్యము. తనను తనలో నున్న లోకములను గ్రహించుట జ్ఞానమగును. తనలోనున్న పరమాత్మను ఎరుంగుట పరమ జ్ఞానమగును.

    తనను తాను భగవానునకు అర్పించుట ప్రపత్తియగును. అదియే పరాకాష్ట!

    "అంతర్యామే మఘవన్మాదయస్వ" అన్నాడు ఈ మంత్రమున.

    ఇంద్రా! నా ఆత్మను అనుభవించుము- ఆనందించుము అనుచున్నాడు.

    6. ఇంద్రవాయుగ్రహమా!- సోమరసపానపాత్రా! సమస్త ఇంద్రియముల కొరకును-దివ్య మరియు పార్థివదేవతల కొరకును ఉత్పన్నమగుము. నిన్ను వనసు- ప్రజాపతి- అందుకొనవలెను.

    చక్కగా ఉత్పన్నమైన గ్రహమా! నిన్ను నేను సూర్యుని కొరకు పట్టుకొనుచున్నాను. మరీచులు పాలకులయిన దేవతల కొరకు నిన్ను శుద్ధిచేయుచున్నాను. (గ్రహమును- పాత్రను -చేతితో శుభ్రము చేయవలెను.)

    గ్రహమా! దేహమున ఉదాన వాయు పరిపుష్టి కొరకు నిన్ను గ్రహించుచున్నాను.

    7. పవిత్ర సోమపాయి వాయువులారా! మీరు ఇటురండి. మావద్దకు వచ్చినిలువండి. మిమ్ము సర్వులు వరింతురు. వేలసంఖ్యలో మీ వాహన మృగములు విరాజిల్లుచున్నవి. నేను మీకొరకు మదకర సోమరసము అర్పించినాను. ఆ సోమపు ప్రథమ పానమున మీరు వర్థిల్లుదురు.
   
    8. ఇంద్రవాయువులారా! ఈసోమము మీ ఉభయుల కొరకు అభిషుతము చేయబడినది. ఈ ఆహ్లాదకరమగు సోమము మీ ఉభయులను చేరుకొనవలెనను కొనుచున్నది.

    ఉపాయామగ్రహమా! వాయువునకు సోమరసపానము చేయించుటకు గాను నిన్ను అందుకొను చున్నాను- ఇంద్రునకు సోమరసపానము చేయించుటకు నిన్ను అందుకొనుచున్నాను.

    పాత్రా! ఇది నీవు స్థిరపడు స్థానము. పాత్రను వేదిమీద యథాస్థానమున ఉంచవలెను) ఉపాయామ గ్రహమ! పరస్పరము సమానప్రీతిగల ఇంద్రాగ్నుల కొరకు మీలో సోమరసము నింపుచున్నాను.

    ఉపయామ ఇయం వా ఇదమన్నాద్యనుప యచ్ఛతి పశుభ్యో మనుష్యేభ్యో వనస్పతిభ్యః అని శతపథము. మానవులకు, పశువులకు, మనస్పతులకు అన్నాదులను ఇచ్చునది. ఇది పాత్రపేరు కావచ్చును.

    9. (మిత్రావరుణులకు సోమము అందించుపాత్రను చేపట్టి) మిత్రా వరుణులారా! ఈ  సోమరసము సత్యమును- యజ్ఞమును వర్ధిల్లచేయునది. ఇది మీ కొరకు అభిషవింపబడినది. మీరు మా సోమపాత్ర ఆహ్వానమును ఆలకించండి.

    ఉపయామగ్రహమా! మిత్రావరుణుల కొరకు నీలో సోమరసము నింపుచున్నాను.

    10.(మిత్రా వరుణుల కొరకు సోమరసము నింపిన పాత్రలో రెండుదర్భలను ఉంచి సోమరసమున పాలు కలుపువలెను) దేవతలకు సోమహవి సమర్పించు ఋత్విగ్యజమాలమగు మమ్ము గోవులు, అశ్వములు మున్నగు ధనములచే సంపన్నులము చేయుము. దేవతలు సోమహవికి ప్రసన్నులు కావలెను. గో, ఆశ్వాది ధనములచే ఆనందించవలెను.

    మిత్రావరుణులారా! మాకు మార్పు ఎరుగని గోవును- నిత్యము పాలిచ్చుదానిని - అనుగ్రహించుము.

    పాత్రా! ఇది నీ స్థిర నివాసము. నేను నిన్ను మిత్రా వరుణుల కొరకు ఇచట ఉంచుచున్నాను.

    11. (అశ్వినుల కొరకగు సోమపాత్రను పట్టుకుని) అశ్వినులారా! మీ మాట మధురము సత్యము. ఆ మాటతో మీరు మాయజ్ఞమును ఆసించితము చేయండి.

    ఉపయామగ్రహమా! నేను నిన్ను అశ్వినుల కొరకు పట్టుచున్నాను. ఇది నీ స్థానము. మధువిద్యావంతులగు అశ్వినుల కొరకు నిన్ను ఇక్కడ పెట్టుచున్నాను.

    12. ఇంద్రుడు సర్వకాలములందు ఋషిసమాన జ్యేష్ఠుడు - శ్రేష్ఠుడు. యజ్ఞమున దర్భాసనమున ఆసీనుడగువాడు. స్వర్గమును ఇచ్చువాడు. శత్రువు మీదకు దండెత్తువాడు. శత్రుంజయుడు. బలశాలి. శత్రుధనమును జయించువాడు.

    సోమమా! యజ్ఞములందు యజమాని యజ్ఞక్రియలందు మిశ్రణాదులద్వారా నీవు వర్ధిల్లుదువు. అందువలన ఆ యజమానికి సమస్తము సమకూర్చమని ఇంద్రుని ప్రార్థింతువు.

    శుక్రగ్రహమా! నీవు ఉపయామము ద్వారా శండుని పారద్రోలుటకు గ్రహించబడినావు.  ఇది నీ స్థానము. నీవు యజమాని కొరకు వీరునివలె ఆచరింపుము.

    (అధ్వర్యు, ప్రతిస్థాత రెండు యూపఖండములను ప్రోక్షించవలెను. అధ్వర్యు శుక్రగ్రహమును ప్రతిస్థాత మన్దిత గ్రహమును శుద్ధిచేసి మూతపెట్టవలెను) శుక్రని పుత్రుడు - అసురుల పురోహితుడు - శండుడు బహిష్కరించ బడినాడు.

    (అధ్వర్యు, ప్రతిస్థాత హవిర్భావ మండపము నుంచి బయటకు రావలెను)

    శుక్రగ్రహమా! శుభ్రసోమరసమును నీద్వారా పానము చేయుదేవతలు నిన్ను యజ్ఞస్థానమునకు కొనిపోవలెను.

    (వేది దక్షిణభాగమున అధ్వర్యు శుక్రగ్రహమును ఉత్తర భాగమున ప్రస్థాత మంధిత గ్రహమును స్థాపించవలెను)

    ఉత్తరవేది శ్రోతలారా! మీరు సర్వథా అహింసితులగుడు.

    శుక్రగ్రహము అనగా  శుక్రమను పాత్ర. గ్రహములందలి శుక్రుడుకాడు.
   
    శుక్రడనువాని పుత్ర్రుడు శండుడు. అతడు అసుర పురోహితుడు.

    పురాణశుక్రుడు- శుక్రాచార్యుడు అసురుల గురువు అతని కూతురు దేవయాని. కచదేవయాని కథ, యయాతి కథ ప్రసిద్ధములు.

    13. (దక్షిణ భాగమున ఉన్న శుక్రగ్రహమును తాకి అధ్వర్యు) శుక్రగ్రహమా! నీవు ఎంతో వీరుడవు. యజమానికి వీరపుత్రులను - గోవులు అశ్వములు మున్నగు ధనములు ప్రసాదించుచు అతనిని చేరుకొనుము. శుక్రగ్రహము- తన శుద్ధదీప్తిచే- ద్యావాపృథ్వులతో సంగతమై - సర్వమును భరించి - శండుని యజ్ఞమునుంచి  బహిష్కరించినది. (అధ్వర్యు ప్రోక్షించిన యూపఖండమును బయటవేయవలెను)

    యూపశకలమా! నీవు శుక్రగ్రహమును నిలుపుస్థానమవు (అధ్వర్యు ప్రోక్షిత యూపశకలమును ఆహవనీ యాగ్నిలో వేయవలెను)

    14. సోమదేవా! మేము యజమానులము. నిన్ను అజస్రధారాయుక్తుని చేయగల వారలము కావలెను. దేవతలకు సోమరసము అందచేయువారలము కావలెను. దేవతల వలన ధనము అన్నము పొందువారలము కావలెను.

    (యూపపు ఒకపక్కనిలిచిన అధ్వర్యు శుక్రగ్రహమునందలి సోమమును ఆహుతి ఇవ్వవలెను. మరొక ప్రక్క నిలిచినా ప్రతి ప్రస్థాత మంథన గ్రహమునందలి సోమమును ఆహుతి ఇవ్వవలెను_ ఇది అందరు కోరుకొను ప్రథమ సోమక్రియ - శుద్ధిక్రియ. వరుణ, మిత్ర, అగ్నులు సోమమును రక్షించవలెను - పానము చేయవలెను.

    15. బృహస్పతి ఈ సోమరసమును అందరికన్న ముందు తెలిసికొన్నవాడు. అధ్వర్యులారా! ఇంద్రునకు అభిషుత సోమపు ఆహుతి అర్పించండి. ఇది ఇంద్రునకు సోమరస ఆహుతి. ఛందములను అభిమానించు దేవతలు తృప్తులు అగుదురు గాత. ఏఛందో దేవతలు సోమరస యాగమును ఆపేక్షించువారో - ఎవరు ఈసోమరసయాగమందు ప్రీతిగలవారో - వారిద్వారా ఈ ఆహుతి దేవతలకు అందుచున్నది. (అధ్వర్యు, హొతపక్కన పశ్చిమాభిముఖుడై నిలిచి) హొతా! అగ్ని సోమరసమునకు పరిచితుడైనాడు. (అనవలెను)

    16. (మంథనగ్రహమును పట్టి) విద్యుజ్యోతి గర్భకాంతి పరివేష్టించిన కమనీయ చంద్రరూపము సోమము. ఈ సోమము ద్యులోక గర్భమందు విరాజిల్లుజలమును వర్షముగా మార్చుటకు ప్రోత్సహించును. ఈసోమము స్తుతులతో అర్చింతురు.

    సోమరసమా! ఉపయామ గ్రహమున నింపి అందుకొనుచున్నాను. అసుర పురోహితుడగు మార్కుని, యజ్ఞమునుండి పారద్రోలుటకు నిన్ను గ్రహించుచున్నాను.

    మర్కొసురః అని ఉవటుడు. మర్కః శుక్రపుత్ర్కోసుర పురోహితఃఅని మహీధరుడు. ఇంతకు ముందు శణ్డుడు శుక్రపుత్ర అసుర పురోహితుడని చెప్పినాడు. ఇతడు శుక్రుని మరొక పుత్రుడు కావచ్చును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.