Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
9. పావకా! నీ జ్వాలాజిహ్వలు ప్రకాశించునవి. తృప్తి కలిగించునవి. అవి దేవతలను ఆహ్వానించును. అగ్నీ! నీవు యజనము చేయించుము.
10. పావకా! నీవు ప్రకాశించువాడవు. ప్రసిద్ధుడవు. ఈ యజ్ఞమునకు దేవతల నాహ్వానింపుము. ఈ యజ్ఞహవిస్సును వారలకు అందించుము.
11. అగ్ని పవిత్ర వ్రతములవాడు. విప్రుడు. శుద్ధుడు. విద్వాంసుడయిన పరిశుద్దుడు. అట్టి పరిశుద్ధాగ్నిని మేము ఆహ్వానించుచున్నాము. అతడు ప్రకాశించుచున్నాడు.
12. అగ్నీ! నీకిరణములు ప్రకాశించుచున్నవి. పైపైకి వ్యాపించుచున్నవి. నిన్ను పూజించువారు నీ తేజస్సును అందుకొనుచున్నారు.
13. అగ్నీ! నీవు ఆయువును ఇచ్చువాడవు. తేజస్సును ఇచ్చువాడవు. నాకు ఆయువును తేజస్సును ప్రసాదించుము. నీవు తనూపాః - తనువును రక్షించువాడవు. మే తనుమ్ పాహి. నాదేహము నందున్న లోపమును సరిచేయుము.
14. రాత్రీ! నీ సమాస్తి నాకు క్షేమము అగును గాత.
15. అగ్నీ! నీవు అన్న కర్తవు. కీర్తి ప్రదుడవు. విరోధి నాశినివి. నీకు మేము సమిధలు అర్పించుచున్నాము. అందువలన మేము అన్నవంతులము, కీర్తి వంతులము, సంతానవంతులము అగుచున్నాము. అట్లయి - శతగం హిమాద్యుమన్తస్సమిధీమహి - నూరుహేమంతములు దీప్తి మంతులమై ప్రసిద్ధులము కాగలము.
16. అగ్నీ! నీవు సూర్యుని వర్చస్సును చేరుచున్నావు. ఋషుల స్తుతులను చేరుచున్నావు. నీకు ప్రియమగు ఆహవనీయ స్థానమును చేరుకొనుచున్నావు.
త్వమగ్నే సూర్యవర్చా అసి సం మా ఆయుషా వర్చసా ప్రజయా సృజ - అగ్నీ! నీవు సూర్య తేజస్కుడవు. నాకు ఆయువు, వర్చస్సు, సంతానము కలిగించుము.
ఆరవ అనువాకము
1. నేను మానవ సంతానమును. ధేనుసంతానమును చూచుచున్నాను. నా ఇంట వారందరు ఉండవలెను.
(యజమాని ఇంటిని చూడవలెను.)
2. పశువులారా! మీక్షీరములు ఉదక రూపములు. అవి బలకరములు. రుచికరములు. నేను మీ క్షీరాదులను సేవించుచున్నాను.
(యజమాని పశుశాలను చూడవలెను.)
3. పశువులారా! మీరు ఈ భూలోకమున ఉండండి. మా ఇంట ఉండండి. ఇచ్చోటనే ఆడండి. ఇచటి నుండి తొలగి పోకండి. నా కొరకు మీరు సంతాన పరంపరాభివృద్ధినొందండి.
(ఆహవనీయ, గార్హ పత్యాగ్ని మధ్యన యజమాని ఉండవలెను.)
4. వత్సమా! నీవు మీ అమ్మ వద్ద ఉన్నావు. తల్లిపాలు కుడుచుటకు ఇటుపక్కకు, అటుపక్కకు ఉరుకులు పెట్టుచున్నావు. అట్లగుట చేసి నీవు బహు రూపములుగ కనిపించుచున్నావు. నీవు నీ తల్లి పాలకు కారణమవు. నేను పశుస్వామిని. నాకు ధనసమృద్ధి కలిగించుటకు నా వద్దకు రమ్ము. నీవు అనేక రెట్లయి పెరుగునట్లు నిన్ను పోషింతును. క్షీరాదిరూపమగు ధనము మావద్ద ఉండును గాత.
(యజమాని దూడను తాకవలెను.)
5. అగ్నీ! మేము నిత్యము ఉదయము, సాయంకాలము మనస్ఫూర్తిగా నీకు నమస్కరించుచున్నాము. నిన్ను అందుకొను చున్నాము.
6. అగ్నీ! నీవు యజ్ఞసామ్రాట్టువు. గోపాలకుడవు. సత్యప్రకాశివి. మాఇంట హవిస్సులచే వృద్ధి నొందుచున్న వాడవు. నిన్ను ఆరాధించుచున్నాను.
7. అగ్నీ! కొడుకునకు తండ్రివలె మాకు సులభసాధ్యుడవగుము. మా క్షేమమునకు గాను మాకు దగ్గరి వాడవగును.
8. అగ్నీ! మాకు మిక్కిలి సన్నిహితుడవు అగుము. మాకు రక్షకుడవు అగుము. శుభంకరుడవగుము. మా గృహమందు నిత్యము మాకు దగ్గరగా ఉండుము.
(5 - 8 గార్హ పత్యాగ్ని ఆరాధన అగును.)
9. అగ్నీ! నీవు ఎంతో పవిత్రుడవు. ఎంతో ప్రకాశించు వాడవు. మేము నీకు మిత్రులము అగుదుము. కావున మా దరి చేరుము.
10. అగ్ని ధనవంతుడు, వసు, రుద్రాదులచే ఆదరించబడువాడు. అగ్నీ! మాకు అభిముఖుడవు అగుము. ప్రజ్వరిల్లుము. మాకు ధనములనిమ్ము.
11. నా ఇంటనున్న పశువురారా! పాలు, ధనవృద్ధిని నేను మీనుండి ఆశించుచున్నాను. మీ యందు క్షీర, ధనసమృద్ధికి మీరు నన్ను ఆశించండి.
గోవులారా! మీరు మధుర ఘృతమును ఇచ్చువారుకండి. మీరు సహస్ర సంఖ్యాకముగా వృద్ధిచెందునట్లు మిమ్ము నేను పోషింతును. మీ సంపదలు నన్ను చేరును గాత.
12. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ |
సవితా దేవత మా బుద్ధులకు ప్రేరణ కలిగించు చున్నాడు. అట్టి సవితాదేవత తేజస్సును మేము ఉపాసించుచున్నాము.
13. అగ్నీ! నీవు బృహత్కర్మకు స్వామివి. ఉశిజకుమారుని కర్మ ప్రవర్తక ఋషినిగా చేసినావు. నన్ను సహితము సోమయాగమునకు ఉపదేష్టనుగా చేయుము.
14. సంపన్న అగ్నీ! నీవు ఎన్నడును హింసకుడవు కావు. హవిర్ధానము చేయు యజమాని దగ్గరనే ఉంటున్నావు. ఇంద్రుని వంటి అగ్నీ! దేవతవగు నీ దానమును మేము అందుకొనుచున్నాము.
15. అగ్నీ! నీవు బలశాలివి. వరదుడవు. విప్రుడవు. శత్రునిబర్హణుడవు. అట్టి నిన్ను మేము ప్రతినిత్యము సేవించుచున్నాము.
16. అగ్నీ! నీవు గృహస్వామివి. నీ అనుగ్రహమున నేను నూరు హేమంతముల వరకు సుగృహపతిని అగుదును గాక.
నేను గృహపతిని. నిన్ను సేవించుచున్నాను. అందువలన నీవు నూరు హేమంతములు వరకు సుగృహపతివి అగుదువు గాత.
నేను పుట్టనున్న సంతానమునకు బ్రహ్మవర్చస్సు, ఆయురారోగ్యములు, ఐశ్వర్యాభివృద్ధి కలిగించుమని నీ ఆశీస్సులు కోరుచున్నాను. పుట్టి ఉన్న సంతానమునకు సహితము అట్టి ఆశీస్సులనే కోరుచున్నాను.
ఏడవ అనువాకము
(5 వ అనువాకమంత్రములకు వ్యాఖ్య.)
1. సామ రహితముగ చేయునది యజ్ఞము కాదు. 'ఉపప్రయన్త' ఇత్యాది మంత్రములు అగ్నిహోత్ర యాగమందు స్తోమ సంబంధములగును.
2. 'ఉపప్రయన్త' అణు మంత్రమునందలి 'ఉప' అను పదమునకు అర్థము ఇట్లుండును.
ప్రజలు, పశువులు భూలోకమునందే ఉన్నారు. కావున యజమానికి పశువులు, ప్రజలు ఈలోకముననే లభించుచున్నారు.
(ఇది ఒకటవ మంత్రము.)
3. 'అస్యప్రత్నా' అణు 2 వ మంత్రమునందలి 'ప్రత్న' శబ్దము స్వర్గమును సూచించుచున్నది. కావున యజమాని స్వర్గమునకు చేరును అని అర్థము.
4. 'అగ్నిర్మూర్దా' అను మంత్రము నందలి 'మూర్ధన్' అను పదము శ్రేష్ఠత్వమును సూచించుచున్నది. 3 వ మంత్రమునందలి ఈ పదము వలన యజమాని తనతో సములైన వారిలో శ్రేష్ఠుడనియు - అతడు దివినుండి భువికి దిగి వచ్చినాడనియు అర్థము అగుచున్నది.
5. 'ఆయమిహ' అను నాలుగవ మంత్రమునందలి పదము యజమానిని అగ్ని ప్రముఖునిగా చేయుచున్నాడని చెప్పుచున్నది.
6. 'ఉభావాఇంద్రాగ్నే' అను 5 వ మంత్రము వలన యజమాని బలమును, తేజస్సును పొందుచున్నాడని అర్థము.
7. 'అయంతేయోనిః' అను 6 వ మంత్రము వలన పశువులే ధనమనియు - యజమాని పశురూప ధనమును పొందుచున్నాడనియు వ్యాఖ్య.
8. 'ఉపప్రయన్తః' అను తొలిమంత్రము నుండి 'అగ్న ఆయూంషి' అను ఆరవ మంత్రము వరకు 'పూర్వషట్కము' అనిపేరు. 'ఉదగ్నే' అను 12 వ మంత్రము వరకు గలవానికి 'ఉత్తర షట్కము' అని పేరు.
పూర్వషట్కమున అగ్నిని ఉపస్థానము చేసిన యజమానికి ఆరురుతువులందు ప్రతిష్ఠ కలుగును. ఉత్తర షట్కమునందు కూడ అగ్నిని ఉపస్థానము చేసినచో పన్నెండు మాసములు - సంవత్సర - పర్యంతము ప్రతిష్ఠ పొందును.
9. మానవుడు అశ్వములను, గోవులను పొందుచున్నాడు. అట్లే కాలక్రమమున వార్ధక్యము పొందును. ఆధానము చేయబడిన అగ్నియు వార్ధక్యము నందుచున్నాడు. కావున యజ్ఞకర్త సంవత్సరము ముగిసినంత అగ్నిని ఋక్కులచే ప్రార్థించి నూతనుని జరారహితుని చేయవలెను.
10. పేదవాడు ధనికుని చేరును. కానుకలు ఇచ్చును. నమస్కరించును. తనకు కావలసినవి కోరును.
యజమాని అగ్నికి నమస్కరించుట కూడ అట్టిదియే. ప్రార్థించి యాచించిన యజమానికి అగ్ని దహనాది ఉపద్రవములు కలిగించడు. ధనాదికములను ప్రసాదించును. కావున అగ్ని యజమానుల సంబంధము అనుగ్రాహ్య అనుగ్రాహకము.
11. నా సంతానమునకు, నా పశువులకు, నాకు కలిగిన దోషలోపములను పూరించుమని 'అగ్నేయేమేతవ్వా' అను పదమూడవ మంత్రము ప్రవచించుచున్నది.
12. రాత్రీ! నీ ముగింపు క్షేమ కరమగును గాత. అని 14 వ మంత్రము చెప్పుచున్నది. పూర్వము బ్రాహ్మణులు రాత్రి గడుచువరకు భయపడుచుండిరి.
13. మానవులకు 5 కర్మేంద్రియములు + 5 జ్ఞానేంద్రియములు - మొత్తము పది ఇంద్రియములు ఉండును. ప్రతి ఇంద్రియమున 10 నాడుల చొప్పున 10 x 10 = 100 నాడులు అగును. మానవుని ఆయుః పరిమాణము కూడ వందసంవత్సరములగును. కావున 15 వ మంత్రమున "శతహిమాః" అని చెప్పబడినది.
14. "ఇన్ధానా స్త్వా శతగం హిమాః" మున్నగు మంత్రములచే అగ్న్యుపస్థానము, సమిధాదానము చేయవలయును. ఈ ఋక్కు అంతర్జ్వాలగల ఇనుప ప్రతిమ వంటిది. ఒక్కొక్క దెబ్బచే వదల నరులను సంహరించిన అసురులను దేవతలు ఈ ఋక్కుచే సంహరించినారు. యజమాని ఈ ఋక్కున సమిధాధానము చేయవలెను. అప్పుడు ఈ ఋక్కు వజ్రమగును. యజమాని శత్రువును వధించగలవాడగును.
15. అగ్నీ! నీవు సూర్య తేజము కలవాడవు. నిన్ను ప్రార్థించి నేను ఆతేజమును పొందగలను అనునదే 'సంత్వమగ్నే' కు అర్థము.
16. 'త్వమగ్నేసూర్యవర్చాఅసి' అను 16 వ మంత్రము వలన అగ్నిని ఆయువు, తేజస్సు, సంతానము కోరినట్లయినది.
ఎనిమిదవ అనువాకము
(ఆరవ అనువాకమంత్రములకు వ్యాఖ్య.)
1. 'సంపశ్యామి' అను మొదటి పదమునకు అన్ని గ్రామ్యపశువులను యజమాని పొందును గాత అని అర్థము.
2. అర్థమునకు రెండవ మంత్రము చూడండి.
3. క్షీరాది రసరూపధనము గల పశువులు తన గృహమునందే ఉండవలెననియు - వానికి స్థిరజీవనము కలుగవలెననియు - అవి వదిలి పోరాదనియు యజమాని ప్రార్థన.
4. ఇటుకలను పరచి జ్వలింపచేసిన అగ్ని ఒకటి. ఇది 'ఇష్టకచిత్' అగును. రెండవది పశువునుండి జ్వలింపచేసినది. ఇది 'పశుచిత్' అగును. 'సగంహితాసి' మంత్రములు చదువుచు దూడను తాకిన యజమాని వత్సమును ఉపధానము చేసి 'పశుచిత్' చేసిన వాడగును.





