Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
వసాజ్యమా! వస + ఆజ్యము - నీవు అంతరిక్షమునందలి దేవతలకును పితరులకును హవివి. అగ్నయే స్వాహా. దిశలు - ప్రదిశలు - విదిశలు - అదిశలు - ఉద్దిశలు - దిశలకు స్వాహా.
20.(పశుహవిని స్పృశించి) ఆత్మసంబంధ ప్రాణములు ఈ పశువు ప్రత్యంగమున చేర్చబడినవి. ఆత్మసంబంధ ఉదాన వాయువు సహితము ఈపశువు ప్రత్యంగమున ప్రవేశపెట్టబడినది.
త్వష్ణదేవా! నీవు కూర్చిన ఈ పశువు యొక్క అంగములన్నియు పూర్వము వలె సంధించబడినవి. ఛేదనము వలన చెదిరినవి సహితము అతికినవి.
పశువా! ఈవిధముగా మంత్రములచే నీ అవయవములనన్నింటిని సంధించుట జరిగినది. మమ్ము రక్షించుటకును - దేవతలను చేరుటకును నీమిత్రులు, తల్లిదండ్రులు అనుమతింతురు గాత.
21. (వండి ఉంచిన వధ్యపశు గుడను మూడింట ఒకవంతు వంకరగాకోసి - దానిని పదకొండు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను ఆహుతి ఇవ్వవలెను)
గుడహవీ! నీవు సముద్రమును చేరుము - స్వాహా. గుడహావీ! నీవు అంతరిక్షమును చేరుము - స్వాహా. గుడహావీ! నీవు రాత్రింబవళ్ల రూపమగు కాలమగు కాలమును చేరుము- స్వాహా గుడహావీ! నీవు గాయత్రి మొదలగు ఏడు ఛందములను చేరుము - స్వాహా. గుడహవీ! నీవు ద్యావా పృథ్వులను చేరుము -స్వాహా. గుడహవీ! నీవు యజ్ఞములకు అధిదేవత విష్ణువును చేరుము - స్వాహా. గుడహవీ! నీవు దివ్యాకాశామును చేరుము - స్వాహా.
సముద్రాది దేవసంఘములారా! మీరందరు నా మనసును నా హృదయమందే నియంత్రించండి. (సర్వహొమము చేసి) సర్వములారా! మీరందరు నా మనసును నా హృదయమందే నియంత్రించండి. (స్వరహొమము చేసి) స్వరములారా! మీధూమము ద్యులోకమును చేరవలెను. మీ జ్యోతి స్వర్గమును చేరవలెను. మీరు మీ భస్మమున ఈపృథ్విని నింపుడు - స్వాహా.
22. (పశుహృదయమును పచనము చేసిన శూలమును తడి -పొడి భూమి మధ్య పాతిపెట్టి అధ్వర్యు) హృదయశూలమా! నీవు జలములను హింసించకుము. ఓషధులను హింసించకుము.
(ఋత్విక్కు, యజమానాదులు జలమును తాకి) వరుణరాజా! మేము ఏ ఏ స్థానములందు పాపములకు భయపడుచున్నామో, ఆయా స్థానములనుండి మాకు విముక్తి కలిగించుము. గవాది పశువులు అహంతవ్యములు, అందురు కదా! మేము వాటిని ఈవిధముగా హింసించుచున్నాము. ఆ పాపమునుండి మమ్ము విడిపించుము.
వరుణరాజా! నీకృపవలన మాకు మంచి మిత్రులు లభించవలెను. ఓషధులు సహితము మాకు మంచి మిత్రులు కావలెను. మమ్ము ద్వేషించువారిని - మేము ద్వేషించువారిని జలములు ఓషధులు - మాకు మంచి మిత్రులుగ -దుఃఖములు కలిగించవలెను.
23. సూర్యాస్తమయమునకు ముందు సోమీయ వసతీవరీ నది జలమును తేవలెను. సూర్యాస్తమయమైనంత నూతినుండి తేవలెను. హవియుక్త యజమాని హవిప్రాయములగు వసతీవరీ జలమును పూజించును. యజ్ఞము ఈ వసతీవరీ జలములఛే హవిర్యుక్తము కావలెను. సూర్యుడు సహితము వీనివలన హవిర్యుక్తుడు కావలెను.
24. వసతీవరీ జలములారా! నేను మిమ్ము జీర్ణము కాని గృహమున -దక్షిణాగ్ని మండపమున స్థాపింతును.
(కొత్తగా ఏర్పరచిన గార్హపత్యగ్ని స్థలపు పశ్చిమ భాగమున ఉంచవలెను. మరల అచటి నుంచి తొలగించి ఉత్తరవేదియొక్క దక్షిణ కోణమున ఉంచవలెను)
వసతీవరీజలమా! నీవు ఇంద్రాగ్నుల భాగమవు. (మరల జలమును తీసి ఉత్తరవేదియొక్క ఉత్తర కోణమున ఉంచవలెను) వసతీ నదీజలమా! నీవు మిత్రావరుణుల భాగమవు. (మరల తీసి అగ్నీధ్రీయదిష్ణ్యకు వెనుకనిలిపి) వసతీవరీ జలమా! నీవు విశ్వేదేవతల భాగమవు.
ఈ జలదేవతాక గాయత్రి బుక్కులు - ఈవసతీ వరీ జలము - సూర్యుని వెంటగమనించ జలములు - ఆ జలములన్నియు మా ఈ యజ్ఞమును దేవతలకు ప్రీతికరము చేయవలెను.
25. (వేది మీద ఘృతపర్యంత పదార్థములకు కూర్చి చివరకు హవిర్ధాన శకటము వద్దకు చేరి సోమమును కట్టిన త్రాటిని విప్పి - దక్షిణ శకటపు ఈషక్రింద అభిషవ ఫలకములను ఉంచి)
సోమమా! నిన్ను హృదయము, ద్యులోకము, సూర్యునికొరకు ఉపామృతము చేయుదును. నీవు మా హింసా రహిత యజ్ఞమును ద్యులోకపు దేవతలకు ప్రీతి కరము చేయుము. నీవు ఏడుగురు వషట్కర్తలను యజ్ఞకర్మమున నియమింపుము.
26. (సోమమును శిలల మీద పెట్టి) సోమరాజా! నీవు సమస్తప్రజను సమ్మానింపుము. సమస్త ప్రజ నిన్ను అభినందించును.
సమిధలచే జాజ్వల్య మానమగు అగ్నీ! నా ఆహ్వానమును యాచనను వినుము. (అధ్వర్యు ప్రచరణి స్రువముచే అతి ప్రణీతమందు ఆహుతి ఇచ్చి) జలదేవతా! ధనములందించు స్తుతులారా! నా ఆహ్వానము వినండి. సోమమును మర్దించుశిలలారా! మీరు నాఆహ్వానము వినండి. విద్వాంసులు యజ్ఞమును విన్నట్లు - సవిత నాఆహ్వానము వినవలెను -స్వాహా 'సవితాహవం మే స్వాహా'
27. జలదేవతలారా! తరంగములు మీకు అసత్య భూతములు- హవిష్మంతములు - శక్తిశాలినులు- హర్షకారిణులు. వాటితో మీరు సోమరస పానము చేయు దేవతలకు అందుకొనవలసి ఉన్నది. కావున దేవతల భాగములగు మీరు ఆ తరంగములను దేవతలకు అర్పించండి -స్వాహా.
28. (జలములందు హొమము చేసిన ఘృతమును మిత్రావరుణుల చమసమున వేరుగా ఉంచి) ఘృతమా! జలమునుంచి వేరయినావు. వసతీవరీజలమా! మిమ్ము అక్షయత్వము కొరకు సముద్రపు ఆవల తీసికున్నాను. జలము జలమునను - ఓషధులందును కలసినవి.
29. (ప్రచరణి స్రువమందున్న శేషఘృతమును అగ్నిష్టోమమున హొమము చేసి) అగ్నీ! యుద్ధములందు నీవు ఏ మానవుని రక్షింతువో - ఏ మానవుని నీవు అన్నములు ఆర్జించుటకు ప్రోత్సహింతువో - అతనికే శాశ్వతములగు అన్నములు లభించును - స్వాహా.
30. (ఉపాంశు శిలను పట్టి కొంతసేపు మౌనము వహించి)
నేను సవితాదేవుని ఆజ్ఞానువర్తిని. అశ్వినుల బాహువులతోను - పూషహస్తములతోనూ నిన్ను పట్టుకున్నాను. ఉపాంశు సవనశిలా! నీవు ధనప్రదవు. ఈ యజ్ఞమును
గంభీరము చేయుము. ఇంద్రుని కొరకు బలప్రద, మధుర, దుగ్ధాదియుక్త సోమము నీమీదనే అభిషుతమైనది. వసతీ వరీ జలములారా! మీరు మాకు గ్రహణ యోగ్యులు. మీమాట దేవతలు విందురు. జలమా! అభిషుత సోమమున కలవండి. మమ్ము సంతృప్తులను చేయండి.
31. జలములారా! నామనసుకు తృప్తికలిగించండి. వాక్కునకు తృప్తి కలిగించండి. చక్షుద్వయమునకు తృప్తి కలిగించండి. రెండు చెవులకు తృప్తి కలిగించండి. ఆత్మకు తృప్తి కలగించండి. నా సంతానమునకు తృప్తి కలిగించండి. పశువులకు తృప్తి కలిగించండి. సహచరులకు తృప్తి కలిగించండి.
జలమా! నీకృపవలన నా మిత్రుల నానుండి విడిపోరాదు.
32. (ఉపాంశు సవన శిలలను కృష్ణాజినము మీద ఉంచి శిలలమీద అయిదుసార్లు సోమమును వేయవలెను)
సోమమా! ప్రాతః సవనమున సోమరస అంశభాగ యుక్తుడగు ఇంద్రుని కొరకును- మధ్యాహ్నం సవనమున సోమభోక్తరుద్ర సహిత ఇంద్రుని కొరకును - మూడవ సవనమున సోమ భోక్త ఆదిత్య సహిత ఇంద్రుని కొరకును - శత్రునాశక ఇంద్రుని కొరకును నిన్ను అభిషవము నిమిత్తము ఈశిలమీద ఉంచుచున్నాను. (మూడుసార్లు మూడుపిడికిళ్ల సోమము శిలల మీద వేయవలెను) సోమమా! నీవు ద్యులోకపు శ్యేన రూపవు. సోమము అనుసరించిన గాయత్రి కొరకు నిన్ను అభిషవించుచున్నాడు. (నాలుగవ పిడికెడు సోమము శిలమీద వేయవలెను) సోమమా! ధనము, అన్నము ప్రసాదించు అగ్నికొరకు నిన్ను నేను గ్రహించుచున్నాను. (అయిదవ పిడికెడు సోమము శిలలు మీద వేయవలెను)
33. (ఉపాంశు సవనశిల మీద వేసిన అయిదు పిడికిళ్ల సోమమును ముట్టుకోని) సోమమా! ద్యులోకమున నీ జ్యోతిస్వరూపము - విశాల అంతరిక్షమున నీజ్యోతిస్వరూపము వెలుగుచున్నది. దానితో యజమానికి ధనసంపన్నమును, విశాలమును అగు స్థానమును కల్పించుము.
34. గ్రహణీయ జలములారా! మీరు క్షిప్రులు. వృత్ర సంహారకులు. ధనదాతలు. సోమామృత పాలకులు.
మీరు ఈ యజ్ఞమును దేవతలు అందుకొనునట్లు అనుగ్రహించండి. అనుజ్ఞాతులై మీరు సహితము దేవభావమున సోమపానము చేయండి.
35. (ఉపాంశు సవన శిలచే సోమమును దించుచు) సోమమా! నీవు భయపడకుము. కంపించకుము. బలము కలుగుము. ద్యావాపృథ్వులారా! మీరు దృఢపడండి. ఈ శిలలు మున్నగు వానిని దృఢపరచండి. మీరు ఉభయులు దీనిని ధరించండి. ఈ రాతితో దంచుట వలన యజమాని శత్రువు చచ్చినాడు - సోమము కాదు.
36. సోమమా! పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ సమస్తదిశలు నీకు అనుకూలములు అగును గాత. దూతా! ణీ భాగములతో సోమమును పరిపూర్ణము చేయుము. ఈవిషయము సమస్తజనులు ఎరుంగుదురు గాత.
37. ఇంద్రా! నీవు ప్రీతికరుడవు. బలవంతుడవు. నీవు యజమానిని, గొప్ప గొప్పగా ప్రశంసింతువు. ధనవంత ఇంద్రా! నిన్ను మించి ఎవడును యజమానికి ధనాది సుఖములు ఇవ్వజాలడు. ఇంద్రా! ఇది సత్యవచనము - నీతో చెప్పుచున్నాను.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
అభ్యాదానాద్వాచనాస్తమను ఆరవ అధ్యాయము సమాప్తము.
సర్వేపి సుఖినస్సంతు.





