Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
6. విభక్తి విధానమును అనుష్ఠించి పునరాధానము చేయవలెను. అట్లుచేసిన యజమాని చక్కగా చేసినవాడు అగుచున్నాడు.
మంత్రోచ్చారణము మెల్లగా చేయుచు యాగము చేసినవాడు శ్రేష్ఠమగు ధనమును ఆర్జించి దాచుకున్నవాడు అగుచున్నాడు. స్విష్టకృతమను అగ్నిని ఉచ్చైస్వరమున మంత్రోచ్చారణ చేసి యాగము చేసిన వాడు శ్రేష్ఠధనమును ఆర్జించి ప్రసిద్ధిని పొందుచున్నాడు.
కావున విభక్తి విధమున ప్రయాజ మంత్రముల చేత వషట్కార పూర్వకముగ యాగము చేయవలెను. ఆ విధమున చేసినవాడు ఆయతనాదేవనైతి - స్వగృహమునుండి తొలగిపోడు.
7. యజమానోవై పురోడాశః పశవ ఏతే ఆహుతీ - యజమానియే పురోడాశము. పశువులే ఆహుతులు. పురోడాశము లన్నింట ఈ ఆహుతులను హోమము చేయవలెను. ఆ విధముగా ఆచరించిన యజమానిని పశువులు వరించుచున్నవి.
8. ప్రథమాధానమునందు 'సర్పరాజ్జీ' అను ఆధానమంత్రములు చెప్పబడినవి. 'సికత' 'ఉష' ఇత్యాది సప్తమృద్విశేషములు ఉపయోగించబడినవి. కావున పునరాధానము నందు వానిని ఉపయోగించనక్కరలేదని పూర్వపక్షము.
9. ప్రథమాధానము నందు ఆధానమంత్రములు చెప్పబడినను - సంభారద్రవ్యములు ఉపయోగించబడినను పునరాధానమునందు సహితము మంత్రోచ్చారణ, సంభారద్రవ్యముల ఉపయోగము చేయవలెనని సిద్ధాంతము.
10. పునరాధేయ సమృద్ధికిగాను 1. విరిగిన తరువాత బాగుచేసిన రథమును 2. చిరిగిన తరువాత కుట్టిన బట్టను - 3. చిక్కిన తరువాత బలిపించిన వృషభమును దక్షిణగా ఇవ్వవలెను.
11. సప్తతే అగ్ని మున్నగు మంత్రములు చదువుచు పునరాధేయ దేవతయగు అగ్నికి హోమము చేయవలెను. ఆ విధముగా చేయుటవలన అగ్నియొక్క ఏ అంగము విస్మృతమైనదో ఆ ప్రదేశము నుండియే సాంగమగు అగ్నిని పొందినట్లగును.
12. దేవతలందు వీరుడు అగ్ని. అటువంటి అగ్నిని ఉద్వాసన చేసినవాడు అగ్నిహంతకుడు అగుచున్నాడు. అతనిని వరుణుడు అప్పు తీసికొన్న వానిని వలె బాధించును. ఆ దోషనివారణకుగాను అగ్ని, వరుణుల హోమము చేయవలెను. 11 పాత్రలందు పురోడాశమును సంస్కరించి హోమము చేయవలెను. ఆ విధముగా వరుణుని సంతృప్తి చెందించినట్లగును. యజమాని బాధలు పొందడు.
మూడవ అనువాకము
(ఆధాన మంత్రములు చెప్పబడినవి.)
1. గార్హ పత్య ప్రదేశమా! నీవు బాహుళ్యమున పృథ్వివి అగుచున్నావు. శ్రేష్ఠత్వమున ద్యులోకమవు అగుచున్నావు. మహత్వమున అంతరిక్షమవు అగుచున్నావు.
భూదేవీ! నీ ఉత్సంగమున అన్నము భుజించు అగ్నిని - యజమాని అన్నము కొరకును ఆధానము చేయుచున్నాను.
2. ఆదిత్యరూపమున ఈ గార్హపత్యాగ్ని శ్వేతవర్ణుడు అయినాడు. జగములందు వ్యాపించినాడు. తదుపరి ఆదిత్యుడగు అతనికి భూమి తల్లియైనది. స్వర్గము తండ్రియైనాడు.
3. ఆదిత్యరూప గార్హ పత్యాగ్ని ముప్పది ముహూర్తరూప తేజస్సులచే ప్రకాశించుచున్నాడు. స్తుతివాక్కు పక్షివలె ఎగిరి ఆకాశము నందలి ఆదిత్యుని ఆశ్రయించినది.
గార్హ పత్యాగ్నీ! నీ విషయమున నైనను మేము ప్రతికూలముగా ప్రవర్తించి యుండిన మన్నించుము. జ్వాలారూపమున ప్రకాశింపుము.
4. అస్య ప్రాణా దపాన త్యన్తశ్చరతిరోచనా. అతని కాంతి ఉచ్చ్వాసమై ఉదయించుచున్నది. నిశ్వాసమై అంతరించుచున్నది. అట్లు ద్యావాపృథ్వుల మధ్య సంచరించు చున్నది.
ఆదిత్యుడు యజ్ఞము చేయువారల కొరకు దివిని వెలిగింపచేయుచున్నాడు.
(రాత్రింబవళ్లను ఉత్చ్వాస నిశ్వాసలనుట అద్భుతము!.)
5. నేను కోపమునకు వశవర్తిని అయినాను. కోపమున అగ్నీ! నిన్ను సాగనంపినాను. అది గతము. నామీద నీ కృప కలిగినది. మరల నిన్ను ప్రజ్వలింప చేయుచున్నాను.
6. ఆహవనీయాగ్నీ! నాకు కోపము కలిగినది కదా! అట్లయి నిన్ను ఉద్వాసన చేసినాను కదా! అప్పుడు నీవు భూమిలోనికి పోయినావు. నీ తేజస్సును వసువులు, ఆదిత్యులు, విశ్వేదేవతలు పరిగ్రహింతురు గాత.
7. అగ్ని తేజోవంతుడు అగును గాత. హోమము చేయబడిన ఆజ్యమును అందుకొనును గాత. చెడిన యజ్ఞమును బాగుచేయును గాత. బృహస్పతి ఈ యజ్ఞమును విస్తరించును గాత. ఈ యజ్ఞము సమస్త దేవతలకు సంతృప్తికరము అగును గాత.
8. అగ్నీ! నీయొక్క సమిధలు ఏడు. నీ నాలుకలు ఏడు. మంత్రములు ఏడు. స్థానములు ఏడు. హోతలు ఏడుగురు. నీ యాగములు ఏడు. అట్టి నీవు ఆహవనీయాది సప్త స్థానములను ఘృతమున నింపుము.
(యజమాని హోమము చేయవలెను.)
9. అగ్నీ! నీవు నాచే ఉద్వాసితుడవు అయినావు. క్షీరాదులతో మరల రమ్ము. ఆయువుతో మరల రమ్ము. అన్నము తీసికొని మరల మరల రమ్ము. సమస్త దోషముల నుండి మమ్ము రక్షించుము.
10. అగ్నీ! నీవు ధనమందుకొని మరలి రమ్ము. వర్షధారలచేత మరలిరమ్ము. తృణ, ధాన్య, లతా, పాదపముల పైభాగములను తడుపుచు రమ్ము.
11. లేక, సలేక, సులేక నామముగల తే ఆదిత్యాః. మీ ఆదిత్యులు జుషాణాః - ప్రీతులై నః - మాయొక్క ఆజ్యమ్ - నేతిని, వియన్తు - త్రాగుదుఋ గాత.
కేతస్సకేత సుకేతస్తేన ఆదిత్యా ఆజ్యం జుషాణా వియన్తు
వివస్వాగం అదితిర్దేవ జూతిస్తేన ఆదిత్యా ఆజ్యం జుషణా వియన్తు
నాలుగవ అనువాకము
(మంత్రములు వ్యాఖ్యానించ బడుచున్నవి.)
1. 'భూమిర్భూమ్నా!' అను మంత్రమునకు 'అన్నలాభము కోరి ఆధానము చేయుచున్నాను' అని అర్థము'.
(గత అనువాకము తొలి మంత్రము 'భూమిర్భూమ్నా ద్యౌర్వరిణాన్తరిక్షం మహిత్వా' అనునది.)
2. సర్పములు ముసలివి అయినవి. అవి జరను పోగొట్టదలచినవి. ఆలోచించినవి. కద్రువ పుత్రుడు కసర్ణీయుడు. 'భూమిర్భూమ్నా' మున్నగు మంత్రముల వలన ముసలి తనము పోవునని తెలిసికొన్నాడు. అప్పుడు సర్పములు ఆ మంత్ర బలమున వార్ధక్యమును విడిచినవి. మరల కోమల శరీరములను పొందినవి.
భూమి సర్పములకు రాణియగును. అందు వలన భూమికి సంబందించిన ఋక్కులచే గార్హ పత్యాగ్నిని పునరాధానము చేయవలెను. ఆ విధముగా చేసినచో యజమాని అగ్నిని నవీనునిగను, జరారహితునిగను చేసినట్లగును.
3. భూమికి అన్నసిద్ధి లేకుండెను. అప్పుడు భూమి ఈ మంత్రమును తెలిసికొన్నది. ఆ మంత్ర బలమున భూమికి అన్నసిద్ధి కలిగినది. కావున అన్నసిద్ధికి సర్పముల రాణియయిన భూమికి సంబంధించిన ఋక్కులచే అగ్నిని ఆధానము చేయవలెను. అప్పుడు ఆ భూమియందే అగ్నిని ప్రతిష్ఠించి ఆధానము చేసినట్లగును.
4. యత్త్వాక్రుద్ధః అనుమంత్రము. అలిగిన బాలుని లాలనచేసినట్లు - అగ్నిని కప్పిపుచ్చినట్లగును.
5. 'పునస్త్వోద్దీపయామి' అనుమంత్రమున సాగనంపిన అగ్నిని మరల జ్వలింప చేసినట్లు చెప్పబడినది.
6. 'యత్తేమన్యు' అను మంత్రము యజమాని కోపముచే ఉద్వాసన చేసిన అగ్నిని ఆదిత్యాదులు స్వీకరించినారని చెప్పినది.
7. అగ్నిని ఉద్వాసన చేసినచో యజ్ఞము భంగము అగును. ఆ దోషనివారణకు బృహస్పతి ఋక్కులతో ప్రార్థించవలెను. అందువలన యజ్ఞమును బ్రహ్మతో సంధానము చేసినట్లగును.
8. 'విచ్చిన్నం యజ్ఞం' అను మంత్రము నందలి 'పందధాతు' అను క్రియాపదము అవిచ్చిత్తిని చెప్పుచున్నది.
9. 'విశ్వేదేవా' మున్నగు మంత్రములు యజ్ఞము విచ్చిన్నము కాకుండ చేయుచున్నవి. ఆ విషయము విశ్వేదేవతలు - దేవతలకు చెప్పుచున్నారు.
10. 'సప్తతే అగ్నే' అను మంత్రము సమిధలు ఏడు అని నిర్దుష్టముగ విధించినవి. అగ్నికి ఇష్టము సప్తసంఖ్యాకములని చెప్పబడినది. అట్లు ప్రార్థించిన యజమానికి అగ్ని శరీరము లభించును.
11. 'పునరూర్జా నివర్తస్వ' అను మంత్రములచే యజమాని పురోడాశ ఆహుతులను హోమము చేయవలెను. అందువలన యజమాని క్షీరాది రసములు కలవాడును, ధనవంతుడును అగుచున్నాడు.
12. దేవతలు ఆధాన పునరాధానములు చేసి స్వర్గమునకు వెళ్లినారు. అచట వారికి దాహము అయినది. స్వర్గమున సమృద్ధిలేదని దేవతలు గ్రహించినారు. భూలోకమునకు తిరిగి వచ్చినారు. 'లేకస్స లేక' మంత్రములచే ఆహుతులు ఇచ్చినారు. స్వర్గమునకు చేరి సమృద్ధిని పొందినారు.
కావున యజమాని పునరాధేయానంతరము అగ్నిని ఆధానము చేసి 'లేకస్స లేక' మంత్రముల ఆహుతులను హోమము చేయవలెను. అందువలన యజమానికి దేవతలకు లభించిన సమృద్ధి లభించును.
అయిదవ అనువాకము
(5 - 10 అనువాకము అగ్ని ప్రార్థన చెప్పుచున్నవి.)
1. మేము యజ్ఞము చేయుచున్నాము. మామాటలు దూరము నుండి అగ్ని వినుచున్నాడు. అట్టి అగ్నిని గూర్చియే మంత్రములు చదువుచున్నాము.
(యజమాని ఆహవనీయ అగ్ని ఎదుట నిలిచి ఆరు ఆహుతుల వరకు ప్రార్థన చేయవలెను.)
2. ఋత్విజులు సంకోచము లేని వారు. అగ్నియొక్క ప్రాచీన కాంతి నుంచి క్షీరదము, బహుధన ప్రదము, కర్మ ప్రవర్తకమునగు జ్యోతిస్సును దుదుహ్రే - పితుకుచున్నారు.
3. ఈ అగ్ని ఆదిత్యరూపమున ఉన్నవాడు. ద్యులోకమునకు శిరము వంటివాడు. వేడికలిగించుట వలన భూలోక పాలకుడు అగుచున్నాడు. స్థావర జంగమముల ఉదక కార్యములకై జఠరాగ్ని రూపమున వానిలో నిలిచినాడు. వానికి ఆనందము కలిగించుచున్నాడు.
4. ఆప్నవాన, భృగు ఋషులు వారి ఆశ్రమములందు అగ్నిని ప్రకాశింపచేసినారు. అది విచిత్రమును,వ్యాప్తి గల అగ్ని. దానిని వారు ప్రజల అభ్యుదయమునకు ఏర్పరచినారు. ఆ అగ్నిని మేము ఈ యజ్ఞమున ప్రజ్వలింపచేయుచున్నాము. అగ్నినే ప్రధానముగా మనసులందు భావించుచున్నాము.
ఈ అగ్ని యజ్ఞములందు దేవతలను ఆహ్వానించుచున్నాడు. మానవులను మించి యాగము చేయుచున్నాడు. యాగములందు స్తుతించబడుచున్నాడు.
5. ఇంద్రాగ్నులారా! మీరు పురోడాశమను అన్నము కలవారు. మిమ్ము సంతోషపెట్టుటకు ఆహ్వానించుచున్నాము. హోమము చేయుటకు మిమ్ము ఆహ్వానించుచున్నాను. మాకు ధనమును, అన్నమును ఇమ్మని మిమ్ము ఆహ్వానించుచున్నాము.
6. అగ్నీ! ఆహవనీయ ప్రదేశము నీకు స్థానము అగును. ఇది అన్ని ఋతువులందు హోమములు నిర్వర్తింప చేయును. అది నీ స్థానము అని గ్రహించుము. ఈ ఆహవనీయ స్థానమును అధిష్టించుము. మాకు ధనవృద్ధి కలిగించుము.
7. అగ్నీ! మా ఆయువులను రోగరహితము చేయుము. మాకు క్షీరాదులను, అన్నములను కలిగించుము. శత్రుసేనను దూరముగనే ఉంచుము. ఆ సేనను హింసించుము.
8. అగ్నీ! నీవు సత్కర్మలవాడవు. నాకు పుష్టిని ధనమును కలిగించుము. మాయందలి బ్రహ్మవర్చస్సును, సామర్థ్యమును పెంచుము.





