Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||
1. దేవస్యత్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణేహస్తాభ్యాం!
ఆదదే నార్యసీదమహం రక్షసాం గ్రీవా అపి కృన్తామి!
యవోసి యవయాస్మద్వేషో యవయరాతీర్దివేత్వన్తరిక్షాయ
త్వా పృథివ్యైత్వా శున్దన్తాంలోకాః పితృషదనమసి !!
(యజ్ఞస్తంభమును పాతుటకు గుంత త్రవ్వుటకు అభ్రీని ఎత్తి)
అభ్రీ! నేను సవిత ఆజ్ఞానువర్తిని. అశ్వినుల బాహువుల తోను, పూషహస్తములతోను నిన్ను పట్టుచున్నాను. నీవు స్త్రీరూపవు. గుంత త్రవ్వుటకు నిన్ను మరల మరల నేల మీద పోడుచుచు రాక్షసుల తలలు ఉత్తరించుచున్నాను.
(యవలను నీళ్లలో వేసి) యవలారా! మీరు దూరము చేయు స్వభావము కలవారు. మానుంచి ద్వేషమును దూరము చేయండి. ఆదాతలను దూరము చేయండి.
(యూపమును ప్రోక్షణ చేయుచు) యూపఅగ్రభాగమా! ద్యులోకము కొరకు నిన్ను శుద్ధిచేయుచున్నాను. యూపమధ్యమా! అంతరిక్షము కొరకు నిన్ను శుద్ధిచేయుచున్నాను. యూపమూలమా! పృథ్వి కొరకు నిన్ను శుద్ధిచేయుచున్నాను.
(గుంతలో నీరు పోయుచు) పితృజనులను ప్రతిష్ఠించు స్థలము పావనమగును గాత.
(గుంతలో తూర్పు, ఉత్తరదిశలకు అగ్రములు ఉండునట్లు దర్భలు పరచవలెను) దర్భయుక్త గర్తమా! నీవు పితృజనులు స్థిరపడు స్థానమవు.
2. (స్తంభమును గుంతలోనికి దింపుచు) యూపమా! నిన్ను పైకి లేపుటకు నిన్ను మధ్యన పట్టిన వారిని నీవు స్వర్గమునకు చేర్చగలదానవు. నీవు సుఖముగా గర్తయందు ప్రవేశించగలదానవు. మేము యూపమును గర్తమున స్థాపించుచున్నామని గర్తము ఎరుగవలెను. గర్తమా! యూపము నీ మీద స్థిరపడును.
యూపమా! సవిత నిన్ను మధుర వర్షజలమున - ఘృతమున- తడుపును గాత. సుఫలయుక్త ఓషధుల కొరకు నేను నిన్ను గర్తలోనికి దించుచున్నాను. నీవు నీ అగ్రభాగమున ద్యులోకమును స్పృశించుము. మధ్యభాగమున అంతరిక్షమును పూరింపుము. మూలభాగమున పృథ్విని దృఢపరచినావు.
3.యూపమా! నీమూలమున మేము ఉత్తమ లోకములకు చేరవలెనని కోరుచున్నాము. ఆ లోకములందు పొడవు కొమ్ముల గోవులు - కలసి వెలుగు కిరణములు ఉండును. అచ్చట ఆ మహాస్థానమున - విష్ణువు పరమపదము పూర్తిగా ప్రకాశించును.
(యూపమును గర్తమున పూడ్చుచు) యూపమా! నీవు బ్రాహ్మణులకు లభించుదానవు. క్షత్రియులకు లభించు దానవు. ధనము, అన్నము మున్నగునవి ప్రసాదించుదానవు. నిన్ను నేను గర్తమున దించుచున్నాను.
యజ్ఞయూపమా! నీవు బ్రహ్మణులను దృఢపరచుము. క్షత్రియులను దృఢపరచుము. ఆయువును దృఢపరచుము. మా సంతానములను దృఢపరచుము.
4. ఋత్విజులాలా! విష్ణువుయొక్క వీరకర్మలను చూడండి. అతడు సమస్త కర్మలను తనయందు ఉంచినాడు. విష్ణువు ఇంద్రునకు పరమ అనుకూలమిత్రుడు.
5.ద్యులోకమందు వ్యాపించియున్న నక్షత్రమండలమును మన చక్షువులు చూచును. అట్లే విద్వాంసులు విష్ణువు యొక్క పరమ పదమును నిత్యము దర్శింతురు - 'సదా పశ్యంతి సూరయః'
6. (కుశలతో పేనిన త్రాటితో స్తంభపు నాభి భాగమును మూడుసార్లు - వరుసలు - చుట్టి) యుపమా! నీవు త్రాటిచే పరివేష్ఠించవలెను.
స్వరములారా! మీరు ద్యులోకపుత్రులు.
యూపమా! పృథివియందు ఇది నీ ఆశ్రయస్థానము. అరణ్యమున పుట్టిన పశువులు నీ భాగపువారు.
7. తృణమా! నీవు సమీపమునుంచి రక్షించు మిత్రుడవు (గడ్డిపోచతో పశువును ముట్టి దేవతల ప్రజవగు పశువా!
స్వర్గమును ఇచ్చునట్టి అగ్ని సోముల హవిర్భాగము దేవతలకు అందవలెను.
త్వష్ఠదేవా! నీవు యజమానికి ధనము ప్రసాదించుము.
పశువా! హవిర్భూతములగు నీ మాంసాదులను దేవతలు ఆస్వాదింతురుగాక.
8. క్షీరాది ధనములుగల గోవులారా! యజమాని ఇంట సుఖముగా ఉండండి. బృహస్పతీ! నీవు యజమాని ఇంటి గవాది ధనములను భరించుము.
దేవతల పశుహవివగు పశువా! నిన్ను యజ్ఞపు బంధనములచే బంధింతును. (పశువు కొమ్ములకు కుశలత్రాటితో కట్టవలెను) ఇక శమిత నిన్ను వశపరచుకొనును గాత.
(శమిత - యజ్ఞపశువుయొక్క హృదయ స్థాన వపను వండువాడు)
9. పశువా! నేను సవితృదేవుని ఆజ్ఞానువర్తిని. అశ్వినుల బాహువులతోనూ, పూషహస్తముల తోను, అగ్నిసోములకు ప్రీతికరుడవగు నిన్ను - యూపమునకు కట్టుచున్నాను. (పశువును యూపమునకు కట్టవలెను) నిన్ను నేను జలము దర్భలు మున్నగు ఓషధులచే ప్రోక్షించుచున్నాను. (దర్భలతో పశువుమీద నీరుచల్లవలెను) దేవతల హవియగుటకు నీతల్లి నిన్ను అనుమతించును గాత. అగ్నిసోములకు ప్రీతికరమవగు నిన్ను ప్రోక్షించుచున్నాను.
10. పశువా! నీవు నీరు త్రాగుదానవు, (పశువు నిమ్న ఉదారాది భాగములను ప్రోక్షించవలెను) నిన్ను జలదేవత పవిత్రము చేయవలెను. (పశువు మీద అంతట జలము చల్లవలెను)
పశువా! నీప్రాణము బ్రహ్మ ప్రాణములందు చేరవలెను. నీ అంగప్రత్యంగములు - యథావిధి ఆయా యజనీయ దేవతలందు చేరవలెను. ఈ యజమాని అభీష్ట స్వర్గది ఆశిషములతో చేరును గాత.
11. (శమిత చేతినుంచి 'అసి', 'స్వరు' లను తీసికొని వానిని ఘృతమున ముంచి) అసి, స్వరు లారా! ఘృతమున తడిసిన మీరు ఈవధ్య పశువును రక్షించండి.
ధన కామనాయుక్త సుత్తివాణీ! నీవు యజమానికి ప్రియములగు ధనాదులు అందించుము యజమానిలో ప్రవేశింపుము.
స్తుతీ! నీవు వాయుదేవుని ప్రీతికి పాత్రవగుము. ఈ వధ్యపశువును విశాల అంతరిక్షమున ఉండు రాక్షసాదుల నుండి రక్షింపుము. నీవు స్వయముగా ఈ పశుహవితో దేవతలను యజించుము వధ్యపశువు శరీరముతో ఐక్యమగుము.
వర్షము వలన కలిగిన తృణమా! ఈ యజ్ఞస్వామి యజమానిని ఫలయుక్త యజ్ఞమున నిలుపుము. (పశువుక్రింది నేలమీద గడ్డి వేయవలెను) "స్వాహా దేవేభ్యో దేవేభ్యః స్వాహా"
(స్వరు - యూపస్తంభము కొట్టగా మిగిలిన ముక్క)
12. (పశువు చర్మమువిడదీయు పరికరములతో త్రాటిని పశువును కట్టుటకు - నేలమీదవేసి! రజ్జువా! నీవు సర్పాకారమవుకాకుము. అజగర ఆకారము దాల్చకుము.
(చేత నీటికుండ పట్టి నడుచు యజమాన పత్నిని పశువు వద్దకు తీసికొని పోయి ప్రస్థాత ఆమెచే అనిపించునది)
విశాల ఆకాశమును అందుకొను యజ్ఞమా! నమస్కారము. నీవు శత్రురహితుడవై సమాప్తిని చేరికొనుము. యజ్ఞమార్గమున ప్రాప్తమగు ఆహుత ఘృతధారలను అనుసరించిసాగుము. "ఘృతస్య కుల్యాఉపఋతస్య పధ్యాఅను"
13. కాళ్లు చేతులు కడుక్కొను జలమున్న ఘటమా! నీవు పరిశుద్ధవు. ఈపశువును పరిశుద్ధము చేయుము. దీనిని దేవతలకు చేరు అర్హతా కలిగించుము. దేవతల మధ్యనున్న మేము ఆ దేవతలచే ఎల్లప్పుడు పరివేష్ఠితులము కావలెను.
14. (యజమాన పత్ని మృతపశువు వద్ద కూర్చొని) పశువా! నేను నీ నాలుకను శుద్ధిచేయుచున్నాను. (నీరు ముఖమునకు అంటించవలెను.) పశువా! నేను ప్రాణములను శుద్ధిచేయుదును. (నాసికారంథ్రములకు నీటిని అంటించవలెను.) పశువా! నేను నీ కనులను శుద్ధిచేయుదును. (కనులకు నీరు అంటించవలెను) పశువా! నీచెవులను శుభ్రము చేయుదును. (చెవులకు నీరు తాకించ వలెను) పశువా! నేను నీ నాభిని శుద్ధిచేయుదును. (నాభికి నీరు తాకించవలెను) పశువా! నేను నీ శిశ్నమును శుద్ధిచేయుదును. (పశువు అంగమునకు నీరు తాకించవలెను) పశువా! నేను నీ గుదమును శుద్ధిచేయుదును. (గుదమునకు నీరు తాకించవలెను) పశువా! నేను నీపాదములను శుద్ధిచేయుదును. (పశువు నాలుగు పాదములకు నీరు ముట్టించవలెను)
15. (కాళ్లు చేతులు కడుగు నీటి కుండలోని నీటితో యజమాని - అధ్వర్యు - యజమానపత్ని కడుగుకొని - పశువును శుద్ధిచేయవలెను. కుండలో మిగిలిన నీటిని పశువుపై చల్లి యజమాని)
పశువా! నీమనసు వికసించవలెను. నీ నాలుక ప్రసన్నము కావలెను. నీ ప్రాణము వికసించవలెను. నీ కన్నులు ప్రపుల్లములు కావలెను. నీ శ్రవణశక్తి వర్ధిల్లవలెను.
పశువా! బంధనాదులచే నీ విషయమున క్రూరముగా ప్రవర్తించుట జరిగినది. వధాది కృత్యములు నిర్వహించుట జరిగినది. ఆ బాధలన్నియు నిన్ను విడిచిపోవును. హొమీయములగు నీ అంగములన్నియు పరిశుద్ధములు కావలెను. రాత్రింబవళ్లు మొదలుకొని సర్వకాలములు నీకు కళ్యాణ ప్రదములు కావలెను.
(మూడు దర్భలను పశువు రొమ్ముమీద పెట్టి) ఓషధులారా! ఈపశువును రక్షించండి. (కత్తిచేతపెట్టి) ఖడ్గమా! నీవు ఈ పశువు ఆత్మకు దుఃఖము కలిగించకుము. (పశువు రొమ్ము దగ్గరి చర్మమును చీల్చవలెను)
16. (పశువు చర్మము తీయకముందు పశువు రొమ్ముమీద దర్భలు పెట్టి ఉండెను. కత్తితో పశువు చర్మము కోయునపుడు ఆ దర్భలు రెండు ముక్కలు అయినవి. అధ్వర్యు ఆ రెంటిలోని అగ్రభాగములను కుడి చేతను - మూలభాగములను ఎడమచేతను పట్టి పశువు రక్తమున ముంచవలెను.)
రక్త రంజిత తృణములారా! మీరు రాక్షసుల భాగము. (మంత్రము చదివిన అధ్వర్యు రెండు దర్భముక్కలను మట్టి కుప్పమీద వేయవలెను) రాక్షసవర్గము యజ్ఞస్థానమునుండి పారద్రోలబడినది.
(యజమాని అనవలసినది) నేను రాక్షస వర్గమును పాదాక్రాంతులను చేయుచున్నాను. (గడ్డి ముక్కలపై పాదముంచవలెను) నేను రాక్షస వర్గమును పీడించుచున్నాను. (గడ్డిముక్కలను కాలితో తొక్కవలెను) నేను రాక్షసులను అంధకారమయ రసాతలమునకు త్రోయుచున్నాను.
(పశువు ఉదరము నుండి తీసిన మేదలో వపా శ్రపణుల - మేదను తొలగించు దారు ఉపకరణములను - మేదలో ముంచి అధ్వర్యు అనునది) ద్యావాపృథ్వులారా! మీరిద్దరు జలముచే ఆచ్ఛాదితులు కండి. వాయువా! నీవు వపబిందువులను గ్రహించుము. ఆహవనీయగ్నీ! ఘృత ఆహుతులను ఎరుంగుము. అగ్నయే స్వాహా
(గడ్డిముక్కలను, వపాశ్రపణులను ఆహవనీయాగ్నిలో హొమము చేయుచు అధ్వర్యు) వపాశ్రపణులారా! మీరు ఉభయులు అగ్నిలో ఆహుతి చేయబడినారు. ఇక మీరు అంతరిక్షమున ఉన్న పవనమును కలసికొనండి.
17. (ఋత్విజ యజమానాదులందరు జలాశయము వద్ద తమను పవిత్రము చేసి కొనుచు) మాలో ఉన్న ఏ మాత్రపు పాపమునైనను, శరీరమునందలి మలమును ఈ జలము తొలగించవలెను. నేను చేసిన అకారణ ద్రోహమును, పాపభయము ఎరుగని నాకు కలిగిన శాపమును సోమ, జలములు రెండును తొలగించవలెను.
18. (జుహువులో నిండిన నేతిని ముందు పశువు హృదయమున చల్లి పిదప సర్వంగపు మాంసము మీద చల్లవలెను)
పశువా! నీహృదయము దేవతలు హృదయములందును, నీప్రాణము దేవతల ప్రాణము లందును, లీనమగును గాత.
వపా! నీవు ఎంతో చిన్నదానవు. అగ్ని నిన్ను పచనము చేసి, విస్తారము చేయును. జలము మాంసమును వేరుచేయును. వాయుగతి కలిగిన, పూషగతి కలిగిన వపను పానము చేసిన అంతరిక్షముందున్న రాక్షసాదులు వ్యధితులు కావలెను. ఈ విధముగా వపా హొమమున దుర్భాగ్యము దూరమైనది. (ఘృతము మరియు వపను ఖడ్గముచే కలుపవలెను.)
19. ఘృతపానము చేయు దేవతలారా! ఘృతపానము చేయండి. వసాపానముచేయు పితఋలారా! వసాపానము చేయండి.





