Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    (దక్షిణ శకటము క్రింద త్రవ్విన మొదటి గుంతను నీళ్లతో కడుగ వలెను.)

    నాతో సములైన శత్రువులు పూడ్చిన కృత్యాదులను పెరికి పారవేయుదును. (రెండువ గుంతను శుభ్రము చేయవలెను.)

    నా బంధువులు - బంధువులు కానివారు పాతిన కృత్యాదులను పెరికి వేయుచున్నాను. (మూడవ గుంతను శుభ్రము చేయవలెను.)

    నా సహొదరులును - సహొదరులు కానివారును పాతిన కృత్యాదులను పెరికి వేయుచున్నాను. (నాలుగవ గుంతను శుభ్రము చేయవలెను.)

    పరాజయం ప్రాప్య పలాయమానౌ రాక్షసైరింద్రాది వధార్థమభిచార రూపేణ భౌనకానిఖాతా అస్థికేశనఖాది పదార్థాః కృత్యా విశేషాః" అని యాస్కుడు,

    రాక్షసులు ఓడినారు. పారునారు. వారు ఇంద్రాది దేవతలను వధించుటకు అభిచారము చేసినారు. ఎముకలు, వెంట్రుకలు గోళ్ళు నేలలో పాతిపెట్టినారు. వానిని 'కృత్య' అందురు.

    ఓడినవాడు బలహీనుడు, గెలిచినవాడు బలవంతుడు, బలహీనుడు, బలవంతుని మీద పగ తీర్చుకొనలేడు. కాని అంతవరకు అతని కసి తీరదు. మనశ్శాంతి ఉండదు. కసి తీర్పు కొనుటకు- తనను ఓడించిన వారివే అని భావించి - అస్థికేశాదులను పాతిపెట్టి ఊరట చెందుట మానవ సహజము.

    అభిచారము రాక్షసవిద్య అనుచున్నాడు! అయినను ఇది మానవ మనస్తత్వము - మానవ బలహీనతకు సంబంధించినదిగా తోచుచున్నది.

    శత్రువులు ఎన్ని విధములో చెప్పినాడు. 1. సాధారణ శత్రువులు 2. సమాన శత్రువులు 3. సహొదరాది శత్రువులు 4. బంధు శత్రువులు.

    24. (క్రమముగా ఒక్కొక్క గుంతను స్పృశించి యజమాని అనవలసినది)

    ప్రథమగర్తా! నీవు స్వరాటువు. శత్రువును నష్టపరచు దానవు.

    రెండవ గర్తమా! నీవు సత్రరాట్టువు. అభిమాన శత్రువును నష్టపరచుదానవు.

    మూడవ గర్తమా! నీవు జనరాట్టువు. రాక్షస నాశకవు.

    నాలుగవ గర్తమా! నీవు సర్వరాట్టువు. సర్వశత్రునాశకవు.

    (స్వకీయమేవ రాజ్యం యస్య సః స్వరాట్ అని ఉవటుడు. తన రాజ్యము కలవాడు స్వరాట్టు. అట్లే సత్రరాట్టు - జనరాట్టు - సర్వరాట్టు)

    25.  గర్త చతుష్టయమా! మీరు విష్ణుసంబంధులు. రాక్షసాదులను - కృత్యాదులను, కేశాదులను నష్టపరచువారు. మిమ్ములను జలముచే కడుగుచున్నాను.

    గర్తచతుష్టయమా! మీరు విష్ణు సంబంధులు, రాక్షసాదులను, కృత్యాదులను- అస్థికేశాదులను నష్టపరచువారు. మీలో ఉన్న అపరిశుద్ధజలమును తొలగించుచున్నాను.

    గర్త చతుష్టయమా! మీరు విష్ణుసంబంధులు, రక్షసాదులను - కృత్యాదులను - అస్థి కేశాదులను నష్టపరచువారు. మీ మీద  దర్భలు పరచుచున్నాను.

    గర్త  చతుష్టయమా! రాక్షసఘాతకులగు మీ రెండు రెండింటి మీద రెండు ఫలకములు పెట్టుచున్నాను.

    గర్త చతుష్టయమా! మీరు విష్ణుసంబంధులు - రాక్షసాదులను - కృత్యాదులను అస్థికేశాదులను నష్టపరచున్నారు. మీమీద పెట్టిన ఫలకములను మట్టిచే కప్పుచున్నాను.

    (ఫలకముల మీది మట్టిమీద కృష్ణాజినమును పరచవలెను)

    చర్మమా! నీవు విష్ణుసంబంధివి.

    (చర్మము మీద సోమరసము పిండు రాళ్లను ఉంచవలెను)

    శిలలారా! మీరు విష్ణుసంబంధులు.

    26. అగ్నీ! నేను సవితాదేవుని ఆజ్ఞానువర్తిని. అశ్వినుల బహువులతోను- పూష హస్తములతోను నిన్ను అందుకొనుచున్నాను. నీవు స్త్రీ రూపవు. నీద్వారా ఉదంబర శాఖను నాటుటకు గొయ్యి త్రవ్వుట ద్వారా రాక్షసులను గొంతు వరకు నరుకుచున్నాను.

    యవధాన్యమా! నీవు యవవు. వేరుచేయుదానవు. నీవు మమ్ము ద్వేషించరాదు. అదాతలను మానుంచి దూరము చేయుము.

    ఉదంబరశాఖ యొక్క అగ్రభాగమా! ద్యులోకప్రాప్తి కొరకు నిన్ను జలముతో శుద్ధిచేయు చున్నాను. మధ్యభాగమా! అంతరిక్ష ప్రాప్తి కొరకు నిన్ను జలమున శుద్ధి చేయుచున్నాను. మూలభాగమా! భూలోక ప్రాప్తి కొరకు నిన్ను జలమున శుద్ధి చేయుచున్నాను. పితృజనులుండు స్థానము క్రవ్యాదుల నుండి పవిత్రమగును.

    గర్తమా! నీవు పితృజనుల నివాస స్థానమవు. (గర్తకు పూర్వ, ఉత్తర దిశలందు అగ్రభాగములు ఉండునట్లు దర్భలు పరచవలెను.)

    27. ఉదంబరశాఖా! నీవు ద్యులోకమును నిలుపుము. మధ్యభాగమా! అంతరిక్షమును నిలుపుము. మూలమా! పృథ్విని దృఢపరచుము.

    శాఖా! వాయువు నిన్ను గుంతలో నాటవలెను. తమ ధారక ధర్మమున మిత్రావరుణులు నిన్ను గుంతలో నాటవలెను. నీవు బ్రహ్మణుని సంతోషపెట్టుదానవు. క్షత్రియుని సంతోష పెట్టుదానవు. ధనము అన్నము ప్రసాదించుదానవు. నిన్ను నేను గుంతలో నాటుచున్నాను.

    హేశాఖా! నీవు బ్రాహ్మణుని దృఢపరచుము. క్షత్రియుని దృఢపరచుము. ఆయువును దృఢపరచుము. యజమాని సంతానములను దృఢపరచుము.

    28. హేశాఖా! నీవు గట్టిగా నాటుకొనుము. యజమాని తన ఇంట పశువులు, ప్రజలతో వర్ధిల్లవలెను.

    (శాఖలో పిల్ల శాఖ సంధివద్ద ఆహుతి ఆర్పించి) ఘృతమున ద్యావాపృథ్వులను పూరింపుము.

    (ఉదంబర శాఖణు పాతిన చోట దాని మీద మంటపము నిర్మించువలెను) మంటపమా! నీవు ఇంద్రునకు నీడ ఇచ్చుదానవు యజమాని, ఋత్విజాదులకు నీడనిచ్చుదానవు.

    29. స్తుతులచే ప్రాప్యుడవగు ఇంద్రా! మా స్తుతులు నిన్ను నిలువైపులనుండి క్రమ్ముకొనవలెను. స్తుతులు వర్ధన శీలలు -ప్రియంవదలు. అవి నీకు హర్షదాయకములు కావలెను.

    30. బంధనరజ్జువా! నీవు ఇంద్రుని బంధకమవు. గ్రంధీ! నీవు ఇంద్రుని నిలిపి ఉంచుదానవు.

    మండపమా! నీవు ఇంద్రసంబంధివి. (హవిర్థాన మండపపు వాయవ్య కోణపు ఉత్తర భాగమున అగ్నీధ్రమను పేరుగల అగ్ని స్థానమును చేసి - దానిని స్పృశించి)

    31. అగ్నీధ్రీయ దిష్ణ్యే! నీవు విభు మరియు ప్రవాహరణ నామము గల దానవు. హొతృదిష్ణ్యే! నీవు వహ్ని లేక హవ్యవాహన నామము గలదానవు. మైత్రావరుణ ద్విష్ణ్యే! నీవు శ్వాత్ర- ప్రచేత నామము గల దానవు. బ్రాహ్మణచ్ఛంసి దిష్ణ్యే! నీవు విశ్వవేదనామము గలదానవు.

    (అగ్నిని ప్రతిష్ఠించుటకు ఏర్పరచిన మట్టివేదికలను దిష్ణ్యేలు అందురు)

    32. పోతృదిష్ణ్యే! నీవు ఉశిక మరియు కవి నామము గల దానవు. నేష్టృదిష్ణ్యే! నీవు  అంధారి మరియు బంభారి నామము గల దానవు. అచ్ఛావాకదిష్ణ్యే! నీవు అవస్యు -దువస్వాన్ నామము గల దానవు.

    (దిష్ణ్యే వేదికల తరువాత ఉత్తరవేది యొక్క దక్షిణ భాగమున మార్జాతీయ వేదికలు నిర్మింపబడును)

    మార్జతీయవేదీ! నీవు శున్థ్యువు. మార్జాతీయమవు. ఉత్తరవేదినున్న ఆహవనీయమా! నీవు సామ్రాట్టువు. కృశానవు. బహిష్పవమాన దేశమా! నీవు పరిషద్యవు. పవమానవు. చాత్వాలమా! నీపేర్లు నభము - ప్రతక్వము. శమిత్రిమా! నీవు మృష్ట ౦ హస్య సూదన నామకుడవు. ఉదంబరశాఖా! నీవు బుతుధామ - స్వజ్యోతి సంజ్ఞుడవు.

    33. బ్రహ్మ ఆసనమా! నీవు సముద్ర - విశ్వవచనామకపు -సమస్త యజ్ఞమును పర్యవేక్షించు బ్రహ్మకూర్చుండు స్థలము.

    ప్రాచీన వంశశాలా ద్వారము వద్ద ఉన్న అగ్నీ! నీవు అజసకపదవు.

    ప్రజాహిత అగ్నీ! నీవు అహీయమాన, మూలభూత అహిబుధన్యమవు.

    సదనమా! నీవు వాక్ స్థానమవు. వాణి ద్వారా కర్మచేయు స్థానము. నీవు ఇంద్రసంబంధివి. సదనమవు.

    యజ్ఞద్వారము వద్ద నిలిపిన ఉదంబర ఉభయ శాఖలారా! మీరు నన్ను బాధించరాదు. మార్గపాలక సూర్యా! మార్గమధ్యమందున్న నన్ను వర్ధిల్లచేయుము. దేవలోకమునకు దారి తీయు యజ్ఞమార్గము నాకు శుభంకరము కావలెను.

    34. ఋత్విజులారా! మీరు నన్ను స్నేహదృష్టితో చూడండి.

    దిష్ణ్యలారా! మీరు సుత్తియుక్త దిష్ణ్యనామకులు. సుత్తి సహితులు సమస్తుతులు కండి.

    అగ్నులారా! మీరు మీ ఉగ్రతేజోపంజములనుండి నన్ను రక్షించండి. నాకు ధనాదులు అందించండి. నన్ను పరిపూర్ణని చేయండి. నన్ను రక్షించండి. నా నమస్కారములు అందుకొనండి. నన్ను బాధించకండి.

    35. ఆజ్యమా! నీవు అనేక రూపజ్యోతివి. దేవతలకు ఉద్దీపకుడవు.

    సోమమా! నీవు మమ్ము శరీరచ్ఛేది రాక్షసులనుండి - ద్వేషించువారినుండి -శత్రుకృత దౌర్భాగ్యముల నుండి రక్షించువాడవు. వీటన్నింటినుండి తప్పుకొనుటకు నీవే విశాల రక్షకుడవు. సోమాయ స్వాహా.

    ప్రియతములగు సోమ ఘృతములకు స్వాహా.

    36.అగ్నిదేవా! నీవు సమస్త ధనమార్గములు తెలిసినవాడవు. మమ్ము సన్మార్గమున ధనప్రాప్తి వైపు నడిపించుము. మానుండి కుటిల పాపములను దూరము చేయుము. మేము నీకు అధికాధికముగా నమస్కరించుచున్నాము. నమస్కారములు చెప్పుచున్నాము.

    37. ఈ అగ్ని మా కొరకు ధనము కలిగించవలెను. శత్రుదమనుడై మాకు అగ్రగామికావలెను. అన్నము కొరకగు యుద్ధములందు ఈ అగ్ని మా కొరకు అన్నములను జయించవలెను. అగ్ని అత్యంత ప్రసన్నుడై గెలువవలెను. అగ్నయే స్వాహా. (అగ్నీధ్రీయ దిష్ణ్యలో ఒక ఆహుతి అర్పించవలెను)

    38. విష్ణో! నీవు విస్తృతముగ పర్యటించుము. మా నివాసమున విశాల స్థానము ఏర్పరచుము.

    ఘృతయోని అగ్నీ! నీవు ఘృతపానము చేయుము. యజ్ఞపతి యజమానిని ఆపదల నుండి దాటించుము. అగ్నయే స్వాహా

    (ఆహవనీయగ్నికి ఆహుతి అర్పించవలెను)

    39. సవితృదేవా! ఈ సోమము నీ దక్షిణలందున్నది. సోమమును రక్షింపుము. సోమమును రక్షించినపుడు అసురులు నిన్ను హింసించ కుండవలెను.

    సోమదేవా! నీవు ఇంద్రాది దేవతలకు వారివారి భాగముల రూపమున అందినావు. (కట్టిపెట్టిన కృష్ణాజినము విప్పి సోమమున తీయవలెను)

    యజమానినగు నేను ధన అన్నాదులతో నావారిని చేరుకున్నాను. ఇది దేవతల కొరకగు ఆహుతి - స్వాహా. నేను స్వయముగా- ఇప్పుడు - వరుణ పాశములనుండి విముక్తడనగుచున్నాను. "వరుణస్యపాశాన్ముచ్యే"

    40. వ్రతపాలక అగ్నీ! ఇంతవరకు నేను నీ సంరక్షణలందున్నాను. వ్రతమును పూర్తి చేయించగల నీ స్వరూపము నాలో లీనమై ఉండెను. ఇప్పుడు మరల నీ స్వరూపమును నీవే గ్రహించుము ఇంతవరకు నాదేహము నీలో లీనమై ఉండెను. దానిని మరల నాదేహమున ప్రవేశపెట్టుము.

    వ్రతముల స్వామీ! మన ఉభయుల వ్రతములు, వ్రతనియమములు సమాప్తమైనవి. దీక్షాస్వామి సోమము నా దీక్షను ఆమోదించినాడు. తపముల స్వామి ఉపసదాగ్ని నా తపములను ఆమోదించినాడు.

    41. విష్ణో! నీవు విక్రమింపుము. మా నివాసమునకు విశాల స్థానము ఏర్పరచుము.

    ఘృతయోని అగ్నీ! ఘృతపానము చేయుము. యజ్ఞపతి యజమానిని ఆపదలనుండి దాటించుము. అగ్నయే స్వాహా.

    (యూపము కొట్టుటకు వెళ్ళుచు ఆహవనీయాగ్నికి ఘృతాహుతి అర్పించవలెను.)

    42. (యజ్ఞస్తంభము చేయుటకు అడవిలో చెట్టుకొట్టుటకు వెళ్ళిన వడ్రంగి ఆజ్య శేషసహితుడై అనవలసినది)

    యూపయోగ్యవృక్షమా! అడవిలోని అన్ని చెట్లనువిడిచి నేను నీవద్దకు వచ్చినాను. ఇతర వృక్షముల జోలికి పోలేదు. ఇతర వృక్షముల కన్న నీవే నాకు శ్రేష్ఠముగా కనిపించినావు.

    వనస్పతిదేవా! ఎంతో ప్రీతితో మేము నిన్ను సేవించుటకు వచ్చినాము. దేవపూజ మరియు యజ్ఞము కొరకు నిన్ను పూజింతుము.

    (చెట్టు మీద దర్భలుంచి) దర్భఓషధులారా! మీరు ఈవృక్షమును రక్షంచండి. (గొడ్డలిచే కొట్టుచు) పరశూ! నీవు ఈ వృక్షమును బాధించకుము.

    43. (తెగి పడుచున్న వృక్షమును సంబోధించి)

    నీవు భూలోకమును పెళ్లగించకుము. అంతరిక్షమును బాధించకుము. ఇక నీవు నెల మీద శయనింపుము. పదునైన ఈ పరశువు నిన్ను దేవతలకు ఉపయోగపడు పరమ సౌభాగ్యము కలిగించినది.

    వృక్షదేవా! నీవు శతశాఖలు కలిగి పత్రపుష్పములు గల దానవగుము. మేము సహితము పుత్ర, పౌత్రాదుల కూడి సహస్రశాఖసమముగా వర్ధిల్లుదుము.

    (చెట్టుపడి ఉన్నచోట ఆహుతి అర్పించవలెను)

    అతస్త్యం దేవ వనస్పతే శతవల్శోవిరోహ
    సహస్ర వల్శానివ వయం రుహేమ!!


       
                               దాశరథి రంగాచార్య విరచిత
                  శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
        ఆతిథ్యాత్ స్ధాణుహొమాన్తమను అయిదవ అధ్యాయము సమాప్తము.
                                    సర్వేపి సుఖినస్సంతు. 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.