Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    శిఖండి పుత్రునివలేనే పెరిగినాడు. ద్రోణుని వద్ద అస్త్ర శస్త్ర విద్యలు నేర్వసాగినాడు. శిఖండికి యుక్త వయస్సు వచ్చినది. దుశార్ణరాజు హేమవర్మ తన కూతురును ఇచ్చి వివాహము చేసినాడు. కాలక్రమమున శిఖండి భార్య, భర్త రహస్యమును గుర్తించినది. తన భర్త పురుషుడు కాడు అని గమనించినది. ఈ విషయమును రహస్యముగా పుట్టినింటికీ తెలియపరచినది.
    హేమవర్మ కూతురు చేరవేసిన వార్త విన్నాడు. భగ్గుమన్నాడు. ద్రుపదుడు తనను మోసము చేసినందుకు మండిపడినాడు. తన సైన్యమును తీసుకొని బయలుదేరినాడు. ద్రుపదుని పట్టణమును ముట్టడించినాడు. అప్పటికి సాయంకాలము అయినది. తెల్లవారి ఎదుర్కొనుటకు ద్రుపదుని సైన్యము సిద్దము అగుచున్నది.
    శిఖండి ఇవన్నియు విన్నాడు. తన మూలముననే ఇదంతయు జరుగుచున్నదని గ్రహించినాడు. ఇంటి నుండి బయలుదేరినాడు. ఆరాత్రి అరణ్యమున ఆత్మహత్యకు ప్రయత్నించినాడు. "స్థూలకర్ణుడు' అను యక్షుడు అది చూచినాడు. శిఖండిని వారించినాడు. తన నివాసమునకు తెచ్చినాడు. ఒదార్చినాడు. ఆత్మహత్యా ప్రయత్నమునకు కారణము అడిగినాడు.
    శిఖండి ఏడ్చినాడు.
    యక్షుడు కరిగినాడు.
    శిఖండి తన వృత్తాంతమంతయు తెలియపరచినాడు. ప్రస్తుతము కలిగిన ఆపదను వవరించినాడు.
    యక్షుడు శిఖండి మాటలు విన్నాడు. భాదపడినాడు. "శిఖండీ! నీ కధ విచిత్రముగా ఉన్నది. నీ స్త్రీత్వము నాకు ఇమ్ము. నా పురుషత్వము నీవు తీసుకొనుము. నీపని ముగిసిన పిదప పదిరోజులకు వచ్చి నా పురుషత్వమును నాకు ఇమ్ము" అన్నాడు. శిఖండిని పురుషుని చేసినాడు. తాను స్త్రీ అయినాడు.
    శిఖండి ఎంతో సంతోషించినాడు. స్తూలకర్ణునకు కృతజ్ఞతలు తెలియపరచినాడు. తన ఇంటికి ఆరాత్రి చేరినాడు. తల్లిదండ్రులకు తన విషయము తెలియపరచినాడు. తాను ప్రస్తుతము పురుష పుంగవుడను అని చెప్పినాడు. ద్రుపద రాజ దంపతులకు ఆపద తప్పునట్లు అయినది. శివదేవుడు చెప్పినది సత్యము అగుచున్నదని గ్రహించినాడు. సైన్యసన్నాహములు నిలుపు చేయించినారు. నిద్రపోయినారు.
    తెల్లవారినది. ద్రుపదరాజు హేమవర్మకు వార్తను పంపినాడు. ఆహ్వానించినాడు. హేమవర్మ వచ్చినాడు. శిఖండిని చూచినాడు. సంతృప్తుడు అయినాడు. కూతురు పంపిన వార్త విని దండెత్తి వచ్చినందులకు సిగ్గు పడినాడు. ద్రుపదునకు క్షమాపణ చెప్పినాడు. సైన్యమును తీసుకున్నాడు. దశార్ణమునకు వెళ్ళిపొయినాడు.
    పదిరోజులు గడచినవి. శిఖండి స్థూలకర్ణుని వద్దకు వెళ్ళినాడు. అతని పురుషత్వమును తీసుకొనవలసినదని కోరినాడు.
    "శిఖండీ" స్థూలకర్ణుడు అన్నాడు "ఇక నీ జీవిత పర్యంతము నీవు పురుషుడగను, నేను స్త్రీగను ఉండవలసి ఉన్నది. వెళ్ళుము సుఖించుము."
    శిఖండికి ఆశ్చర్యము కలిగినది. అందుకు గల కారణము అడిగినాడు. స్థూలకర్ణుడు చెప్పినాడు.
    "ఒకనాడు కుబేరుడు వచ్చినాడు. నన్ను పిలిపించినాడు. నేను సిగ్గుపడుచు అతని ముందు నిలిచినాను. అతను నన్ను చూచినాడు. జరిగినది తెలుసుకున్నాడు. "స్థూలకర్ణుడు జీవిత పర్యంతము స్త్రీగానే ఉండుగాక అని శపించినాడు. నేను నీ కధ చెప్పినాను. ఉపకారము చేయుటకే ఇల్టు చేసినానని విన్నవించినాను" అటులయిన శిఖండి జీవిత పర్యంతము స్త్రీగా నందువు. అటు తరువాత పురుషుడవుగానే ఉండి పొమ్ము. నీ లక్ష్యము సాధింపుము" అన్నాడు.
    "స్థూలకర్ణా!" శిఖండి అన్నాడు. "నా వలన నీకు ఈ ఆపద వచ్చినది. నేను ఇప్పుడు ప్రాణములు విడుతును. నీవు మరల పురుషుడవు కమ్ము" అన్నాడు.
    "శిఖండీ! ఇది దైవ నిర్ణయము. నీ వలన ఒక కార్యము సిద్దించునున్నది. నేను స్త్రీగా ఉన్నాను. సంతోషముగా ఉన్నాను. వెళ్ళుము. నీ కార్యము నేరవెర్చుము" అని శిఖండిని స్థూలకర్ణుడు సాగనంపినాడు.
    శిఖండి ఇంటికి వచ్చినాడు. తలిదండ్రులతో చెప్పినాడు. శివుని వాక్యము జరిగినదని వారు సంతోషించినారు. ద్రుపదుడు శిఖండిని ద్రోణాచార్యుల వద్దకు పంపినాడు. అక్కడ అతడు అస్త్ర విద్యలు నేర్చినాడు.
    ఇది భీష్ముడు దుర్యోధనునకు చెప్పిన కధ. కధ చెప్పి భీష్ముడు అన్నాడు :-
    "దుర్యోధనా! నేను యుద్దమందు అంగనా పూర్వులను చంపను. స్త్రీల పేర్లు గల వారిని, స్త్రీ వేశాధారులను చంపను. నేను అట్టి వ్రతమును పూని ఉన్నాను. కావున అంగనాపూర్వుడు అయిన శిఖండి నామీదకు వచ్చినను నేను బాణము వేయను. చావున కైనను సంమతింతును. వ్రత భగ్నుడను అగుటకు సమ్మతించను."
    భీష్ముని మాటలు విన్నాడు దుర్యోధనుడు. కొంత చింతించినాడు. అయినను భీష్ముని వ్రతనిబద్దతను మనసులో కొనియాడినాడు.
    "పితామహా! భీష్మా! పాండవపక్షము నందలి సకల బలములను నిశ్శేషముగా చంపుటకు నీకు ఎంత సమయము పట్టును?" అని దుర్యోధనుడు అడిగినాడు.   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.