Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఆలోచనామృతము
1. అంబ కధ విచిత్రము. విశిష్టము, ఆసక్తిదాయకమును అయి ఉన్నది. అంబ ఆడది. అయినను ఎక్కడను అబలత్వము కనిపించనీయలేదు. స్థిర సంకల్పమున ఆమె వీరులను సహితము తలదన్నినది.
స్థిర సంకల్పము, కార్యదీక్ష, కార్య తత్పరత ఉన్నచో మానవుడు స్త్రీ అయినను పురుషుడు అయినను ఎంతటి కఠినమయిన కార్యమును అయినను సాధించవచ్చును అని నిరూపించినది.
2. ప్రేమించుటకు కారణము చెప్పుట కష్టము కావచ్చును. ద్వేషించుటకు మాత్రము కారణము ఉండవలెను. అంబ భీష్ముని విషయమున పగ బూనుటకు సరియైన కారణము కనిపించదు.
i) అంబ సాల్వుని ప్రేమించిన విషయము కాశీరాజునకు కూడ తెలియనట్లున్నది. తెలిసిన అంబ స్వయంవరము ప్రకటించడు.
ii) తెలిసి భీష్ముడు అంబను తేలేదు. తెలిసిన తరువాత ఆమెను పంపినాడు.
iii) అంబ సాల్వుని ప్రేమించినది. సాల్వుడు అంబను ప్రేమించినట్లు లేడు. వరించిపోయిన దానిని వెళ్ళగొట్టినాడు.
iv) భీష్ముడు చెపిన తప్పు కనిపించదు. అంబది అకారణ వైరముగా కనిపించుచున్నది.
3. అంబ తన పని కొఱకు పరశురాముని ఆశ్రయించినది. పరశురాముడు భీష్ముని పక్షము వినలేదు. ఏకపక్ష నిర్ణయము చేసినాడు. "సత్యము" తెలుసుకొనుటకు ప్రయత్నించలేదు. అకారణ కోపము వహించినాడు.
4. కుంతివలెనె గంగ ప్రయత్నించినది. తన కొడుకును, భీష్ముని రక్షించదలచినది. మరుజన్మమునందయిన భీష్ముని వధింతును అన్నది అంబ. మరుజన్మ మానవ జన్మ రాకుండ నదివై ప్రవహించమని శపించినది గంగ.
అంబ తన తపము చేత గంగను ఓడించినది!
5. అంబ ఈ జీవితమూ ముగియునంత వరకు ఓపిక పట్టలేకపోయినది. చితిలో దూకి జన్మను అంతము చేసికొన్నది. ఇది అత్యంత సాహసవంతమయిన కార్యము. పని సాధించదలచిన వారు ప్రాణములను సహితము లెక్కచేయరు!
6. స్థూలకర్ణుడు శిఖండిని పురుషునిగా మార్చినాడు. తాను స్త్రీ అయినాడు. ఇది అతని ఉదారతకు, త్యాగమునకు పరోపకారమునకు నిదర్శనము.
పురుషులను స్త్రీలుగా మార్చుట నేటి శస్త్రవిద్యకు సామాన్యము అయిపోయినది. ఇట్టి విద్యయే స్థూలకర్ణునకు తెలిసి ఉండవలెను.
ఒకని పురుషుని చేయుటకు తాను స్త్రీ కావలసిన అవసరము ఆనాడు ఉండేనేమో పరిశీలించవలసి ఉన్నది.
స్థూలకర్ణుని త్యాగాబుద్దిని చిత్రించుటకు మాత్రము గొప్పగా ఉపయోగపడినది.
7. ద్రుపదుడు , ద్రోణుడు చిన్ననాటి స్నేహితులు. వారికి స్పర్ధలు వచ్చుట ద్రుపదుని గెలుచుట అదిపర్వమున చెప్పబడినది. ద్రుపదుని కొడుకు ధృష్టద్యుమ్నుడు ద్రోణుని వధించుటకే పుట్టినాడు. ఇదువురి మధ్య ఇంతటి వైరము ఉన్నది.
అయినను ద్రుపదుడు శిఖండిని విద్యాభ్యాసమునకు ద్రోణుని దగ్గరికే పంపినాడు. ద్రోణుడు శిఖండికి శస్త్రాస్త్రములు నేర్పినాడు.
శిఖండి తనను చంపనున్నవాడని తెలిసి భీష్ముడు వారించలేదు.
వృత్తి నిర్వహించుటకు వ్యక్తిగత ద్వేషములను మరచిపోయి విధిని నిర్వహించిన ఆ మహానుభాహులను ఎట్లు కీర్తించవలెనో కూడ తెలియకున్నది.
***
లక్షణాచార్య బుచ్చమాంబా పౌత్రుండును, వెంకటాచార్య వెంకటాంబా పుత్రుండును అంధ్రప్రదేశ ఆస్థానకవి కృష్ణమాచార్య అనుజుండును, పరిశీలన ఇత్యాది విమర్శక గ్రంధకర్తయు అయిన దాశరధి రంగాచార్య విరచితంబయిన శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వము సమాప్తము.




